‘రాళ్లతో కొట్టడం, కాళ్లు చేతులు నరకడం’.. ఇస్లామిక్ షరియా చట్టాల ప్రకారం కఠినంగా శిక్షలు అమలు చేస్తామని ప్రకటించిన తాలిబాన్ టాప్ లీడర్

ఫొటో సోర్స్, Getty Images
అఫ్గానిస్తాన్‌లో ఇస్లామిక్ షరియా చట్టాలను కఠినంగా అమలు చేయాలంటూ అక్కడి న్యాయమూర్తులను తాలిబాన్ టాప్ లీడర్ ఆదేశించారు.
కొన్ని రకాల నేరాలకు బహిరంగంగా అవయవాలను ఖండించడం, రాళ్లతో కొట్టడం వంటివి కూడా ఉండొచ్చని భావిస్తున్నారు.
దొంగతనం, కిడ్నాప్, రాజ్యద్రోహం వంటి వాటికి తప్పకుండా శిక్షలను ఇస్లామిక్ షరియా చట్టం ప్రకారం విధిస్తారని తాలిబాన్ టాప్ లీడర్ హైబతుల్లా అఖుండ్జాదా ప్రతినిధి తెలిపారు.

ఫొటో సోర్స్, Afghan Islamic Press
1990లలో అఫ్గానిస్తాన్‌ను పాలించినప్పుడు బహిరంగంగా మరణ శిక్షలు వంటివి విధించి తీవ్ర విమర్శల పాలయ్యారు తాలిబాన్లు.
అయితే గత ఏడాది అధికారాన్ని చేజిక్కుంచుకున్నప్పుడు తాము ఈసారి అంత కఠినంగా ఉండమని చెప్పారు. కానీ అధికారం వచ్చిన నాటి నుంచి కూడా వారు కఠిన ఆంక్షలు విధిస్తూ వచ్చారు. స్వేచ్ఛను హరిస్తూ వస్తున్నారు.
ముఖ్యంగా మహిళల హక్కుల విషయంలో తీవ్రమైన ఆంక్షలు విధించారు.
షరియా చట్టాలను ఉల్లంఘించే నేరాలకు ఆ చట్టాల ప్రకారమే శిక్షలు విధించాలని తాలిబాన్ సుప్రీం లీడర్ న్యాయమూర్తులను ఆదేశించారు.
‘కొందరి న్యాయమూర్తులతో ముల్లా అఖుండ్జాదా సమావేశమయ్యారు. ఆ తరువాత ఈ ఆదేశం వచ్చింది’ అని తాలిబాన్ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ ఆదివారం ట్వీట్ చేశారు.
‘దొంగలు, కిడ్నాపర్లు, రాజ్యద్రోహులకు సంబంధించిన ఫైళ్లను నిశితంగా పరిశీలిస్తున్నారు’ అని ముజాహిద్ తెలిపారు.
అయితే నేరాలను, వాటికి విధించే శిక్షలను స్పష్టంగా తాలిబాన్లు చెప్పలేదు. షరియా చట్టాల ప్రకారం అవయవాలను తొలగించడంతోపాటు బహిరంగంగా కొరడా దెబ్బలు కొట్టడం, రాళ్లతో కొట్టడం చేస్తారని ఒక మతబోధకుడు బీబీసీతో చెప్పారు.
మానవ హక్కులను కఠినంగా అణచివేస్తున్నారనేందుకు తాజా ఆదేశాలు నిదర్శనంగా కనిపిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Reuters
కాబుల్‌లోని మహిళలను పార్కులకు వెళ్లడాన్ని నిషేధిస్తూ పోయిన వారం తాలిబాన్ పాలకులు ఆదేశాలు జారీ చేశారు. ఆ తరువాత వ్యాయామశాలలు, పబ్లిక్ బాత్‌లకు కూడా మహిళలు వెళ్లకూడదని ఆదేశించారు.
ఇప్పటికే తాలిబాన్లు ఆడ, మగలకు విడివిడిగా పార్కులు, వ్యాయామశాలలు ఉండాలని నిర్ణయించారు. కానీ ఆ ప్రదేశాల్లో ఇస్లామిక్ చట్టాలను అనుసరించడం లేదని తాలిబాన్లు చెబుతున్నారు.
గత ఏడాది అమెరికా బలగాలు అఫ్గానిస్తాన్ నుంచి వెనక్కి వెళ్లిపోయాక ఆ దేశం తాలిబాన్ల చేతికి వచ్చింది. నాటి నుంచి మహిళలు, ప్రత్యర్థులు, పాత్రికేయులను అణచివేస్తూ తాలిబాన్లు మానవ హక్కులను ఉల్లంఘిస్తూ వస్తున్నారనే ఆరోపణలున్నాయి.
గతంలో మాదిరిగా ఈసారి మహిళల మీద కఠినమైన ఆంక్షలు, శిక్షలు ఉండవని తాలిబాన్లు చెబుతున్నా ఇప్పటికే సగానికి పైగా జనాభా తీవ్రమైన ఆంక్షలు ఎదుర్కొంటోంది.
ఇంట్లోని పురుషుల తోడు లేకుండా ఆడవారు దూర ప్రయాణలు చేయడానికి వీలు లేదని తాలిబాన్లు ఆదేశించారు. ఇప్పటికీ దేశవ్యాప్తంగా చాలా వరకు టీనేజీ అమ్మాయిలకు బడికి వెళ్లే అవకాశం లేదు.
చాలా మంది మహిళలను ఉద్యోగాలు చేయకూడదని తాలిబాన్లు ఆదేశించారు. కొందరు మాత్రమే విద్య, ఆరోగ్య రంగంలో పని చేస్తున్నారు. అఫ్గానిస్తాన్‌ను తాలిబాన్లు చేజిక్కించుకున్నాక ఆ దేశానికి చెందిన విదేశాల్లోని ఆస్తులను అంతర్జాతీయ సంస్థలు ఫ్రీజ్ చేశాయి.
ఇవి కూడా చదవండి:
- అక్రమంగా నిర్మించిన ఫ్లాట్లను ఎలా గుర్తించాలి, ఎల్ఆర్ఎస్తో ఉపయోగం ఉంటుందా?
- జీ20: 11 ఏళ్ల తరువాత కలుస్తున్న బైడెన్, జిన్‌పింగ్.. ఏం చర్చించనున్నారు
- ఇద్దరూ పెళ్లైనవాళ్లే.. ‘ఫేస్బుక్లో ప్రేమించుకున్నారు’.. నిజామాబాద్ నుంచి యూపీ వెళ్లిన మహిళ, హత్య చేసిన ‘లవర్’
- ఐటీ రంగం సంక్షోభంలో ఉందా, ఈ ప్రభావం ఎలా ఉండొచ్చు
- యోగి వేమన విశ్వవిద్యాలయంలో విగ్రహాల మార్పుపై వివాదం ఎందుకు, ఎవరు ఏమంటున్నారు














