హైదరాబాద్: ‘అల్లాహు అక్బర్’ అనాలంటూ తనపై దాడి చేశారని రాష్ట్రపతికి ‘లా’ కాలేజీ విద్యార్థి ఫిర్యాదు - అయిదుగురు విద్యార్థులు అరెస్ట్

ఫొటో సోర్స్, viral video
హైదరాబాద్‌లోని ఒక లా కాలేజీ హాస్టల్ ఆవరణలో ఒక విద్యార్థిని అక్రమంగా నిర్బంధించి.. ‘‘జై మాతాది, అల్లాహు అక్బర్’’ అనాలంటూ సహ విద్యార్థులు దాడి చేశారన్న ఆరోపణలపై ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సైబరాబాద్ పోలీసులు తెలిపారు.
ఈ కేసులో 10 మంది విద్యార్థులు నిందితులుగా ఉన్నారని, వారిలో అయిదుగురిని అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పారు. నిందితుల్లో హిందూ, ముస్లిం రెండు మతాలకు చెందిన వారూ ఉన్నట్లు తెలిపారు. నవంబర్ 1వ తేదీన జరిగిన ఈ ఘటనపై బాధిత విద్యార్థి దిల్లీలో రాష్ట్రపతికి ఫిర్యాదు చేయటంతో.. ఆ ఫిర్యాదును తెలంగాణ పోలీసులకు బదిలీ చేయగా శంషాబాద్ పోలీసులకు ఈ విషయం తెలిసింది. ‘‘నిందితులుగా ఉన్న 10 మంది విద్యార్థుల్లో అయిదుగురిని అరెస్ట్ చేశాం. మిగతా నిందితులను కూడా త్వరలో అరెస్ట్ చేస్తాం. నిందితుల్లో అయిదుగురు హిందువులు, మిగతావాళ్లు ముస్లింలు’’ అని శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి బీబీసీకి వివరించారు.
‘‘తనను ‘అల్లాహు అక్బర్’ అనాలంటూ దాడిచేశారని బాధితుడు చెప్తున్నారు. కానీ ఆ సంఘటన గురించి అతడి మాటలతో వెంటనే అర్థమయ్యే దానికన్నా చాలా భిన్నమైన ఘటన ఇది’’ అని ఆయన చెప్పారు.
ఈ ఘటనపై కాలేజీ యాజమాన్యం కూడా స్పందించింది.
‘‘ విషయం తెలిసిన వెంటనే వేగంగా స్పందించాం. ఈ వ్యవహారానికి బాధ్యులైన 12 మంది విద్యార్ధులను వెంటనే సస్పెండ్ చేశాం. ఇలాంటి సంఘటనలను కాలేజీ యాజమాన్యం ఎట్టి పరిస్థితుల్లో సహించబోదు’’ అని ఐఎఫ్‌హెచ్ఈ యూనివర్సిటీ
రిజిస్ట్రార్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
బాధితుడు హిమాంక్ బన్సల్ ఫిర్యాదు ప్రకారం....నవంబర్ 1వ తేదీ మధ్యాహ్నం హాస్టల్ గదిలో ఉన్న అతడి మీద 10 మంది విద్యార్థుల బృందం దాడిచేసింది. దాడి చేసిన వారిలో ఒకరు తన దుస్తులు చించటానికి ప్రయత్నించాడు. అసభ్యంగా ప్రవర్తించాడు.
దాడిచేసిన వారిలో ఒకరు బాధితుడిని ‘చచ్చే వరకూ కొట్టాలి’ అని తన సహచరులతో చెప్పటం వినిపిస్తోంది. ఆ ఘటన అనంతరం హిమాంక్ బన్సల్ హైదరాబాద్ నుంచి తన స్వస్థలానికి వెళ్లి, అక్కడి నుంచి రాష్ట్రపతికి, ఇతర ప్రభుత్వ నేతలకు ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు చెప్తున్నారు. పోలీసుల ప్రాధమిక దర్యాప్తులో.. హిమాంక్ తన సహ విద్యార్థినితో సోషల్ మీడియాలో ఫ్రెండ్ అయ్యాడని తెలిసింది.
‘‘ఆ యువతి తాను అప్పటికే ఒక రిలేషన్‌షిప్‌లో ఉన్నానని హిమాంక్‌కు చెప్పగా.. తాను దిల్లీలో ఒక తొమ్మిదో తరగతి విద్యార్థినితో స్నేహంగా ఉన్నట్లు హిమాంక్ చెప్పాడు. దీనిపై వారిద్దరి మధ్యా వాగ్వాదం జరిగింది’’ అని డీసీపీ వివరించారు.

ఫొటో సోర్స్, Twitter
హాస్టల్‌లో తన గదిలోకి చొరబడి తనపై దాడిచేస్తున్న వారిని, ఏం తప్పు చేశానని కొడుతున్నారని తాను ప్రశ్నించానని హిమాంక్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను మొహమ్మద్ ప్రవక్త మీద అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశానని వాళ్లు ఆరోపించినట్లు బన్సల్ వెల్లడించారు. ‘‘ఆ బాలిక డిప్రెషన్‌కు లోనైనట్లు, కాలేజీలో ఆమె స్నేహితుల్లో ఒకరు ఆమెకు, హిమాంక్‌కు మధ్య జరిగిన ఆ చాట్‌ను చూసి ఆమె స్నేహితులకు చెప్పారనీ చెప్తున్నారు’’ అని డీసీపీ వివరించారు.
హిమాంక్ మీద దాడికి సంబంధించిన వీడియో కూడా విద్యార్థుల మధ్య వైరల్‌గా మారింది. పోలీసులు భారత శిక్షాస్మృతిలోని హత్యాయత్నం, అక్రమ చొరబాటు, నేరపూరిత బెదిరింపు, ప్రమాదకరమైన ఆయుధాలతో ఉద్దేశపూర్వకంగా గాయపరచటం, అక్రమ నిర్బంధం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
నిందితులైన విద్యార్థులతో పాటు, ప్రైవేటు లా కాలేజీ యాజమాన్యం మీద కూడా తెలంగాణ ర్యాగింగ్ నిషేధ చట్టం కింద కూడా కేసులు నమోదు చేశారు.
ఇవి కూడా చదవండి:
- దివ్య అయ్యర్: ఈ కేరళ కలెక్టర్ తన కొడుకును ఎత్తుకుని ప్రసంగించడంపై ఎందుకీ చర్చ?
- 650 రూపాయల ట్విటర్ బ్లూ టిక్.. ఒక కంపెనీకి ఒక్క రోజులో రూ.1.22 లక్షల కోట్లు నష్టం తెచ్చింది.. ఎలాగంటే..
- ‘‘చాలాకాలంగా ఇలాగే చేస్తున్నాం కానీ ఎప్పుడూ గర్భం రాలేదు’’
- వంటగది అపరిశుభ్రత వల్లే అనేక జబ్బులు... సాధారణంగా చేసే 9 తప్పులు, సరిదిద్దుకునే మార్గాలు
- వ్యాయామం: మానవులు ఎక్సర్సైజ్ చేయటం అసహజమా? చాలా మందికి వ్యాయామం ఎందుకు ఇష్టం ఉండదు? – మానవపరిణామ శాస్త్రవేత్త చెప్తున్న 4 విషయాలు














