విశాఖ హార్బర్ అగ్నిప్రమాదం: పోలీసుల అదుపులో యూట్యూబర్ నాని .. అసలేం జరిగింది?

విశాఖ హార్బర్‌లో అగ్ని ప్రమాదం
ఫొటో క్యాప్షన్, విశాఖ హార్బర్‌లో అగ్ని ప్రమాదం
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

విశాఖపట్నం హార్బర్‌లో జరిగిన అగ్నిప్రమాదానికి సంబంధించి యూట్యూబర్ నాని (లోకల్ బాయ్ నానీ) సహా పలువురిని విచారిస్తున్నామని పోలీసులు చెప్పారు.

నవంబరు 20న అదుపులోకి తీసుకున్న నానీని, ఈ ప్రమాదంలో ఆయన పాత్ర లేదని తేలడంతో విడిచిపెట్టామని తెలిపారు. అయితే, ఆయన్ను విడిచిపెట్టడంపై మత్స్యకారుల్లోని మరో వర్గంవారు ఆగ్రహం వ్యక్తం చేయడంతో నానిని పోలీసులు మళ్లీ అదుపులోకి తీసుకున్నారు.

“యూట్యూబర్ పోలీసుల అదుపులోనే ఉన్నారు. అతనితో పాటు మరికొందర్ని కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నాం. అయితే ఇప్పటీ వరకు ఈ నేరానికి కారణం ఎవరనే సమచారం లభించలేదు. వస్తున్న సమాచారాన్ని బట్టి రోజూ కొందర్ని విచారిస్తున్నాం. ఈ ప్రమాదానికి ఇది కారణమని ఇంకా చెప్పలేకపోతున్నాం. సైంటిఫిక్ ఎవిడెన్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాం. ఒకటి, రెండు రోజుల్లో పూర్తి సమాచారాన్ని సేకరిస్తాం” అని విశాఖ హార్బర్ అగ్ని ప్రమాదం కేసును దర్యాప్తు చేస్తున్న అధికారి మోసెస్ పాల్ చెప్పారు.

మత్స్యకారుల్లో ఆందోళన
ఫొటో క్యాప్షన్, మత్స్యకారుల ఆందోళన

మంటల్లో కాలిపోయిన 43 బోట్లు

విశాఖపట్నం ఫిషింగ్ హర్బర్ చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 43 బోట్లు మంటల్లో కాలిపోయాయి. 15 బోట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని అధికారులు చెప్పారు.

నేవీ, పోర్టు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం ఏమీ జరగలేదు. అగ్నిప్రమాదానికి కారణాలు ఏమిటన్నది ఇంకా తెలియలేదు.

ఈ అగ్నిప్రమాద దృశ్యాలను యూట్యూబర్ లోకల్ బాయ్ నాని షూట్ చేసి తన యూట్యూబ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేశారు. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందో, ఎవరు కారకులో తెలియడం లేదని ఆ వీడియోలో నాని చెప్పారు.

యూట్యూబర్ నానిపై కొన్ని ఆరోపణలు రావడంతో విశాఖ వన్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాద ఘటనపై సమాచారం సేకరించేందుకు విచారణ జరుపుతున్నట్లు వన్ టౌన్ పోలీసులు సోమవారం చెప్పారు.

హార్బర్ సమీపంలోని హెచ్‌పీసీఎల్ ట్యాంకర్ల వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించామని, వీటి ఆధారంతో ఈ ప్రమాదానికీ, యూట్యూబర్ నానీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చామని పోలీసులు వెల్లడించారు.

అయితే, ఈ ప్రమాదానికి కారణమని అనుమానిస్తున్న మరికొందరిని విచారిస్తున్నట్లు చెప్పారు.

ఆ రోజు రాత్రి..

వేటకు వెళ్లేందుకు సిద్ధమైన బోట్లు, అలాగే ఇప్పటికే వేటకు వెళ్లి చేపలు, రొయ్యలతో హార్బర్ చేరుకున్న బోట్లు అన్ని లంగరు వేసి ఉన్నాయి. 750 బోట్లు ఉండే విశాఖ హార్బర్ లో ప్రమాదం జరిగిన సమయంలో దాదాపు 250 వరకు బోట్లకు లంగరు వేసి ఉన్నాయని మత్స్యకారులు చెప్పారు.

మూడు రోజుల క్రితం సముద్రంపైకి వేటకు వెళ్లిన బోట్లు కూడా ఆదివారం సాయంత్రానికి తీరానికి చేరాయి. ఆదివారం రాత్రి 11 గంటలు దాటిన తర్వాత ఓ పడవలో నుంచి మంటలు చెలరేగాయి.

“అగ్నిప్రమాదం జరిగిన సమయంలో బోట్లలో వేటకు వెళ్లి తీసుకుని వచ్చిన రూ.లక్షల విలువ చేసే చేపలు, రొయ్యలు ఉన్నాయి. ఉదయం వాటిని వేలం వేస్తాం. ఒక్కో బోటులో సుమారు రూ.5 నుంచి రూ.6 లక్షల విలువైన చేపలున్నాయి. అగ్ని ప్రమాదం జరిగిందని నాకు రాత్రి 11 గంటల సమయంలో ఫోన్ వచ్చింది. పది నిముషాల్లో నేనిక్కడకు వచ్చాను. అప్పటికే 40 నుంచి 50 బోట్లు కాలిపోతూ కనిపించాయి. మంటలు ఆర్పేందుకు ప్రయత్నించలేకపోయాం. ఎందుకంటే బోట్లలో వంట కోసం ఉంచుకునే గ్యాస్ సిలిండర్లు పేలుతున్నాయి. దీంతో భయం వేసి దగ్గరకు కూడా వెళ్లలేకపోయాం.” అని ప్రమాదంలో తన బోటును కోల్పోయిన మత్స్యకారుడు రాజేష్ బీబీసీతో చెప్పారు.

మొత్తం మంటల్లో తగలబడిన బోట్లు, అందులోని చేపలు, ఇతర సామగ్రి విలువ అంతా కలిపి రూ.30 కోట్ల నుంచి రూ.35 కోట్ల వరకూ ఉంటుందని సంఘటన స్థలాన్ని పరిశీలించిన అధికారులు ప్రాథమిక అంచనా వేశారు.

బోటు, అందులోని చేపలు అన్నీ తగలబడిపోయాయి.

మంటల్లో కాలిపోయిన ఫిషింగ్ బోట్లు
ఫొటో క్యాప్షన్, మంటల్లో కాలిపోయిన ఫిషింగ్ బోట్లు

మూతపడిన చేపల మార్కెట్

అగ్ని ప్రమాదం జరిగిన స్థలం పక్కనే హార్బర్ చేపల మార్కెట్ ఉంది. వేట ముగించుకుని వచ్చిన తర్వాత బోట్లలో తెచ్చే చేపలను ఈ మార్కెట్లో విక్రయిస్తుంటారు.

వేలం ద్వారా చేపలు కొనుగోలు చేసే రిటైల్ వ్యాపారులు బోట్ల నుంచి చేపలను హోల్‌సేల్‌గా కొనుగోలు చేసి అమ్ముతారు.

“ఇవాళ అమ్ముదామని బోటులో ఉంచిన చేపలన్ని తగలబడ్డాయి. మొత్తం రూ.2 లక్షల సరుకు బోటులోనే ఉంది. మూడు రోజుల కిందట వేటకు వెళ్లాం. నిన్న రాత్రి వచ్చాం. ఉదయం వేలంలో అమ్ముకుందామని బోటును లంగరేసి ఉంచాం. అనుకోకుండా ఈ ప్రమాదంలో బోటు, అందులోని చేపలు అన్నీ కాలిపోయాయి. బోటు రూ.35 లక్షలు, చేపలు రూ. 2 లక్షలు మొత్తం పోయాయి” అని ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన విజయ్ మెహన్ చెప్పారు.

ప్రమాదంలో మొత్తం 43 బోట్లు కాలిపోయాయి. ప్రస్తుతం హార్బర్‌లో బోట్లు, చేపలు కాలిపోయిన వాసన వస్తోంది.

ప్రమాదం జగరడంతో, మార్కెట్‌కి రావాల్సిన చేపలు అన్ని తగలబడిపోయాయి. దీంతో చేపల మార్కెట్ మూతపడింది.

రూ.30-35 కోట్లనష్టం జరిగి ఉంటుందని అంచనా
ఫొటో క్యాప్షన్, రూ.30-35 కోట్లనష్టం జరిగి ఉంటుందని అంచనా

కారణాలు తెలియాల్సి ఉంది: జాయింట్ కలెక్టర్

ఇంత పెద్ద ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదని జాయింట్ కలెక్టర్ విశ్వనాథన్ చెప్పారు. ప్రస్తుతం విచారణ జరుపుతున్నామని, ముందుగా ప్రమాదంలో బోట్లను, ఇతర సామగ్రిని కోల్పోయిన వారిని ఆదుకోవడంపై దృష్టి పెట్టామని ఆయన అన్నారు.

ప్రమాద ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

“ఇప్పటి వరకు మేం సేకరించిన సమాచారం ప్రకారం 43 బోట్లు తగలబడిపోయాయి, 15 బోట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ప్రమాదంలో తగలబడిన, ధ్వంసమైన బోట్ల యజమానుల వివరాలను సేకరిస్తున్నాం. వారికి నష్టపరిహారం అందించేందుకు చర్యలు చేపట్టాం” అని జాయింట్ కలెక్టర్ తెలిపారు.

హార్బర్ బయట మత్స్యకారుల ఆందోళన
ఫొటో క్యాప్షన్, హార్బర్ బయట మత్స్యకారుల ఆందోళన

ప్రమాద స్థలానికి సీఎం రావాలి: బాధితులు

ప్రమాదానికి కారణమైన వారిని గుర్తించి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ హార్బర్ వద్ద మత్స్యకారులు అందోళన చేపట్టారు. హార్బర్ గేటు వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్న మత్స్యకారులను లోపలికి రానివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు.

గేటు వద్దే బైఠాయించిన మత్స్యకారులు ప్రమాద స్థలానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావాలని నినాదాలు చేశారు. సీఎం వచ్చి తమ గోడు వినాలని, ఇలాంటి ప్రమాదం గతంలో తామెన్నడూ చూడలేదని, దీనికి బాధ్యులైన వారిని గుర్తించి శిక్షించాలని డిమాండ్ చేశారు.

బోట్ల రిపేర్లు, డీజిల్ ధరల పెరుగుదల, రోజుల తరబడి సముద్రం మీద ఉన్నా చేపలు చిక్కకపోవడం వంటి సమస్యలతో ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న మత్స్యకారులు, ఈ ప్రమాదంతో తమ జీవితాలు తల్లకిందులైపోయాయని ఆవేదన చెందుతున్నారు.

బాధితుల వద్దకు వెళ్లి వారికి కావలసిన సహాయం అందించాలని మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజును సీఎం జగన్ ఆదేశించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)