గుజరాత్: 'నా భార్య, బావమరిది బలవంతంగా నాతో బీఫ్ తినిపించారు... అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా'

Rohit

ఫొటో సోర్స్, ROHITS FAMILY

ఫొటో క్యాప్షన్, రోహిత్
    • రచయిత, లక్ష్మీపటేల్
    • హోదా, బీబీసీ గుజరాతీ కోసం
લાઇન

* గుజరాత్‌లోని సూరత్‌లో రెండు నెలల కిందట ఆత్మహత్య చేసుకున్న ఓ యువకుడి మరణంపై తాజాగా పోలీస్ కేసు నమోదైంది.

* ఆత్మహత్య చేసుకున్న హిందూ యువకుడి భార్య ముస్లిం

* బీఫ్ తినాలంటూ భార్య తనను ఒత్తిడి చేసినట్లు ఆత్మహత్యకు ముందు ఆరోపించిన యువకుడు

* ఆత్మహత్యకు ముందు ఫేస్‌బుక్ పోస్ట్

* కొడుకు చనిపోయినట్లు రెండు నెలల తరువాత తెలియడంతో ఇప్పుడు కేసు నమోదు చేసిన మృతుడి తల్లి

લાઇન

''ఈ లోకాన్ని వీడి వెళ్తున్నాను. నా భార్య సోనమ్, ఆమె సోదరుడే నా చావుకు కారణం. నాకు న్యాయం చేయాలని నా స్నేహితులందరినీ కోరుతున్నాను. బీఫ్ తినాలని ఒత్తిడి చేయడమే కాకుండా తినకపోతే చంపేస్తామని బెదిరించారు. ఈ లోకంలో బతికే అర్హత కోల్పోయాను. అందుకే ప్రాణాలు తీసుకుంటున్నాను'

రోహిత్ సింగ్ అనే 27 ఏళ్ల యువకుడు తన ఆత్మహత్యకు ముందు ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్ట్ ఇది.

పోలీసులకు అందిన ఫిర్యాదులో ఉన్న వివరాల ప్రకారం.. రోహిత్ సింగ్ సూరత్ నగరంలోని ఉధానా ప్రాంతంలో ఉన్న బీఆర్‌సీ టెక్స్‌టైల్ మిల్‌లో సూపర్‌వైజర్‌గా పనిచేస్తుండేవారు.

ఫేస్‌బుక్‌లో సూసైడ్ నోట్ పోస్ట్ చేసి ఆ తరువాత ఆయన ఉరివేసుకుని చనిపోయారు.

తన భార్య సోనమ్ జకీర్ అలీ, బావమరిది ముక్తార్ అలీలు తనను గోమాంసం తినమని ఒత్తిడి చేశారని, చంపేస్తామని బెదిరించారని రోహిత్ ఆ సూసైడ్ నోట్‌లో ఆరోపించారు.

రోహిత్ కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు సోనమ్ జకీర్ అలీ, ముక్తార్ అలీలపై సెక్షన్ 306, 506(2), 114ల ప్రకారం కేసు నమోదుచేశారు.

రోహిత్ సూసైడ్ నోట్
ఫొటో క్యాప్షన్, రోహిత్ సూసైడ్ నోట్

కొడుకు సూసైడ్ చేసుకున్నట్లు రెండు నెలల తరువాత తెలిసింది..

రోహిత్ సింగ్ చనిపోయిన రెండు నెలల తరువాత ఇటీవల బంధువు ఒకరి ద్వారా కుటుంబసభ్యులకు ఆయన చనిపోయినట్లు తెలిసింది.

దాంతో రోహిత్ తల్లి వీణాదేవి ఉధానా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు సోనమ్, ముక్తార్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు.

సోనమ్ జకీర్ అలీ నిజానికి ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన అమ్మాయి. ప్రస్తుతం ఆమె సూరత్‌లోని ఉధానా ప్రాంతం పటేల్‌నగర్‌లో ఉంటున్నారు.

''రోహిత్ చనిపోయినట్లు నాకు ఈమధ్యే తెలిసింది. మా బంధువు ఒకరు ఈ విషయం చెప్పారు. రెండు నెలల కిందట రోహిత్ చనిపోయాడని.. చనిపోవడానికి ముందు ఫేస్ బుక్ పోస్ట్ పెట్టాడని తెలిసింది' అని వీణాదేవి 'బీబీసీ గుజరాతీ'తో చెప్పారు.

రోహిత్ చనిపోవడానికి ముందు ఆదివారం చివరిసారిగా తాను ఆయనతో మాట్లాడానంటూ గుర్తుచేసుకుని ఆమె కన్నీళ్లుపెట్టుకున్నారు.

వీడియో క్యాప్షన్, ప్రభుత్వంపై తమకు భరోసా లేదంటున్న స్థానిక ముస్లింలు

''నన్ను చూడాలని ఉన్నప్పటికీ రాలేకపోయానని చెప్పాడు రోహిత్. ఆదివారం నాడు ఆయనతో మాట్లాడిన తరువాత మరుసటి రోజు సోమవారం ఫోన్ చేశాను. కానీ, తీయలేదు. పనిలో ఉన్నాడేమో అనుకున్నాను'' అన్నారు వీణాదేవి.

15 రోజులకో, నెలకో ఒకసారి వచ్చి చూసి వెళ్లేవాడని.. చివరిసారిగా తాను ఆయనతో మాట్లాడిన ఆదివారం రోజు ఆయన ఉత్తర్ ప్రదేశ్‌లోని తమ సొంతూరు వెళ్లారని ఆమె చెప్పారు.

రోహిత్ 15 రోజులు ఊళ్లో ఉన్నారని.. అన్ని రోజులు సెలవుపై రావడం వల్ల తరువాత బిజీగా మారుంటారని భావించానే కానీ చనిపోయారని అనుకోలేదని వీణాదేవి చెప్పుకొచ్చారు.

''రోహిత్ కాకుండా మరో కుమారుడు ఊళ్లో ఉండి మా పొలాలు చూసుకుంటారు. 2021 మే నెలలో నేను, నా ఇద్దరు కుమార్తెలు, కొడుకు రోహిత్ కలిసి గుజరాత్ పనికోసం వచ్చాం. రోహిత్‌కు ఫ్యాక్టరీలో పని దొరికింది. ఒక రోజు సోనమ్ అలీని తీసుకొచ్చి ఆ అమ్మాయంటే తనకు ఇష్టమని.. పెళ్లి చేసుకుంటానని చెప్పాడు'' అన్నారు వీణాదేవి.

వీడియో క్యాప్షన్, క్షమాబిందు: తనను తాను పెళ్లి చేసుకున్న ఈ అమ్మాయి సెక్స్ గురించి ఏమన్నారంటే...

ఇద్దరి మతాలు వేరని.. ఇబ్బందులు వస్తాయని చెప్పినా ఆమెనే పెళ్లి చేసుకున్నాడని వీణాదేవి చెప్పారు.

తరువాత సోనమ్‌ను పెళ్లి చేసుకున్న రోహిత్ తమతో కాకుండా వేరే చోట ఉండేవాడని.. క్రమంగా చుట్టాలుబంధువులతో సంబంధాలు తెగ్గొట్టుకున్నారని చెప్పిన వీణాదేవి.. తమను చూసేందుకు కూడా నెలకో, 15 రోజులకో వచ్చేవారని.. ఎక్కడుండేవారో తమకు తెలియదని చెప్పారు.

'కొడుకుపైనే ఆధారపడి బతికేవాళ్లం మేమంతాం. సూరత్ వచ్చి ఇలా కొడుకును పోగొట్టుకుంటానని అనుకోలేదు. మాకు న్యాయం జరగాలి' అన్నారు వీణాదేవి.

ఆరోపణలు ఎదుర్కొంటున్న సోనమ్, ఆమె కుటుంబసభ్యులను సంప్రదించేందుకు బీబీసీ గుజరాతీ ప్రయత్నించింది కానీ వారి నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.

రోహిత్

ఫొటో సోర్స్, Rohits family

రోహిత్‌కు మామ.. వీణాదేవికి సోదరుడు అయిన రాజేశ్ సింగ్ రాజ్‌పుత్ బీబీసీతో మాట్లాడారు. రోహిత్ చనిపోయినట్లు వారం కిందట తెలిసిందని చెప్పారాయన.

'మా బంధువు ఫేస్‌బుక్‌లో ఈ పోస్ట్ చూసి ఊళ్లో ఉన్న రోహిత్ సోదరుడికి చెప్పారు. ఆయన మాకు ఫోన్ చేసి చెప్పారు. ఆ తరువాత మేం ఆరా తీస్తే రోహిత్ పటేల్ నగర్‌లో ఉండేవారని తెలిసింది. పటేల్ నగర్ వెళ్లాం కానీ మాకు ఆయన ఉండే ఇంటి అడ్రస్ దొరకలేదు. అప్పుడు బంధువు ఒకరు రోహిత్ పనిచేసే ఫ్యాక్టరీకి వెళ్లారు. అక్కడ ఓ వ్యక్తి మాకు రోహిత్ ఇల్లు చూపించారు. అక్కడికి వెళ్లిన తరువాత రోహిత్ రెండు నెలల కిందట చనిపోయినట్లు తెలిసింది' అన్నారు రాజేశ్ సింగ్.

'రోహిత్ 2022 జూన్ 27న మధ్యాహ్నం 2.30కి ఆత్మహత్య చేసుకున్నారు. రోహిత్ గర్ల్‌ఫ్రెండ్ సోనమ్, ఆమె సోదరుడు ముక్తార్‌లు గోమాంసం తినమని బలవంతం చేయడంతో పాటు చంపేస్తామని బెదిరించడంతో ఆత్మహత్య చేసుకున్నారు' అని రోహిత్ తల్లి వీణాదేవి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. రోహిత్‌ను శారీరకంగా, మానసికంగా వేధించారని ఆమె ఆరోపించారు.

పోలీసులకు ఫిర్యాదు

ఫొటో సోర్స్, Rohits family

ఫొటో క్యాప్షన్, ఫిర్యాదు కాపీ

రోహిత్ కుటుంబం సొంతూరు ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లా గంగేహతి. రోహిత్ తల్లి వీణాదేవి ప్రస్తుతం సూరత్‌లోని జేబీ నగర్‌లో ఉంటున్నారు. 2018లో ఆమె భర్త చనిపోయారు.

ఆమె ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. పెద్ద కొడుకు రోహిత్ కాగా చిన్న కొడుకు సొంతూరు గంగేహతిలో ఉంటూ వ్యవసాయం చేస్తున్నారు.

వీణాదేవి తన పెద్ద కొడుకు రోహిత్, ఇద్దరు కుమార్తెలను తీసుకుని పని కోసం ఏడాదిన్నర కిందట సూరత్ వచ్చారు. అక్కడికి వచ్చిన తరువాత రోహిత్‌కు సోనమ్‌తో పరిచయమై ఇద్దరూ కలిసి ఉండేవారు.

సోనమ్‌కు రోహిత్‌తో పరిచయానికి ముందు వేరే వివాహమైందని వీణాదేవి చెబుతున్నారు.

వీణాదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నామని సూరత్ ఏసీపీ జేటీ సోనారా చెప్పారు.

వీడియో క్యాప్షన్, భార్య కోరినట్లు ఘనంగా అంత్యక్రియలు నిర్వహించిన భర్త

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)