ఎస్‌బీఐ రిక్రూట్‌మెంట్: పరీక్ష లేకుండానే స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగం.. నోటిఫికేషన్ జారీ - ప్రెస్ రివ్యూ

ఎస్‌బీఐ ఉద్యోగం.. కంప్యూటర్‌తో పనిచేస్తున్న యువతి

ఫొటో సోర్స్, SBI/Getty Images

భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ) 444 స్పెషలిస్టు ఆఫీసర్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిందని ‘ఈనాడు’ ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. ఆసక్తి గల అభ్యర్థులు జూలై 13 లోగా దరఖాస్తు చేయాలని ఎస్‌బీఐ ప్రకటించింది. తమ వెబ్‌సైట్‌లో లాగిన్ అయి దరఖాస్తులు చేయొచ్చని సూచించింది.

దరఖాస్తు చేసే అభ్యర్థులు రెజ్యూమ్, గుర్తింపు, వయసు ధ్రవీకరణ పత్రాలు, విద్యార్హత, అనుభవానికి సంబంధించిన పత్రాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

ఉద్యోగార్థులు ఎలాంటి పరీక్షా రాయనవరం లేదు. ఎస్‌బీఐ కమిటీ అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి 100 మార్కులకు ముఖాముఖి నిర్వహిస్తుంది.

అందులో అర్హత మార్కులను బ్యాంకు నిర్ణయిస్తుంది. ఏ ఇద్దరికైనా కటాఫ్ మార్కులు సమానంగా వస్తే వయసు ఆధారంగా ఎంపిక ఉంటుంది.

డీజిల్ పెట్రోల్ ధరలు

ఫొటో సోర్స్, Getty Images

పెట్రోల్ ధరలు: ఇప్పుడు పెట్రోల్ కన్నా డీజిల్ ధరే ఎక్కువ

దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతూనే ఉన్నాయని.. దిల్లీలో మొదటిసారిగా డీజిల్‌ ధరలు రూ. 80 మార్కుని దాటాయని ‘నమస్తే తెలంగాణ’ ఒక కథనంలో చెప్పింది.

ఆ కథనం ప్రకారం.. జూన్‌ 7న ప్రారంభమైన ఈ ధరల పెంపు వరుసగా 19వ రోజూ కోనసాగింది. రోజువారీ సమీక్షలో భాగంగా చమురు కంపెనీలు ధరల పెంపు నుంచి బుధవారం పెట్రోల్‌కు మినహాయింపునిచ్చాయి. అయితే ఈ రోజు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.

లీటర్‌ పెట్రోల్‌పై 16 పైసలు, డీజిల్‌పై 14 పైసలు వినియోగదారునిపై వడ్డించాయి. దీంతో ఢిల్లీలో లీటర్‌ డీజిల్‌ ధర రూ.80.02కి చేరగా, పెట్రోల్‌ ధర రూ.79.92కి పెరింగింది.

చరిత్రలో మొదటిసారిగా పెట్రోల్‌ కంటే డీజిల్‌ ధరలు ఎక్కువయ్యాయి. వరుసగా రెండో రోజు కూడా పెట్రోల్‌ కంటే డీజిల్‌ ధర 10 పైసలు అధికంగా ఉన్నది.

పులి

ఫొటో సోర్స్, Getty Images

కవ్వాల్ టైగర్‌ జోన్: పులి ఆకలి ఖరీదు రూ. 21 లక్షలు

తెలంగాణలోని కవ్వాల్ టైగర్ జోన్‌లో పులులకు ‘ఆహారం’గా మారిన పశువుల కోసం లక్షల రూపాయలు పరిహారంగా చెల్లించాల్సి వస్తోందని ‘సాక్షి’ ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పరిధిలో విస్తరించిన కవ్వాల్‌ టైగర్‌ జోన్‌లో ఇటీవల పశులవులపై పులుల దాడులు పెరిగాయి. గతంలో కంటే పులుల సంఖ్య పెరగడంతో దాడుల సంఖ్యా పెరిగి నష్టపరిహారం పెరుగుతూ వస్తోంది.

అధికారిక గణాంకాలు పరిశీలిస్తే గతేడాది ఒక్క కాగజ్‌నగర్‌ డివిజన్‌లోనే 77 పశువులు పులికి ఆహారమయ్యాయి. ఇందుకు రూ. 9.62 లక్షలు పరిహారంగా పశువుల యజమానులకు చెల్లించారు. ఈ ఏడాది ఇప్పటివరకు మరో 5 పశువులపై దాడిచేయగా.. రూ. 38 వేలు చెల్లించారు. చెన్నూరు డివిజన్‌లో 50 పైగా పశువులు పులి దాడిలో చనిపోగా రూ. 6 లక్షలు, బెల్లంపల్లి డివిజన్‌ పరిధిలో 32 పశువులకు గాను రూ. 5 లక్షల వరకు చెల్లించారు.

మహారాష్ట్రలోని తడోబా పులుల సంరక్షణ కేంద్రంలో పులుల సంతతి పెరిగి.. అవి ప్రాణహిత నది దాటి కవ్వాల్‌ టైగర్‌ జోన్‌లోకి వస్తున్నాయి. ప్రస్తుతం కవ్వాల్‌ టైగర్‌ జోన్‌లో 6 పులులు సంచరిస్తున్నట్లు అంచనా. ఈ జోన్‌లో పులుల సంఖ్యకు అనుగుణంగా శాకాహార జంతువులు లేవు. దీంతో పశువులపై పులుల దాడులు పెరిగాయి.

గతంలో విచ్చలవిడిగా వన్యప్రాణుల వేట, కలప అక్రమ రవాణాతో శాకాహార జంతువుల సమతుల్యత దెబ్బతింది. అదీగాక పంది, జింక, దుప్పి, నీల్గాయి లాంటి జంతువులను వేటాడటం కంటే మేతకు వెళ్లిన పశువులను వేటాడటం పులికి సులభంగా మారింది.

రాహుల్ ద్రవిడ్

ఫొటో సోర్స్, Getty Images

రాహుల్ ద్రావిడ్: ‘టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో గొప్ప బ్యాట్స్‌మన్‌’ - విజ్డెన్ ఇండియా

భారత టెస్ట్‌ క్రికెట్‌ 50 ఏళ్ల చరిత్రలో గొప్ప బ్యాట్స్‌మన్‌గా రాహుల్‌ ద్రావిడ్‌ నిలిచాడని ‘ప్రజాశక్తి’ ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. 'విజ్డెన్‌ ఇండియా' బుధవారం ప్రకటించిన ఫలితాల్లో ద్రావిడ్‌కు 52 శాతం, టెండూల్కర్‌ 48 శాతం ఓట్లు దక్కాయి. టాప్‌-4లో గవాస్కర్‌, విరాట్‌ కోహ్లీ నిలిచారు.

'విజ్డెన్‌ ఇండియా' సోషల్‌ మీడియా వేదికగా భారతజట్టుకు చెందిన 16 మంది అత్యుత్తమ క్రికెటర్లను ఎంపిక చేసి ఆన్‌లైన్‌లో ఓట్లను అభ్యర్ధించింది. ఓటింగ్‌లో 11,400 మంది అభిమానులు పాల్గన్నట్లు విజ్డెన్‌ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది.

సెమీఫైనల్‌కు ద్రావిడ్‌, సచిన్‌, గవాస్కర్‌, కోహ్లీ చేరుకోగా.. కొద్దిశాతం ఓట్ల తేడాతో ద్రావిడ్‌, సచిన్‌ ఫైనల్లోకి ప్రవేశించారు. ఫైనల్‌ చివరి రౌండ్‌ ఓటింగ్‌లో టెండూల్కన్‌ను కొద్దిశాతం ఓట్ల తేడాతో ద్రావిడ్‌ ఓడించాడు. ద్రావిడ్‌కు 52 శాతం ఓట్లు దక్కడంతో విజేతగా నిలిచాడు.

'ద్రావిడ్‌ భారతజట్టుకు అడ్డుగోడ(వాల్‌)గా నిలిచినట్లే చివరిరౌండ్‌ వరకూ పోరాడి మంచి ఆధిక్యతతో విజయం సాధించాడు' అని విజ్డెన్‌ ఇండియా తెలిపింది. సెమీఫైనల్లో(ప్లే-ఆఫ్‌)లో గవాస్కర్‌ స్వల్ప తేడాతో కోహ్లీని ఓడించి మూడోస్థానంలో నిలవగా.. విరాట్‌ కోహ్లీ నాలుగో స్థానంతో సరిపుచ్చుకున్నాడు.

భారత టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో 10 వేల పైచిలుకు పరుగులు గవాస్కర్‌, ద్రావిడ్‌, టెండూల్కర్‌ మాత్రమే చేయగలిగారు. టెండూల్కర్‌ 15,921 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా.. ద్రావిడ్‌ 13,288 పరుగులతో రెండోస్థానంలో ఉన్నాడు.

ఇక లిటిల్‌ మాస్టర్‌ (గవాస్కర్‌) 10 వేల మార్క్‌ను చేరిన భారత తొలి టెస్ట్‌ బ్యాట్స్‌మన్‌గా చరిత్ర సృష్టించాడు. విరాట్‌ కోహ్లీ వర్తమాన క్రికెట్‌లో 7,240 పరుగులు, 53.62 యావరేజ్‌తో దుర్భేద్యఫామ్‌లో కొనసాగుతున్నాడు.

వ.సం. ఆటగాడు మ్యాచ్‌లు పరుగులు సగటు

1. రాహుల్‌ ద్రావిడ్‌ 164 13,288 52.31

2. సచిన్‌ టెండూల్కర్‌ 200 15,921 53.58

3. సునీల్‌ గవాస్కర్‌ 125 10,122 51.12

4. విరాట్‌ కోహ్లీ 86 7,240 53.62

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)