వియత్నాం: కరోనా భయంతో 12 పెంపుడు కుక్కలను చంపిన అధికారులు, నిరసనల వెల్లువ

కుక్కలు

ఫొటో సోర్స్, PHAM MINH HUNG

ఫొటో క్యాప్షన్, పెంపుడు జంతువులతో కలిసి ప్రయాణిస్తోన్న ఆ జంట వీడియా టిక్ టాక్‌లో వైరల్ అయింది.
    • రచయిత, బుయ్ థు
    • హోదా, బీబీసీ న్యూస్ వియత్నామీస్

లాంగ్ యాన్ ప్రావిన్స్‌లో కోవిడ్ వ్యాప్తి తీవ్రంగా ఉండడంతో, ఓ వియత్నాం జంట అక్కడి నుంచి పెంపుడు కుక్కలతోపాటూ మోటార్‌ బైక్‌పై వేరే చోటుకి వెళ్లారు.

అనంతరం వారికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ అయింది. కరోనా వైరస్ జంతువుల నుంచీ వ్యాప్తి చెందుతుందన్న భయంతో అధికారులు వీరి 12 పెంపుడు జంతువులను చంపినట్లు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జంటకు తెలిసింది.

"నా భార్య, నేను నిద్రలేకుండా చాలా ఏడ్చాం" అని తాపీ పని చేసే 49 ఏళ్ల ఫామ్ మిన్ హంగ్ బీబీసీకి చెప్పారు.

"ఇలా నిజంగా జరిగిందంటే నమ్మలేకపోయాను.. నా పిల్లలను రక్షించడానికి నేనేమీ చేయలేకపోయాను" అని ఆయన తన కుక్కలను ఉద్దేశించి అన్నారు.

వారి కథ, సోషల్ మీడియా యాప్ టిక్‌ టాక్‌లో వైరల్‌ అయింది. ఈ సంఘటనపై నిరసనలు వెల్లువెత్తాయి. జబ్బు బారిన పడిన జంతువులను చంపేసే అలవాటును తక్షణమే నిలిపేయాలని 1.5 లక్షల మందికి పైగా సంతకాలు చేశారు.

కుక్క

ఫొటో సోర్స్, Sally Anscombe/gettyimages

హృదయాలను గెలుచుకుంది

వియత్నాంపై కోవిడ్ తాజా వేవ్ తీవ్ర ప్రభావం చూపుతోంది.

ఇటీవలి నెలల్లో కఠినమైన లాక్ డౌన్‌ను అమలు చేశారు. చాలా మంది వలస కార్మికుల జీవితాలను ఇది ప్రభావితం చేసింది. దాదాపు 10 లక్షల మంది పెద్ద నగరాలను విడిచి వెళ్లిపోయేలా చేసింది.

అలా వెళ్లిన వారిలో ఫామ్ మిన్ హంగ్, న్గుయెన్ థి చి ఎమ్(35) ఉన్నారు.

అక్టోబర్ 8న వారు తమ పెంపుడు కుక్కలు, ముగ్గురు బంధువులతో కలిసి 280 కిలోమీటర్ల ప్రయాణాన్ని ప్రారంభించారు. వారి బంధువులు కూడా మూడు కుక్కలు, ఒక పిల్లిని తమవెంట తీసుకొచ్చారు.

ఈ జంట, బంధువుల స్వస్థలమైన కా మౌ ప్రావిన్స్‌లోని ఖాన్ హంగ్‌లో కోవిడ్ కేసులు అంతగా లేనందున అక్కడికి వెళ్లారు.

పెంపుడు జంతువులు

ఫొటో సోర్స్, PHAM MINH HUNG

ఫొటో క్యాప్షన్, పెంపుడు జంతువుల పట్ల వారి చూపిస్తోన్న ప్రేమకు ఆన్‌లైన్‌లో ఎంతో మంది ముగ్ధులయ్యారు.

ఈ జంట ప్రయాణాన్ని చూసిన ప్రత్యక్ష సాక్షులు, వారి వీడియోలను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశారు. వారి మోటార్‌బైక్‌పై ఉన్న కుక్కలు, ఇంటిలోని వస్తువులు అన్నింటితో ప్రయాణిస్తున్నట్లు వాటిలో ఉంది. ఈ జంట సోషల్ మీడియాలో పాపులర్ అయింది. వారు సురక్షితంగా గమ్యం చేరుకోవాలని చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు కోరుకున్నారు.

వర్షంలో కుక్కలు తడవకుండా కప్పుకోవడానికి రెయిన్‌కోట్‌లను ఇవ్వడం చూసి తమ హృదయం బరువెక్కిందని కొందరు చెప్పారు. కొంతమంది వారికి నీరు, ఆహారం కూడా పంపిణీ చేశారు.

ఈ జంట 15 కుక్కలతో బయలుదేరింది. కానీ, వారి ప్రయాణం కా మౌ ప్రావిన్స్‌కి చేరుకున్న తర్వాత వారు రెండు కుక్కలను ఓ వాలంటీర్‌కు ఇచ్చారు. మరొకటి చనిపోయింది.

అయితే ఖాన్ హంగ్ చేరుకున్న తర్వాత ఆ జంటకు, వారి ముగ్గురు బంధువులకు కోవిడ్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఒక ప్రావిన్స్‌ నుంచి మరో ప్రావిన్స్‌కి ప్రయాణించే ఎవరైనా తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయించుకోవాల్సివుంటుంది. వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా, జంతువులను క్వారంటైన్ సెంటర్‌ వద్దే వదిలేశారు.

కానీ వారి 12 కుక్కలను, వారి బంధువుల పెంపుడు జంతువులను ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే స్థానిక అధికారులు చంపారని ప్రభుత్వ మీడియా తొలుత ప్రకటించి, ఆ కథనాన్ని తర్వాత తొలగించింది.

జంతువులను ఎలా చంపారన్న విషయంపై స్పష్టత లేదు. అధికారిక పోలీసు వార్తాపత్రిక వాటిని దహనం చేసినట్లు సూచించే చిత్రాన్ని ప్రచురించింది.

"వ్యాధి నియంత్రణకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. జంతువులను వెంటనే చంపడం తప్పనిసరి ముందస్తు నివారణ చర్య" అని స్థానిక అధికారి ట్రాన్ టాన్ కాంగ్ ఆదివారం విలేకరుల సమావేశంలో చెప్పారు.

'అనాగరిక చర్య'

ఈ నిర్ణయం "క్రూరమైన" చర్య అని, "హృదయ విదారకం" అని ఆన్‌లైన్‌లో సోషల్‌ మీడియా వినియోగదారులు స్పందిచారు.

ఇది ఒక "అనాగరికమైన చర్య" అని గ్లోబల్ యానిమల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఫోర్ పావ్స్ సభ్యురాలు, నటి హాంగ్ అన్హ్ పేర్కొన్నారు.

శునకాలు

ఫొటో సోర్స్, UGC

ఈ హత్యలు "అనైతికమైనవి". ఎందుకంటే యజమానులకు వ్యాధి సోకినట్లయితే పెంపుడు జంతువులను చంపాలని నిర్దేశించే మార్గదర్శకాలు ఎక్కడా లేవని అమెరికాలోని సిటీ ఆఫ్ హోప్ నేషనల్ మెడికల్ సెంటర్ శాస్త్రవేత్త గుయెన్ హాంగ్ వు అన్నారు.

"కుక్కలు, పిల్లులు మానవులకు కోవిడ్ వ్యాప్తిని చేస్తాయని శాస్త్రీయ ఆధారాలు లేవు. అయితే, కోవిడ్ ఉన్న వ్యక్తుల ద్వారా కొన్నిసార్లు వాటికి వైరస్ సోకుతుంది" అని డాక్టర్ గుయెన్ చెప్పారు.

టెక్సస్‌లో జరిగిన ఓ అధ్యయనంలో, కోవిడ్ రోగులు ఉన్న 39 ఇళ్లలోని 76 కుక్కలు, పిల్లులపై సర్వే చేశారు. కేవలం మూడు పిల్లులు, ఒక కుక్కకు మాత్రమే కోవిడ్ సోకినట్లు గుర్తించారు. జంతువులకు లక్షణాలు ఉండవు లేదా లేదా తేలికపాటి లక్షణాలను మాత్రమే కనిపించాయి. అవన్నీ వేగంగా కోలుకున్నాయి.

"ఈ పరిస్థితిని సరిదిద్దడానికి అనేక మార్గాలు ఉన్నాయి. వాటిని క్వారంటైన్‌ చేయడానికి బోనులో నిర్బంధించొచ్చు. వాటి యజమానుల బంధువులను సంప్రదించడం లేదా యజమానులు కోలుకునే వరకు వాటిని జాగ్రత్తగా చూసుకోవడానికి ఒక సామాజిక సంస్థను సంప్రదించడం లాంటివి చేయొచ్చు" అని డాక్టర్ గుయెన్ చెప్పారు.

'యుద్ధం లాంటి మనస్తత్వం'

మహమ్మారి ప్రారంభంలో వియత్నాం పోరాటాన్ని, వైరస్‌పై విజయంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రశంసించిది. కానీ, డెల్టా వేరియంట్ ఆ దేశాన్ని కుదిపేసింది.

తాజా వేవ్‌లో పెద్ద సంఖ్యలో కేసులు బయటపడ్డాయి. మొత్తం 8.4 లక్షల కేసులు నమోదవ్వగా, 20 వేలకు పైగా మరణాలు సంభవించాయి.

వైరస్ కట్టడికి వియత్నాం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. గత నెలలో ప్రధాన మంత్రి ఫామ్ మిన్ చిన్ "వైరస్‌తో కలిసి జీవించేలా" ఒక ప్రణాళిక ఉండాలని పేర్కొన్నారు.

వైరస్ వ్యాప్తికి కారణమయ్యారని చాలా మందిపై అభియోగాలు మోపారు. కొందరు దోషులుగా తేలారు. కొంతమందికి ఐదేళ్ల వరకు జైలు శిక్ష కూడా పడింది.

గత నెలలో, అనేక మంది పోలీసు అధికారులు దక్షిణ బిన్ డువాంగ్ ప్రావిన్స్‌లోని ఒక ఫ్లాట్‌లోకి చొరబడిన వీడియో వైరల్ అయింది. కోవిడ్‌కు గురైనట్లు భావించిన ఒక మహిళను, ఆమె చిన్న కుమారుడు ఏడుస్తున్నా పట్టించుకోకుండా, పరీక్షలు చేయడానికి ఆమెను బయటకు లాక్కెళ్లారు. ఈ సంఘటన పెద్ద మొత్తంలో ప్రజా వ్యతిరేకతకు దారి తీసింది.

పెంపుడు జంతువులను చంపాలనే అధికారుల నిర్ణయం ఆశ్చర్యకరం కాదని పరిశీలకులు లే అన్హ్ అన్నారు.

"వియత్నాం ప్రభుత్వం కరోనాపై పోరాటానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. 'ఈ మహమ్మారిపై పోరాడటం శత్రువుతో పోరాడినట్లే' అనే నినాదం ఉంది. దీని అర్థం దేశం యుద్ధంలో ఉంది. యుద్ధ సమయంలో మీరు హేతుబద్ధమైన, మానవత్వ ప్రవర్తనను ఆశించలేరు"

ఫామ్‌కి కష్టతరమైన విషయం ఏమిటంటే, ఆయనకు ఇష్టమైన జంతువులను ఇతరులు చంపేశారని తెలుసుకున్నారు.

"నేను నా పిల్లలను ఆరేళ్లపాటు పెంచాను. నాకు, నా పిల్లలకు కచ్చితంగా న్యాయం జరగాలి" అని ఆసుపత్రి నుండి తన కుక్కలను ఉద్దేశించి అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)