X (ట్విటర్)లో ఒక్క వీడియో పోస్ట్ చేసి రెండు కోట్లు సంపాదించిన యూట్యూబర్

బీస్ట్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఇమ్రాన్ రహ్మాన్-జోన్స్, నటాలియా షెర్మన్
    • హోదా, బీబీసీ న్యూస్

ప్రపంచంలోనే అత్యంత ప్రముఖ యూట్యూబర్ మిస్టర్ బీస్ట్. తానొక వీడియోను ఎక్స్‌లో (ట్విటర్) పోస్ట్ చేయడం ద్వారా రూ. 2 కోట్లకు (2,50,000 డాలర్లు) పైగా సంపాదించినట్లు ఆయన వెల్లడించారు.

క్రియేటర్లకు ప్రకటనల రూపంలో ఆదాయం తక్కువ మొత్తంలో లభిస్తున్నందున సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్ట్ చేయడం గిట్టుబాటు కాదని గతంలో బీస్ట్ అన్నారు.

అయితే, గత వారం ఆయన పోస్ట్ చేసిన ఒక పాత వీడియోకు 155 మిలియన్లకు (15 కోట్లు) పైగా వ్యూస్ వచ్చాయి.

ఎక్స్ సంస్థ వ్యాపారం ఇబ్బందుల్లో ఉన్నందున ఈ వీడియో ఆదాయం సృష్టించిన తీరును నిశితంగా పరిశీలించారు.

ఎక్స్ యజమాని అయిన ఎలాన్ మస్క్, 2022 అక్టోబర్‌లో ఈ ప్లాట్‌ఫారమ్‌ను కొన్నప్పటి నుంచి ట్విటర్‌లో ఎంగేజ్‌మెంట్ పెంచడానికి చాలా వ్యూహాలను ప్రయత్నించారు.

హైప్రొఫైల్ క్రియేటర్లకు అడ్వర్టైజింగ్‌ల ద్వారా లభించిన రాబడిని పంచడం కూడా ఈ వ్యూహాల్లో ఉంది. ఇప్పటికే యూట్యూబ్ వంటి ఇతర సంస్థలు ఇదే పని చేస్తున్నాయి.

అయినప్పటికీ, ఎక్స్ సైట్‌లో ట్రాఫిక్ తగ్గినందున ఈ వ్యూహాలపై సందేహాలు వ్యక్తం అయ్యాయి.

ఎలాన్ మస్క్

ఫొటో సోర్స్, REUTERS

ద్వేషపూరిత ప్రసంగాలు, తప్పుడు సమాచారం వంటి అంశాలపై ప్రకటనదారులతో మస్క్‌ వైరం కారణంగా ఎక్స్‌కు ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం కూడా తగ్గిపోయింది.

మిస్టర్ బీస్ట్ అసలు పేరు జిమ్మీ డోనాల్డ్‌సన్.

ఎక్స్‌లో పోస్ట్ చేసిన వీడియోలకు బిలియన్ (100 కోట్లు) సంఖ్యలో వీక్షణలు వచ్చినా గిట్టుబాటు కాదని గతంలో బీస్ట్ అన్నారు.

అయితే, ఆ వీడియో ద్వారా అడ్వర్టైజింగ్ ఆదాయం ఎంత లభిస్తుందో చూడాలని తనకు చాలా ఉత్సాహంగా ఉన్నట్లు ఆయన చెప్పారు.

కానీ, పెద్ద మొత్తంలో రావడం భ్రమలా ఉందని సోమవారం ఆయన అన్నారు.

‘‘ప్రకటనదారులు ఆ వీడియో ప్రజల్ని ఆకర్షించడం చూసి, ఆ వీడియోకు ప్రకటనలు ఇచ్చారని అనుకుంటున్నా. అందుకే ప్రతీ వీక్షణకు లభించిన ఆదాయం మీరు అనుకున్నదానికంటే ఎక్కువగా ఉంది. తను సంపాదించిన డబ్బును పది మంది యాదృచ్ఛిక వ్యక్తులకు పంచాలనుకుంటున్నా’’ అని ఆయన ఒక పోస్ట్‌లో రాశారు.

మిస్టర్ బీస్ట్ అనే పేరుకున్న పాపులారిటీ లేకుండా ఇంతటి ఘనతను పునరావృతం చేయడం కష్టమని విశ్లేషకులు చెప్పారు.

‘‘రూ. 2 కోట్లకు పైగా సంపాదించినట్లు ఆయన చెప్పారు. ఒక వీడియోకు ఇంత సంపాదించడం తక్కువేమీ కాదు. కానీ దీనికోసం భారీ ట్రాఫిక్ ఉండాలి’’ అని డబ్ల్యూ మీడియా రీసెర్చ్ ప్రిన్సిపల్ కార్స్‌టెన్ వీడ్ అన్నారు.

బీస్ట్

ఫొటో సోర్స్, Getty Images

ఇన్‌ఫ్లూయన్సర్లు సంపాదించే మొత్తం వ్యక్తిని బట్టి మారుతూ ఉంటుంది. వ్యక్తిగత ఒప్పందాల నిబంధనల్ని గోప్యంగా ఉంచుతారు. బాగా పేరున్న వారు ప్రత్యేక రేట్ల కోసం చర్చలు జరుపుతుంటారని భావిస్తారు.

బీస్ట్ తన యూట్యూబ్ చానెల్ ద్వారా ఒక ఏడాదిలో రూ. 448 కోట్లు (54 మిలియన్ డాలర్లు) సంపాదించారని 2022 నవంబర్‌లో ఫోర్బ్స్ అంచనా వేసింది.

అప్పటినుంచి ఆయన యూట్యూబ్ చానెల్‌కు మిలియన్ల మంది సబ్‌‌స్క్రై్బర్లుగా మారారు. ఆయన సబ్‌‌స్క్రై్బర్ల సంఖ్య 233 మిలియన్లు.

ఆయన చానెల్‌కు ఉన్న ప్రేక్షకుల సంఖ్యను చూసి తమ ప్లాట్‌ఫారమ్‌లను ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకునే కంపెనీలన్నీ ఆయనతో సంప్రదింపులకు దిగాయి.

వీడియోలు చేయడానికి మిలియన్ డాలర్లు ఖర్చు అవుతాయని చెప్పిన బీస్ట్, ఒక పెద్ద స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌ నడిపే ఒక కార్యక్రమం కోసం పనిచేస్తున్నారని సమాచారం.

అతను 2023 సెప్టెంబర్‌లో వేర్వేరు విలువైన కార్లను ప్రయత్నిస్తు్న్న వీడియోను తన యూట్యూబ్ చానెల్‌లో పోస్ట్ చేశారు.

దీనికి ప్రస్తుతం యూట్యూబ్‌లో 215 మిలియన్ల వ్యూస్ రావడంతో బీస్ట్ ఎక్కువ రాబడిని పొందగలిగాడు.

బీస్ట్ చేసే ఒక్కో వీడియో రాబోయే కాలంలో యూట్యూబ్‌లో ఒక మిలియన్ డాలర్లు సంపాదించగలదని ఇన్‌ఫ్లూయన్సర్ అనలిటిక్స్ ప్లాట్‌ఫామ్ వీఆరిజమ్ అంచనా వేసింది.

బీస్ట్

ఫొటో సోర్స్, Getty Images

కానీ, కొత్త కంటెంట్ ఆధిపత్యం ప్రదర్శించే ఎక్స్ ప్లాట్‌ఫారమ్‌లో, అదే పోస్టు అంతగా మెరుగైన ప్రదర్శన చేయకపోవచ్చని వీఆరిజమ్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్, వ్యవస్థాపకుడు జెన్నీ సాయ్ అన్నారు.

‘‘కాలక్రమేణా మానెటైజేషన్ శక్తి ఎలా పెరుగుతుందో చూడటం చాలా ఆసక్తిగా ఉంది’’ అని జెన్నీ చెప్పారు.

156.7 మిలియన్ల వీక్షణల ద్వారా 2,63,655 డాలర్ల ఆదాయం వచ్చినట్లుగా సూచిస్తూ బీస్ట్ ఒక స్క్రీన్‌షాట్‌ను షేర్ చేశారు. అంటే వెయ్యి వీక్షణలకు 1.68 డాలర్ల ఆదాయం వచ్చినట్లుగా ఆయన చెప్పారు.

అయితే, తక్కువ పాపులారిటీ ఉన్న వ్యక్తులు కూడా ఇంతే సమానమైన రాబడిని పొందలేరని అతిపెద్ద స్వతంత్ర ప్రీమియం స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ నెబ్యులా చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవ్ విస్కస్ అన్నారు.

‘‘అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించిన, భూమ్మీద అతిపెద్ద యూట్యూబర్ వీడియో అది. బీస్ట్‌కు వచ్చే వీక్షణల్లో కేవలం 1 శాతం మాత్రమే పొందగలిగే మరో క్రియేటర్ ఇలాంటి ఘనత సాధించగలడని నేను అనుకోవట్లేదు’’ అని ఆయన చెప్పారు.

బీస్ట్ చేసిన ప్రయోగం నిజంగా చాలా ప్రత్యేకమైనది.

ఇది కచ్చితంగా ‘ఎక్స్’ చీఫ్ ఎగ్జిక్యూటివ్ లిండా యాకరినోకు సంతోషాన్ని ఇస్తుంది. అడ్వర్టైజింగ్ కెరీర్‌లో అద్భుత కెరీర్ ఉన్న ఆమె నిరుడు ఎక్స్‌ సంస్థలో చేరారు. ఎక్స్‌‌ సంస్థ పాపులారిటీ తగ్గిపోవడం వ్యక్తిగతంగా ఆమెకు కూడా ఇబ్బందికరంగా మారినట్లుగా చెబుతారు. ఇప్పుడు తమ ప్లాట్‌ఫారమ్‌లో ప్రకటనలు గొప్ప ప్రదర్శన చేయడం ఆమెకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)