చిప్స్, కూల్ డ్రింక్స్‌తో ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం ఉంటుంది, పూర్తిగా మానేయాలా? ఎంత తినొచ్చు

ఫొటో సోర్స్, GETTY IMAGES
- రచయిత, సుశీల సింగ్, ఆదర్శ్ రాఠోర్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు మధ్యలో ఆకలి వేస్తే ఏం చేస్తారు?
ఇడ్లీ, దోసెలు, అన్నం, పప్పు, రోటీలు వంటివి కాకుండా తక్షణం అందుబాటులో ఉండే చిప్స్, బిస్కెట్స్, కూల్ డ్రింక్స్ తిని ప్రయాణం సాగిస్తారు కదా.
చాలాసార్లు మనం వీటిని కాలక్షేపానికి తింటుంటాం. ఒక్కోసారి కడుపు నిండుగా ఉన్నా సరే వాటి రుచి కారణంగా అదేపనిగా తింటుంటాం.
కానీ సంప్రదాయ తినుబండారాల స్థానంలో మనం తినే ఈ ఆహారపదార్థాలను ‘అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ’అంటారని తెలుసా? వీటిని ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి కలిగే హాని ఏమిటో తెలుసా?
ముందు వీటిని సరదాగా తినడం ప్రారంభించినా క్రమంగా ఇవి తినడం వ్యసనంగా మారుతుంది.
భారత్‌లో గడిచిన పదేళ్లలో ఈ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ మార్కెట్ వేగంగా పెరుగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్ (ఐసీఆర్ఐఈఆర్) తాజా నివేదికలు చెబుతున్నాయి.

ఫొటో సోర్స్, GETTY IMAGES
అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ అంటే ఏమిటి?
‘‘అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అనేవి మన వంటింట్లో తయారయ్యే తినుబండరాలు లాంటివి కావు. అది సాధారణ ఆహారంలానూ కనిపించదు. ప్యాకేజ్డ్ చిప్స్, చాక్లెట్స్, బిస్కట్లు, పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసే బ్రెడ్స్, బన్నులు మొదలైనవి’’ అని డాక్టర్ అరుణ్ గుప్తా చెప్పారు. ఆయన చిన్న పిల్లల వైద్యనిపుణుడు. న్యూట్రిషియన్ అడ్వకసీ ఫర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ (ఎన్‌ఏపీ) అనే సంస్థకు కన్వీనర్.
‘‘ప్రతి ఒక్కరూ తమ రుచులు, అభిరుచులమేరకు ఆహారాన్ని తయారుచేసుకుంటారు. దీన్ని కూడా ఫుడ ప్రాసెసింగ్ అనే పిలుస్తారు. సాధారణంగా మనం పాల నుంచి పెరుగు తయారుచేస్తే దాన్ని ప్రాసెసింగ్ అంటారు. కానీ ఓ పెద్ద పరిశ్రమలో పాల నుంచి పెరుగు తయారుచేసి దానికి రుచి తెప్పించేందుకు రంగు, వాసన, పంచదార లేదంటే మొక్కజొన్న సిరప్‌ను జతచేస్తే దానిని అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ అంటారు’’ అని ఆయన వివరించారు.
‘‘ఈ పదార్థాలన్నీ జతచేయడం వల్ల అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్‌లో పోషక విలువలేవీ పెరగవు. కానీ వాటిని జతచేయడం వల్ల వాటిని రుచికరంగా మారి తినేవారి సంఖ్య పెరుగుతుంది. దాని వల్ల అమ్మకాలు పెరుగుతాయి. లాభాలు వస్తాయి. అందుకే పెద్ద పెద్ద పరిశ్రమలే వీటిని తయారుచేస్తున్నాయి’’అని తెలిపారు.
అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్‌ను కాస్మొటిక్ ఫుడ్ అని కూడా పిలుస్తారు.
పారిశ్రామిక పద్ధతులు ప్రక్రియలను ఉపయోగించి తయారుచేసిన పదార్థాలనుంచి వీటిని తయారు చేస్తారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.
అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ కు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్ని ఉదాహరణలు కూడా ఇచ్చింది.
- కార్బోనేటేడ్ కూల్ డ్రింక్స్
- తీపి, కొవ్వు, ఉప్పగా ఉండే స్నాక్స్, కాండీలు
- పెద్ద ఎత్తున తయారుచేసే బ్రెడ్స్, బిస్కెట్స్, పేస్ట్రీలు, కేకులు, ప్రూట్ యోగర్ట్
- తినడానికి సిద్ధంగా ఉన్న మాసం, చీజ్, పాస్తా, పిజ్జా, చేపు, బర్గర్, హాట్ డాగ్
- ఇన్‌స్టెంట్ సూప్, ఇన్‌స్టెంట్ నూడిల్స్, బేబీ ఫార్మూలా
పంచదార, ఉప్పుడు, కొవ్వు, లేదంటే ఏదైనా రెండురకాలను మిశ్రమంగా చేసి, రసాయనాలు, ప్రిజర్వేటరీలను జత చేసి, పారిశ్రామిక ప్రక్రియలో వీటిని తయారుచేస్తారు.
ఇలాంటివి సహజంగా మన వంటింట్లో చేయలేం.

ఫొటో సోర్స్, GETTY IMAGES
నిల్వ చేయడం అప్పటి నుంచే..
నాగరికత మొదలైనప్పటినుంచి నిల్వ (ప్రిజర్వేషన్) ఉంచడమనేది ప్రారంభమైందని జాతీయ పౌష్ఠికాహార సంస్థ మాజీ సైంటిస్ట్ డాక్టర్ వి. సుదర్శనరావు తెలిపారు.
బ్యాక్టీరియా, ఫంగస్ మొదలైనవి సోకి ఆహారం చెడిపోకుండా చూడటమే నిల్వ చేయడంలోని ప్రధాన ఉద్దేశం.
‘‘ఆహారం నుంచి తేమను తీసివేయడం వల్ల దానిని నిల్వ చేసుకోవచ్చని మనపూర్వీకులు తెలుసుకున్నారు. ఎండుఫలాలు దీర్ఘకాలం ఉపయోగించుకోవచ్చని వారు గ్రహించారు. అందుకే ముందుగా వారు ఆహారాన్ని ఎండబెట్టడం మొదలుపెట్టారు. ’’ అని ఆయన వివరించారు.
ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి ఉప్పు, పంచదారను ఉపయోగించేవారు, వీటిని నిల్వ కారకాలుగా (ప్రిజర్వేటర్స్)గా పిలుస్తారు. కానీ ఇప్పుడు కొత్త సాంకేతికతలవల్ల నిల్వ చేసే పద్ధతులలో చాలా మార్పులు వచ్చాయని డాక్టర్ వి. సుదర్శనరావు చెప్పారు. హైదరాబాద్‌లోని భారత పరిశోధనా మండలిలో ఆయన దీర్ఘకాలంగా సైంటిస్ట్‌గా ఉన్నారు.
‘‘ఉదాహరణకు ఊరగాయలనే తీసుకోండి. వాటిల్లో ఎక్కువగా ఉప్పు, పంచదార, వెనిగర్, పులుపు ఉపయోగిస్తారు. ఇవి సహజ ప్రిజర్వేటివ్స్‌గా పనిచేస్తాయి. ఒకవేళ కృత్రిమ నిల్వ కారకాలను ఉపయోగించుకోవాలనుకుంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఐ) ప్రమాణాల ప్రకారం ఉపయోగించాల్సి ఉంటుందని గుజరాత్‌లోని రాజ్‌కోట్ మున్సిపల్ కార్పొరేషన్ లో డాక్టర్‌గా పనిచేస్తున్న జయేష్ వకాని వివరించారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ప్రిజర్వేటివ్‌లు, ఆల్ట్రా ప్రాసెస్డ్ ఆహారాలు
వినియోగదారులకు చైతన్యం కలిగించే ‘కంజ్యూమర్ వాయిస్’ అనే సంస్థకు సీఈఓగా పనిచేస్తున్న ఆషిమ్ సన్యాల్ మాట్లాడుతూ ‘‘ఆహారపదార్థాలు ఎక్కువ కాలం చెడిపోకుండా ఉండటంతోపాటు, రుచి పెరగడానికి, ఆకర్షణీయంగా కనిపించడానికి రంగులు కూడా అద్దిన ప్రిజర్వేటివ్‌లను వినియోగిస్తారు’’ అని తెలిపారు.
ఈ నిల్వకారకాలన్నీ కృత్రిమమైనవి, వీటిని పరిమిత పరిమాణంలో వినియోగిస్తారు.
కానీ ఆల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ చెడిపోకుండా వినియోగించే పద్ధతులు తీవ్ర హాని కలిగించేవే.
ఆహార పదార్థాలలో వినియోగించే నిల్వకారకాలను విడిగా చూడలేమని, వాటిని ఆల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్‌లో భాగంగానే చూడగలమని చెప్పారు.
వండిన కూరగాయలు, పప్పులు మొదలైనవాటిని కూడా ప్రాసెస్డ్ ఫుడ్ అంటారని ఆషిమ్ సన్యాల్ తెలిపారు.
కానీ ఆల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ సాంకేతిక సృజనాత్మకతతో ప్రయోగశాలలో కొత్తపద్ధతిలో రూపొందించినది. దీంతోపాటుగా పంచదార, కొవ్వులోనూ పెద్ద ఎత్తున ప్రిజర్వేటివ్‌లు ఉంటాయి.
‘‘ప్రాసెస్డ్ ఫుడ్‌లో పెద్ద ఎత్తున ప్రిజర్వేటివ్‌లు, రసాయనాలు ఉంటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా చెబుతోంది. వీటిల్లో ప్రిజర్వేటివ్‌లను జత చేయడం వల్లే వాటిని ఎక్కువ కాలం వినియోగించే పరిస్థితి ఉంది. ఈ తిండికి అలవాటుపడేలా వాటిల్లో కొన్ని వ్యసనాన్ని కలిగించే పదార్థాలను కూడా కలుపుతారు’’ అని ఆయన చెప్పారు.
చిప్స్, కూల్ డ్రింక్స్, తదితర ఆహారపదార్థాలను తీసుకోవడమనేది పిల్లల నుంచి పెద్దలవరకు అలవాటుగా మారింది. వీటిల్లో కలిపిన పదార్థాలే వాటికి అలవాటుపడేలా చేస్తాయి అని ఆషిమ్ సన్యాల్ వివరించారు.
‘‘అనేక వ్యాధులకు మూలకారణం ఈ ఆల్ట్రా ప్రాసెస్డ్ పుడ్ అనే విషయం శాస్త్రీయంగా నిరూపితమైంది. ‘‘మేమెప్పుడూ పరిశోధించినా అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ లో అత్యధిక మొత్తంలో నిల్వకారకాలు, రసాయనాలు కనిపిస్తున్నాయి’’ అని చెప్పారు.
‘‘అల్ట్రా ప్రాసెసింగ్‌లో పోషకాలు కూడా పోతాయి. అటువంటి ఆహారంలో నాణ్యత అనేదే మిగలదు. సిగరెట్లు, పొగాకు ఎలా వ్యసనంగా మారతాయో, ఈ అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారం కూడా వాటిల్లోని మూలకాల కారణంగా వ్యసనంగా మారుతుంది’’ అని ఆషిమ్ వివరించారు.
ఈ ఆల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ ఎంతవరకు తినొచ్చనే విషయాన్ని మనం గుర్తించలేమని నిపుణులు చెబుతున్నారు.
‘‘మనం ఆహారం తినేటప్పుడు కడుపు నిండిపోతే ఆ విషయాన్ని మెదడు మనకు చెబుతుంది. కానీ మీరు ఫుడ్‌ను ఎంజాయ్ చేసేలా అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తయారుచేస్తారు. వాటిని తినేటప్పుడు మీ కడుపు నిండిపోయింది. ఇక తినడం ఆపండి అని మెదడు మీకు ఎలాంటి సంకేతాలూ ఇవ్వదు’’ అని డాక్టర్ అరుణ్ గుప్తా చెప్పారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ప్రిజర్వేటివ్స్, ఆల్ట్రా ప్రాసెస్డ్ పుడ్‌తో ప్రతికూలతలు
నిర్ణీత పరిమాణానికి మించి కృత్రిమమైన ప్రిజర్వేటివ్‌లను దీర్ఘకాలంపాటు వాడితే క్యాన్సర్ లాంటి జబ్బులు వచ్చే అవకాశం ఉందని డాక్టర్ జయేష్ వకాని చెప్పారు.
కొన్నిసార్లు ఆహార పదార్థాలు, షెల్ఫ్ జీవితకాలాన్ని పెంచడానికి వినియోగించే ప్రిజర్వేటివ్‌ల వలన హాని కలుగుతుందని డాక్టర్ అరుణ్ గుప్తా కూడా చెప్పారు.
‘‘రసాయనాల లాంటి ప్రిజర్వేటివ్‌లు, కలరింగ్ ఏజెంట్లు అలర్జీలను కలగచేసి, రోగ నిరోధక శక్తిని బలహీనపరుస్తాయి. ఒక్కోసారి దీనిని వెంటనే కనిపెట్టలేకపోయినా, దీర్ఘకాలంలో అవి ప్రమాదకరమని తేలుతుంది’’ అని ఆయన తెలిపారు.
గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2023 నివేదిక ప్రకారం ఆకలితో బాధపడే 125 దేశాలలో ఇండియా 111వ స్థానంలో ఉంది.
భారతదేశంలో ఎక్కువ మంది ఆహారం దొరకక ఆకలితో అల్లాడుతున్నారు.
ఓ పక్క పౌష్టికాహార కొరతను దేశం ఎదుర్కొంటుంటే మరోపక్క ఊబకాయుల సంఖ్య పెరగడాన్ని కూడా కూడా చవిచూస్తోంది.
ఊబకాయులు పెరగడానికి అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ కీలక పాత్ర పోషిష్తోంది.
‘‘వీటిని అప్పుడప్పుడు తినొచ్చు. కానీ మన డైట్‌లో అవి పదిశాతాన్ని మించాయంటే అంటే 2వేల కేలరీలలో 200 కేలరీలు అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ ఉందంటే అప్పుడు నష్టం మొదలవుతోందని అర్థం’’ అని డాక్టర్ అరుణ్ గుప్తా చెప్పారు.
వీటిని తినడం వల్ల ముందు బరువు పెరగడం మొదలవుతుంది. ఇది అనేక వ్యాధులు రావడానికి దారితీస్తుంది. మధుమేహం, రక్తపోటు, గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధుల సహా క్యాన్సర్ కూడా వచ్చే ముప్పు ఏర్పడుతుంది.
‘‘ఆల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ డిప్రెషన్, యాంగ్జైంటీని పెంచుతుందని ఇటీవల పరిశోధనల సూచిస్తున్నాయని డాక్టర్ అరుణ్ గుప్తా వివరించారు. ‘‘ఇలా ఎందుకు జరుగుతోందో కనుక్కోవడానికి పరిశోధనలు కొనసాగుతున్నాయి’’ అని చెప్పారు.
సహజంగా పిల్లలు, పెద్దలు అందరూ ఈ ఆల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తింటారు. కానీ భారతదేశంలో ఎక్కువమంది చిన్నారులు వీటిని తింటున్నారు. దీంతో వీరు అతిపెద్ద ముప్పును ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే పిల్లలు ఎక్కువగా తీపిపదార్థాలను ఇష్టపడతారు. వారు చిప్స్, కాండీ, చాక్లెట్లు, ప్యాక్డ్ జ్యూస్, కూల్ డ్రింక్స్ తీసుకోవడానికి ఇష్టపడతారు.
దీని గురించి పెద్దలపై ఎక్కువగా పరిశోధనలు జరిగాయి. కానీ 2017లో జరిగిన ఓ పరిశోధనలో 50 శాతం మంది పిల్లలు ఈ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ వల్ల ముప్పు బారినపడుతున్నారని, వారిని ఈ ఆహారం ఊబకాయం వైపు నడిపిస్తోందని తేలింది’’ అన్నారు డాక్టర్ అరుణ్ గుప్తా.

ఫొటో సోర్స్, GETTY IMAGES
తప్పించుకునే మార్గమేంటి?
అల్ట్రా ప్రాసెస్ ఫుడ్ తినే అలవాటును మానుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
వారంలో నాలుగుసార్లు మీరు అలాంటి ఆహార పదార్థాలను తింటుంటే క్రమంగా వాటిని తగ్గించుకోవాలంటారు ఆషిమ్ సన్యాల్.
అలాగే ప్రజలు ఆహార పొట్లాలపై ఉండే లేబుల్స్ ను చదివేలా చైతన్యం కల్పించాల్సిన అవసరం కూడా ఉంది.
ముఖ్యంగా అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తయారుచేసే కంపెనీలు వాటిలోని పదార్థాల సమాచారాన్ని ప్యాకింగ్ పై భాగంలోనే ప్రముఖంగా ఇచ్చేలా చూడాల్సిన అవసరం ఉందని ఆషిమ్ చెప్పారు.
‘‘ప్యాకింగ్ ముందు భాగంలో పోషకాల లేబులింగ్ ను ఇవ్వాలనే విషయాన్ని మేం ప్రస్తావిస్తున్నాం. అందులో షుగర్ ఎక్కువ ఉందా, లేదా ఉప్పు ఎక్కువ ఉందా, లేదంటే కొవ్వు ఎక్కువా అనే సమాచారాన్ని ఇవ్వాలి. దీనిపై దృష్టి సారించ గలిగితే 80శాతం సమస్య తీరిపోయినట్టే. ప్రస్తుతం ఈ సమాచారమంతా ప్యాకింగ్ వెనుక భాగంలో రాస్తున్నారు. పైగా చిన్నచిన్న అక్షరాలలో ఇవ్వడం వల్ల వినియోదారులు వాటిని గుర్తించలేరు’’ అని చెప్పారు.
లాటిన్ అమెరికా దేశాలలో ఫ్రంట్ లేబులింగ్ మొదలైంది.
దీనివల్ల ప్రజలు తాము ఏం తింటున్నామో తెలుసుకుని తమ ఆహారపు అలవాట్లు మార్చుకుంటున్నారు.
అయితే లేబుల్‌పై ఇచ్చే సమాచారంతో వ్యాపారం ప్రభావితమవుతుందనే వాదన ఉంది. అయితే సిగరెట్లు తదితర పొగాకు ఉత్పత్తులపై కూడా ప్యాకెట్ ముందుభాగంలో ఇచ్చే సమాచారం వల్ల అమ్మకాలు తగ్గిపోలేదు కదా అని ఆయన ప్రశ్నించారు.
ఈ విషయంలో ప్రభుత్వానిది కీలక పాత్ర అని అరుణ్ గుప్తా చెప్పారు.
‘‘ప్రభుత్వానిది అతిపెద్ద బాధ్యత. ప్రజలు తామేం తింటున్నామో తెలుసుకోవాలి. దీంతోపాటు మీడియా, సమాజం, వ్యవస్థలు దీనిపై చైతన్యం కలిగించాలి. అప్పుడు ప్రజలు తామేం తినాలో ఎంపిక చేసుకోగలుగుతారు’’ అని తెలిపారు.
ఇండియాలో రెండేళ్ళ పిల్లల వరకు అందించే ఆహారపదార్థాల ప్రచారంపై నిషేధం ఉన్నట్టే, ఎక్కువ షుగర్, ఉప్పు, కొవ్వు పదార్థాలు గలిగిన ఆహార పదార్థాలకు సంబంధించి తప్పుదోవ పట్టించే ప్రకటనలను కూడా నిషేధించాలి అని అరుణ్ గుప్తా చెప్పారు.
‘‘ఏది హానికారకమో ప్రజలు తెలుసుకోవాలి. ప్రజలు వాటిని తినొచ్చు. కాకపోతే తక్కువగా తింటారు’’
‘‘ఇలాంటి విధానాలు అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తయారుచేసి లాభాలు ఆర్జిస్తున్న వ్యాపారులకు ఓ సందేశమవుతాయి. వ్యాపారం చేసి లాభాలు సంపాదించాలనుకోవడంలో తప్పేమీ లేదు. కానీ ప్రజల ఆరోగ్యంపై లాభాలు సంపాదించాలనుకోవడమే తప్పు’ అని అరుణ్ గుప్తా చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- నువ్వుల లడ్డూ: 'తీయని మాటలు పలికేలా చేసే తీపి వంటకం'
- బటర్ చికెన్, దాల్ మఖనీ వంటకాలు ఎవరు కనిపెట్టారు? తేల్చనున్న దిల్లీ హైకోర్టు
- అమెజాన్ అడవుల్లో బయటపడ్డ పురాతన నగరం.. అత్యాధునిక రహదారి వ్యవస్థ, కాల్వల నిర్మాణంతో వేలమంది నివసించిన ఆనవాళ్లు
- కశ్మీర్లో మంచు కురవని శీతాకాలం ఎప్పుడైనా చూశారా...ఈ ఏడాదే ఎందుకిలా?
- పిల్లల స్కూల్ ఫీజులు, ఇన్సూరెన్స్ ప్రీమియం కోసం ఆదాయం పెంచుకొనే మార్గాలు ఇవీ
- (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














