ఇరాన్ నిరసనలపై రష్యా, చైనా, ఇజ్రాయెల్ మీడియా ఏమంటోంది?

ఫొటో సోర్స్, AFP via Getty Images
ఇరాన్‌లో దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలు శుక్రవారం నాటికి 14వ రోజుకు చేరాయి. అనేక నగరాల్లో పెద్దయెత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి.
మానవ హక్కుల సంఘాల నివేదికల ప్రకారం, గత రెండు వారాల్లో దేశవ్యాప్తంగా జరిగిన ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో 48 మంది నిరసనకారులు మరణించారు. అనేక నగరాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి.
నిరసనల సమయంలో చోటుచేసుకుంటున్న హింస నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పాశ్చాత్య దేశాలు, అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు తీవ్రంగా ఖండించాయి.
మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఇరాన్‌ను హెచ్చరించారు. ఒకవేళ నిరసనకారులను ఇరాన్ చంపడం ప్రారంభిస్తే, అమెరికా తప్పకుండా చర్య తీసుకుంటుందన్నారు.
''వారికి ఎక్కడైతే అత్యంత ఎక్కువ నొప్పి కలుగుతుందో, అక్కడే వారిపై గట్టి దెబ్బ కొడతాం. దీనర్థం (ఇరాన్‌లో) సైన్యాన్ని మోహరిస్తామని కాదు, వారికి అత్యంత బాధ కలిగే చోటే వారిని గట్టిగా దెబ్బతీయడం" అని ట్రంప్ అన్నారు.
మరోవైపు, ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఈ నిరసనలను 'ట్రంప్‌ను సంతోషపెట్టేవి'గా అభివర్ణించారు. ట్రంప్‌ను ఒక నియంతతో పోల్చారు.
ఇరాన్ నిరసనల వార్తలు అంతర్జాతీయ మీడియాలో హెడ్‌లైన్స్‌లో నిలుస్తున్నాయి. ఈ నిరసనలను ఇజ్రాయెల్‌లో ఆసక్తిగా గమనిస్తున్నారు.


ఫొటో సోర్స్, BBC Persian
భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇరాన్‌లో నిరసనల దృష్ట్యా అక్కడి భారతీయుల కోసం ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. నిరసనలు జరిగే ప్రాంతాలకు దూరంగా ఉండాలని, అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించింది.
భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ''ఇరాన్‌లో పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాం. అక్కడ సుమారు 10 వేల మంది భారతీయులు, భారత సంతతికి చెందిన ప్రజలు ఉన్నారు'' అని చెప్పారు.

ఫొటో సోర్స్, Channel 12 News
ఇజ్రాయెల్ మీడియా ఏం చెప్పింది?
ఇరాన్ ప్రస్తుత నిరసనలపై ఇజ్రాయెల్ మీడియాలో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. అక్కడి ప్రజల్లో కొంత ఆసక్తి ఉన్నప్పటికీ, మీడియాలో విశ్లేషణలు మాత్రం చాలా జాగ్రత్తగా, ఆచితూచి ఉంటున్నాయి.
బీబీసీ మానిటరింగ్ నివేదిక ప్రకారం, ఇరాన్ ప్రస్తుతం 'మరుగుతున్న స్థితిలో' ఉందని ఇజ్రాయెల్‌కు చెందిన మితవాద పత్రిక 'ఇజ్రాయెల్ హయోమ్', 'ఛానల్ 12 న్యూస్' వ్యాఖ్యానించాయి.
ఇరాన్ చివరి షా (రాజు) కుమారుడైన బహిష్కృత నేత రెజా పహ్లావి దేశ నాయకత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని ఇచ్చిన పిలుపుతో నిరసనలు మరింతగా ఊపందుకున్నాయని ఛానల్ 12 న్యూస్ చెప్పుకొచ్చింది.
జనవరి 8న ప్రసారమైన ఒక కార్యక్రమంలో ఛానల్ 12 మిలటరీ కరస్పాండెంట్ నిర్ డ్వోరీ మాట్లాడుతూ, ఇరాన్‌లో ఇజ్రాయెల్ సైన్యం "అసాధారణ కార్యకలాపాలను" గమనించిందని చెప్పారు. దీన్ని ఆయన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) చేపట్టిన సైనిక విన్యాసాలతో ముడిపెట్టారు.
"ఇజ్రాయెల్ లేదా ఇరాన్ ఒకరి ఉద్దేశాలను మరొకరు సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల పరిస్థితి మరింత దిగజారిపోయే ప్రమాదముందని ఇజ్రాయెల్ భయపడుతోంది" అని డ్వోరీ అన్నారు.
ఒకవేళ జోక్యం చేసుకోవాల్సి వస్తే, ఇజ్రాయెల్ ప్రస్తుతం "వేచి చూసే" ధోరణిని అవలంబించాలని, అమెరికానే ముందుగా స్పందించనివ్వాలని చూస్తోందని చెప్పారు.
అయితే, గత నివేదికలు మరోలా ఉన్నాయి. ఇరాన్ తన దేశంలోని అంతర్గత అసంతృప్తి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇజ్రాయెల్‌పై దాడి చేసే అవకాశం ఉందని అవి పేర్కొన్నాయి.
ఇజ్రాయెల్ సైనిక నిఘా విభాగం మాజీ అధిపతి తామిర్ హైమాన్, 'తప్పుడు అంచనాల' కారణంగా ఇరాన్‌తో యుద్ధం వచ్చే ముప్పు పెరిగిందని అభిప్రాయపడ్డారు. పరిస్థితులు మరింత దిగజారకుండా ఇజ్రాయెల్ జాగ్రత్త పడాలని ఆయన సూచించారు.
"ప్రస్తుత సమయంలో, ఇరాన్ ప్రజల ముందుకు బయటి నుంచి ముప్పు తీసుకురావడం సరికాదు. అంతర్గతంగా ఇప్పుడున్న పరిస్థితులు మరింత విస్తృతమయ్యేందుకు మనం అవకాశం ఇవ్వాలి."

ఫొటో సోర్స్, AFP via Getty Images
చైనా మీడియాలో నిశ్శబ్దం...
ఇరాన్ నిరసనలపై చైనా అధికారులు, ఆ దేశ మీడియా అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాయి. అధికారిక మీడియాలో కూడా ఈ నిరసనలకు సంబంధించిన వార్తలు చాలా పరిమితంగానే కనిపిస్తున్నాయి.
బీబీసీ పర్షియన్ రిపోర్ట్ ప్రకారం, ఈ నిరసనల వార్తలు చైనా టెలివిజన్‌లోని ప్రధాన వార్తా కార్యక్రమాల్లో ప్రసారం కాలేదు. అంతేకాకుండా, దీనిపై వచ్చిన ఏకైక అధికారిక వ్యాఖ్యను కూడా విదేశీ వ్యవహారాల శాఖ వెబ్‌సైట్ నుంచి తొలగించారు.
చైనా నుంచి ఏకైక బహిరంగ స్పందన జనవరి 5న వెలువడింది.
చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ మాట్లాడుతూ, "ఇరాన్ ప్రభుత్వం, అక్కడి ప్రజలు ప్రస్తుత కష్టాలను అధిగమించి, దేశ స్థిరత్వాన్ని కాపాడుకోగలరని ఆశిస్తున్నాం" అని పేర్కొన్నారు.
బీబీసీ పర్షియన్ ప్రకారం, నికోలస్ మదురో విషయంలో చైనా ప్రభుత్వ మీడియాలో వచ్చినంత స్థాయిలో ఇరాన్ నిరసనల వార్తల కవరేజ్ లేదు.
చైనాకు చెందిన కొందరు బ్లాగర్లు ఇరాన్ నిరసనలపై స్పందిస్తూ, ఈ విషయంలో చైనా దూరంగా ఉండాలని సూచించారు.
గత ఏడాది జూన్‌లో ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య జరిగిన ఘర్షణల సమయంలో ఇరాన్ మెతక వైఖరిని అవలంబించిందని, బలహీనంగా వ్యవహరించిందని చాలామంది చైనా సోషల్ మీడియా వినియోగదారులు ఆరోపించారు.
"ఇరాన్ తన కాళ్లపై తాను నిలబడాలి. చైనా సాయం గురించి కూడా ఆలోచించవద్దు" అనే శీర్షికతో మీడియాలో వచ్చిన మరో కథనం, ఎట్టి పరిస్థితుల్లోనూ చైనా ఇరాన్‌కు సహాయంగా వెళ్లకూడదన్న వాదనను స్పష్టం చేస్తోంది.

ఫొటో సోర్స్, Russia24
రష్యన్ మీడియా ఏమందంటే..
చైనా తరహాలోనే రష్యా మీడియాలో కూడా ఇరాన్ నిరసనలకు సంబంధించి ప్రత్యేకమైన కవరేజీ ఏమీ లేదు.
రష్యా ప్రభుత్వ అనుకూల మీడియా సంస్థ 'ఆర్‌టీ'లో జనవరి 8న ఇరాన్‌లో ఇంటర్నెట్ ఆంక్షలపై ఒక వార్త ప్రచురితమైంది.
ద్రవ్యోల్బణం పెరగడం, ఇరాన్ కరెన్సీ బలహీనపడటాన్ని నిరసిస్తూ గత నెల చివరలో ప్రారంభమైన ఈ నిరసనలు అనేక నగరాలకు వ్యాపించాయని అందులో పేర్కొన్నారు.
రష్యా ప్రభుత్వ వార్తా సంస్థ 'తాస్' (టీఏఎస్‌ఎస్) ఇరాన్ నిరసనలను కవర్ చేస్తోంది, అయితే ఇరాన్ ప్రభుత్వం చెబుతున్నట్లు "అల్లర్లు"గానే 'తాస్' కూడా రిపోర్ట్ చేస్తోంది.
ప్రధాన మీడియాలో దీనిపై పెద్దగా చర్చ జరగనప్పటికీ.. బ్లాగులు, ఇతర సోషల్ మీడియా వేదికలపై మాత్రం అమెరికా వ్యతిరేక వాదన బలంగా కనిపిస్తోంది.
రష్యా టీవీ వ్యాఖ్యాత రుస్లాన్ ఒస్టాష్కో తన టెలిగ్రామ్ ఛానల్‌లో, వెనెజ్వెలా తర్వాత ఇరాన్, ఆపై రష్యా కూడా అమెరికా "ఆయిల్ చైన్" తదుపరి లక్ష్యాలు కావొచ్చని హెచ్చరించారు.
ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలు ఉన్న దేశాల చార్ట్‌ను ప్రచురిస్తూ, ఇరాన్ నిరసనలను దేశీయ అసంతృప్తిగా కాకుండా, ఇరాన్ చమురు వనరులను ఆక్రమించుకోవడానికి అమెరికాకు దొరికిన ఒక అవకాశంగా ఆయన అభివర్ణించారు.
సైనిక, భద్రతా వ్యవహారాలపై రష్యాలో ప్రాచుర్యం పొందిన టెలిగ్రామ్ ఛానల్ 'రేబార్', ఇరాన్ భద్రతా దళాలు దేశంలో పరిస్థితిని పూర్తిగా అదుపులో ఉంచాయని పేర్కొంది. అయితే అశాంతిని ప్రేరేపించడానికి అమెరికా, పాశ్చాత్య మీడియా "ఒక లక్ష్యంతో తప్పుడు ప్రచారం" చేస్తున్నాయని ఆరోపించింది.
పాశ్చాత్య దేశాల మానసిక యుద్ధంలో భాగంగా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ దేశం విడిచి మాస్కోకు వెళ్లిపోవచ్చంటూ బ్రిటన్ పత్రిక 'ద టైమ్స్'లో వచ్చిన కథనాన్ని రేబార్ తోసిపుచ్చింది.

ఫొటో సోర్స్, Office of the Iranian Supreme Leader/WANA (West Asia News Agency)
ఖమేనీ ఏమన్నారు?
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను సంతోషపెట్టేందుకు ప్రయత్నిస్తున్న "అల్లరి మూకలు' అని నిరసనకారులను ఉద్దేశించి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అన్నారు. ప్రభుత్వ భవనాలను ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు.
సోషల్ మీడియా వేదిక 'ఎక్స్'లో వరుస పోస్ట్‌ల ద్వారా ఖమేనీ ట్రంప్‌పై విమర్శలు గుప్పించారు.
"ప్రపంచం మొత్తానికి సంబంధించి అహంకారంతో నిర్ణయాలు తీసుకునే అమెరికా అధ్యక్షుడు ఒక విషయం తెలుసుకోవాలి. చరిత్రలో ఫిరౌన్, నిమ్రుద్, మొహమ్మద్ రెజా పహ్లావి వంటి నియంతలు, అహంకారపూరిత పాలకులు తమ అహంకారం గరిష్ట స్థాయికి చేరి పతనమయ్యారు. ట్రంప్ పతనం కూడా అలాగే జరుగుతుంది" అని ఒక పోస్టులో రాశారు.
"12 రోజుల యుద్ధంలో మా దేశానికి చెందిన వెయ్యి మందికి పైగా పౌరులు అమరులయ్యారు. దీనికి తానే ఆదేశాలు ఇచ్చానని అమెరికా అధ్యక్షుడు స్వయంగా చెప్పారు. అంటే, ఇరానీయుల రక్తం తన చేతులకు అంటిందని ఆయనే ఒప్పుకున్నారు. కానీ ఇప్పుడు తాము ఇరాన్ ప్రజల పక్షాన ఉన్నామని చెబుతున్నారు" అని ఖమేనీ విమర్శించారు.
వెనెజ్వెలాలో పరిణామాలను ప్రస్తావిస్తూ, "లాటిన్ అమెరికాలోని ఒక దేశాన్ని వారు ఎలా చుట్టుముట్టారో మీరు చూడవచ్చు. అక్కడ వారు కొన్ని చర్యలు చేపట్టారు. దీనిపై వారికి కనీసం సిగ్గు కూడా లేదు, అదంతా కేవలం చమురు కోసమే చేశామని బాహాటంగా చెబుతున్నారు" అని ఖమేనీ రాశారు.
మరోవైపు, ట్రంప్ తాను ఇరాన్‌లో నిరసనకారులకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.
ఇరాన్ ఆర్థిక వ్యవస్థ దారుణంగా పడిపోవడంతో ఈ నిరసనలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడవి గత కొన్నేళ్లలో ఎన్నడూ లేనంత పెద్ద నిరసనలుగా మారాయి.
ఇరాన్‌లోని ఇస్లామిక్ రిపబ్లిక్ వ్యవస్థకు ముగింపు పలకాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. మరికొందరు పాత రాచరికాన్ని మళ్లీ పునరుద్ధరించాలని కోరుతున్నారు.
మానవ హక్కుల సంఘాల సమాచారం ప్రకారం, ఇరాన్‌లో చోటుచేసుకున్న హింసలో కనీసం 48 మంది నిరసనకారులు, 14 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. దీని కారణంగా దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.

ఫొటో సోర్స్, AFP via Getty Images
యూరోపియన్ దేశాలు ఏమంటున్నాయి?
ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ దేశాల నాయకులు ఒక సంయుక్త ప్రకటనలో, ఇరాన్‌లో నిరసనకారుల హత్యలను ఖండించారు. నిరసనకారులపై హింసను ఆపాలని ఇరాన్ అధికారులను కోరారు.
దీనికంటే ముందే, యూరోపియన్ యూనియన్ విదేశాంగ విభాగం అధిపతి కాజా కల్లాస్ మాట్లాడుతూ, శాంతియుత నిరసనకారులపై ఎలాంటి హింసనైనా తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు.
బీబీసీ పర్షియన్ రిపోర్ట్ ప్రకారం, ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్ వోల్కర్ టర్క్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఇరాన్ నిరసనల్లో మరణాలపై స్వతంత్ర, పారదర్శకమైన విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అలాగే ఇరాన్‌లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంపై వోల్కర్ టర్క్ ఆందోళన వ్యక్తం చేశారు.
అంతర్జాతీయ జర్నలిస్టుల సంఘం కూడా ఒక ప్రకటనలో, ఇరాన్ దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ నిలిపివేత, మీడియాపై ఆంక్షల గురించి హెచ్చరించింది. జర్నలిస్టుల రక్షణ కోసం ఏర్పాటైన కమిటీ (సీపీజే) స్పందిస్తూ, ఇంటర్నెట్ సేవలను వెంటనే పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని ఇరాన్ ప్రభుత్వాన్ని కోరింది.
అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఒక ప్రకటన చేస్తూ, ఇంటర్నెట్ నిలిపివేసిన తర్వాత భద్రతా బలగాలు నిరసనకారులను అణచివేస్తున్నట్లు వస్తున్న నివేదికలపై తాము విచారణ జరుపుతున్నామని వెల్లడించింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














