కేంద్ర బడ్జెట్: ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ముందున్న సవాళ్లు ఏంటి?

వైజాగ్ స్టీల్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అర్చనా శుక్లా
    • హోదా, బీబీసీ న్యూస్

‘‘స్టీల్ ప్లేట్లను వేస్ట్ చేయొద్దు. మనం మరిన్ని నష్టాలను భరించే పరిస్థితి లేదు...’’ అని స్టీల్ ప్లేట్లతో సైకిల్ విడిభాగాలు తయారు చేస్తున్న తన పనివాళ్లకు చెప్పారు సత్నామ్‌సింగ్ మాకడ్.

పంజాబ్‌లోని లూధియానాలో గల ఆయన ఫ్యాక్టరీలో ఉత్పత్తి.. కోవిడ్ మహమ్మారి ముందు నాటితో పోలిస్తే.. ఇప్పటికే సగానికి పైగా పడిపోయింది. స్టీలు వంటి ముడిసరకుల ధరల్లో హెచ్చుతగ్గుల వల్ల లాభాలు కూడా తగ్గిపోయాయి.

‘‘కోవిడ్ లాక్‌డౌన్ల కాలంలో నా వలస కార్మికుల్లో చాలా మంది ఇళ్లకు వెళ్లిపోయారు. చాలా కొద్ది మంది మాత్రమే తిరిగొచ్చారు. డిమాండ్ చాలా మందకొడిగా ఉంది. అందువల్ల మా ఉత్పత్తి పుంజుకోలేదు. ఈసారి మావంటి చిన్న వ్యాపారులకు బడ్జెట్‌లో ఏమైనా చేస్తారేమోనని మేం ఆశిస్తున్నాం’’ అని మాకడ్ బీబీసీతో పేర్కొన్నారు.

పతాక శీర్షికల్లో భారత వృద్ధి గణాంకాలు మెప్పించేలా ఉంటే.. భారతదేశపు అసంఘటిత కార్మికుల్లో అత్యధికులకు ఉపాధి కల్పించే మకాడ్ వంటి వారు నడిపే చిన్న వ్యాపారాలు.. దేశ ఆర్థికవ్యవస్థ కోలుకోవటంలో ఉన్న అసమానతలను ప్రతిఫలిస్తున్నాయి.

భారతదేశం K షేప్ రికవరీకి (K ఆకారంలో కోలుకోవటానికి) మధ్యలో ఉంది. మహమ్మారి కాలంలో అతి తీవ్రంగా దెబ్బతిన్న పట్టణ ప్రాంత పేదలు, చిన్న వ్యాపారులు.. లాక్‌డౌన్లు, పడిపోయిన డిమాండ్ వలయాల ప్రకంపనలను ఇంకా చవిచూస్తూనే ఉన్నారు. మరోవైపు ధనికవర్గాల దగ్గర పేరుకుపోయిన డిమాండ్.. సంఘటిత రంగాల్లో వృద్ధికి దారితీసింది. దీంతో అసమానత్వం తీవ్రంగా పెరిగిపోయింది.

ఈ రెండిటి మధ్య భారత ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి ఒకటో తేదీన ప్రవేశపెట్టే బడ్జెట్‌లో సమతుల్యత సాధించాల్సి ఉంటుంది. మరింత సమానత్వంతో కూడిన రికవరీకి కార్యాచరణ ప్రణాళికను ప్రకటించాల్సి ఉంటుంది.

కానీ దానిని ఆమె ఎలా సాధిస్తారనేది అంచనా వేయటం కష్టం.

ఎన్నికల బడ్జెట్

ఫొటో సోర్స్, Getty Images

ఎన్నికల బడ్జెట్

ఆర్థికమంత్రి బడ్జెట్ ప్రసంగం చేసిన కేవలం 10 రోజుల తర్వాత.. రెండు భారీ గ్రామీణ రాష్ట్రాల్లో – పంజాబ్, ఉత్తరప్రదేశ్‌ - ఎన్నికలు జరుగనున్నాయి. ద్రవ్య పరిస్థితి చాలా కష్టంగా ఉన్నప్పటికీ.. ఆరోగ్య పరిరక్షణ, పరిశుభ్రమైన నీరు, గృహనిర్మాణం వంటి సంక్షేమ పథకాలపై ప్రభుత్వ వ్యయం పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కొన్ని వర్గాల ప్రజలకు నగదు అందించే అవకాశం కూడా ఉండొచ్చునని చెప్తున్నారు.

ఊహించిన దానికన్నా ఎక్కువ కాలం కొనసాగుతున్న కోవిడ్ వలయం, ఒమిక్రాన్ వేరియంట్ వల్ల ఇటీవల మరో వేవ్‌లో పెరిగిన కేసుల వెల్లువలు.. వైద్య మౌలికసదుపాయాల నిర్మాణం ఆవస్యకత మీద మళ్లీ దృష్టి కేంద్రీకరించేలా చేశాయి. కాబట్టి వైద్యం, అనుబంద రంగాలకు కేటాయింపులు పెంచే అవకాశముంది.

ప్రజాకర్షక వైఖరిని అవలంబించవచ్చన్న అంచనాతో.. 2022 బడ్జెట్ వ్యవసాయ, గ్రామీణ రంగాల మీద కూడా దృష్టి కేంద్రీకరిస్తూ ప్రకటనలు చేయవచ్చు.

రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన తుది గడువు 2022తో ముగుస్తుంది. పంటల వైవిధ్యం, సబ్సిడీలు, ప్రత్యక్ష మార్కెట్ అందుబాటు అనేది లక్ష్యంగా పెట్టుకున్నారు.

బడ్జెట్‌లో ఈ హామీ ఇచ్చి ఐదేళ్లు గడిచాయి. ఈ కాలంలో రైతుల ఖర్చులు రెట్టింపు కాగా.. వారి ఆదాయాలు కుచించుకుపోయాయి. ఈ ఏడాది బడ్జెట్‌లో కేటాయింపులు క్షేత్రస్థాయిలో వాస్తవరూపం దాలుస్తాయా లేదా అనే అంశం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది.

వీడియో క్యాప్షన్, మీ బ్యాంకు దివాళా తీస్తే మీరు డిపాజిట్ చేసిన డబ్బు పరిస్థితేంటి?

‘‘అభిమానుల కేరింతల మధ్య పథకాలను ప్రకటిస్తారు. కానీ అవి సమర్థవంతంగా రైతులకు చేరవు. రైతులు వ్యవసాయం చేయటానికి అవసరమైన విత్తనాలు, ఎరువులు వంటివి సకాలంలో రైతులకు చేరాలి. మేం గోధుమ పంట వేయటానికి ఎరువులు అవసరమైనపుడు.. ఏమీ దొరకలేదు. దానివల్ల మొత్తం పంట చక్రమంతా దెబ్బతింటుంది’’ అని లూధియానాకు చెందిన గోధుమ రైతు అమ్రిక్ సింగ్ బీబీసీతో చెప్పారు.

వివాదాస్పద చట్టాలను ప్రభుత్వం ఉపసంహరించుకునేలా ఒత్తిడి చేస్తూ ఏడాది పాటు నిరసన తెలిపిన ఈ రైతుల విశ్వాసాన్ని గెలవటం.. రానున్న ఎన్నికల్లో ప్రభుత్వానికి చాలా కీలకం.

రైతులకు మూడు నెలలకోసారి రూ. 2,000 నగదు అందించే పీఎం-కిసాన్, గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎంజీఎన్ఆర్ఏ వంటి పథకాలు.. గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ప్రజానీకానికి భద్రత కల్పించాయని ఇండియా రేటింగ్స్, రీసెర్చ్ స్కీమ్స్ అనే సంస్థలు చెప్తున్నాయి. రాబోయే బడ్జెట్‌లో ఈ పథకాలు కొనసాగటంతో పాటు, తగినన్ని నిధులు కేటాయిస్తూ వీటిని మరింతగా విస్తరిస్తారని అంచనా వేస్తున్నారు.

చిన్న వ్యాపారాలు, ఉద్యోగాల పునరుద్ధరణ...

ఫొటో సోర్స్, AFP

చిన్న వ్యాపారాలు, ఉద్యోగాల పునరుద్ధరణ...

మహమ్మారి వల్ల తలెత్తిన ఆర్థిక మందగమనం వల్ల చిన్నాభిన్నమైన భారతదేశపు గ్రామాలు, పట్టణాల్లో ఉద్యోగాలు – ముఖ్యంగా నైపుణ్య ఉద్యోగాలు కుచించుకుపోయాయి. రైల్వే రిక్రూట్‌మెంట్ ప్రక్రియలకు వ్యతిరేకంగా ఇటీవల యూపీ, బీహార్‌లలో విద్యార్థుల నిరసనలు.. పెరిగిపోతున్న నిరుద్యోగిత, దానివల్ల ఆందోళనలను మరోసారి ముందుకు తెచ్చాయి.

నిరుద్యోగిత పెరుగుతుండటంతో మార్కెట్‌లో కార్మిక శక్తి భాగస్వామ్యం పడిపోయిందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ అంచనా వేసింది. 2016 డిసెంబర్‌లో 43 శాతంగా ఉన్న ఉద్యోగకల్పన రేటు 2021 డిసెంబర్ నాటికి 37 శాతానికి దిగజారింది.

అదే సమయంలో వ్యవసాయంలో పనిచేసే వారు, గ్రామీణ ఉపాధి పథకం ఎంజీఎన్‌ఆర్‌ఏలో పనిచేసే వారి వాటా ఎక్కువగా పెరిగింది. గ్రామీణ మౌలిక సదుపాయాలు, త్వరగా పూర్తయ్యే ప్రాజెక్టులు, ఉపాధి ఎక్కువగా కల్పించే ప్రాజెక్టులకు.. 2022-23 బడ్జెట్‌లో పెట్టుబడి వ్యయం కేటాయింపుల్లో ప్రాధాన్యం ఇస్తారని నిపుణులు ఆశిస్తున్నారు.

నగరాలు, పట్టణాల్లో మళ్లీ ఉద్యోగాలను కల్పించటంలో.. దేశంలో అసంఘటిత కార్మికశక్తికి ఎక్కువగా ఉపాధి కల్పించే చిన్న పరిశ్రమలు చాలా కీలకమవుతాయి.

కోవిడ్ వల్ల తలెత్తిన మందగమనం వల్ల తీవ్రంగా దెబ్బతిన్న మధ్య, చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమలకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వలేదని యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్‌లో ఎకానమిక్స్ ప్రొఫెసర్ జయతి ఘోష్ అభిప్రాయపడ్డారు. ఈ రంగంపై ఈ బడ్జెట్‌లో మరింతగా దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉందన్నారు.

‘‘కేవలం సరఫరాకు సంబంధించిన ప్యాకేజీతో చిన్నతరహా పరిశ్రమలను పునరుద్ధరించటం సాధ్యం కాదు. అసలు సమస్య ఏమిటంటే.. వాటికి డిమాండ్ రావటం లేదు. జనం రక్తమోడుతున్నారు. జనం చేతుల్లో ప్రభుత్వం డబ్బులు పెట్టాల్సి ఉంటుంది’’ అని ఆమె బీబీసీతో పేర్కొన్నారు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ గత వారంలో ఎకానమిక్ టైమ్స్ పత్రికకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో.. ‘‘రాష్ట్రాలు చేస్తున్న పనిని కొనసాగించేలా చూడటం చాలా ముఖ్యం. ఎందుకంటే కింది స్థాయి ఉద్యోగాలను సృష్టించటానికి అది చాలా కీలకం. అంతేకాదు.. దేశీయంగా ఉక్కు, సిమెంట్, కాపర్‌ వంటి వాటికి డిమాండ్ సృష్టించటానికి కూడా అది ముఖ్యం’’ అని చెప్పారు.

కత్తి మీద సాము

ఫొటో సోర్స్, Getty Images

కత్తి మీద సాము

కోవిడ్ మహమ్మారి తొలిసారి దెబ్బకొట్టిన రెండేళ్ల తర్వాత.. టెక్స్‌టైల్స్ వంటి రంగాల్లో వినియోగ డిమాండ్ నెమ్మదిగా తిరిగి పుంజుకుంటోంది. కానీ ఇలా కోలుకుంటున్న దానిని గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ కేంద్రాల వరకూ ద్రవ్యోల్బణం దెబ్బతీసే ప్రమాదముంది.

చమురు, ఆహారం నుంచి ఇనుము, జౌళి వంటి పరిశ్రమల ముడి సరకుల వరకూ పెరిగిపోతున్న ధరలు అన్ని స్థాయిల్లోనూ ప్రజానీకంపై.. ముఖ్యంగా అల్పాదాయ వర్గాల వారిపై ప్రభావం చూపుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో ఇది ఎన్నికల అంశంగా మారటంతో.. ఆర్థికమంత్రి బడ్జెట్‌లో దీనికి పరిష్కారం చూపవచ్చునని నిపుణులు భావిస్తున్నారు.

కానీ ప్రభుత్వ ఆదాయం కూడా పన్నుల సేకరణలో పడిపోయింది. ఇలా ఆదాయం తగ్గిపోయినప్పటికీ.. ఆర్థికవ్యవస్థకు మద్దతు ఇవ్వటానికి ప్రభుత్వం వ్యయం పెంచినట్లయితే.. ప్రభుత్వ ద్రవ్య పరిస్థితి కూడా ఇక్కట్లను ఎదుర్కొంటుంది.

వృద్ధికి మద్దతివ్వటం, ద్రవ్య పరిస్థితిని బలోపేతం చేయటానికి సంబంధించి - అంటే ఆదాయ, వ్యయాల మధ్య తేడాను తగ్గించటానికి సంబంధించి – 2022-23 బడ్జెట్ ప్రభుత్వానికి కత్తిమీద సాములా ఉండబోతోందని బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకానమిస్ట్ మదన్ సబ్నవీస్ వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)