సెక్స్‌క్యామ్ ఇండస్ట్రీ: ‘‘స్కూల్ పిల్లలుగా ఉన్నప్పుడే మోడల్స్‌గా మమ్మల్ని నియమించుకున్నారు’’

సెక్స్‌క్యామ్ స్టూడియో, కీని , కొలంబియా

ఫొటో సోర్స్, Jorge Calle / BBC

ఫొటో క్యాప్షన్, కీనీ 17 ఏళ్ల వయసులోనే వెబ్‌క్యామ్ మోడల్‌గా పనిచేయడం ప్రారంభించారు.
    • రచయిత, సోఫియా బెట్టిజా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఒకరోజు మధ్యాహ్నం, ఇసబెల్లా స్కూల్ నుంచి బయలుదేరుతున్న సమయంలో ఎవరో ఆమె దగ్గరపడేలా ఒక కరపత్రాన్ని విసిరేశారు. అందులో ''మీ అందంతో డబ్బు సంపాదించాలనుకుంటున్నారా?'' అని రాసి ఉంది.

మోడల్స్ కోసం వెతుకుతున్న ఒక స్టూడియో కొలంబియా రాజధాని బొగోటాలోని తమ ప్రాంత టీనేజ్ విద్యార్థులను లక్ష్యంగా చేసుకున్నట్లు ఆమె చెప్పారు.

17 ఏళ్ల వయసున్న ఇసబెల్లాకు రెండేళ్ల కొడుకు ఉన్నాడు, తనకు డబ్బు చాలా అవసరం కాబట్టి దీని గురించి మరింత తెలుసుకునేందుకు ఆమె వెళ్లారు.

అక్కడికి వెళ్లగానే.. అదొక సెక్స్‌క్యామ్ స్టూడియో, శిథిలావస్థకు చేరిన ఒక ఇంట్లో ఓ జంట దానిని నడుపుతున్నారు. అందులో 8 గదులు బెడ్రూమ్‌ల తరహాలో అలంకరించి ఉన్నాయని ఆమె చెప్పారు.

కొన్ని స్టూడియోలు చాలా తక్కువ ఖర్చుతో నడుస్తుంటాయి. మరికొన్ని పెద్దవి. వాటిలో ప్రత్యేక గదులు, లైట్లు, కంప్యూటర్లు, వెబ్‌క్యామ్‌లు, ఇంటర్‌నెట్‌వంటివన్నీ ఉంటాయి.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న వీక్షకుల కోసం అక్కడ మోడల్స్ లైంగిక చర్యలు (సెక్సువల్ యాక్ట్స్) ప్రదర్శిస్తారు. మానిటర్లుగా పిలిచే మధ్యవర్తుల ద్వారా వీక్షకులు వారికి మెసేజ్‌లు, రిక్వెస్ట్‌లు పంపిస్తారు.

మరుసటి రోజు తాను పని ప్రారంభించినట్లు ఇసబెల్లా (అసలు పేరు కాదు) తెలిపారు. అయితే, 18 ఏళ్లలోపు వెబ్‌క్యామ్ మోడళ్లను స్టూడియోలు ఉపయోగించుకోవడం కొలంబియాలో చట్టవిరుద్ధం.

తన జీతం ఎంత, తన హక్కులు ఏంటని వివరించే ఎలాంటి రాతపూర్వక ఒప్పందం లేదని ఇసబెల్లా బీబీసీ వరల్డ్ సర్వీస్‌తో చెప్పారు.

''వాళ్లు నాకేం చేయాలో చెప్పకుండానే స్ట్రీమింగ్ మొదలుపెట్టేశారు. ఇదిగో కెమెరా, ఇక చెయ్ అన్నారు'' అని ఆమె తెలిపారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
సెక్స్‌క్యామ్ ఇండస్ట్రీ
ఫొటో క్యాప్షన్, వెబ్‌క్యామ్ మోడల్స్ హక్కులకు మెరుగైన రక్షణ, పరిశ్రమకు బలమైన నియమాలను కోరుతూ కొలంబియాలోని బొగోటాలో పలువురు ర్యాలీ చేశారు.

'స్కూల్ నుంచి లైవ్ చేయమన్నారు'

కొద్దిరోజులకే, స్కూల్ నుంచి లైవ్ స్ట్రీమ్ చేయాలని స్టూడియో తనకు సూచించిందని, తన తోటి విద్యార్థులు ఇంగ్లిషు నేర్చుకోవడంలో నిమగ్నమై ఉండటంతో తాను నిశ్శబ్దంగా తన ఫోన్ తీసి, తన డెస్క్ వద్ద తనను తాను చిత్రీకరించుకోవడం ప్రారంభించినట్లు ఇసబెల్లా చెప్పారు.

వీక్షకులు తనను అలా చెయ్, ఇలా చెయ్యమంటూ అడగడం, దీంతో తను టాయిలెట్‌కి వెళ్లొస్తానని టీచర్‌ను అనుమతి అడిగి వెళ్లడం, ఒక క్యూబిక్‌లో గడియ పెట్టుకుని, కస్టమర్లు కోరినట్లు చేయడం గురించి ఆమె వివరించారు.

ఏం జరుగుతుందో టీచర్లకు తెలియదు కాబట్టి ''మిగిలిన క్లాసుల్లోనూ అలాగే చేసేదాన్ని'' అని ఇసబెల్లా చెప్పారు.

''ఇది నా బిడ్డ కోసం. తన కోసమే ఇది చేస్తున్నానని అనుకుంటూ ఉండేదాన్ని. అది నాకు ధైర్యాన్నిచ్చింది'' అని ఆమె అన్నారు.

నెలకు 130 కోట్ల వ్యూస్

సెక్స్‌క్యామ్ ఇండస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా వేగంగా వృద్ధి చెందుతోంది. ప్రపంచవ్యాప్తంగా వెబ్‌క్యామ్ ప్లాట్‌ఫాంలకు వచ్చే నెలవారీ వ్యూస్ సంఖ్య మూడు రెట్లు పెరిగి.. 2025 ఏప్రిల్ నాటికి దాదాపుగా 130 కోట్లకు చేరినట్లు అనలిటిక్స్ సంస్థ సెమ్‌రష్ తెలిపింది.

దేశంలో అడల్ట్ వెబ్‌క్యామ్ రంగానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఫెనాల్‌వెబ్ ప్రకారం, కొలంబియాలో ప్రస్తుతం మరే దేశంలో లేనంత ఎక్కువగా 4 లక్షల మంది మోడళ్లు, 12వేలసెక్స్‌క్యామ్ స్టూడియోలు ఉన్నట్లు అంచనా.

ఈ స్టూడియోలు మోడళ్లను తయారు చేసి సెక్సువల్ కంటెంట్‌ను ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెబ్‌క్యామ్ ప్లాట్‌ఫాంలకు చేరవేస్తాయి. అవి డబ్బులు చెల్లించి చూసే కోట్ల మంది వీక్షకులకు ఈ కంటెంట్‌ను ప్రసారం చేస్తాయి.

ఇంట్లో ప్రైవసీ లేకపోవడం, అవసరమైన పరికరాలు లేకపోవడం, సరైన ఇంటర్‌నెట్ కనెక్షన్ లేని చాలామంది స్టూడియోల్లో చేస్తుంటారు. అందుకు పేదరికం, లేదా ఇంట్లో తల్లిదండ్రులతో కలిసి ఉండటం కారణం.

మూడింట ఒక వంతు జనాభా పేదరికంలో మగ్గిపోతున్న కొలంబియాలో, సులభంగా డబ్బు సంపాదించవచ్చంటూ స్టూడియోలు ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తాయని మోడళ్లు బీబీసీతో చెప్పారు.

' స్లేవ్ మాస్టర్స్'

కొన్ని వెబ్‌క్యామ్ స్టూడియోల నిర్వహణ బాగానే ఉందని, ప్రదర్శనకారులకు సాంకేతిక, ఇతర సహాయం చేస్తున్నాయని కొంతమంది మోడల్స్ చెప్పారు. అయితే అనేక ఇతర స్టూడియోలు దుర్వినియోగంతో నిండి ఉన్నాయని ఆరోపించారు.

ఇసబెల్లా వంటి మహిళలు, బాలికలకు స్టూడియోల యజమానులు అబద్ధాలు చెబుతారని, బాగా డబ్బు సంపాదించొచ్చని నమ్మిస్తారని కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో ఆరోపించారు. ఈ స్టూడియోల యజమానులను 'స్లేవ్ మాస్టర్స్' అని ఆయన అభివర్ణించారు.

బొంగాక్యామ్స్, చాటర్‌బేట్, లైవ్‌జాస్మిన్, స్ట్రిప్‌చాట్ అనే నాలుగు అతిపెద్ద వెబ్‌క్యామ్ ప్లాట్‌ఫామ్‌లు యూరప్, అమెరికా నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తాయి. ఇవి 18 ఏళ్లు దాటిన వారే ప్రదర్శకులుగా ఉండాలనే నిర్థరించేందుకు తనిఖీల ప్రక్రియను పాటిస్తాయి. ఈయూ, అమెరికా చట్టాలు రెండూ 18 ఏళ్లలోపు వారితో లైంగిక వీడియోలను అనుమతించవు.

కానీ, కొంతమంది మోడల్స్ బీబీసీతో మాట్లాడుతూ, తక్కువ వయస్సు గల బాలికలను స్టూడియోలు ఉపయోగించుకోవాలనుకుంటే మోసం చేయడం సులభం అన్నారు. ఒకప్పుడు స్టూడియోలో పనిచేసి, మానేసిన 18 ఏళ్లు దాటిన మోడల్స్ కు చెందిన పాత అకౌంట్లను తక్కువ వయస్సు గల బాలికలకు ఇస్తారు.

17 ఏళ్ల వయసులోనే చాతుర్‌బేట్, స్ట్రిప్‌చాట్‌లో కనిపించినట్లు ఇసబెల్లా చెప్పారు.

"స్టూడియో యజమాని నాకు తక్కువ వయస్సు ఉండటం సమస్య కాదని చెప్పారు" అని 18 ఏళ్ల ఇసబెల్లా గుర్తుచేసుకున్నారు.

"ఆమె మరొక మహిళ అకౌంట్ ఉపయోగించారు, నేను అదే పేరుతో పనిచేయడం ప్రారంభించాను" అన్నారు.

స్టూడియోలు నకిలీ ఐడీ కార్డులు ఇచ్చాయని ఇతర మోడల్స్ కూడా బీబీసీకి చెప్పారు. తనకు 17 ఏళ్ల వయసులోనే బొంగాకామ్స్‌లో పనిచేయడానికి అనుమతి ఇచ్చారని కీనీ అనే ఒక మోడల్ చెప్పారు.

సెక్స్‌క్యామ్ ఇండస్ట్రీ
ఫొటో క్యాప్షన్, కొలంబియాలో బొంగాకామ్స్ ప్రతినిధి మిల్లే అచింటే పని పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసుకునేందుకు స్టూడియోలు సందర్శిస్తారు.

ప్రభుత్వ ఐడీ కార్డుతో చెక్ చేస్తాం: బొంగాకామ్స్

పద్దెనిమిదేళ్ళ లోపు పిల్లలను ప్రదర్శన ఇవ్వడానికి అనుమతించమని, నిబంధనలను ఉల్లంఘించినవారి ఖాతాలను మూసివేస్తామని బొంగాకామ్స్ ప్రతినిధి మిల్లీ అచింటే బీబీసీతో చెప్పారు.

బొంగాకామ్స్ ప్లాట్‌ఫామ్ కొలంబియన్ ప్రభుత్వ వెబ్‌సైట్‌ను ఉపయోగించి ఐడీ కార్డులను తనిఖీ చేస్తుందని మిల్లీ అన్నారు. ఒక మోడల్ తాను స్టూడియో నుంచి వెళ్లిపోయానని చెబితే, తన అకౌంట్‌ను బ్లాక్ చేసుకోవడానికి ఆమెకు పాస్‌వర్డ్ ఇస్తామని తెలిపారు.

నకిలీ ఐడీల వాడకాన్ని పూర్తిగా ఆపివేసినట్లు చతుర్‌బేట్ ఒక ప్రకటనలో తెలిపారు. మోడల్స్ వారి ప్రభుత్వ ఐడీని పట్టుకొని, ప్రత్యక్ష ఫోటోను పంపాలి. వీటిని కంప్యూటర్, సిబ్బంది ఇద్దరూ తనిఖీ చేస్తారు. ప్రతి 10 మంది మోడల్స్‌కు ఒక స్టాఫ్ రివ్యూయర్ ఉన్నారని, పాత అకౌంట్లను తిరిగి ఉపయోగించలేరని ప్లాట్‌ఫామ్ తెలిపింది. ప్రతి షోలో మోడల్ వయస్సును నిర్ధరించుకోవడానికి చెక్ చేస్తారని సంస్థ చెప్పింది.

స్ట్రిప్‌చాట్ ప్రకటన ప్రకారం.. ఆ సంస్థ ఏ మైనర్ మోడల్‌ను అనుమతించదు. వయస్సు తనిఖీ ప్రక్రియ ద్వారానే ప్రదర్శకులు ముందుకు వెళ్లాలి. సొంత బృందం, థర్డ్ ఫార్టీ కంపెనీలతో మోడల్ గుర్తింపును ధ్రువీకరించుకుంటారు.

పాత అకౌంట్లను ఉపయోగించడం లేదని స్ట్రిప్‌చాట్ కూడా తెలిపింది. అలాగే, ప్రతి లైవ్ స్ట్రీమ్‌లో అసలు మోడల్ కనిపించాలని సంస్థ కొత్త నియమాలు చెబుతున్నాయని స్పష్టంచేసింది. ఒక మోడల్ బయటికెళ్లి కొత్త అకౌంట్‌తో పనిచేయడం ప్రారంభిస్తే, పాత ఖాతా ఇన్‌యాక్టివ్‌గా మారుతుందని, స్టూడియో ఇకపై దానిని ఉపయోగించలేదని తెలిపింది.

బీబీసీ ప్రశ్నలకు లైవ్‌జాస్మిన్ స్పందించలేదు.

కీనీ, కొలంబియా
ఫొటో క్యాప్షన్, స్ట్రీమింగ్ ప్రారంభించడానికి సిద్ధమవుతున్న కొలంబియన్ వెబ్‌క్యామ్ మోడల్ కీనీ

'యవ్వనంగా కనిపిస్తే ఇష్టపడతారు'

ఇప్పుడు కీనీకి 20 ఏళ్లు, కొలంబియాలో మెడెల్లిన్‌లోని తన బెడ్‌రూమ్‌ నుంచి ఆమె పనిచేస్తున్నారు.కొత్త స్టూడియో ద్వారా ఆన్‌లైన్‌లో కినీ ప్రదర్శనలు ఇస్తారు, అది అంతర్జాతీయ వెబ్‌క్యామ్ వెబ్‌సైట్‌లకు అనుసంధానంగా ఉంటుంది.

ఆమె గది చిన్నపిల్లల గదిలా కనిపిస్తుంది, అక్కడ చాలా జంతువుల బొమ్మలు, టెడ్డీ బేర్‌లు ఉన్నాయి.

"మీరు యవ్వనంగా కనిపించినప్పుడు వీక్షకులు నిజంగా ఇష్టపడతారు" అని కీనీ అంటున్నారు.

"కొన్నిసార్లు అది సమస్యగా అనిపిస్తుంది. కొంతమంది క్లయింట్లు చిన్నపిల్లలా నటించమని అడుగుతారు, అది సరైనది కాదు" అని ఆమె అన్నారు.

తన తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడంతో కుటుంబాన్ని పోషించడానికి ఈ పని ప్రారంభించినట్లు కీని చెప్పారు. ఈ పని గురించి తన తండ్రికి తెలుసని, ఆయన మద్దతుగా ఉన్నారని ఆమె అన్నారు.

17 ఏళ్ల వయసులో ఈ రంగంలోకి వచ్చినట్లు కీని చెప్పారు. అది చాలా చిన్నవయసని ఆమె అభిప్రాయపడ్డారు. ఇందులోకి తీసుకొచ్చిన మాజీ ఉద్యోగులను ఆమె నిందించడం లేదు, వారు తనకు డబ్బు సంపాదించడానికి అవకాశం ఇచ్చారని కీని చెప్పారు.

ఇప్పుడు, ఆమె నెలకు దాదాపు రూ. 1.71 లక్షలు (2 వేల డాలర్లు) సంపాదిస్తున్నారు, ఇది కొలంబియా కనీస వేతనం రూ. 25,600 (300 డాలర్ల) కంటే చాలా ఎక్కువ.

"ఈ ఉద్యోగానికి కృతజ్ఞతలు, మా అమ్మ, నాన్న, సోదరికి నా మొత్తం కుటుంబానికి సహాయం చేస్తున్నాను" అని కీని అన్నారు.

అతిపెద్ద వెబ్‌క్యామ్ స్టూడియోలలో ఒకటైన ఏజే స్టూడియోస్‌ను బీబీసీ సందర్శించింది. అక్కడ, మోడల్స్ మానసిక ఆరోగ్యానికి సహాయం చేసే ఇన్-హౌస్ సైకాలజిస్ట్‌ను మాకు పరిచయం చేశారు.

స్టూడియోలో మసాజ్‌లు, పెడిక్యూర్‌లు, బోటాక్స్, లిప్ ఫిల్లర్‌ల వంటి బ్యూటీ ట్రీట్‌మెంట్‌లను అందించే స్పా కూడా ఉంది. వీటిని డిస్కౌంట్‌తో అందిస్తారు లేదా ఉత్తమ ఉద్యోగి(ఎక్కువగా సంపాదించిన వారు లేదా పక్కవారికి సాయంగా ఉన్నవారు)కి బహుమతులుగా ఇస్తారు.

సోఫీ

ఫొటో సోర్స్, Jorge Calle / BBC

ఫొటో క్యాప్షన్, ఒక స్టూడియో తనను బలవంతంగా అవమానకరమైన లైంగిక చర్యలకు పాల్పడేలా చేసిందని, ఒకేసారి ముగ్గురు ఇతర అమ్మాయిలతో ప్రదర్శనలు ఇప్పించిందని మోడల్ సోఫీ చెప్పారు.

'టాయిలెట్ బ్రేక్ తీసుకున్నందుకు జరిమానా'

వెబ్‌క్యామ్ ప్రదర్శకులందరూ గౌరవంగానీ, మంచి ఆదాయంగానీ పొందుతున్నారని చెప్పలేమని కొలంబియా అధ్యక్షుడు అన్నారు. అలాగే ఆయన ప్రవేశపెట్టిన కొత్త శ్రామిక చట్టం కఠినమైన నియమాలు అమలు కావడానికి దోహదపడుతుందేమోనని వెబ్‌క్యామ్ పరిశ్రమ ఎదురుచూస్తోంది.

వీక్షకులు చెల్లించే డబ్బులో స్ట్రీమింగ్ వెబ్‌సైట్‌లు సాధారణంగా 50 శాతం తీసుకుంటాయని మోడల్స్, స్టూడియోలు బీబీసీకి తెలిపాయి. స్టూడియోలు 20 నుంచి 30 శాతం తీసుకుంటాయి, మిగిలినది మోడల్‌కు ఇస్తారు. దీనర్థం ఒక షో వంద రూపాయలు సంపాదిస్తే, మోడల్‌కు 20 నుంచి 30 రూపాయలు మాత్రమే వస్తాయి. కొన్ని స్టూడియోలు ఇంకా ఎక్కువ తీసుకుంటాయి.

ఎనిమిది గంటలు పనిచేసి కేవలం రూ.450 (5 డాలర్లు) మాత్రమే సంపాదించిన సందర్భాలు ఉన్నాయని మోడల్స్ చెప్పారు.

విరామం లేకుండా 18 గంటల వరకు పని చేయమని బలవంతం చేశారని, తినడానికి లేదా టాయిలెట్‌కు వెళ్లడానికి షో నిలిపివేస్తే జరిమానా కూడా విధించారని కొందరు మోడల్స్ చెప్పారు.

డిసెంబర్ 2024లో ప్రచురితమైన హ్యూమన్ రైట్స్ వాచ్ నివేదిక ఈ కథనాలకు బలం చేకూరుస్తోంది.

పురుగులు, బొద్దింకలున్న చిన్న మురికి గదుల్లో కొంతమందిని చిత్రీకరించారని ఈ కథనం కోసం బీబీసీతో కలిసి పనిచేసిన రచయిత్రి ఎరిన్ కిల్‌బ్రైడ్ కనుగొన్నారు. కొందరు బాధాకరమైన, సిగ్గుపడేలా లైంగిక చర్యలను చేయవలసి వచ్చినట్లు తెలిసింది.

మెడెల్లిన్‌కు చెందిన సోఫీ(26)కి ఇద్దరు పిల్లలు. ఆమె ఒక నైట్‌క్లబ్‌లో వెయిట్రెస్‌గా పనిచేసేవారు. కానీ, కస్టమర్లతో విసుగుచెందిన సోఫీ, వెబ్‌క్యామ్ మోడలింగ్ ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు.

ఒక స్టూడియో తనను బలవంతంగా బాధాకరమైన, అవమానకరమైన లైంగిక చర్యలు చేయించిందని, ఒకేసారి ముగ్గురు ఇతర అమ్మాయిలతో ప్రదర్శనలు ఇప్పించిందని సోఫీ చెప్పారు.

ఈ చర్యలను కస్టమర్లు కోరడంతో దానికి స్టూడియో మానిటర్లు (మోడల్స్, వీక్షకుల మధ్య మధ్యవర్తులుగా పనిచేసే సిబ్బంది) ఆమోదించారని సోఫీ వివరించారు. అలా చేయనని స్టూడియోకి చెబితే, నీకువేరే మార్గం లేదని మానిటర్లు చెప్పారని ఆమె గుర్తుచేసుకున్నారు.

"చివరికి, నేను అలా చేయాల్సి వచ్చింది. లేకపోతే వారు నా అకౌంట్ బ్యాన్ చేస్తారు" అని సోఫీ చెప్పారు.

కొలంబియాలో ఒక సాధారణ ఉద్యోగం తనను, ఇద్దరు పిల్లలను జాగ్రత్తగా చూసుకోవడానికి తగినంత జీతం ఇవ్వదు కాబట్టి, ఇప్పటికీ వెబ్‌క్యామ్ స్టూడియోలలో పనిచేస్తున్నట్లు సోఫీ తెలిపారు. లా డిగ్రీ చదవడానికి ఆమె ఇప్పుడు డబ్బు ఆదా చేస్తున్నారు.

ఈ సమస్యలు కొలంబియాలో మాత్రమే లేవని ఎరిన్ కిల్‌బ్రైడ్ అంటున్నారు.

భారత్, బల్గేరియా, కెనడా, చెక్ రిపబ్లిక్, హంగేరీ, రొమేనియా, రష్యా, దక్షిణాఫ్రికా, యుక్రెయిన్, అమెరికా దేశాలలోని స్టూడియోల నుంచి నాలుగు పెద్ద స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లు వీడియోలను చూపిస్తున్నాయని ఆమె కనుగొన్నారు.

ప్లాట్‌ఫామ్ నియమాలలో బలహీనతలు మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగేలా లేదా వాటిని మరింత దిగజార్చేలా ఉన్నాయని కిల్‌బ్రైడ్ అభిప్రాయపడ్డారు.

స్టూడియోలలో పని పరిస్థితుల గురించి ప్లాట్‌ఫామ్‌లను బీబీసీ అడిగినప్పుడు, బొంగాకామ్స్‌కు చెందిన మిల్లీ అచింటే మాట్లాడుతూ ''కొలంబియాలోని కొన్ని స్టూడియోలను తనిఖీ చేయడానికి ఎంపికచేసిన ఎనిమిది మంది మహిళల బృందంలో నేను ఒక సభ్యురాలిని'' అని చెప్పారు

'మోడళ్లకు సరిగ్గా జీతం లభిస్తుందా, గదులు శుభ్రంగా ఉన్నాయా, మోడళ్లు అన్యాయానికి గురవుతున్నారా?' వంటివి చెక్ చేస్తామని ఆమె చెప్పారు.

స్ట్రిప్‌చాట్, చాటర్‌బేట్ స్టూడియోలను సందర్శించవని, మోడల్స్‌కు అవి ప్రత్యక్ష యజమానులు కాదని, కాబట్టి స్టూడియోలు, మోడళ్ల మధ్య ఒప్పందాలలో జోక్యం చేసుకోమని ఆ ప్లాట్‌ఫామ్‌లు చెప్పాయి.

కానీ, సురక్షితమైన పని వాతావరణాన్ని అందించడంపై శ్రద్ధ వహిస్తున్నామని చెబుతున్నాయి. మోడళ్లను స్టూడియోలు గౌరవంగా చూసుకోవాలని, వారిని సౌకర్యవంతంగా ఉంచాలని ఆశిస్తున్నట్లు స్ట్రిప్‌చాట్ చెప్పింది.

ఒక మోడల్‌ను ఏదైనా చేయమని బలవంతం చేస్తున్నారని లేదా ఒత్తిడి చేస్తున్నారని భావిస్తే అందులో జోక్యం చేసుకోవడానికి తమ వద్ద ప్రత్యేక బృందాలు ఉన్నాయని బొంగాక్యామ్స్, స్ట్రిప్‌చాట్, చాటర్‌బేట్ ప్లాట్‌ఫామ్‌లు తెలిపాయి.

వెబ్‌క్యామింగ్‌, సోఫీ
ఫొటో క్యాప్షన్, తన పిల్లలను పోషించుకోవడానికి, లా డిగ్రీ చదవడానికి తాను సెక్స్‌క్యామ్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నట్టు సోఫీ చెప్పారు.

"వాళ్లు నన్ను మోసం చేశారు"

రెండు నెలలపాటు ఉదయం 5 గంటలకే మేల్కొని వెబ్‌క్యామింగ్‌లో పనిచేసిన ఇసబెల్లా తన మొదటి చెల్లింపును పొందడానికి ఉత్సాహంగా ఎదురుచూశారు.

కానీ ప్లాట్‌ఫామ్, స్టూడియో వారి వాటాను తీసుకున్న తర్వాత, తనకు రూ. 3,500(42 డాలర్లు) మాత్రమే ఇచ్చారని ఆమె చెప్పారు. స్టూడియో తనకు వాగ్దానం చేసిన దానికంటే తక్కువ శాతం చెల్లించిందని, తన డబ్బులో ఎక్కువ భాగాన్ని ఇవ్వలేదని ఇసబెల్లా ఆరోపించారు.

ఆ డబ్బుతో పాలు, న్యాపీలు కొన్నట్లు ఆమె చెప్పారు. "వారు నన్ను మోసం చేశారు" అని అన్నారు.

పాఠశాల విద్యార్థి అయిన ఇసబెల్లా, కొన్నినెలలు మాత్రమే వెబ్‌క్యామ్ మోడల్‌గా పనిచేశారు.

ఇంత చిన్న వయసులో తనతో వ్యవహరించిన తీరు తీవ్రంగా బాధపెట్టిందని ఆమె చెప్పారు. ఏడుపు ఆపుకోలేకపోయారు, దీంతో ఇసబెల్లాను ఆమె తల్లి సైకాలజిస్ట్ వద్దకు తీసుకెళ్లారు.

ఇప్పుడు, ఆమెతో పాటు ఆ స్టూడియోలో పనిచేసిన ఆరుగురు మాజీ ఉద్యోగులు వారికి జరిగిన అన్యాయంపై ప్రభుత్వ ప్రాసిక్యూటర్‌కు ఫిర్యాదు చేశారు. స్టూడియో మైనర్లను ఉపయోగించుకుందని, వారిని దోపిడీ చేసిందని, ఆర్థికంగా ప్రయోజనం పొందిందని ఆరోపించారు.

"నేను మైనర్‌గా ఉన్నప్పుడు చేసిన వీడియోలు ఆన్‌లైన్‌లో ఇప్పటికీ ఉన్నాయి" అని ఇసబెల్లా చెప్పారు.

"వాటిని తొలగించేంత శక్తి నా దగ్గర లేదు. అవి నాపై ప్రభావం చూపాయి. ఇకపై నాకు దాని గురించి ఆలోచించడం ఇష్టం లేదు" అని ఆమె అన్నారు.

(ఈ కథనం కోసం వుడీ మోరిస్ అదనపు రిపోర్టింగ్ చేశారు)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)