ఫేస్‌బుక్ మెసెంజర్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్: ఈ టెక్నాలజీతో యూజర్లకు లాభమా, నష్టమా? ప్రభుత్వాలు ఎందుకు వద్దంటున్నాయి?

ఫేస్‌బుక్ మెసెంజర్

ఫొటో సోర్స్, Getty Images

ఫేస్‌బుక్ మెసేజింగ్‌లో అత్యాధునిక భద్రతను ప్రవేశపెట్టాలనే ప్రణాళికను నిలిపివేయాలని బ్రిటన్ ప్రభుత్వం కోరుతోంది. ఇది కోట్లాది మందిపై ప్రభావం చూపే చర్చ.

ఫేస్‌బుక్ మెసెంజర్ సర్వీసులో ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ (ఈ2ఈఈ)ని ప్రవేశపెట్టవద్దని ఆ సంస్థ మీద ఒత్తిడి చేయాల్సిందిగా.. బ్రిటన్ ప్రభుత్వంతో పాటు చిన్నారుల సేవా సంస్థల సంఘం ఒకటి బ్రిటన్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాయి.

ఫేస్‌బుక్ తన మెసేజింగ్‌ యాప్‌లో ఈ అత్యాధునిక భద్రత వ్యవస్థను ప్రవేశపెడితే.. మరింత ఎక్కువ మంది చిన్నారులకు ఆన్‌లైన్ వేటగాళ్ల నుంచి ముప్పు ఉంటుందనేది వారి వాదన.

అయితే వ్యక్తిగత గోప్యత, సమాచార భద్రత కోసం ఈ బలమైన రక్షణ వ్యవస్థ అవసరమని గోప్యత ఉద్యమకారులు, టెక్నాలజీ కంపెనీలు వాదిస్తున్నాయి. దీంతో ఈ అంశంపై చర్చ తీవ్రరూపం దాల్చే అవకాశముంది.

ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను దాని ప్రస్తుత రూపంలో విస్తరించకుండా అడ్డుకోవాలని చాలా దేశాల ప్రభుత్వాలు కోరుకుంటున్న నేపథ్యంలో.. బ్రిటన్‌లో రాజుకుంటున్న ఈ ఘర్షణను ప్రపంచమంతా నిశితంగా గమనిస్తోంది.

బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజీలాండ్, అమెరికా, ఇండియా, జపాన్ ప్రభుత్వ యంత్రాంగాలతో పాటు.. ఇంటర్‌పోల్, బ్రిటన్‌కు చెందిన ఎన్‌సీఏ వంటి పోలీసింగ్ సంస్థలు ఈ టెక్నాలజీని చాలా ఏళ్లుగా విమర్శిస్తున్నాయి.

మరోవైపు.. కోట్లాది మంది ప్రజలు వాట్సాప్, ఐమెసేజ్, సిగ్నల్ వంటి యాప్‌లను వినియోగించటం ద్వారా ఈ2ఈఈ టెక్నాలజీని ఆదరిస్తున్నారు.

వీడియో క్యాప్షన్, ప్రపంచాన్ని మార్చేసిన 4 ఆవిష్కరణలు ఇవే

ఎన్‌క్రిప్షన్ అంటే ఏమిటి?

ఎన్‌క్రిప్షన్ అంటే.. ఏదైనా సమాచారాన్ని చదవటానికి వీలులేకుండా గజిబిజిగా మార్చేయటం. మనం మనకు తెలియకపోయినా ప్రతి రోజూ ఆన్‌లైన్‌లో ఎన్‌క్రిప్షన్ టెక్నాలజీని వాడుతున్నాం.

ఉదాహరణకు మీ ఇంటర్నెట్ బ్రౌజర్‌ పైభాగాన ఉండే చిన్న పాడ్‌లాక్.. బీబీసీ వెబ్‌సైట్ సర్వర్ల నుంచి మీరు పొందే సమాచారం, ఆ సర్వర్ల నుంచి మీరు పంపించే సమాచారం ఎన్‌క్రిప్ట్ అయిందనే విషయాన్ని మీకు చెప్తుంది.

అంటే.. ఇచ్చిపుచ్చుకునే ఆ సమాచారాన్ని మధ్యలో జోక్యం చేసుకునే వారెవరూ చదవలేరని దాని అర్థం.

ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఈమెయిల్స్ వంటి అతి సున్నితమైన ఆన్‌లైన్ సేవల విషయంలో ఈ ఎన్‌క్రిప్షన్ మరింత దృఢంగా ఉంటుంది.

ఇదెలా పనిచేస్తుందంటే.. ఒక వెబ్‌సైట్ లేదా యాప్‌కు – మన డివైజ్‌కు మధ్య ఒక సీక్రెట్ కోడ్‌ను ఖరారు చేసుకుంటారు.

ఆ వెబ్ సర్వీస్‌కు ఇంటర్నెట్ ద్వారా మనం పంపించే సమాచారం ఏదైనా.. మనం దానిని పంపించే ముందు ఎన్‌క్రిప్ట్ అవుతుంది. ఆ సమాచారం మనం సంప్రదిస్తున్న కంపెనీకి చేరుకున్న తర్వాత.. మనం ఖరారు చేసుకున్న రహస్య కోడ్‌ను సరిచూసుకుని అప్పుడది చదవగలిగే రూపంలోకి డిక్రిప్ట్ అవుతుంది.

ఈ తరహా ఎన్‌క్రిప్షన్‌ ఇంటర్నెట్‌లో ప్రయాణించే మన సమాచారానికి హ్యాకర్లు, నేరస్తుల నుంచి రక్షణ కల్పిస్తుంది కాబట్టి.. దీనిని అందరూ ఆహ్వానిస్తున్నారు.

కానీ ఈ సమాచారాన్ని.. ఆ డాటాను ప్రాసెస్ చేసే సంస్థలు చదవగలవు. దీంతో ఏదైనా కంపెనీ దగ్గర స్టోరై ఉండే సమాచారాన్ని లేదా మెసేజీలను తమకు అప్పగించాలని పోలీసులు, భద్రతా సంస్థలు అడగ గలుగుతున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా పోలీసులు ఆధారాలు సేకరించటంలో ఇది కూడా రోజు వారీ పనిగా మారిపోయింది. నేరస్తులను అరెస్ట్ చేయటానికి, శిక్షించటానికి ఇది సాయపడుతోంది.

ప్రపంచంలో ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉన్న, అత్యంత ప్రజాదరణ కలిగిన యాప్ వాట్సాప్. దీనికి 200 కోట్ల మంది యూజర్లు ఉన్నారు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ప్రపంచంలో ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉన్న, అత్యంత ప్రజాదరణ కలిగిన యాప్ వాట్సాప్. దీనికి 200 కోట్ల మంది యూజర్లు ఉన్నారు

ఈ2ఈఈను ప్రభుత్వాలు ఎందుకు ఇష్టపడట్లేదు?

ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ అనేది మరో అడుగు ముందకు వెళుతుంది. ఒక సెండర్‌కి – ఒక రిసీవర్‌కి మధ్య ఖరారయ్యే సీక్రెట్ కోడ్ ఎంత రహస్యంగా ఉంటుందంటే.. మన డాటాను నిర్వహించే కంపెనీకి కూడా ఆ కోడ్ తెలీదు.

అంటే.. మెసేజ్‌లు, ఇమేజ్‌లు, ఫోన్ కాల్స్‌ వంటి వాటిని కేవలం సదరు ఎండ్ యూజర్ – వాటిని పంపించే వినియోగదారులు మాత్రమే డిక్రిప్ట్ చేయగలుగుతారు.

ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో సులభంగా అర్థం చేసుకోవాలంటే.. మీరు మాత్రమే చదవగలిగే ఒక లేఖను పోస్టులో తెప్పించుకోవటాన్ని ఊహించుకోండి.

ఆ లేఖ పంపించే వ్యక్తికి మీరు ఒక బాక్స్‌ను పంపిస్తారు. ఆ బాక్స్ తాళంచెవి మీ దగ్గర మాత్రమే ఉంటుంది. వారు ఆ లేఖను ఆ బాక్సులో పెట్టి మూతపెట్టగానే ఆ బాక్సుకు తాళం పడిపోతుంది. అప్పుడు వాళ్లు ఆ బాక్స్‌ను మీకు పంపిస్తారు. మీరు మీ దగ్గర మాత్రమే ఉన్న ఏకైక తాళంచెవితో దానిని తెరవగలుగుతారు.

ఈ2ఈఈ వ్యవస్థ ఇలాగే పనిచేస్తుంది. ఇక్కడ ఆ తాళం వేసిన బాక్సుకు డిజిటల్ రూపాన్ని.. ‘పబ్లిక్ కీ’ అంటారు. మీ దగ్గరున్న విశిష్టమైన ఏకైక తాళంచెవిని మీ ‘ప్రైవేటు కీ’గా పిలుస్తారు.

గోప్యతకు ప్రాధాన్యమిచ్చే జనం ఈ వ్యవస్థను అమితంగా ఇష్టపడుతున్నారు. ఎందుకంటే మీ సమాచారానికి అందరి నుంచీ రక్షణ ఉంటుంది. మీరు పంపే డాటాను ఆ మెసేజింగ్ కంపెనీ కూడా చదవటానికి వీలుపడదు.

కానీ ప్రభుత్వ యంత్రాంగాలు దీనిని ఇష్టపడటం లేదు. ఎందుకంటే.. నేర కార్యకలాపాలు జరుగుతున్నాయనే అనుమానులు ఉన్నా కూడా ఈ2ఈఈ వ్యవస్థలో మెసేజ్‌లను వారు చదవలేరు, ఫొటోలను చూడలేరు, ఫోన్ కాల్స్ వినలేరు.

వీడియో క్యాప్షన్, ఫేస్‌బుక్‌లో మీ సమాచారం ఏమవుతుంది?

ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ప్రమాదకరమా?

ఈ వ్యవస్థను వ్యతిరేకిస్తున్న బ్రిటన్ ఉద్యమం.. ఈ2ఈఈ వల్ల చిన్నారులకు పొంచివున్న ప్రమాదాలపై దృష్టి కేంద్రీకరిస్తోంది.

‘‘ఈ2ఈఈని ప్రవేశపెట్టటం అంటే.. ఆన్‌లైన్‌లో చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడే నేరస్తులను గుర్తించకుండా చీకట్లు కప్పేయటమే అవుతుంది’’ అని ‘నో ప్లేస్ టు హైడ్’ ఉద్యమ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.

ఈ వ్యవస్థ అమలులోకి వస్తే.. ఆగంతకులు ఫేస్‌బుక్ మెసెంజర్‌లో చిన్నారులకు పంపే మెసేజీలను పోలీసులు చదవలేరని వారు వాదిస్తున్నారు.

‘‘ఈ2ఈఈ టెక్నాలజీ వినియోగం వల్ల పిల్లల భద్రత ప్రమాదంలో పడకుండా ఉండేలా చేయగలిగినపుడు మాత్రమే.. ఈ టెక్నాలజీని తాము వినియోగిస్తామని వారు బహిరంగంగా హామీ ఇవ్వాలంటూ మేం సోషల్ మీడియా వేదికలకు పిలుపునిస్తున్నాం’’ అని ఉద్యమ ప్రతినిధి ఒకరు చెప్పారు.

అమెరికా నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్‌ప్లాయిటెడ్ చిల్డ్రన్ (ఎన్‌సీఎంసీఈసీ) చెప్తున్నదాని ప్రకారం.. సోషల్ మీడియాలో చిన్నారులపై లైంగిక దాడులకు సంబంధించిన సమాచార మార్పిడిపై 2020 సంవత్సరంలో 2.17 కోట్ల ఫిర్యాదులు అందాయి.

ఈ2ఈఈ వ్యవస్థను మరింత విస్తృతంగా అమలు చేసినట్లయితే.. ఈ ఫిర్యాదుల్లో ఏటా 1.4 కోట్ల ఫిర్యాదులు రాకుండా పోతాయని ఉద్యమకారులు చెప్తున్నారు.

చిన్నారులకు, గోప్యతకు భద్రత కల్పించే పరిష్కారాలను కనుగొనటానికి టెక్ కంపెనీలతో కలిసి పనిచేయటానికి తాము సిద్ధంగా ఉన్నామని వారు తెలిపారు.

వీడియో క్యాప్షన్, అక్కడ ఫేస్‌బుక్, వాట్సప్ వాడాలంటే ట్యాక్స్ కట్టాల్సిందే

ఫేస్‌బుక్ ఏం చెప్తోంది?

ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా.. తన మెసెంజర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో నవంబర్‌లోనే ఈ2ఈఈ వ్యవస్థను అమలు చేయాలన్న ప్రణాళికను.. చిన్నారుల భద్రత సంస్థల ఒత్తిడితో వాయిదా వేసింది.

‘‘ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలను అనుసంధానించే సంస్థగా, ఇండస్ట్రీలో అత్యున్నత స్థాయి టెక్నాలజీని రూపొందించిన సంస్థగా.. ప్రజల వ్యక్తిగత సమాచారమార్పిడికి భద్రత కల్పించటానికి, ఆన్‌లైన్‌లో ప్రజల భద్రతను కాపాడటానికి మేం కృతనిశ్చయంతో ఉన్నాం’’ అని మెటా సంస్థలో భద్రత విభాగానికి ప్రపంచ అధిపతి ఆంటిగోన్ డేవిస్ ఆ సమయంలో చెప్పారు.

పిల్లలకు భద్రత కల్పించటానికి తాము చేపట్టిన చర్యల జాబితాను ఆ సంస్థ వివరించింది.

మేసేజింగ్ ప్రవర్తనలో అసాధారణ క్రమాలను గుర్తించటానికి మెషీన్ లెర్నింగ్‌ను ఉపయోగించటం, 18 ఏళ్ల వయసు లోపు యూజర్లను ప్రైవేటు లేదా ‘ఫ్రెండ్స్ ఓన్లీ’ అకౌంట్లలో మాత్రమే ఉంచటం వంటివి అందులో ఉన్నాయి.

వీడియో క్యాప్షన్, ఫేస్‌బుక్ మోడరేటర్: చూడలేని ఎన్నో దారుణాలను అక్కడ చూడాల్సి ఉంటుంది!

ఇరు పక్షాలనూ మెప్పించే దారేదైనా ఉందా?

2017లో ఈ చర్చ మొదలైనప్పటి నుంచీ.. ఎండ్-టు-ఎండ్-ఎన్‌క్రిప్టెడ్ మెసీజీలను భద్రతా సంస్థలు చదవటానికి వీలుకల్పించే సాంకేతిక కిటుకు ఏదైనా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు అడుగుతూ ఉన్నాయి.

కానీ.. ఈ టెక్నాలజీ మూల సూత్రాలతో రాజీపడకుండా.. ‘భద్రత లొసుగు’ను కానీ, ఓ ‘దొడ్డి దారి’ని సృష్టించటం కానీ అసాధ్యమని సైబర్ సెక్యూరిటీ నిపుణులు వాదిస్తున్నారు.

రహస్య దొడ్డి దారి కీని భద్రతా సంస్థలు దుర్వినియోగం చేయబోవని యూజర్లు నమ్మాల్సి ఉంటుంది.

జనం సురక్షితంగా, సెన్సార్‌షిప్ లేకుండా సంభాషించుకోవటానికి ఈ2ఈఈ ఒక్కటే మార్గంగా ఉన్న దేశాల్లో ఇది మరింత ఎక్కువ ఆందోళనకరమైన విషయం.

ఏదో విధమైన కొత్త వ్యవస్థను కనుగొనేలా మెటా సంస్థను బ్రిటన్ ప్రభుత్వం ఒప్పించగలిగితే.. అది ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు వాడుతున్న ఎండ్-టు-ఎండ్ యాప్‌లకు విస్తరిస్తుందనటంలో సందేహం లేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)