RRB పరీక్షలు, బిహార్ నిరుద్యోగులు: ‘‘పది రూపాయల సమోసా తినడానికి బదులుగా ఆ డబ్బుతో జిరాక్స్‌ తీసుకుని పరీక్ష కోసం చదువుకుంటా’’

ఉద్యోగం కోసం నిరంతం చదవడంతో పాటు ఇతర కష్టాలను కూడా విద్యార్థులు ఎదుర్కొంటున్నారు

ఫొటో సోర్స్, VISHNU NARAYAN

ఫొటో క్యాప్షన్, ఉద్యోగం కోసం నిరంతం చదవడంతో పాటు ఇతర కష్టాలను కూడా విద్యార్థులు ఎదుర్కొంటున్నారు
    • రచయిత, విష్ణు నారాయణ్, అనంత్ ఝణాణె
    • హోదా, బీబీసీ హిందీ కోసం

''నా ఖర్చుల కోసం ఇంటి నుంచి రూ. 3,000 పంపిస్తారు. రూమ్ కిరాయి కోసం రూ. 1200 ఖర్చు చేస్తా. ఇప్పుడు లైబ్రరీలు తెరుచుకోవట్లేదు. లేకపోతే లైబ్రరీ కోసం రూ. 400 చెల్లించాల్సి ఉంటుంది. గ్యాస్‌ను పొదుపు చేయడం కోసం కుక్కర్‌లోనే వంట చేసుకుంటాను. నూనె ధర రూ. 200కి చేరింది. నేను మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తిని. ఇంతకుముందు నాతో పాటు నా సోదరుడు కూడా ఇదే గదిలో ఉండేవాడు. ఇప్పుడు ఆయనకు ఉద్యోగం లభించింది. నా అదృష్టం ఏంటంటే, నాకు పట్నాలోనే చదువుకునే వెసులుబాటు దొరికింది.''

ఇదంతా పట్నాలోని బిఖానా పహాడ్ ప్రాంతానికి చెందిన ఉద్యోగార్థి, 20 ఏళ్ల అంగద్ కథ.

వీడియో క్యాప్షన్, తెలంగాణ: ఉద్యోగం వస్తుందా.. రాదా? వస్తే ఎప్పుడు వస్తుంది?

అంగద్ తరహాలోనే 27 ఏళ్ల మిథున్ కూడా బిఖానా పహాడ్‌లోని ఒక చిన్న లాడ్జిలో నివసిస్తూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు.

''పరీక్షా ఫలితం ఏమైందని ఇంట్లోవారు అడుగుతారు. వారు దాని గురించి అడిగినప్పుడు చాలా నిరాశగా అనిపిస్తుంది. 'ఆర్‌ఆర్‌బీ-ఎన్టీపీసీ పరీక్ష పోయినట్లే, కానీ ఇంకా గ్రూప్-డి మిగిలి ఉంది' అని వారికి చెప్పాను.

ఇక ఇదే నా చివరి పరీక్ష కానుంది. దీనికోసం మరో మూడు, నాలుగు నెలలు ఇక్కడే ఉండాలి.

దానితర్వాత రూమ్ ఖాళీ చేసి ఇంటికి వెళ్లిపోతాను. ఏదో ఒక పని వెతుక్కుంటాను. జీవితం కంటే ఉద్యోగమే ఎక్కువేం కాదు'' అని ఆయన చెప్పుకొచ్చారు.

ఉద్యోగార్థులు

ఫొటో సోర్స్, VISHNU NARAYAN

అంగద్, మిథున్ చెప్పిన ఈ మాటలన్నీ... బిహార్‌తో పాటు దాని పొరుగు రాష్ట్రాల్లో ఉద్యోగం కోసం కష్టపడుతోన్న చాలామంది యువకులు పరిస్థితికి నిదర్శనం.

ఉద్యోగం కోసం కష్టపడుతోన్నబిహార్‌లోని వివిధ జిల్లాలకు చెందిన ఈ విద్యార్థులంతా నివసించే చోటును పట్నాలో 'లాడ్జి'లుగా వ్యవహరిస్తారు.

విద్యార్థుల పోరాటం

ఈ విద్యార్థులు నివసించే గదులు మరీ చిన్నగా ఉంటాయి. కిటికీలే ఉండని ఈ గదుల్లో బల్బ్ లేకుండా దేన్నీ చూడలేం. గదుల్లోని గోడలపై భారత్, ప్రపంచ పటాలు, పీరియాడిక్ టేబుల్ పట్టికలు కనిపిస్తాయి.

అనుకున్న లక్ష్యం నుంచి వెనక్కి తగ్గకుండా నిత్యం స్ఫూర్తి పొందేందుకు మహానుభావుల ఫొటోలతో పాటు స్ఫూర్తిదాయక కొటేషన్లను కూడా గోడలపై చూడొచ్చు.

ఇలాంటి ఇరుకు గదుల్లో ఉంటూనే వీరంతా ఉద్యోగ పోరాటాన్ని సాగిస్తారు.

ఉద్యోగార్థులు

ఫొటో సోర్స్, VISHNU NARAYAN

లాడ్జిలో 10 నుంచి 15 మంది విద్యార్థులకు ఒకే టాయిలెట్ ఉంటుంది. కరోనా మహమ్మారి వీరి కష్టాలను మరింత పెంచింది. ఆన్‌లైన్ తరగతుల వల్ల అదనంగా ఇంటర్నెట్ ఖర్చు కూడా తోడైంది.

ఆర్ఆర్‌బీ-ఎన్‌టీపీసీ పరీక్ష ఫలితాల విడుదల అనంతరం, జనవరి 24నుంచి బిహార్, యూపీలకు చెందిన విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. తాము మోసపోయామని, తమ గోడు వినేవారే లేరని విద్యార్థులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వీలైనంత త్వరగా ఉద్యోగం తెచ్చుకోవాలంటూ కుటుంబ సభ్యులు ఒత్తిడి చేస్తారు. ఉద్యోగం రాకపోతే ఇరుగుపొరుగువారు కూడా చులకనగా చూస్తారు. ఈ కారణాలతోనే చాలామంది విద్యార్థులు ఇళ్లకు వెళ్లేందుకు కూడా వెనుకాడుతున్నారు.

ఉద్యోగార్థులు

ఫొటో సోర్స్, VISHNU NARAYAN

ఆర్థిక ఇబ్బందులు

పట్నాలో నివసిస్తూ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతోన్న కోడెర్మా ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల రంజీత్ కూడా తన పరిస్థితి గురించి మాట్లాడారు. ''నేను ఆర్ఆర్‌బీ-ఎన్‌టీపీసీ, గ్రూప్ 'డి' రెండు పరీక్షలకు దరఖాస్తు చేశాను. ఎన్‌టీపీసీ పరీక్ష ఫలితం కూడా వచ్చింది. రెండో దశ పరీక్ష కోసం సిద్ధమవుతున్నా. అంతలోనే మొదటి దశ ఫలితాల విషయంలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఏం చేయాలో అర్థం కావడం లేదు'' అని రంజీత్ అన్నారు.

రంజీత్ తండ్రి ఎలక్ట్రీషియన్. ఇంటి బాధ్యతలన్నీ ఆయనే చూసుకుంటారు.

''పది రూపాయల సమోసా తినడానికి బదులుగా, అదే డబ్బును జిరాక్స్‌కు వెచ్చించి పోటీ పరీక్ష కోసం చదువుకుంటా. నా చేతి ఖర్చుల కోసం లాక్‌డౌన్‌కు ముందు పిల్లలకు ట్యూషన్ చెప్పేవాడిని. కానీ ట్యూషన్ కోసం కేటాయిస్తోన్న సమయాన్ని నా చదువు కోసమే ఉపయోగించుకుంటే మంచిది అనిపించింది. ఎందుకంటే ట్యూషన్‌ కోసం నా సమయాన్ని వృథా చేసుకుంటే పరీక్ష ఫలితాలు తారుమారు అవుతాయేమో అని భయంగా ఉండేది'' అని ఆయన వివరించారు.

రైల్వే ఉద్యోగంతో పాటు ఎస్‌ఎస్‌సీ ఉద్యోగాలకు సన్నద్ధమవుతోన్న మరో విద్యార్థి ప్రణవ్‌తో కూడా మేం మాట్లాడాం. ''నేను కూడా ఆర్ఆర్‌బీ-ఎన్‌టీపీసీ పరీక్ష రాశాను. కానీ మొదటి దశలో అర్హత సాధించలేకపోయాను. మా నాన్న వ్యవసాయం చేస్తారు. మా కుటుంబం అంతా ఆయనపై ఆధారపడుతుంది. ఇప్పుడు మా తమ్ముడు కూడా పట్నా రానున్నాడు. బడ్జెట్ పెరిగిపోతుంది. మా నాన్నకు ఇది చాలా భారంగా మారనుంది. నా బాధ్యత మరింత పెరుగుతోంది'' అని ఆయన చెప్పారు.

పగటిపూట కూడా బల్బ్ లేకుండా రూమ్‌లో దేన్నీ చూడలేం

ఫొటో సోర్స్, VISHNU NARAYAN

ఫొటో క్యాప్షన్, పగటిపూట కూడా బల్బ్ లేకుండా రూమ్‌లో దేన్నీ చూడలేం

ఉద్యోగం కోసం ఎప్పటి నుంచి సన్నాహాలు ప్రారంభిస్తారు?

పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే ఉద్యోగార్థులు, తొలుత తాము ఏ ఉద్యోగానికి సిద్ధం కావాలో నిర్ణయించుకుంటారు. తర్వాత ఆ దిశగా చదవడం ప్రారంభిస్తారు.

సదరు ఉద్యోగానికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేంతవరకు వేచి చూస్తారు. ఈలోగా మరో ఉద్యోగానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైతే, ఆ ఉద్యోగానికి కూడా దరఖాస్తు చేస్తారు.

ఎందుకంటే తాము సన్నద్ధమవుతోన్న ఉద్యోగానికి సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందో ఎవరికీ తెలియదు. దానికోసం చూస్తూ ఎదురుగా ఉన్న అవకాశాన్ని ఎందుకు వదిలేయాలని ఉద్యోగార్థులు భావిస్తారు.

ఇంటి నుంచి వచ్చే ఫోన్ మాట్లాడాలంటే భయంగా ఉంటుంది. ఒక నిమిషం సంభాషణలో కూడా పరీక్ష తేదీలు, సన్నద్ధత గురించే మాట్లాడాల్సి ఉంటుంది.

తాజాగా కోవిడ్ కూడా భయాందోళనలను కలిగిస్తోంది. ఎప్పుడు మరో కొత్త వేవ్ పుట్టుకొస్తుందో అని అందరూ భయపడుతున్నారు.

మరోవైపు పరీక్షా పత్రాల లీకేజీ, ఫలితాలు విడుదలైన తర్వాత ఎవరైనా కోర్టుకు వెళ్తారేమో అని ఇలా పలు భయాలు ఉద్యోగార్థులను వెంటాడుతున్నాయి.

ఉద్యోగార్థులు

ఫొటో సోర్స్, VISHNU NARAYAN

ఉద్యోగమే ఎందుకు?

హిందీ మాట్లాడే రీజియన్‌కు చెందిన చాలామంది విద్యార్థులు ఎందుకు ప్రభుత్వ ఉద్యోగాలనే కోరుకుంటున్నారు? అనే ప్రశ్న చాలా మందిలో మెదులుతుంది.

''మొదట బతకడానికి జీవనోపాధి కావాలి. కొంత పొలం ఉండాలి. వ్యవసాయం చేయడానికి ఎరువులు, నీరు వంటి ఇతర సదుపాయాలు ఉండాలి. కానీ హిందీ మాట్లాడే ప్రాంతాల్లో తరచిచూస్తే వ్యవసాయం అనేది నష్టాల వ్యాపారంగా మారిపోయింది. అందుకే సన్నకారు రైతులంతా ఇప్పటికే వలస పోయారు'' అని ఏఎన్ సిన్హా సోషల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ మాజీ డైరెక్టర్ డి.ఎం.దివాకర్ చెప్పారు.

దివాకర్ చెప్పినదాని ప్రకారం, బిహార్‌లో భూమి లేని ప్రజలు పెద్ద సంఖ్యలో ఉన్నారు.

''పేదరికాన్ని తొలిగించుకోవడానికి, సమాజంలో గౌరవం పొందడానికి ఉద్యోగం అవసరమనే భావన మన సమాజంలో ఎప్పటినుంచో ఉంది. లిబరలైజేషన్ తర్వాత అధికార రంగంలో ఉద్యోగాలు తగ్గిపోయాయి. 2016 తర్వాత నుంచి ఉద్యోగ ప్రకటనల జారీ కూడా దాదాపుగా ఆగిపోయింది. ఈ నేపథ్యంలో ఏ ఉద్యోగ ప్రకటన వెలువడినా కూడా ఉద్యోగార్థులు పిచ్చివాళ్లలా దరఖాస్తులు నింపుతున్నారు'' అని దివాకర్ వివరించారు.

రామ్ సింగ్

ఫొటో సోర్స్, FAIZ ABBAS

ఫొటో క్యాప్షన్, రామ్ సింగ్

యూపీ ఉద్యోగార్థుల పరిస్థితి కూడా ఇందుకు భిన్నం కాదు

రైతు కుటుంబానికి చెందిన రామ్ సింగ్, గత మూడేళ్లుగా రాయ్‌బరేలీలో ఉంటూ ఎన్‌టీపీసీ, గ్రూప్ 'డి' పరీక్షల కోసం సిద్ధమవుతున్నారు.

ఆయన ఎన్‌టీపీసీ పరీక్షకు హాజరయ్యారు. మొదటిదశలో ఉత్తీర్ణత కూడా సాధించారు. 80 మార్కుల్ని సాధించిన ఆయన లెవల్-5 కేటగిరీకి ఎంపికయ్యారు.

రాయ్‌బరేలీ నుంచి 35 కి.మీ దూరంలో ఉన్న డల్మావూ ప్రాంతానికి వచ్చి ఆయన చదువుకునేవారు. ''నేను 2018లో ఉద్యోగం కోసం చదవడం ప్రారంభించాను. 2018లోనే గ్రూప్ డి పరీక్ష కూడా రాశాను. దాని తర్వాత, అదే ఏడాది ఎన్‌టీపీసీతో పాటు గ్రూప్ డి నోటిఫికేషన్ కూడా విడుదలైంది. నోటిఫికేషన్ విడుదలైన మూడేళ్ల తర్వాత వాటి ఫలితాలు వచ్చాయి. నెల రోజులకు ఇక్కడ రూ. 5000 ఖర్చు వస్తుంది. ఈ ఉద్యోగ ప్రక్రియలను 6 నెలల్లో పూర్తి చేస్తే విద్యార్థులకు డబ్బు, సమయం ఆదా అవుతుంది'' అని ఆయన చెప్పుకొచ్చారు.

విద్యార్థులపై పోలీసుల చర్యను రామ్ సింగ్ ఖండించారు. ''అన్యాయం జరిగిన వారు వీధుల్లోకి రాకపోతే, నిరసనలు చేయకపోతే ప్రభుత్వానికి ఈ విషయం ఎలా తెలుస్తుంది'' అని ఆయన ప్రశ్నించారు.

యోగేశ్ కుమార్

ఫొటో సోర్స్, FAIZ ABBAS

ఫొటో క్యాప్షన్, యోగేశ్ కుమార్

యోగేశ్ కుమార్ కూడా రైతు కుటుంబానికి చెందినవారే. రాయ్‌బరేలీ నగరానికి 35 కి.మీ దూరంలో ఉన్న లాల్ గంజ్ తహసీల్ ప్రాంతంలోని మాధురి గ్రామానికి చెందినవారు. ఆయన గత కొన్నేళ్లుగా రాయ్‌బరేలీలో ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు.

''సర్, మేం ఊరినుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నాం. రూ. 3200 చెల్లించి ఇక్కడ అద్దెకు ఉంటున్నాం. ఇప్పుడు కోచింగ్ కూడా మూతపడింది. మేం ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలి? ఏం చేయాలి?'' అని యోగేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యార్థులపై లాఠీచార్జి చేయడం గురించి మాట్లాడుతూ... ''మా ఇంటి ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దేందు కోసం మేం కష్టపడి చదవాలి అనుకుంటున్నాం. లాఠీ దెబ్బలు తినడానికి మేం ఊళ్ల నుంచి నగరానికి రాలేదు'' అని అన్నారు.

''మాపై పోలీసులు కేసులు పెడుతున్నారు. లాఠీచార్జి చేస్తున్నారు. ఉద్యోగాలు మాత్రం ఇప్పించడం లేదు. పంచవర్ష ప్రణాళిక సిద్ధమైంది. విద్యార్థులు ప్రతిపక్షాలుగా ప్రభుత్వం భావిస్తోంది. మాకు, రాజకీయ పార్టీలకు ఎలాంటి సంబంధం లేదు. మేం విద్య, ఉద్యోగాల కోసం పోరాడుతున్నాం'' అని వ్యాఖ్యానించారు.

గత కొన్నేళ్లుగా రైల్వే గ్రూప్ 'డి', ఎన్‌టీపీసీ పరీక్షల కోసం సిద్ధమవుతోన్న రాహుల్ యాదవ్... రైల్వే బోర్డు తీసుకున్న నిర్ణయంతో తాను మోసపోయినట్లు భావిస్తున్నారు.

రాహుల్ యాదవ్

ఫొటో సోర్స్, FAIZ ABBAS

ఫొటో క్యాప్షన్, రాహుల్ యాదవ్

7 లక్షల మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించాల్సి ఉండగా, కేవలం 3.5 లక్షల మందికి మాత్రమే ఆ అవకాశం దక్కిందని ఆయన చెబుతున్నారు.

''మేం చాలా సంవత్సరాలుగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాం. కోచింగ్ తీసుకుంటూ చదువుకుంటాం. ప్రణాళికబద్ధంగా కష్టపడతాం. కానీ జాబ్ పొందడానికి చాలా సమయం పడుతుంది. ఒక రిక్రూట్‌మెంట్ ప్రక్రియను పూర్తి చేయడానికి నాలుగు నుంచి ఐదేళ్ల సమయం పడుతోంది'' అని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)