బ్రెగ్జిట్: యూకే ప్రధాని థెరెసా మే ముసాయిదా బిల్లులో మార్పుల కోసం ప్రయత్నిస్తున్న ఐదుగురు మంత్రులు

ఫొటో సోర్స్, GETTY IMAGES/PA/GETTY IMAGES/EPA/REUTERS
యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగేందుకు ఉద్దేశించిన బ్రెగ్జిట్ ముసాయిదా బిల్లులో మార్పులు చేసేలా బ్రిటన్ ప్రధానమంత్రి థెరెసా మే మీద ఒత్తిడి చేయగలమని ఆమె కేబినెట్‌లోని అయిదుగురు మంత్రుల బృందం ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.
కామన్స్ సభ నాయకురాలు ఆంద్రియా లీడ్సమ్ ఈ బృందాన్ని సమన్వయం చేస్తున్నట్లు చెప్తున్నారు.
ప్రధానికి బహిరంగంగా మద్దతు తెలిపిన మైఖేల్ గోవ్, లియామ్ ఫాక్స్‌లతో పాటు.. పెన్నీ మోర్దాంట్, క్రిస్ గ్రేలింగ్‌లు ఈ బృందంలోని మిగతా నలుగురు మంత్రులు.
ఈయూ నుంచి వైదొలగటానికి సంబంధించిన ముసాయిదా బిల్లును థెరెసా మే బుధవారం ప్రకటించారు. దానికి ఆమోదం పొందుతానని ధీమా వ్యక్తంచేశారు.
బ్రిటన్ వైదలగటానికి విధివిధానాలను ఈ 585 పేజీల పత్రంలో పొందుపరిచారు. ఈయూకు ఎంత డబ్బు చెల్లిస్తారు, బ్రెగ్జిట్ పూర్తయ్యే కాలక్రమం, పౌరుల హక్కులు తదితర వివరాలు ఇందులో ఉన్నాయి.

ఫొటో సోర్స్, AFP
ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ ఇద్దరు సీనియర్ మంత్రులు, మరికొందరు జూనియర్ మంత్రులు, సహాయకులు రాజీనామా చేశారు. దీంతో థెరెసా మే క్లిష్ట పరిస్థితుల్లో పడ్డారు.
ఈ ఒప్పందం మీద అసంతృప్తిగా ఉన్న కన్జర్వేటివ్ బ్రెగ్జిట్ వాదులు కూడా థెరిసా మీద అవిశ్వాసం లేఖలు సమర్పిస్తున్నారు. ఒకవేళ ఇటువంటి లేఖలు 48 పంపించినట్లయితే.. అవిశ్వాసంపై ఓటింగ్ నిర్వహించాల్సి వస్తుంది. థెరెసా నాయకత్వం ప్రశ్నర్థాకంగా మారవచ్చు.
ముసాయిదా ఉపసంహరణ ఒప్పందంలో ఐర్లండ్‌కు సంబంధించిన ప్రత్యామ్నాయ ప్రణాళికలో మార్పులు చేయటానికి మరో నలుగురు మంత్రులతో కలిసి ప్రయత్నించవచ్చునని లీడ్సమ్ ఆశిస్తున్నట్లు శుక్రవారం సాయంత్రం తెలియవచ్చింది.
ఈయూ, యూకే మధ్య చర్చల్లో ప్రధాన అంశంగా నిలిచింది ఐరిష్ సరిహద్దు విషయమే. ఉత్తర ఐర్లండ్... యూకేలో భాగంగా ఉంది. ఐర్లండ్.. ఈయూలో భాగంగా ఉంది.
బ్రెగ్జిట్ తరువాత కూడా ఉత్తర ఐర్లండ్, ఐర్లండ్ మధ్య సరిహద్దును ఏర్పాటు చేయకూడదని రెండు పక్షాలు కోరుకుంటున్నాయి. అయితే, దీర్ఘకాలిక వాణిజ్య ఒప్పందం కుదరకపోతే ప్రత్యామ్నాయ ప్రణాళికను అమలు చేయటం కోసం దానిని ఒప్పందంలో చేర్చాలని ఇరు పక్షాలూ అంగీకరించాయి.

ఫొటో సోర్స్, Getty Images
ముసాయిదాలో చేర్చిన ప్రత్యామ్నాయ ప్రణాళిక ప్రకారం.. ఉత్తర ఐర్లండ్‌లో ఆహార ఉత్పత్తులు, వస్తువుల ప్రమాణాల వంటి పలు అంశాలు.. బ్రిటన్ నిబంధనల ప్రకారం కాకుండా.. ఈయూ నిబంధనలకు దగ్గరగా ఉంటాయి.
ఇది తమకు అంగీకారం కాదని విమర్శకులు అంటున్నారు. అయితే.. ఈయూ ఆమోదం లేకుండా ఈ ప్రత్యామ్నాయ ప్రణాళికను బ్రిటన్ పక్కన పెట్టజాలదు.
ఐర్లండ్ సరిహద్దు సమస్యకు.. కొత్త సాంకేతికత లేదా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ప్రత్యామ్నాయ పరిష్కారాలుగా చేర్చుతూ ముసాయిదాలో మార్పులు చేయాలని ఈ ఐదుగురు మంత్రుల బృందం కోరుతోందని బీబీసీ పొలిటికల్ ఎడిటర్ లారా క్వీన్స్‌బర్గ్ పేర్కొన్నారు.
ముసాయిదా ఒప్పందంలో మార్పులు చేయకపోయినట్లయితే.. థెరెసా మంత్రివర్గంలో ఇంకా కొనసాగుతున్న బ్రెక్జిట్ వాదులు రాజీనామా చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెప్పాయి.

ఫొటో సోర్స్, ANDREW MATTHEWS
‘పరిష్కారం కోసం కఠిన నిర్ణయాలు తీసుకోవాలి’
ఇదిలావుంటే, ఉపసంహరణ ఒప్పందం అందరికీ నచ్చే ఒప్పందం కాదని, కానీ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుని, పరిష్కారం కనుగొనటం తన బాధ్యత అని ప్రధానమంత్రి థెరెసా మే ‘డెయిలీ మెయిల్’ పత్రికతో అన్నారు.
ముసాయిదా వ్యతిరేకులు సూచిస్తున్న ప్రత్యామ్నాయ బ్రెగ్జిట్ ప్రణాళికలు.. ఐర్లండ్ అంశాన్ని పరిష్కరించలేవని కూడా ఆమె హెచ్చరించారు.
ముసాయిదా ఒప్పందంపై వ్యతిరేకత రావటం గురించి స్పందిస్తూ.. ‘‘ఈ రెండు రోజులూ చాలా గడ్డుకాలం’’గా ఉందని ఆమె వ్యాఖ్యానించారు.
ఈ పరిస్థితులను ఎదుర్కోవటానికి తన భర్త ఫిలిప్ సాయపడ్డారని, ఒకసారైతే తనకు విస్కీ పోసి, బీన్స్ టోస్ట్ చేసి ఇచ్చారని తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
బ్రెగ్జిట్ కొత్త మంత్రి
కొత్త బ్రెగ్జిట్ మంత్రిగా స్టీఫెన్ బార్‌క్లేను థెరెసా శుక్రవారం ఎంపిక చేశారు. గురువారం రాజీనామా చేసిన డొమినిక్ రాబ్ స్థానంలో స్టీఫెన్‌ను నియమించారు.
ఆయన గత జనవరి నుంచి ఆరోగ్య మంత్రిగా ఉన్నారు. బ్రెగ్జిట్ మంత్రి పదవిని ఏర్పాటు చేసినప్పటి నుంచీ ఆ బాధ్యతల్లో నియమితుడైన మూడో వ్యక్తి ఆయన.
అలాగే.. వర్క్ అండ్ పెన్షన్స్ మంత్రి పదవికి రాజీనామా చేసిన ఈస్తర్ మెక్‌వే స్థానంలో ఆంబర్ రూడ్‌ను నియమించారు. బార్‌క్లే నుంచి ఆరోగ్యశాఖను స్టీఫెన్ హామాండ్ చేపట్టారు.
రాజీనామా చేసిన ఉత్తర ఐర్లండ్ శాఖ మంత్రి శైలేశ్ వర స్థానాన్ని జాన్ పెన్రోస్ భర్తీచేస్తారు.
మరోవైపు.. ప్రధానమంత్రిపై అవిశ్వాసం మీద ఓటింగ్ నిర్వహించాలని దాదాపు 20 మంది టోరీ ఎంపీలు డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి:
- జికా వైరస్: బ్రెజిల్ ప్రేమ కథలు
- గాంధీ కథ చెప్పిన రచయిత గుజరాత్లో ఎందుకు చదువు చెప్పలేకపోయారు?
- అరటి పండు అంతరించిపోనుందా?
- కేరళ వరదలు: ఫేక్‌న్యూస్ ప్రవాహం
- ఈదీ అమీన్: మనిషి రక్తం తాగిన నియంత
- అమీనా: ఈ ఆఫ్రికా రాణి ప్రతి యుద్ధం తరువాత ఓ భర్తను పొందుతారు తర్వాత..
- ఫేక్ న్యూస్‌పై సమరం: ‘సోషల్ మీడియాలో కనిపించేదంతా నిజం కాదు’
- కిలోరాయి మారుతోంది.. మరి మీ బరువు మారుతుందా? మారదా?
- తెలంగాణ ఎన్నికలు: 'ఎన్టీఆర్‌పై ఎలా గెలిచానంటే'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








