ఇరాన్: తెహ్రాన్‌లో జనజీవనం సాధారణ స్థితికి వచ్చిందా? ప్రజలు ఏమంటున్నారు

అమెరికా, ఇరాన్‌ల మధ్య సంబంధాలు మెరుగుపడాలని బూఫ్ కేఫ్ బరిస్టా అమీర్ కోరుకుంటున్నారు

ఫొటో సోర్స్, Charlotte Scarr/BBC

ఫొటో క్యాప్షన్, అమెరికా, ఇరాన్‌ల మధ్య సంబంధాలు మెరుగుపడాలని బూఫ్ కేఫ్ బరిస్టా అమీర్ కోరుకుంటున్నారు
    • రచయిత, లూసీ డౌసెట్
    • హోదా, చీఫ్ ఇంటర్నేషనల్ కరెస్పాండెంట్

ఇరాన్ రాజధాని తెహ్రాన్‌ నడిబొడ్డున ఉన్న బూఫ్ కేఫ్‌ వినియోగదారులకు చల్లచల్లని డ్రింకులను అందిస్తుంది.

ఎంతోకాలంగా మూతపడి ఉన్న అమెరికా ఎంబసీకి సమీపంలో ఈ కేఫ్ ఉంటుంది.

1979 ఇరాన్ విప్లవం, బందీల సంక్షోభం నేపథ్యంలో తెహ్రాన్‌తో వాషింగ్టన్ సంబంధాలు తెంచుకున్నప్పటి నుంచి ఈ కేఫ్ గోడలపై అమెరికా వ్యతిరేక చిత్రాలను ఏర్పాటు చేశారు.

అమెరికా, ఇరాన్‌ల మధ్య సంబంధాలు మెరుగుపడాలని కోరుకుంటున్నట్లు బూఫ్ కేఫ్‌లో పనిచేసే అమీర్ అన్నారు.

''అమెరికా విధించిన ఆంక్షలు మా వ్యాపారాలను దెబ్బతీశాయి. మేం ప్రపంచవ్యాప్తంగా పర్యటించడాన్ని కష్టతరం చేస్తున్నాయి'' అని అమీర్ చెప్పారు.

ఆ కేఫ్‌లో రెండు టేబుళ్లు మాత్రమే బుక్ అయ్యాయి. పొడవాటి నల్లటి ముసుగు ధరించిన మహిళ ఒక టేబుల్‌పై ఉండగా, మరో టేబుల్ వద్ద బ్లూ జీన్స్ ధరించి, జడ వేసుకోకుండా వదిలేసిన పొడవాటి జుట్టుతో మరో మహిళ ఉన్నారు. ఆమె ఆహార్యం అక్కడ మహిళలు 'ఏమి ధరించాలనే నియమాలను' ఉల్లంఘిస్తున్నట్లుగా ఉంది. ఆమె తన బాయ్‌ఫ్రెండ్‌తో అక్కడ కూర్చున్నారు.

తెహ్రాన్‌కు సంబంధించిన చిన్న దృశ్యం ఇది. తెహ్రాన్ భవిష్యత్ అనిశ్చితిలో ఉంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
యాంకర్ వార్తలు చదువుతుండగా టీవీ స్టూడియోపై ఇజ్రాయెల్ దాడులు

ఫొటో సోర్స్, The Islamic Republic of Iran News Network

అక్కడికి కాస్త దూరంలోనే ఇరాన్ ప్రభుత్వ టీవీ స్టేషన్ ఐఆర్‌ఐబీ కాంప్లెక్స్ ఉంటుంది. సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ జాతిని ఉద్దేశించి రికార్డు చేసిన ప్రసంగం గురువారం(జూన్ 26, 2025) ఈ కాంప్లెక్స్ నుంచే ప్రసారం అయింది.

''అమెరికన్లు మొదటి నుంచే ‘ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌’ను వ్యతిరేకిస్తున్నారు. మనం లొంగిపోవాలనేదే వారి ఉద్దేశం'' అని 80 ఏళ్ల అయతొల్లా ఆ ప్రసంగంలో అన్నారు.

ఇజ్రాయెల్ వరుస దాడులతో ఇరాన్ అణు స్థావరాలు, క్షిపణి కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటూ సీనియర్ కమాండర్లు, శాస్త్రవేత్తలను హత్య చేస్తున్నప్పటి నుంచి అయతొల్లా ఒక బంకర్‌లో తలదాచుకుంటున్నట్లుగా కథనాలు వచ్చాయి.

డోనల్డ్ ట్రంప్ మంగళవారం కాల్పుల విరమణను ప్రకటించిన తర్వాత అయతొల్లా నుంచి వచ్చిన తొలి ప్రసంగం ఇది. ఈ ప్రసంగాన్ని ఐఆర్‌ఐబీ కాంపౌండ్‌లో ఉన్న ఒక కార్యాలయంలోని చిన్న టీవీలో మేం చూశాం. ఆ కాంపౌండ్ మొత్తం శిథిలాలమయం కాగా ఈ కార్యాలయం మాత్రం చెక్కుచెదరకుండా ఉంది.

జూన్ 16న ఇజ్రాయెల్ బాంబు దాడిలో ఈ కాంప్లెక్స్‌లోని ప్రధాన స్టూడియో అగ్నికి ఆహుతైంది. ఈ స్టూడియో నుంచే అయతొల్లా ప్రసంగం టీవీల్లో ప్రసారం అయ్యుండొచ్చు. ఇప్పుడు ఇది కాలి బూడిదలా మారింది.

ఇస్లామిక్ రిపబ్లిక్‌కు చెందిన ప్రచార విభాగాన్ని లక్ష్యంగా చేసుకున్నామని ఈ దాడి గురించి ఇజ్రాయెల్ చెప్పింది. ఈ విభాగం మిలిటరీ ఆపరేషన్‌ను రహస్యంగా ఉంచిందని ఆరోపించింది. అయితే, ఈ ఆరోపణలను అక్కడి జర్నలిస్టులు తిరస్కరించారు.

ఇజ్రాయెల్‌తో 12 రోజుల యుద్ధంలో గాయపడిన ఇరాన్ ప్రజలకు తెహ్రాన్ నగరంలోని ఆసుపత్రుల్లో ఇప్పటికీ చికిత్స అందిస్తున్నారు.

ఇరాన్‌పై ఇజ్రాయెల్ మళ్లీ దాడులు చేస్తుందని నర్స్ అష్రఫ్ బర్ఘీ భయపడుతున్నారు

ఫొటో సోర్స్, Charlotte Scarr/BBC

ఫొటో క్యాప్షన్, ఇరాన్‌పై ఇజ్రాయెల్ మళ్లీ దాడులు చేస్తుందని నర్స్ అష్రఫ్ బర్ఘీ భయపడుతున్నారు

ఇజ్రాయెల్ జూన్ 23న ఎవిన్ జైలు సమీపంలో బాంబు దాడి చేసినప్పుడు గాయపడిన సైనికులు, పౌరులను అష్రఫ్ పనిచేస్తోన్న ఎమర్జెన్సీ వార్డుకే తీసుకొచ్చారు.

''నర్సుగా నా 32 ఏళ్ల అనుభవంలో నేను చికిత్స చేసిన దారుణమైన గాయాలు వారివే'' అని అష్రఫ్ అన్నారు.

తాము కేవలం మిలిటరీ, అణు స్థావరాలపైనే దాడులు చేస్తున్నామంటూ ఇజ్రాయెల్ చెబుతున్నదంతా అబద్ధమని మోర్తెజా అనే మరో వ్యక్తి ఆరోపించారు.

జూన్ 23న ఇజ్రాయెల్ చేసిన దాడిలో గాయపడిన మోర్తెజా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఇజ్రాయెల్ క్షిపణి, భవనంపై పడిన సమయంలో జైలు రవాణా విభాగంలో మోర్తెజా పని చేస్తున్నారు. ఆయన తన రెండు చేతులు, వీపుపై తగిలిన గాయాలను చూపించారు.

ఇదే వార్డులోని మరో గదిలో సైనికులకు చికిత్స జరుగుతోంది. కానీ, అక్కడికి వెళ్లేందుకు మాకు అనుమతి ఇవ్వలేదు.

దాడుల్లో ధ్వంసమైన కారు

ఫొటో సోర్స్, AFP

ఇప్పటివరకు ఈ ఘర్షణలో 627 మంది చనిపోయినట్లు, దాదాపు 5,000 మంది గాయపడినట్లు ఇరాన్ ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా గణాంకాలు చూపుతున్నాయి.

తెహ్రాన్ నెమ్మదిగా కోలుకుంటోంది. ప్రజలు మళ్లీ తమ జీవితాలను ఆరంభిస్తున్నట్లుగా కనిపిస్తున్నారు. హైవేల మీద, వీధుల్లోనూ ట్రాఫిక్ కనబడుతోంది.

బాంబుల నుంచి తప్పించుకోవడానికి పారిపోయిన ప్రజలంతా మళ్లీ నగరంలోకి వస్తున్నందున బజార్లలోని దుకాణాలు మళ్లీ తెరుచుకుంటున్నాయి.

ఇజ్రాయెల్ 12 రోజుల పాటు చేపట్టిన తీవ్రమైన మిలిటరీ ఆపరేషన్‌తో పాటు ఇరాన్‌లోని ప్రధాన అణు స్థావరాలపై అమెరికా దాడులతో చాలామంది ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు.

''అవి మంచి రోజులు కావు. అదంతా గుర్తొస్తే గుండె బద్దలవుతోంది. మంచి జీవితం గడిపేందుకు మేం ఎంతో కష్టపడ్డాం. కానీ, ఇప్పుడు మా భవిష్యత్ ఎలా ఉంటుందో అర్థం కావట్లేదు'' అని గత కొన్ని రోజులుగా ఇరాన్‌లో జరిగినదాన్ని తలుచుకుంటూ మీనా అనే యువతి కంటతడి పెట్టారు.

తెహ్రాన్‌లోని ప్రముఖ ప్రాంతాల్లో ఒకటైన పాలరాతి కట్టడం ఆజాదీ టవర్ వద్ద మేం కొందరిని కలిసి మాట్లాడాం.

ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో దేశ భవిష్యత్ గురించి ఇరాన్ పాలకుల మద్దతుదారులు, విమర్శకులు ఒకేలా ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రభుత్వానికి మీరేం సలహా ఇవ్వాలనుకుంటున్నారని అలీ రెజా అనే యువకున్ని ప్రశ్నించగా, ''ప్రజలు చెప్పాలనుకుంటున్నది వాళ్లు వినాలి. మేం స్వేచ్ఛను కోరుకుంటున్నాం. నేను చెప్పేది ఇదొక్కటే'' అని ఆయన బదులిచ్చారు.

అక్కడ కొంత తిరుగుబాటు స్వరం కూడా వినిపించింది.

''మా అణు స్థావరాలపై దాడులు చేయడం, మేం చెప్పినట్లుగా మీరు నడుచుకోవాలని ఆశించడం దౌత్యానికి విరుద్ధం'' అని యూనివర్సిటీ విద్యార్థి అయిన 18 ఏళ్ల హమీద్ అన్నారు.

(అదనపు రిపోర్టింగ్ చార్లెట్ స్కార్, నిక్ మిల్లార్డ్)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)