హైదరాబాద్: డయాబెటిస్ టెస్ట్ రూ. 15కే

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
మధుమేహాన్ని (డయాబెటిస్) గుర్తించేందుకు చాలా రకాల పద్ధతులు అందుబాటులో ఉన్నాయి.
అయితే తక్కువ ఖర్చు, తక్కువ సమయంలో షుగర్ లెవల్స్ గుర్తించే 'బయో సెన్సర్'ను తయారు చేశారు బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ పరిశోధకులు.
రక్తపు చుక్క తీయకుండా కేవలం రూ.15కే టెస్టు చేసుకోవచ్చని చెబుతున్నారు.
సంప్రదాయ పద్ధతుల్లో వేలిపై సూదితో పొడిచి రక్తం నమూనాల్ని తీసుకుని అందులో గ్లూకోజ్ లెవల్స్ కొలుస్తుంటారు.
సూది గుచ్చకుండానే శరీరంలోని గ్లూకోజ్, లాక్టోజ్ స్థాయి తెలుసుకోవచ్చని చెబుతున్నారు బిట్స్ పిలానీ పరిశోధకులు.


ఫొటో సోర్స్, BITS Pilani Hyderabad
బయోసెన్సర్ సాయంతో గుర్తింపు
బిట్స్ పిలానీ హైదరాబాద్ పరిశోధకులు బయో సెన్సర్ తయారు చేశారు.
ఇది మనిషి శరీరంలోని జీవక్రియలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి ఇస్తుందని పరిశోధకులు చెప్పారు.
''చెమట, మూత్రం సాయంతో గ్లూకోజ్, లాక్టోజ్ స్థాయి రియల్ టైమ్‌లో తెలుసుకునేందుకు వీలవుతుంది'' అని బిట్స్ ప్రొఫెసర్ సంకేత్ గోయెల్ తెలిపారు.
ఈ పరిశోధనకు బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) పిలానీ, హైదరాబాద్ క్యాంపస్‌లోని ఎంఈఎంఎస్, మైక్రోఫ్లూయిడ్స్ అండ్ నానో ఎలక్ట్రానిక్స్ (ఎంఎంఎన్ఈ) ల్యాబ్‌కు చెందిన ప్రొఫెసర్ సంకేత్ గోయెల్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్‌గా వ్యవహరించారు.
ప్రొఫెసర్ డి. శ్రీరామ్ కో-ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్‌గా వ్యవహరించారు. పీహెచ్‌డీ స్కాలర్ సోనల్ ఫండే ఈ పరిశోధనలో పాల్గొన్నారు.
వీరి పరిశోధనకు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) సహకారం అందించింది.

ఫొటో సోర్స్, Getty Images
ఎలా పనిచేస్తుందంటే..
బయోసెన్సర్ అనేది ఎలక్ట్రో కెమికల్ సెన్సింగ్ ఆధారంగా పనిచేస్తుంది.
బయోసెన్సర్‌లో పాలీ అమైడ్ షీట్‌పై ఇంక్ జెట్ ప్రింటింగ్ టెక్నాలజీతో పనిచేసే సెన్సర్లు అమర్చారు.
''ఇందులో 2.5వ జనరేషన్ సెన్సర్ వాడాం. చెమట, మూత్రం నుంచి బయోసెన్సర్ శరీరంలోని గ్లూకోజ్ స్థాయిలను గుర్తించి పోర్టబుల్ పొటెన్షియోస్టాట్ తీసుకుంటుంది. తర్వాత అది స్మార్ట్ ఫోన్‌కు సిగ్నల్స్ పంపిస్తుంది. అందులో గ్లూకోజ్, లాక్టోజ్ స్థాయిలు కనిపిస్తాయి'' అని సోనల్ ఫండే వివరించారు.
కేవలం చెమట, యూరిన్ నుంచే కాకుండా ఈ సెన్సర్ కణజాలం నుంచి కూడా గ్లూకోజ్, లాక్టోజ్ స్థాయిలను గుర్తించగలదని ఆమె తెలిపారు.
బయోసెన్సర్, పొటెన్షియోస్టాట్ రూ.700 నుంచి రూ. 800 ధరకు దొరుకుతుందని, టెస్టుకు రూ.15 మాత్రమే ఖర్చవుతుందని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
కచ్చితమైన సమాచారం
బయోసెన్సర్ ఉపయోగించి టెస్టు చేసినప్పుడు కచ్చితమైన ఫలితాలు వచ్చాయని సోనల్ ఫండే చెప్పారు.
''చెమట, యూరిన్‌లో గ్లూకోజ్ పరంగా 2.6 మైక్రో మోలర్ లెవెల్స్‌ను బయో సెన్సర్ చూపించింది. లాక్టోజ్ పరంగా 1 మిల్లీ మోలార్ లెవెల్ ఉన్నట్లుగా ఉంది. ఈ రెండు స్థాయిల ఆధారంగా రికవరీ రేటు 96-102శాతం వచ్చింది'' అని వివరించారామె.
బయోసెన్సర్‌తో ఒకేసారి గ్లూకోజ్, లాక్టోజ్ స్థాయి తెలుసుకునేందుకు వీలవుతుందని వివరించారు.
''ప్రస్తుతం మేం ప్రయోగశాలలో పరీక్ష చేసేందుకు వీలుగా బయోసెన్సర్ తయారు చేశాం. కానీ మున్ముందు అందే సహకారం బట్టి కమర్షియల్ స్థాయిలో తీసుకురావాలనే ప్రణాళిక ఉంది'' అని సోనల్ ఫండే బీబీసీతో చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు ఆర్థికంగా భారం కాకూడదనే ఉద్దేశంతో బయోసెన్సర్ రూపొందించినట్లుగా ప్రొఫెసర్ డి.శ్రీరామ్ చెప్పారు.
''సూదితో గుచ్చే అవసరం లేకుండా తక్కువ ఖర్చులో బయోమార్కర్స్ తయారు చేయాలనేది మా ఆలోచన. అందుకు తగ్గట్టుగానే బయో సెన్సర్ తయారు చేశాం'' అని చెప్పారు ప్రొఫెసర్ డి.శ్రీరామ్.
బిట్స్ పరిశోధకుల పరిశోధన ఫలితాలు 'ఎల్స్‌వేర్ జర్నల్'లో ప్రచురితమయ్యాయి.

ఫొటో సోర్స్, Getty Images
2022 నాటికే 83 కోట్ల మందికి చేరిక
శరీరంలో ఇన్సులిన్ స్థాయి తగ్గడం వల్ల డయాబెటిస్ వస్తుంది.
క్లోమ గ్రంధి సరైన మోతాదులో ఇన్సులిన్ ఉత్పత్తి చేయనప్పుడు రక్తంలో గ్లూకోజ్ (షుగర్) స్థాయి పెరిగిపోతుంది.
సరైన మోతాదులో ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంటే, రక్తంలో గ్లూకోజు స్థాయి నియంత్రణలో ఉంటుంది.
మధుమేహ వ్యాధి కారణంగా దీర్ఘకాలంలో శరీరంలో వివిధ వ్యవస్థలపై ప్రభావం పడటంతోపాటు నరాలు, రక్తనాళాలు, రక్త సరఫరా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 1990లో 20 కోట్ల మంది డయాబెటిస్ వ్యాధితో బాధ పడుతుండగా, 2022నాటికి అది 83కోట్లకు చేరిందని అంచనా.
2050 నాటికి ప్రతి ఎనిమిది మంది యుక్తవయసు వారిలో ఒకరు డయాబెటిస్ బారిన పడతారని ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ అంచనాలు చెబుతున్నాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














