ఆంధ్రప్రదేశ్: 300 కుక్కలకు విషమిచ్చి చంపేసి గోతిలో పడేశారంటూ కేసు, అసలేం జరిగింది?

కుక్క
    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

వీధి కుక్కలను చంపేశారన్న వార్త ఆంధ్రప్రదేశ్‌లో కలకలం సృష్టిస్తోంది.

గ్రామ పంచాయతీ అధికారులే దాదాపు 300 కుక్కలను చంపించారంటూ పోలీసులకు ఫిర్యాదు వచ్చింది.

విషమిచ్చి కుక్కలను చంపేశారని జంతు ప్రేమికులు చెబుతున్నారు.

దీనిపై పంచాయతీ అధికారులపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పశ్చిమ గోదావరి జిల్లాలోని మండల కేంద్రమైన లింగపాలెంలో ఈ ఘటన జరిగింది.

గత నెల 24న జరిగిన ఘటన ఫైట్ ఫర్ యానిమల్ ప్రొటెక్షన్ సంస్థ జోక్యంతో వెలుగులోకి వచ్చింది.

కుక్క

అసలేం జరిగింది?

లింగపాలెం పంచాయితీ పరిధిలో చాలాకాలంగా వీధి కుక్కల సమస్య ఉంది.

కుక్కల దాడిలో పలువురు గాయపడిన ఘటనలు కూడా ఉన్నాయి.

కొద్దిరోజుల క్రితం పంచాయతీ ఎన్నికల్లో కుక్కల బెడద తగ్గిస్తామని కూడా హామీలు ఇచ్చినట్టు ఆ గ్రామానికి చెందిన వారు చెబుతున్నారు.

తాజాగా పంచాయతీకి చెందిన పెద్దల నిర్ణయంతో కుక్కలను వేటాడే ప్రయత్నం చేశారు. కానీ అది పెద్దగా ఫలితాన్నివ్వలేదు.

వీడియో క్యాప్షన్, భారత్‌లో ఏటా 15లక్షల మందికి కుక్కకాటు

దాంతో వాటికి ఒకేసారి విషమిచ్చి చంపేసినట్టు ఫైట్ ఫర్ యానమిల్ ప్రొటెక్షన్ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ఆ సంస్థ ప్రతినిధి శ్రీలత బీబీసీతో మాట్లాడారు.

స్థానికంగానే మెడికల్ షాపులో ఆ విష పదార్థాలు కొనుగోలు చేసినట్టు మాకు తెలిసింది. ఇంజెక్షన్ రూపంలో కుక్కలకు ఇచ్చారు. ఈ పని కోసం కొందరిని నియమించారు. వాళ్లకు డబ్బులిచ్చి ఈ పని చేయించారు. దాంతో ఒకేసారి వందల సంఖ్యలో కుక్కలు చనిపోయాయి. మాకు తెలిసి 300 వరకు ఉంటాయి.

చనిపోయిన తర్వాత కూడా వాటిని పూడ్చిపెట్టే ప్రయత్నం చేయలేదు. గొయ్యి తీసి అందులో పడేశారు. పెద్ద సంఖ్యలో చనిపోయిన కుక్కలను అక్కడ వేయడంతో తీవ్ర దుర్వాసన వచ్చింది.

గ్రామస్తుల ద్వారా మాకు సమాచారం అందడంతో వెళ్లి చూశాం. జంతు సంరక్షణ చేయాల్సిన ప్రభుత్వ అధికారులు హింసకు పాల్పడ్డారు. పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్‌పై ఫిర్యాదు చేశాం అని శ్రీలత చెప్పారు.

కుక్క

పోస్ట్‌మార్టం రిపోర్ట్ రావాలి

"కుక్కలు చనిపోయిన తర్వాత ఒకేచోట పడేశారు. దాంతో ఆ కళేబరాలన్నీ కుళ్లిపోయాయి. వాటికి పోస్ట్‌మార్టం చేశాం. రిపోర్టు కోసం శాంపిళ్లను విజయవాడలోని ల్యాబ్‌కి పంపించాము. వారిచ్చే రిపోర్టుని బట్టి ఏం జరిగిందన్నది చెప్పగలం.

ప్రస్తుతం అంతపెద్ద సంఖ్యలో కుక్కలు చనిపోవడం మాత్రం ఉద్దేశపూర్వకంగా చేసిన పనేనని అందరూ చెబుతున్నారు అంటూ లింగపాలెం మండల పశువైద్యాధికారి డాక్టర్ ప్రసాద్ బీబీసీకి తెలిపారు.

వీడియో క్యాప్షన్, విశ్వాసం గల కుక్క.. యజమాని కోసం ఆస్పత్రి బయట ఆరు రోజులు ఎదురుచూపులు

ఒక్కసారి వందల సంఖ్యలో కుక్కలను చంపేశారనే ప్రచారంతో ఉన్నతాధికారులు సైతం జోక్యం చేసుకున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో వివిధ శాఖల అధికారులు కుక్కల మృతికి అసలు కారణాలు వెలికితీసే ప్రయత్నాలు చేస్తున్నారు.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

విచారణ జరిగితే అసలు కారణాలు తెలుస్తాయి

మరోవైపు పోలీసులు కూడా ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. ధర్మాజీగూడెం స్టేషన్ ఎస్‌ఐ రమేష్ ఆధ్వర్యంలో విచారణ సాగుతోంది.

కుక్కలు చనిపోయిన ఘటనపై ఫిర్యాదు వచ్చింది. పంచాయతీ అధికారులే విషమిచ్చి చంపేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. విచారణ జరుపుతున్నాం.

ఎఫ్‌ఐ‌ఆర్ నమోదయ్యింది. ఆధారాల కోసం ప్రయత్నం చేస్తున్నాం. అవి సేకరించగానే తదుపరి చర్యలుంటాయి. పోస్ట్‌మార్టం రిపోర్ట్ వస్తే దాని ఆధారంగా కేసులో ముందుకెళతాం.

పీసీఏ సెక్షన్ 11 (ఎల్), ఐపీసీ 429 కింద కేసులు పెట్టాం. పంచాయతీ సెక్రటరీ, సర్పంచ్, సిబ్బంది మీద కేసు వచ్చిందని ధర్మాజీగూడెం ఎస్ఐ రమేష్ బీబీసీకి తెలిపారు.

వీడియో క్యాప్షన్, జంతువులు శరీరం నుంచి నీటిని విదిల్చే తీరు ఇదీ

సమస్య పరిష్కారం కోసమే..

కుక్కలకు విషమిచ్చి చంపేశారనే ఆరోపణలపై పంచాయతీ అధికారులు స్పందించడానికి నిరాకరించారు.

'గ్రామంలో చాలాకాలంగా కుక్కల వల్ల చిన్నపిల్లలు కూడా గాయపడ్డారు. చాలా పెద్ద సమస్యగా ఉంది. 23వ తేదీన ఇంజెక్షన్లు ఇచ్చి 21 కుక్కలను చంపేశారు. కానీ దాని మీద ప్రచారం మాత్రం చాలా ఎక్కువ జరిగింది. చట్టం ప్రకారం తప్పే అయినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లోనే ఇలా చేశారు. దాని మీద అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నా పంచాయతీ పాలకవర్గం చూసుకుంటుంది' అని లింగపాలెం గ్రామానికి చెందిన బి. రామారావు చెప్పారు.

ఈ శునకాల మరణాల వెనుక అసలు కారణాలను మాత్రం అధికారికంగా వెల్లడించలేదు.

పోస్టుమార్టం రిపోర్ట్ ఆధారంగా చర్యలుంటాయని పోలీసులు చెబుతున్నారు.

జంతు ప్రేమికులు మాత్రం ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)