హిందూ-ముస్లింలు చేతులు కలిపి ఇతర మైనారిటీలపై దాడులు చేసినప్పుడు... - దృక్కోణం

ఫొటో సోర్స్, CENTRAL PRESS/GETTY IMAGES
ఇది వందేళ్ల కిందటి మాట. వలసపాలకుల ఏలుబడిలో ఉన్న బాంబే (నేటి ముంబయి) భారతదేశ చరిత్రలో అతి పెద్ద అల్లర్లకు సాక్షీభూతంగా నిలిచింది. ఇక్కడ విశేషం ఏంటంటే, హిందూ, ముస్లింలు చేతులు కలిపి ఇతర మైనారిటీ మతస్తులపై దాడులు చేశారు.
నేటి భారతదేశానికి అప్పుడు జరిగిన సంఘటనలు, అవి నేర్పిన పాఠాలను చరిత్రకారుడు దిన్యార్ పటేల్ గుర్తు చేస్తున్నారు.
1921 నాటి బాంబే అల్లర్లు - వీటినే ప్రిన్స్ ఆఫ్ వేల్స్ అల్లర్లు అని కూడా అంటుంటారు. నాడు జరిగిన హింసకు మూల కారణం నాటి భావి భారత చక్రవర్తి, బ్రిటీష్ సామ్రాజ్యానికి కాబోయే రాజు ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ఎడ్వర్డ్ VIII భారత పర్యటన.
ఆయన రాకను వ్యతిరేకిస్తూ జరిగిన ఆందోళనలు భిన్నమైన భావజాలాలు, లక్ష్యాలున్న గ్రూపులు చేతులు కలిపి చేశాయి. స్వరాజ్యం, స్వదేశీ, మద్యనిషేధం, పాన్-ఇస్లామిజం అనేవి ఆ భావజాలాలు.
1921 నవంబర్‌లో ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ఎడ్వర్డ్ VIII భారతదేశంలో పర్యటనకు అడుగుపెట్టారు.
అప్పుడు భారతీయులు మహాత్మాగాంధీ ఆధ్వర్యంలో సహాయ నిరాకరణ ఉద్యమంలో ఉన్నారు. 1857లో తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ వలస పాలకులు ఎదుర్కొన్న మొదటి అతిపెద్ద ఉద్యమం అది.
"హిందూ-ముస్లిం ఐక్యత" పతాకం క్రింద, గాంధీ భారతీయ ముస్లింల నేతృత్వంలోని ఖిలాఫత్ ఉద్యమంలో చేరారు.
మొదటి ప్రపంచ యుద్ధంలో ఒట్టోమన్ సామ్రాజ్యం ఓడిపోయిన తర్వాత, గ్రేట్ బ్రిటన్ దాని సుల్తాన్‌ను పదవీచ్యుతుడ్ని చేస్తుందని ముస్లింలు ఆందోళన చెందారు. వారు ఒట్టోమన్ సుల్తాన్‌ను ఇస్లాంకు చట్టబద్ధమైన ఖలీఫాగా భావించేవారు.
ఈ రెండు మతాల మధ్య ఐక్యత కొనసాగుతున్న ఆ సమయంలోనే మిగిలిన మైనారిటీ గ్రూపులలో మెజారిటీవాద భయాలను పెంచింది. హిందూ-ముస్లిం ఐక్యతకు భయపడిన వారిలో క్రైస్తవులు, సిక్కులు, పార్సీలు, యూదులు ఉన్నారు.

అయితే, ఈ విషయంలో ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని గాంధీ ఆ మైనారిటీ వర్గాలకు సూచించారు. ''హిందూ-ముస్లిం ఐక్యత అంటే మెజారిటీ వర్గాలు మైనారిటీ వర్గాలపై ఆధిపత్యం చెలాయించడం కాదు'' అని ప్రకటించారు.
తన పర్యటనతో భారత దేశంలోని బ్రిటీష్ విధేయులకు సంతోషం కలుగుతుందని, వారు గాంధీ ఉద్యమానికి దూరంగా ఉంటారని ప్రిన్స్ ఎడ్వర్డ్ అమాయకంగా భావించారు.
ఆయన ఊహలకు విరుద్ధంగా బాంబేలో ప్రిన్స్ ఆఫ్ వేల్స్ రాకను వ్యతిరేకిస్తూ సమ్మె చేయాలని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. బ్రిటన్ ఆర్థిక సామ్రాజ్యవాదానికి చిహ్నమైన విదేశీ వస్త్రాలను తగలబెట్టాలని కూడా నిర్ణయించింది.

జాతీయవాదానికి వ్యతిరేకంగా మైనారిటీ వర్గాలు
అయితే, 1921 నవంబర్ 17న యువరాజు రాకను స్వాగతించడానికి గణనీయమైన సంఖ్యలో ప్రజలు సిద్ధపడ్డారు. యువరాజు ఓడ దిగివచ్చే కార్యక్రమానికి హాజరయ్యారు. వారిలో ఎక్కువమంది పార్సీలు, యూదులు, ఆంగ్లో-ఇండియన్లు ఉన్నారు.
ప్రశాంతంగా ఆందోళన నిర్వహించాలని గాంధీ సూచించినప్పటికీ కాంగ్రెస్, ఖిలాఫత్ వలంటీర్లు తీవ్రంగా స్పందించారు. భారతదేశపు మొట్ట మొదటి మహిళా ఫొటో జర్నలిస్ట్ హోమీ వైరావాలా ఈ సంఘటనలకు ప్రత్యక్ష సాక్షి.
2008లో నేను ఆమెను ఇంటర్వ్యూ చేసినప్పుడు, ప్రిన్స్ ఆఫ్ వేల్స్‌కు స్వాగతం పలికేందుకు పార్సీ పాఠశాల విద్యార్థినులు సంప్రదాయ నృత్యం చేసుకుంటూ వచ్చినట్లు ఆమె గుర్తు చేసుకున్నారు.
కానీ, తరువాతి రోజుల్లో బొంబాయి వీధుల్లో అనేక అల్లర్లను వైరావాలా చూశారు. రాళ్లు, సోడా బాటిళ్లు విసురుకుంటూ ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్నారు. పార్సీ యజమానుల మద్యం దుకాణాలను లక్ష్యంగా చేసుకుని రాళ్లు విసిరారు. వాటిని తగలబెడతామని హెచ్చరించారు.
సహాయ నిరాకరణ ఉద్యమంలో మద్య నిషేధాన్ని కూడా చేర్చడానికి గాంధీ తీవ్రంగా ప్రయత్నించారు. ఎక్కువగా మద్యం దుకాణాలను నడిపే పార్సీలు ఈ ఉద్యమానికి సహకరించాలని, స్వచ్ఛందంగా షాపులను మూసేయాలని గాంధీ కోరారు.

బొంబాయిని అట్టుడికించిన హింసాకాండ
పార్సీలు నిర్వహించే మద్యం దుకాణాలు జాతీయభావానికి ప్రతిఘటనగా, పార్సీల ఆర్ధిక ఆధిపత్యానికి చిహ్నంగా హిందూ, ముస్లింలు భావించారు.
పార్సీ మతానికి చెందిన ఓ వ్యక్తికి చెందిన మద్యం దుకాణాన్ని తగలబెడతామని అప్పట్లో నిపుణులు హెచ్చరించారు. ఆ షాపు యజమాని తన దుకాణంలోని మద్యాన్ని వీధిలో పారబోయడంతో వారు శాంతించారు.
పార్సీలు, ఆంగ్లో ఇండియన్లు కేవలం బాధితులు కాదు. వారు జాతీయవాదులపై రాళ్లు కర్రలతో దాడులు చేశారు. ఖద్దరు దుస్తులు, గాంధీ టోపీలు ధరించిన వారిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారు.
ఒక దశలో పార్సీలు, ఆంగ్లో ఇండియన్లు దాడి చేయవచ్చన్న భయంతో గాంధీ టోపీలు ధరించవద్దని కాంగ్రెస్ తన కార్యకర్తలకు సూచించింది. అలాగే కాంగ్రెస్‌తో కలిసి పని చేస్తున్న పార్సీలు, క్రైస్తవులపై కూడా దాడులు జరగవచ్చని హెచ్చరించింది.
ఇరువర్గాల మధ్య జరుగుతున్న హింసను ఆపేందుకు గాంధీ వివిధ సంఘాల నాయకులతో చర్చలు జరిపి శాంతింపజేశారు.
మతపరమైన అల్లర్లను నిరసిస్తూ నవంబర్ 19న గాంధీ తన మొట్టమొదటి నిరాహార దీక్షను ప్రారంభించారు. హింస తగ్గే వరకు అన్న పానియాలకు దూరంగా ఉంటానని ఆయన ప్రతిజ్ఞ చేశారు.
ఆ వ్యూహం పని చేసింది. నవంబర్ 22 నాటికి, గాంధీ తన నిరాహారదీక్షను విరమించారు.కానీ, ప్రిన్స్ ఆఫ్ వేల్స్ అల్లర్లు ఆయన్ను తీవ్రంగా కదిలించాయి. "స్వరాజ్యం భవిష్యత్తు నాకు కనిపించింది'' అని గాంధీ బాధతో వ్యాఖ్యానించారు.
మెజారిటీవాదుల హింసాత్మక ఆధిపత్య ధోరణి కారణంగా మైనారిటీలలో ఏర్పడే ఆందోళనను ఈ అల్లర్లు నిరూపించి చూపాయని ఆయన అన్నారు.
అందుకే, ఈ హింసాత్మక ఘటనల నుంచి బొంబాయి బైటపడ్డాక , మైనారిటీల విశ్వాసాన్ని తిరిగి పొందేందుకు గాంధీ తీవ్రంగా ప్రయత్నాలు ప్రారంభించారు.
మైనారిటీ హక్కుల ప్రాముఖ్యత పై కాంగ్రెస్, ఖిలాఫత్ వలంటీర్లకు ఆయన సూచనలిచ్చారు, వారికి నష్ట పరిహారం కోసం కృషి చేశారు.
మైనారిటీల సంక్షేమం బాధ్యత మెజారిటీ కమ్యూనిటీలకు ఉందని గాంధీ అన్నారు. సమావేశాలలో, కాంగ్రెస్ ప్రచురణల్లో మైనారిటీ ప్రతినిధులకు గణనీయమైన ప్రాధాన్యతను ఇచ్చారు.
''హిందూ-ముస్లిం ఐక్యత'' నినాదం స్థానంలో గాంధీ కొత్తగా "హిందూ-ముస్లిం-సిక్కు-పార్సీ-క్రిస్టియన్-యూదుల ఐక్యత" అనే నినాదాన్ని తీసుకువచ్చారు.
ఇది పలకడానికి వీలుకాని పెద్ద పదం. కానీ, అది పని చేసింది. మైనారిటీలకు స్వతంత్ర భారతదేశంలో స్థానం ఉంటుందని ఒప్పించడానికి సహాయపడింది.
బాంబే అల్లర్లలో కనీసం 58 మంది మరణించారు. నగరంలోని ఆరు మద్యం దుకాణాలలో ఒకదానిపై దాడి జరిగింది. ప్రిన్స్ ఆఫ్ వేల్స్‌కు ఈ అల్లర్లు బ్యాడ్ బిగినింగ్‌లా కనిపించాయి.
భారతదేశంలో ఆయన ఎక్కడికెళ్లినా సమ్మెలు, నిరసనలు, చంపేస్తామన్న బెదిరింపులు ఎదురయ్యాయి.

ఫొటో సోర్స్, Getty Images
నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి?
ప్రిన్స్ ఆఫ్ వేల్స్ అల్లర్లలో కనిపించిన మతపరమైన హింస రాజకీయ కారణాలతోనే జరిగింది. అంతకు ముందున్న మతపరమైన విద్వేషాలతో ముడిపడింది కాదు.
1921 నాటి రాజకీయాలు హిందువులు, ముస్లింలు కలిసి పోరాడేలా చేశాయి. కొన్ని సంవత్సరాలకు కాంగ్రెస్-ఖిలాఫత్ కూటమి పతనం అయ్యాక హిందూ-ముస్లింలు ఒకరిపై మరొకరు హింసకు దిగారు.
ఇక్కడ నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే...మెజారిటీవాదం అనేది చంచలమైన, ఒక పనికిమాలిన అంశం. 1920లలో బొంబాయి వీధుల్లో జరిగినట్లే, రకరకాల కారణాలతో, అనూహ్య రీతుల్లో హింసా మార్గంలో పయనించవచ్చు.
బహుశా అందుకే గాంధీ మెజారిటీవాదాన్ని అడ్డుకోవడానికి చాలా దూరం వెళ్లారు. మైనారిటీల పట్ల సహనం గురించి నొక్కి చెప్పారు.
వందేళ్ల కిందటే గాంధీ ఇలాంటి పరిణామాలపై హెచ్చరికలు చేశారు. ఈ రోజు మెజారిటీలు ఇతరులను అణిచివేసేందుకు ఏకమైతే రేపు ఈ ఐక్యత మరో కారణంతో విచ్ఛిన్నం కావచ్చు.
(దిన్యార్ పటేల్ రచయిత, ఇటీవలే ఆయన దాదాభాయ్ నౌరోజీ జీవిత చరిత్ర రాశారు)
ఇవి కూడా చదవండి:
- గుజరాత్ నిజంగా శాకాహార రాష్ట్రమా? రోడ్ల పక్కన నాన్ వెజ్ స్టాల్స్ ఎందుకు మూసేస్తున్నారు?
- వెక్కి వెక్కి ఏడ్చిన చంద్రబాబు.. ‘మళ్లీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగు పెడతా’
- ‘చంద్రబాబుది ఓ డ్రామా.. ఆయన చెబుతున్న మాటలు అసెంబ్లీలో ఎవ్వరూ అనలేదు’ - వైఎస్ జగన్
- కేసీఆర్ ధర్నా చౌక్ బాట ఎందుకు పట్టాల్సి వచ్చింది?
- మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నాం: ప్రధాని మోదీ
- అమెరికాను అధిగమించి అత్యంత సంపన్న దేశంగా అవతరించిన చైనా -మెకెన్సీ రిపోర్ట్
- ‘చేసింది కొంతే.. చేయాల్సింది చాలా ఉంది’
- 'జై భీమ్': ఈ నినాదం ఎలా పుట్టింది, మొట్టమొదట వాడింది ఎవరు
- రాణి కమలాపతి ఎవరు? హబీబ్గంజ్ స్టేషన్కు ఆమె పేరెందుకు పెట్టారు?
- ఆల్బర్ట్ ఎక్కా: గొంతులో బుల్లెట్ దిగినా, మిషన్ పూర్తి చేసి ప్రాణం వదిలిన భారత జవాన్
- ‘గత 116 ఏళ్లలో ఈ స్థాయిలో మంచు కురవడం చూడలేదు’
- పాకిస్తాన్: అత్యాచార నేరస్థులను నపుంసకులుగా మార్చే బిల్లుకు ఆమోదం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












