జోర్డాన్, ఈజిప్టులకు మా కుక్కలను ఇక పంపించం: అమెరికా ప్రకటన

ఫొటో సోర్స్, PRESS ASSOCIATION
పేలుడు పదార్థాలను పసిగట్టే శునకాలను జోర్డాన్, ఈజిప్టులకు పంపించటాన్ని నిలిపివేసినట్లు అమెరికా చెప్పింది. ఆ రెండు దేశాల్లో నిర్లక్ష్యం కారణంగా అనేక శునకాలు మరణించటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
''క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నపుడు ఏ శునకమైనా మరణించటం అత్యంత విచారకరమైన సంఘటన'' అని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి పేర్కొన్నారు.
ఇటీవలి సంవత్సరాల్లో జోర్డాన్, ఈజిప్టులతో పాటు మరో ఎనిమిది దేశాలకు పంపించిన 100కు పైగా శునకాల సంరక్షణ విషయంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ అమెరికా విదేశాంగ శాఖ డైరెక్టర్ జనరల్ కార్యాలయం గత సెప్టెంబరులో ఒక నివేదికలో ప్రముఖంగా ప్రస్తావించింది.
అమెరికాలో శిక్షణ పొందిన కుక్కలను ఉగ్రవాద వ్యతిరేక కార్యక్రమాల్లో భాగంగా ఆయా దేశాలకు అందిస్తున్నారు.
వీటిని పంపించటం మీద తాత్కాలికంగా నిషేధం విధిస్తున్నట్లు అమెరికా సోమవారం నాడు ప్రకటించింది. మరిన్ని శునకాల మరణాలను నివారించటానికి ఈ చర్య చేపట్టినట్లు విదేశాంగ శాఖ అధికారి తెలిపారు.
ఈ అంశం మీద జోర్డాన్, ఈజిప్టులు ఇంకా స్పందించలేదు.
''విదేశాల్లో ఉగ్రవాద వ్యతిరేక కృషిలో, అమెరికన్ల ప్రాణాలను కాపాడటంలో ఈ కుక్కలు కీలక పాత్ర పోషిస్తాయి'' అని అమెరికా అధికారి చెప్పారు.
ఇప్పటికే జోర్డాన్, ఈజిప్టులకు పంపించిన శునకాలు ప్రస్తుతానికి అక్కడే ఉంటాయని పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, CANINE VALIDATION CENTER
జోర్డాన్‌లో ఒక శునకం 2017లో వడదెబ్బ వల్ల చనిపోయిందని అమెరికా విదేశాంగ శాఖ నివేదిక చెప్తోంది.
మరో రెండు శునకాలను ''ఆరోగ్యం విషమించిన పరిస్థితిలో అమెరికాకు తిప్పి పంపించారు'' అని కూడా పేర్కొంది.
''చివరికి ఆ రెండు శునకాల్లో ఒకదాని కారుణ్యమరణానికి అధికారులు అంగీకరించాల్సి వచ్చింది.. మరొక శునకం బరువు తీవ్రంగా తగ్గిపోవటంతో దానికి పోషకాహారం అందించి ఆరోగ్యాన్ని మెరుగుపరచాల్సి వచ్చింది'' అని ఆ నివేదిక వివరించింది.
ఆ మూడు శునకాలూ బెల్జియన్ మాలనోయీ జాతికి చెందిన కుక్కలే.
ఈ నెలలో ఇచ్చిన మరో నివేదికలో.. జోర్డాన్‌కు పంపించిన మరో రెండు కుక్కలు అసహజ కారణాల వల్ల చనిపోయాయని వెల్లడించింది. ఒక కుక్క వడ దెబ్బతో, మరో కుక్క పోలీసులు చిలకరించిన క్రిమిసంహారకం వల్ల చనిపోయిందని తాజా నివేదికలో వివరించినట్లు ఏఎఫ్‌పీ వార్తా సంస్థ కథనం.
అమెరికా శిక్షణ పొందిన స్నిఫర్ డాగ్స్ (వాసన పసిగట్టే శునకాలు) ను అత్యధికంగా జోర్డాన్‌కు పంపిస్తుంటారు. ఇప్పటికి దాదాపు 100 శునకాలను ఆ దేశానికి అందించారు.
ఈజిప్టుకు పంపించిన 10 శునకాల్లో మూడు శునకాలు 2018-19 సంవత్సరంలో ఊపిరితిత్తుల క్యాన్సర్, వడ దెబ్బ, పిత్తాశయం దెబ్బతినటం వల్ల చనిపోయాయని అమెరికా నివేదిక తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- రష్యా సైన్యంలోకి హస్కీ డాగ్స్: ‘సైనిక వాహనాలు వెళ్లలేని ప్రదేశాలకూ ఇవి వెళ్లగలవు’
- విషపూరిత కప్పలు... వాటిని నేర్పుగా తినే ఎలుకలు
- 5 నెలలు.. 7 జిల్లాలు.. 2 రాష్ట్రాలు.. 1300 కి.మీ... ఆడ తోడు కోసం తిరిగిన మగ పులి
- గర్భిణిని కరిచి చంపిన కుక్కలు.. 93 శునకాలకు డీఎన్ఏ పరీక్షలు
- జింకని చంపుదామనుకుంటే అదే వేటగాడిని చంపేసింది
- ఐసిస్: 'ఇరాక్‌లో మళ్లీ బలపడుతున్న మిలిటెంట్లు'
- భారత్‌లో ‘దేవతల గుహ’: వెళ్తే తిరిగిరాలేరు.. ఎందుకు? ఏముందక్కడ?
- పెరియార్ : దక్షిణాది రాష్ట్రాలు భారతదేశంలో చేరడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు
- ఇదోరకం మోసం.. కొన్ని సెకన్ల ముందు సమాచారం తెలుసుకుని కోట్లు కొల్లగొడుతున్నారు
- "ఈ దేశంలో పౌరులు కాదు, తమ ఓటర్లు మాత్రమే ఉండాలని ప్రభుత్వం కోరుకుంటోంది"
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








