మహారాష్ట్ర: కోతులు పగబట్టి 200 కుక్కపిల్లలను చంపింది నిజమేనా? లవూల్ గ్రామంలో అసలు ఏం జరిగింది?

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
    • రచయిత, నితిన్ సుల్తానే
    • హోదా, బీబీసీ కోసం

మరాఠ్వాడా తాలూకా మజల్‌గావ్‌లోని లవూల్ గ్రామం గత వారం రోజులుగా వార్తల్లో నిలిచింది. ఆ గ్రామంలో కోతులు, కుక్కల మధ్య జరిగిన ఘర్షణ వార్తలు మీడియా దృష్టిని ఆకర్షించాయి.

ఏం జరిగిందనే దానిపై అనేక ఊహాగానాలు వినిపించాయి. కోతులు పగబట్టి 200 కుక్కపిల్లలని చంపేశాయని కొందరు అన్నారు. వాస్తవంలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి బీబీసీ ఆ గ్రామానికి వెళ్లింది. గ్రామ పంచాయితీ కార్యాలయానికి వెళ్లి సంఘటన వివరాలు కనుక్కునేందుకు ప్రయత్నించింది.

మరాఠ్వాడా ప్రాంతంలో బీడ్ జిల్లా తాలూకా మజల్‌గావ్‌ నుంచి లవూల్ గ్రామానికి అయిదారు కిలోమీటర్ల దూరం ఉంటుంది. 1980లో సమీపంలోని నదిపై డ్యామ్ కట్టడంతో ఈ గ్రామం నీట మునిగింది. తరువాత పునరావాస ప్యాకేజీ కింద ఇక్కడి వారు మరోచోట ఇళ్లు కట్టుకున్నారు. కొత్త గ్రామాన్ని లవూల్ ఏక్ అని పిలుస్తున్నారు.

సుమారు 5,000 జనాభా ఉన్న ఈ గ్రామం విస్తీర్ణం కూడా ఎక్కువే. స్కూలు, బ్యాంకులతో సహా ఇక్కడ మౌలిక సదుపాయాలు బాగానే ఉన్నాయి. మజల్‌గావ్‌ ఆనకట్ట కట్టిన తరువాత వ్యవసాయానికి మెరుగైన నీటి పారుదల సౌకర్యాలు సమకూరాయి. ఈ గ్రామం బీడ్ జిల్లాలోని సంపన్న గ్రామాలలో ఒకటిగా పేరు సంపాదించింది.

వీడియో క్యాప్షన్, కుక్కల దాడిలో గాయపడి మృత్యుముఖంలోకి వెళ్లిన కోతికి సీపీఆర్ చేసి బతికించారు

కోతులు వచ్చాయి..

ఈ ఘటన వివరాలు కిందటి వారమే బయటపడినా, సెప్టెంబర్ నుంచి ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని గ్రామస్తులు చెప్పారు. సెప్టెంబర్ ప్రారంభంలో రెండు కోతులు లవుల్ గ్రామంలోకి వచ్చాయి.

"సాధారణంగా మా గ్రామంలో కోతులు ఉండవు. అప్పుడప్పుడూ బయట నుంచి వస్తుంటాయి, పోతుంటాయి. కానీ వాటివల్ల మాకు ఎప్పుడూ ఎలాంటి ఇబ్బంది కలుగలేదు. కానీ, ఈసారి కోతులు వచ్చినప్పుడు వింత వింత సంఘటనలు జరిగాయి" అని గ్రామ పంచాయితీ సభ్యుడు రవీంద్ర షిండే చెప్పారు.

ఈ కోతులు ఊర్లో ఉన్న చిన్న చిన్న కుక్కపిల్లల్ని లాక్కుని చెట్టు పైకో లేదా ఇంటి పైకో తీసుకెళ్లడం ప్రారంభించాయి. మొదట్లో గ్రామస్థులు దీన్ని గుర్తించలేదు. కానీ, క్రమంగా వారికి విషయం బోధపడింది.

కుక్కపిల్లను ఎత్తుకెళుతున్న కోతి

ఫొటో సోర్స్, NITIN SULTANE

ఫొటో క్యాప్షన్, కుక్కపిల్లను ఎత్తుకెళుతున్న కోతి

కోతులు కుక్కపిల్లల్ని చంపేశాయా?

కోతులు ఎత్తుకెళ్లిన కుక్కపిల్లలు చెట్ల పైనుంచో, ఇళ్ల పైనుంచో కిందపడి చనిపోయేవి. దాంతో, కోతులు కుక్కపిల్లల్ని చంపేస్తున్నాయనే వదంతులు వ్యాపించాయి. కోతులు మనుషులను కూడా వెంబడిస్తున్నాయని, దానివల్ల కొందరికి గాయాలయ్యాయని కూడా వదంతులు సాగాయి.

సీతారాం నాయ్బల్ కూడా ఇలాగే గాయపడ్డారు. ఇంటి పైకప్పుపై కుక్కపిల్లలు కనిపించడంతో వాటిని కిందకు దించేందుకు ఆయన ఇల్లు ఎక్కడానికి ప్రయత్నించారు. కానీ, అకస్మాత్తుగా ఒక కోతి ఆయనకు ఎదురుపడడంతో, భయపడి కిందకు దూసేశారు.

దాంతో, సీతారం రెండు కాళ్లకూ మడమల దగ్గర ఎముకలు విరిగిపోయాయి. కాళ్లకు రాడ్‌లు అమర్చాల్సి వచ్చింది. చికిత్సకు సుమారు లక్షన్నర ఖర్చయింది. ఇది జరిగి మూడు నెలలు కావొస్తున్నా, సీతారాం కాళ్లు పూర్తిగా నయమవలేదు. ఇప్పటికీ, చాలా నెమ్మదిగా కొన్ని అడుగులు మాత్రమే వేయగలుగుతున్నారు.

కోతులు చిన్న పిల్లలను వెంబడించాయన్న వార్తలు వచ్చాయి. దాంతో, గ్రామస్థులు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడి తలుపులు బిగించారు. క్రమంగా విషయం గ్రామ పంచాయితీ వరకు వెళ్లింది.

వీడియో క్యాప్షన్, డ్రోన్ టెక్నాలజీతో కుక్కల్ని కాపాడుతున్న మహిళ

మొదట్లో ఉదాసీనంగా వ్యవహరించిన అటవీ శాఖ

ఈ విషయంలో అటవీ శాఖ సహాయం కోరుతూ గ్రామ పంచాయితీ ఒక అభ్యర్థన పంపింది. "సెప్టెంబర్ 12, 13 తేదీల్లో లిఖితపూర్వకంగా అభ్యర్థన పంపాం. కానీ, మాకు ఎలాంటి జవాబూ రాలేదు" అని గ్రామాభివృద్ధి అధికారి నానాసాహెబ్ షెల్కే తెలిపారు.

మళ్లీ మరోసారి అభ్యర్థన పంపించినా, అటవీ శాఖ ఉదాసీనంగానే వ్యవహరించింది. అయితే, నిరాశ పడకుండా గ్రామస్థులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. చివరికి, అటవీ శాఖ తమ బృందాన్ని లవూల్ గ్రామానికి పంపింది. "వాళ్లు ఆ ప్రాంతాన్ని తనిఖీ చేసి వెళ్లిపోయారు" అని గ్రామ వివాద పరిష్కార అధ్యక్షుడు రాధాకిషన్ సోన్వానే తెలిపారు.

ఇక చేసేదేమీ లేక గ్రామస్తులు మీడియాను ఆశ్రయించారు. మీడియాలో ఈ విషయానికి కొంత పబ్లిసిటీ వచ్చాక, ప్రభుత్వం కదిలింది.

కొండముచ్చు, కుక్కపిల్ల (ప్రతీకాత్మక చిత్రం)

ఫొటో సోర్స్, NITIN SULTANE

ఫొటో క్యాప్షన్, కొండముచ్చు, కుక్కపిల్ల

కుక్కపిల్లల సహాయంతో కోతులను పట్టుకున్నారు

మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగిన తర్వాత ధరూర్‌లోని అటవీ శాఖ అధికారులు కోతులను పట్టుకునేందుకు నాగ్‌పూర్‌ నుంచి తమ బృందాన్ని పంపించారు. డిసెంబర్ 19, శనివారం నాడు ఈ బృందం కోతులకు ఎర వేసి పట్టుకుంది. కోతులను ఆశపెట్టడానికి బోనులో కుక్కపిల్లను ఉంచారు. కోతులు బోనులో చిక్కుకోగానే, వాటిని బంధించి తీసుకెళ్లి అడవిలో వదిలేశారని వడవాణి అటవీ అధికారి డి.ఎస్.మోరే తెలిపారు.

ఎన్ని కుక్కపిల్లలు ప్రాణాలు కోల్పోయాయి?

లవూల్ గ్రామంలో జరిగిన ఘటనలు మీడియాలో రావడంతో, పలువురి దృష్టిని ఆకర్షించాయి. మొదట 10 నుంచి 15 కుక్కపిల్లలు చనిపోయాయని, కొద్ది రోజుల్లోనే చనిపోతున్న వాటి సంఖ్య రెట్టింపైందని కొన్ని మీడియా సంస్థలు వెల్లడించాయి. కోతులు 250 కుక్కపిల్లల్ని చంపేశాయని కొన్ని మీడియా సంస్థలు తెలిపాయి. కానీ, గ్రామస్థుల లెక్కలు వేరుగా ఉన్నాయి. 50 నుంచి 60 కుక్కపిల్లలు చనిపోయాయని కొందరు చెబితే, సుమారు 100 కుక్కపిల్లలు చనిపోయాయని మరి కొందరు చెప్పారు.

అయితే, మీడియాలో వచ్చినట్టు సుమారు 200 కుక్కపిల్లలు చనిపోయుంటాయని ఇంకొందరు చెప్పారు. దాంతో, వాస్తవంలో ఎన్ని కుక్కపిల్లలు మరణించాయో లెక్క తేలడం కష్టమైంది. అయితే, గ్రామస్తుల నుంచి అధికారికంగా సేకరించిన లెక్క ప్రకారం 50 నుంచి 60 కుక్కపిల్లలు చనిపోయాయి.

కానీ, ఈ లెక్కలన్నీ తప్పని, వాస్తవంలో మూడో నాలుగో కుక్కపిలలు చనిపోయి ఉండవచ్చని మోరే బీబీసీకి తెలిపారు.

లవూల్‌ గ్రామం

ఫొటో సోర్స్, NITIN SULTANE

ఫొటో క్యాప్షన్, లవూల్‌ గ్రామం

కోతులు ప్రతీకారం తీర్చుకున్నాయంటూ వదంతులు

ఒక కోతి పిల్లను కుక్కలు చంపేయడంతో కోతులు కుక్కల మీద పగబట్టాయనే వదంతులు వ్యాపించాయి. ఇవి ఎప్పుడు ఎలా మొదలయ్యాయో తెలీదుగానీ గ్రామస్తులందరూ దీని గురించి విన్నారు. "కోతి పిల్ల చనిపోయిన తరువాత తల్లి కోతికి పిచ్చి పట్టిందని, కుక్కపిల్లను తన పిల్లగా భావించి తీసుకెళ్లిపోయిందని కొందరు చెబుతున్నారు" అని రవీంద్ర షిండే అన్నారు.

ఈ వదంతులు, జరుగుతున్న సంఘటనలు గ్రామస్తులను తీవ్రంగా భయపెట్టాయి. పిల్లలు స్కూళ్లకు వెళ్లడానికి, మహిళలు ఒంటరిగా ఇళ్లల్లోంచి బయటకు రావడానికి భయపడ్డారని లక్ష్మణ్ భగత్ చెప్పారు. ఒక కోతి లక్ష్మణ్ భగత్ బంగ్లా పైకప్పుపై బస చేసింది. ఎనిమిది నుంచి పది కుక్కపిల్లలను లాక్కొచ్చి ఆ భవనం పైకప్పుపై ఉంచింది.

"కుక్కపిల్లల అరుపులు మాకు వినిపించాయి. అవి ఆకలికి అరుస్తున్నాయని అనుకున్నాం. మర్నాటి నుంచి వాటి కోసం అన్నం, రొట్టెలు, పాలు గిన్నెల్లో ఉంచి బయట పెట్టేవాళ్లం." అని లక్ష్మణ చెప్పారు. ఆ పాలు, రొట్టెలు కుక్కపిల్లల ప్రాణాలు కాపాడాయి. ఇప్పుడు అవి భగత్ ఇంట్లో అటూ ఇటూ తిరుగుతూ ఆడుకుంటున్నాయి.

కోతులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కోతులు

నిపుణులు ఏమంటున్నారు?

కుక్కపిల్లల చర్మంపై పేలు, పురుగులు ఉంటాయి. అవి తినడానికే కోతులు వాటిని ఎత్తుకుపోయుంటాయని, కోతులు పెద్ద కుక్కలను వెంటాడలేవు కాబట్టి కుక్కపిల్లలను ఎత్తుకెళ్లి ఉంటాయని మోరే అన్నారు. పేలు, పురుగులు తినేశాక అవి కుక్కపిల్లలను ఇంటి పైకప్పులపైనే వదిలిపెట్టి వెళ్లిపోయాయి.

కుక్కపిల్లలు అక్కడి నుంచి బయటపడలేక, తిండి లేక రెండు మూడు రోజుల్లో చనిపోయి ఉండవచ్చు. లేదా పైకప్పు నుంచి కిందకు దిగుతున్నప్పుడు జారిపడిపోయి ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చని మోరే అన్నారు. అయితే, కోతులు పగబడతాయని, కక్ష తీర్చుకోడానికి ఏ స్థాయికైనా వెళతాయని ఔరంగాబాద్‌లోని సిద్ధార్థ్ జూలో చాలా కాలం పాటు పనిచేసిన డాక్టర్ బి. ఎస్. నాయక్వాడే తెలిపారు. కాకపోతే లవూల్ గ్రామంలో అలా జరిగుండదని, అతిశయోక్తులు ప్రచారమయ్యాయని ఆయన అన్నారు.

కోతులకు చుట్టూ ఏం జరుగుతోందో తెలుసుకునే కుతూహలం ఎక్కువ ఉంటుంది. ఆ కుతూహలం కొద్దీ కుక్కపిల్లలను ఎత్తికెళ్లి ఉంటాయని లైఫ్ కేర్ యానిమల్ అసోసియేషన్ అధ్యక్షుడు ధనరాజ్ షిండే అన్నారు.

కోతులు గ్రామస్తులను ఎప్పుడూ వెంబడించలేదు. కోతులు ఎదురుపడగానే గ్రామస్తులు భయపడడంతో ప్రమాదాలు జరిగాయిగానీ, అవి కావాలని హాని తలపెట్టలేదని అటవీ అధికారి మోరే తెలిపారు.

ఇప్పుడు లవూల్ గ్రామంలో కలకలం సద్దుమణిగింది. గ్రామంలో చాలా కుక్కలు సంచరిస్తున్నాయి.

వీడియో క్యాప్షన్, తెలంగాణలోని ఈ ఊరిలో రోజూ సూర్యోదయం ఆలస్యంగా, సూర్యాస్తమయం వేగంగా అయిపోతుంది

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)