అఫ్గానిస్తాన్: 'పదేళ్ళ వయసు వరకూ నన్ను మా నాన్న అబ్బాయిగానే పెంచారు... అలానే అందర్నీ నమ్మించి నన్ను కాపాడారు'

ఫొటో సోర్స్, NILOFAR AYOUBI
- రచయిత, ......
- హోదా, బీబీసీ న్యూస్ వరల్డ్
ఉత్తర అఫ్గానిస్తాన్‌లోని కుందుజ్ వీధుల్లో ఆడుకునేటప్పుడు నాలుగేళ్ల వయసులో నీలోఫర్ అయూబీని ఒక వ్యక్తి కొట్టాడు. ఆ దెబ్బకు నీలోఫర్ అయూబీ నేలపై పడింది.
‘‘అప్పుడు నేను ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చాను. నాన్న కళ్లు కోపంతో ఎర్రబడ్డాయి’’ అని నీలోఫర్ బీబీసీకి చెప్పారు. ప్రస్తుతం నీలోఫర్ వయసు 23 ఏళ్లు. ఆ సంఘటన తనకింకా గుర్తుందని చెప్పారు.
‘‘నాన్న కోపంతో అటూఇటూ తిరగడం ఇంకా నాకు గుర్తుంది. అతనెలా నిన్ను తాకుతాడు అని అంటూ నాన్న కోపడ్డారు’’
ఆమెను కొట్టడానికి కొద్దిసేపు ముందు, ఆ వ్యక్తి నీలోఫర్ ఛాతీని తాకాడు. ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. మళ్ళీ కనిపించినప్పుడు పరదా ధరించకపోతే, మీ నాన్నను కొడతానంటూ నీలోఫర్‌ను బెదిరించాడు.
ఇలాంటి కొన్ని సంఘటనల తర్వాత, నీలోఫర్ తండ్రి ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నాడు.
‘‘అమ్మని కత్తెర అడిగారు. నా జుట్టు కట్ చేసి, అబ్బాయిలాగా బట్టలు వేయమని చెప్పాడు’’ అని నీలోఫర్ తెలిపారు.
తాలిబాన్లు తొలిసారి అఫ్గానిస్తాన్‌ను పాలించిన సమయంలో అంటే 1996 నుంచి 2001 మధ్య ఇస్లామిక్ చట్టం షరియా నియంత్రణలో ఉండేది ఆ దేశం. ఈ చట్టం కింద మహిళలపై కఠిన ఆంక్షలు ఉండేవి.
మీరు పుట్టిన జెండర్, మీకున్న మానవ హక్కులను పరిమితం చేస్తుందని అంటున్నారు నీలోఫర్.

ఫొటో సోర్స్, GETTY IMAGES
కుందుజ్‌లో పుట్టి పెరగడం
1996లో నీలోఫర్ పుట్టారు. కానీ, ఆమె గుర్తింపు డాక్యుమెంట్లలో మాత్రం 1993లో పుట్టినట్లు ఉంది.
తాలిబాన్ ప్రభుత్వాన్ని పడగొట్టి 2001లో అఫ్గానిస్తాన్ పాలనలో అమెరికా కలుగజేసుకున్న తర్వాత, ఎంత వీలైత అంత త్వరగా ఆమె చదువులను ప్రారంభించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
షరియా కఠిన నిబంధనల కింద, కూతుర్లను అబ్బాయిలాగా తయారు చేయడం అఫ్గానిస్తాన్‌లోని ఫ్యామిలీల్లో ఆనవాయితీగా వస్తుండేదని నీలోఫర్ చెప్పారు.
ముఖ్యంగా కుటుంబానికి పెద్ద దిక్కు లేనప్పుడు, ఎవరైనా మగవ్యక్తి ఆ ఇంటి మహిళ వద్దకు వచ్చి ఆమెను ఐదో లేదా ఆరో భార్యగా పొందేందుకు బలవంతం చేస్తారు.
‘‘కానీ, నాకు నాన్న ఉన్నారు.స్వతంత్రంగా, స్వేచ్ఛగా నన్ను పెంచేందుకు నాన్న ఈ నిర్ణయం తీసుకున్నారు’’ అని నీలోఫర్ వివరించారు.
అఫ్గానిస్తాన్‌లో షరియా చట్టం కఠినంగా అమలయ్యే సమయంలో నాన్న చాలా ప్రత్యేకమైన వ్యక్తిగా కనిపించే వారు.
ఆయన రాజకీయాలను ద్వేషించే వారని నీలోఫర్ చెప్పారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
‘నాన్నతో కలిసి స్పోర్ట్స్ చూసేందుకు వెళ్లేదాన్ని’
‘‘జుట్టు కత్తిరించుకుని, నా సోదరుల మాదిరి బట్టలు వేసుకుని మా నాన్న ముందు నిల్చున్నాను. నా వయసు ఇతర అమ్మాయిలతో పోలిస్తే చాలా భిన్నంగా కనిపించాను. నన్ను కూడా నా సోదరుల లాగే చూసేవారు.
అబ్బాయి వేషధారణతో నాన్నతో కలిసి మార్కెట్‌కు వెళ్లేదాన్ని. మైళ్ల దూరం నడిచేవాళ్లం. స్పోర్ట్స్ చూసేందుకు బస్సులో ప్రయాణించే వాళ్లం. పక్కింట్లో నాకు స్నేహితులుండే వారు. వారితో కలిసి వీధుల్లో ఆడుకునేదాన్ని’’ అని నీలోఫర్ గుర్తుకు చేసుకున్నారు.
‘‘కానీ, నా అక్కలు మాత్రం ఇంట్లో కూడా వారి జుట్టును కవర్ చేసుకునే వారు. బట్టలు కూడా సంప్రదాయబద్ధంగా వేసుకునే వారు. నాన్న ఇలా ఉండటాన్ని అసలు ఒప్పుకునే వారు కాదు. అమ్మతో వాదించే వారు. వీళ్ల డ్రెస్‌లెందుకు చాలా పొడవుగా, వదులుగా ఉన్నాయి? అంటూ ప్రశ్నించే వారు. నాన్న అంత బాగా ఆలోచించేవారు’’ అని నీలోఫర్ అన్నారు.

ఫొటో సోర్స్, NILOFAR AYOUBI
నమ్మకాన్ని పొందడం
రెండు గుర్తింపులతో పెరగడమనేది ఈ ప్రపంచంలో చాలా కష్టం. తన పక్కింటిలో నీలోఫర్ వయసున్న అమ్మాయి ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోగలిగింది. ఆమె కూడా అబ్బాయిలాగా వేషధారణ వేసుకునేది.
‘‘మేమిద్దరం ఒకరికొకరు సాయం చేసుకునే వాళ్లం. ఒకరు పట్టుబడితే, మరొకరం వచ్చి కాపాడుకునే వాళ్లం’’ అని నీలోఫర్ చెప్పారు.
నీలోఫర్ కరాటే, సైకిల్, జూడో నేర్చుకున్నారు. కానీ, ఆమె అక్కలు మాత్రం ఇంట్లోనే మహిళలాగా ఒక క్లిష్టమైన జీవితాన్ని సాగించే వారు.
ఇంట్లోనే ఉంటూ, ఎప్పుడూ ఏదో ఒక పని చేసేవాళ్లు. అసలు బయట అబ్బాయిల కంటపడేవారు కాదు.
‘‘అక్కలతో కలవకపోవడం వల్ల, నా ప్రపంచం ఎలా ఉంటుందో నాకు తెలిసేది కాదు. అమ్మాయిలకు పిరియడ్స్ వస్తాయన్న విషయం కూడా తెలియదు’’ అని నీలోఫర్ అన్నారు.
ఒకరోజు నీలోఫర్ టీవీలో శానిటరీ న్యాప్‌కిన్స్ ప్రకటన చూశారు. వాటిపై నీటి చుక్కలు వేశారు, ఆ నీటి చుక్కలు బయటికి రాకుండా అవెలా పీల్చుకున్నాయో ఈ ప్రకటనలో చూపించారు. అవేంటి, ఎలా పనిచేస్తాయన్న విషయం నీలోఫర్‌కి అర్థం కాలేదు.
‘‘ఒకసారి అలాంటిది ఒకటి నా కనపడింది. దాన్ని తీసుకెళ్లి నాన్నకు చూపించి, టీవీలో చూసిన మాదిరే ఉంది అన్నాను. ఎందుకు ఇది అని అడిగాను? కానీ ఏం చెప్పాలో నాన్నకు అర్థం కాలేదు.
ఆ తర్వాత దాన్ని తీసుకుని అక్క దగ్గరకు వెళ్లాను. ఆమె దాన్ని నా దగ్గర్నుంచి తీసుకున్నట్లు గుర్తుంది. నన్ను హేళన చేసింది. ఆ సమయంలో కూడా నాకెవరూ పిరియడ్స్ అంటే ఏంటో చెప్పాలని ఆలోచించలేదు’’ అని నీలోఫర్ గుర్తుకు చేసుకున్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
13 ఏళ్లున్నప్పుడు జూడో ఆడిన తర్వాత, నీలోఫర్ చాలా అలసటగా ఇంటికి వచ్చారు. ఆమె కాళ్లు చాలా నొప్పులు వస్తున్నాయి. అలానే పడుకోవాలని నీలోఫర్‌కు అనిపించింది.
బాత్‌రూమ్‌లోకి వెళ్లిన తర్వాత, రక్తస్రావం అవ్వడం కనిపించింది. తన జీవితంలో అతిపెద్ద మార్పు సంభవిస్తుందని ఆమె తెలుసుకోలేకపోయారు.
ఆ తర్వాత రోజు ఈ విషయాన్ని నీలోఫర్ తన స్నేహితురాలికి చెబితే, తాను నవ్విందని నీలోఫర్ చెప్పారు.
‘‘నేను ఇంటికి వచ్చినప్పుడు, నా బట్టలపై ఉన్న మరకలను చూసింది అమ్మ. నన్ను హగ్ చేసుకుని ఓదార్చడానికి బదులు, నువ్వెందుకు అంత త్వరగా పెద్దదానివయ్యావు? అని గట్టిగా అరిచారు’’ అని నీలోఫర్ గుర్తుకు చేశారు.
ఇతర కూతుర్ల మాదిరి నీలోఫర్ జీవితం కూడా నాలుగు గోడల మధ్య ఇంట్లోనే బందీఖానా అవుతుందన్న విషయం తెలిసి బాగా ఏడ్చేశారు ఆమె తల్లి.
ఈ సమయంలో నీలోఫర్ మరో సమస్యను ఎదుర్కోవాల్సి వచ్చింది. అదేటంటే.. ఆమె పుట్టిన జెండర్‌ను బయటికి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది.
‘‘ఇంద్రధనస్సు కిందకు వెళ్తే జెండర్ మారిపోతుందనే ఒక అపోహ మాలో ఉండేది’’ అని నీలోఫర్ చెప్పారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
నీలోఫర్‌లో తిరుగుబాటు స్ఫూర్తి
అబ్బాయిలాగా ఏళ్ల పాటు జీవనం సాగిస్తోన్న నీలోఫర్, స్కూల్‌లో ఇతర అమ్మాయిలకు లేని సెక్యూరిటీని ఇన్ని రోజులు పొందారు.
2001 సెప్టెంబర్ 11న అమెరికా జోక్యం తర్వాత కూడా అఫ్గానిస్తాన్‌లో మళ్లీ రాజకీయ అస్థిరత ప్రారంభమైంది.
అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం, దాన్ని నిలుపుకునేందుకు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంది. కానీ, విద్య వంటి కొన్ని హక్కులు మహిళలకు లభించాయి.
ఈ సమయంలోనే నీలోఫర్ స్కూల్‌కి వెళ్లగలిగింది. తన చిన్నతనం నుంచే ఆమెలో తిరుగుబాటు స్ఫూర్తిని నింపుకున్నారు.
‘‘నినాస్ డెల్ నార్టే పేరుతో ఒక గ్రూప్‌ను క్రియేట్ చేశారు. ఆ గ్రూప్ ద్వారా, స్కూళ్లలో అమ్మాయిలకు చదువు అందించాలని మా ఉద్యమాన్ని ప్రారంభించాం. అఫ్గానిస్తాన్‌లో అమ్మాయిలకు ప్రతీది నిషేధమే.
మహిళగా మారే సమయంలో వారి శరీరంలో మార్పులు వచ్చేవి. వాటిని సిగ్గుగా భావించి, ఆ మార్పులను కనిపించకుండా ఉండేందుకు వారి శరీరాలను గట్టిగా చుట్టుకునే వారు. దీంతో శరీర అవయవాలను పెరగకుండా చూసుకునేవారు’’ అని నీలోఫర్ తెలిపారు.
పలుసార్లు స్కూళ్లలో అమ్మాయిల చదువు కోసం డైరెక్టర్ ఆఫీసుకు వెళ్లినప్పుడు, నీలోఫర్ చదువుల్లో మంచి ప్రతిభ కనబర్చుతూ ఉండటంతో ఆమెను భారత్ పంపించి చదివించేందుకు సహకరించారు.
అదే ఆమె జీవితంలో అతిపెద్ద మార్పు. మాస్టర్స్ డిగ్రీ పొందే వరకు ఆమె చాలా కష్టపడ్డారు.
ఆమె చిన్నగా ఉన్నప్పుడు చాలా పెళ్లి ప్రతిపాదనలు వచ్చాయి. కానీ, మా నాన్న తన వద్దకు రావొద్దని హెచ్చరించారు.
‘‘ఆమెకు ఇప్పుడు పెళ్లి చేయదలుచుకోలేదు. చదువులు పూర్తి చేసుకుని, నీలోఫరే నచ్చిన వ్యక్తిని ఎంచుకుంటుందని నాన్న అన్నారు. మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసుకుని, ఆ తర్వాత పెళ్లి గురించి ఆలోచించాలని అప్పుడే అనుకున్నాను’’ అని నీలోఫర్ అన్నారు.
2016లో నీలోఫర్ పెళ్లి చేసుకున్నారు. ఆ సమయంలో ఆమె వయసు 19 ఏళ్లు. కానీ, అంతకుముందు సంవత్సరమే తన తండ్రి కాలం చేశారు. అది ఆమెకు తీరని వేదనను మిగిల్చింది.
భర్త సాయంతో అఫ్గానిస్తాన్ తిరిగి వచ్చిన నీలోఫర్, వ్యాపారవేత్తగా మారారు. మగవారి నుంచి ఆర్థిక సాయం లభించని మహిళలకు ఉద్యోగాలు ఇచ్చే ఫ్యాషన్, ఫర్నీచర్, ఇంటీరియర్ డిజైన్ వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించారు.
ఆమె వ్యాపారంలో 300 మంది ఉద్యోగులున్నారు. నగరంలో పలు స్టోర్లను నిర్వహిస్తున్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
అఫ్గానిస్తాన్ నుంచి పారిపోవడం
అఫ్గానిస్తాన్‌లో నీలోఫర్ కుటుంబం వ్యాపారంలో విజయం సాధించినప్పటికీ, దేశంలో మళ్లీ రాజకీయ పరిస్థితులు అస్థిరంగా మారడంతో మహిళలకు భద్రతా లోపించింది.
2021 ఆగస్ట్‌లో తాలిబాన్లు మళ్లీ అఫ్గానిస్తాన్‌ను దక్కించుకోవడం ప్రారంభించారు.
‘‘ప్రభుత్వంలో ఒక మంత్రి నుంచి నా భర్తకు కాల్ వచ్చింది. ఆయనకూతురి కోసం ఐడెంటీ కార్డును, పాస్‌పోర్టును త్వరగా సిద్ధం చేయాలని కోరారు’’ అని నీలోఫర్ తెలిపారు. అప్పుడు ఆ పాప వయసు కేవలం 11 నెలలు మాత్రమే.
ఏం చేయాలో పాలుపోలని ఉద్యోగులు కూడా స్టోర్ నుంచి కాల్ చేయడం ప్రారంభించారు.
నీలోఫర్ తన బాబును చూసుకునే కేర్‌టేకర్‌కు కాల్ చేసి, పిల్లల బ్యాగ్‌లు సర్దమని చెప్పారు. తనకు దగ్గర్లో ఉన్న ఉద్యోగులను ఎక్కించుకుని, ట్యాక్సీలో ఆమె ఇంటికి తీసుకొచ్చారు.
పిల్లల్ని, ఆమె తీసుకెళ్లగలిగినా సూట్‌కేసులో తల్లి ఇంటికి బయలుదేరారు. కానీ, నగరంలో అప్పటికే ఉద్రిక్తత పరిస్థితులు తీవ్రమయ్యాయి.
ఈ సమయంలో తాను చూసిన సంఘటలను జీవితాన్ని బాగా కలచివేశాయని అన్నారు నీలోఫర్.
సైకిల్‌పై పోలీసు యూనిఫామ్‌లో ఉన్న ఒక వ్యక్తి రావడం చూశాను. ఆయన మరో వ్యక్తితో, ‘‘నా గన్‌ను తీసుకో, సైకిల్‌ను తీసుకోండి, మామూలు దుస్తులు ఇవ్వరా’’ అని బతిమిలాడుతున్నారు.
అమెరికా ప్రభుత్వం కోసం పనిచేసిన వేలాది మందిని తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత, క్రూరంగా శిక్షించారు. కొందరికి మరణ శిక్షలు కూడా విధించారు.
నీలోఫర్ మాత్రం తన తల్లి ఇంటికి చేరుకోలేకపోయారు. సమీపంలో ఒక ప్రాంతంలో పిల్లల్ని నీలోఫర్ దాచిపెట్టారు. నీలోఫర్ ముందు నుంచి తిరుగుబాటు లక్షణాలు ఉండటం, పలు అంశాలపై పోరాటంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న జర్నలిస్ట్‌లు అఫ్గానిస్తాన్‌లో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఆమెకు ఫోన్ చేశారు.
‘‘పోలాండ్ నుంచి ఒక జర్నలిస్ట్ కాల్ చేసి, తరలింపు జాబితాలో మీరు పేరు కూడా ఉందా? అని అడిగారు. నో అని నేను చెప్పాను. కొంత సమయం ఇవ్వండి, మళ్లీ ఫోన్ చేస్తాను అని చెప్పారు. ఆ తర్వాత మళ్లీ కాల్ చేసి, పోలాండ్‌కు చెందిన ఒక విమానం అక్కడుంది, మిమ్మల్ని దేశం నుంచి బయటికి తీసుకొస్తుందని చెప్పారు’’ అని నీలోఫర్ తెలిపారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
పోలాండ్‌లో కొత్త జీవితం
ఆ తర్వాత పోలాండ్ జర్నలిస్ట్ నీలోఫర్ పేరును ఒక వాట్సాప్ గ్రూప్‌లో చేర్చారు. కాల్ వచ్చిన తర్వాత రెండు సూట్‌కేసులతో 24 గంటలలో విమానశ్రయానికి వెళ్లాలని చెప్పారు.
‘‘ఇంట్లో అమ్మ పవిత్ర గ్రంథాన్ని పట్టుకుని ఉన్నారు. అమ్మను చూశాను, మళ్లీ ఆమెను చూడనని నాకు తెలుసు. మా ఇంటిని, తల్లిని చూడటం అదే చివరిసారి. మూడు రోజుల క్లిష్టమైన ప్రయాణం తర్వాత, కొత్త జీవితం ప్రారంభించేందుకు పోలాండ్ వచ్చాను.
ఎలాంటి కుటుంబం లేకుండా ఇక్కడ జీవించడం చాలా కష్టం. ముఖ్యంగా నా కొడుకుకి. వాడికి కాబూల్ చాలా గుర్తొచ్చేది. అమ్మమ్మ ఎలా ఉంది, ఆమెను ఎందుకు మనతో తీసుకురాలేదని పదేపదే అడిగేవాడు’’ అని నీలోఫర్ తెలిపారు.
కొడుకుకు ఏమైందో సరిగ్గా చెప్పలేకపోయిన నీలోఫర్, అప్పటి నుంచి అఫ్గానిస్తాన్‌లో తాను వదిలివచ్చిన తల్లి, ఆమె ఉద్యోగులు, అక్కాచెల్లెళ్ల కోసం పనిచేయడం ప్రారంభించారు.

ఫొటో సోర్స్, NILOFAR AYOUBI
తన దేశంలో మహిళల హక్కుల కోసం మానవ హక్కుల కాన్ఫరెన్స్‌లో మాట్లాడేందుకు ఆమె బ్రస్సెల్స్, జర్మనీ, అమెరికాల్లో పర్యటించారు.
మహిళలకు సాయం చేసే సంస్థలకు ఆమె మద్దతు ఇస్తున్నారు.
అఫ్గానిస్తాన్‌లో అబ్బాయిగా, అమ్మాయిగా జీవించగలిగిన నీలోఫర్, తాను పొందిన ప్రతీది వరమని, శాపమని ఆమె అన్నారు.
‘‘నేను 100 శాతం అమ్మాయిని, 100 శాతం అబ్బాయిని కాను. కానీ, రెండు జీవితాలను అనుభవించడం నేను పొందిన వరం. ఇవాళ నేను ఇంత స్ట్రాంగ్ మహిళగా నిలబడగలిగానంటే అది దీని వల్లే సాధ్యమైంది. పుట్టి, కొన్నేళ్ల పాటు జీవించి సమాజానికి నా వంతు సహకారం అందించకుండా చనిపోవాలనుకోవడం లేదు’’ అని నీలోఫర్ చెప్పారు.
తండ్రి మార్గదర్శకంలో స్ఫూర్తి పొందిన నీలోఫర్, తన గుండెల్లో ఎప్పటికీ చెరగని ప్రత్యేక స్థానం తండ్రికి ఉంటుందన్నారు. ‘‘ఆయన ముఖాన్ని నేనిప్పటికీ చూడగలను. రాజకీయాలకు దూరంగా ఉండాలని నేనెప్పుడూ అనుకుంటాను. సమాజానికి మంచిని తీసుకురావాలని ఆశిస్తూ అన్ని ప్రాంతాలకు వెళ్లాలి’’ అని నీలోఫర్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: హోం మంత్రి తానేటి వనిత ఫ్లెక్సీ చిరగడమే ఎస్సీ యువకుడి ఆత్మహత్యకు కారణమా... అసలేం జరిగింది?
- రోహిత్ శర్మ ‘టాస్’ కావాలనే దూరంగా వేస్తున్నాడా? పాక్ మాజీ క్రికెటర్ వ్యాఖ్యలపై వివాదమేంటి?
- పట్టిసీమ: కృష్ణా డెల్టా రైతులకు ఇదే పెద్దదిక్కు అయ్యిందా? మరి పోలవరం పూర్తయ్యేది ఎప్పుడు?
- సువర్ణదుర్గ్: అరేబియా సముద్రంలోని ఈ శివాజీ కోటపై బ్రిటిషర్లు ఎందుకు కన్నేశారు?
- హమాస్‌కు డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది? 50 వేల మందికి జీతాలు ఎలా ఇస్తోంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














