మధ్యప్రదేశ్: శివరాజ్ సింగ్ సర్కారులో శాకాహారం - మాంసాహారం మధ్యలో చిక్కుకున్న 'గుడ్డు'

గుడ్డు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సరోజ్ సింగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మీరు ఈ శీర్షిక చూసే ఈ స్టోరీని చదవాలని అనుకున్నారా..

అవును అయితే, మీకు సమాధానం ఈ కథనంలో కచ్చితంగా దొరుకుతుంది. కానీ, దానికి ముందు మనం కాస్త గుడ్డు గురించి కూడా తెలుసుకోవాలి.

గుడ్డును ‘సంపూర్ణ ఆహారం’ అంటారు. అంటే మన శరీరానికి అవసరమైన అన్ని పోషకాలూ ఇందులో ఉన్నాయి.

గుడ్డులో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. దేశవిదేశాల్లో ఎక్కడైనా గుడ్డు సులభంగా దొరుకుతుంది.

గుడ్డుతో ఏదైనా చేయడం చాలా సులభం. గుడ్డుతో ఎన్నో వెరైటీ వంటకాలు, అది కూడా నిమిషాల్లో చేసుకోవచ్చు. ఇన్ని ప్రత్యేకతలు చాలా తక్కువ ఆహార పదార్థాలకు ఉంటాయి.

ఉడకబెట్టి తినచ్చు లేదా ఆమ్లెట్ వేసుకోవచ్చు. ఎగ్ కర్రీని భారత్‌లో వివిధ రాష్ట్రాల్లో చాలా రకాలుగా చేస్తుంటారు. హాఫ్ బాయిల్ కూడా చాలామందికి ఇష్టం. పల్లెలయినా, నగరాలు అయినా, రోడ్డు పక్కన ఆకలి తీర్చుకోడానికి దీన్ని మించిన పోషకాహారం బహుశా వేరే ఏదీ ఉండదు.

గుడ్డు

ఫొటో సోర్స్, Getty Images

ఒక ఉడికించిన గుడ్డులో 211 కిలో క్యాలరీలు ఉంటాయి

  • ప్రొటీన్- 7 గ్రాములు
  • ఫ్యాట్- 22%
  • విటమిన్ A -16%
  • విటమిన్ C-0
  • ఐరన్-9%
  • కాల్షియం-7%

మిగతా ఆహార పదార్థాలతో కలిపి గుడ్డును తినడం వల్ల మన శరీరానికి ఎక్కువ విటమిన్లు లభిస్తాయని కొన్ని పరిశోధనల్లో తేలింది. ఉదాహరణకు సలాడ్‌లో గుడ్డు కలపడం వల్ల విటమిన్ E అధికంగా లభిస్తుంది.

అందుకే, ఆహార పదార్థాల్లో ‘బెస్ట్ ఫుడ్’ కేటగిరీ కోసం ఏదైనా పోటీపెడితే గుడ్డు అన్నిటికంటే మొదట వస్తుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నా గుడ్డులో కొలెస్ట్రాల్ స్థాయి ఎక్కువగా ఉంటుందని, అది శరీరంపై దుష్ప్రభావాన్ని చూపిస్తుందని కొంతమంది నిపుణులు చెబుతున్నారు.

గుడ్డు

ఫొటో సోర్స్, Getty Images

శాకాహారం, మాంసాహారం మధ్యలో గుడ్డు

ఇది తెలియాలంటే, దీని నేపథ్యం కూడా కాస్త తెలుసుకోవాలి

భారత్‌లో పోషకాహార లోపం సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం స్కూళ్లలో ఒక పూట భోజనం, అంగన్‌వాడీల్లో పిల్లలకు పోషకాహారం అందిస్తోంది.

ఐఐఎం అహ్మదాబాద్‌లో అసోసియేట్ ప్రొఫెసర్ రితికా ఖేడా దీనిపై చాలా పరిశోధనలు చేశారు.

కేంద్ర ప్రభుత్వం 1995 నుంచి ‘మిడ్ డే మీల్’(మధ్యాహ్న భోజన పథకం) పేరుతో ప్రారంభించిందని రితిక చెప్పారు.

అంతకు ముందే ఎంజీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పిల్లలకు వండిన ఆహారం పెట్టేవారు. కానీ విపక్షాలు, మీడియా నుంచి దానిపై చాలా విమర్శలు వచ్చాయి. కానీ, ఎంజీఆర్ తన నిర్ణయం నుంచి వెనక్కు తగ్గకుండా దానిని అమలు చేశారు.

ఆ తర్వాత గుజరాత్‌తోపాటూ, మరికొన్ని రాష్ట్రాలు(మధ్యప్రదేశ్, ఒడిషా కూడా) కూడా వండిన భోజనం అందించాయి.

కేంద్రం ప్రభుత్వ పథకం ప్రకారం వండిన ఆహారం పెట్టడానికి బదులు చాలా రాష్ట్రాలు పిల్లలకు ధాన్యం, సరుకులు అందించేవి. కానీ 2001లో సుప్రీంకోర్టు జోక్యంతో వండిన భోజనం పెట్టాలని నిర్ణయించిన అన్ని రాష్ట్రాలూ దానిని హడావుడిగా ప్రారంభించాయి. ఆ తర్వాత 2010 నాటికి ఆ పథకానికి చాలా మెరుగులు దిద్దారు,

తర్వాత ఆహారం నాణ్యత గురించి చర్చ జరిగింది. ఆహారంలో పిల్లలకు ఎన్ని క్యాలరీలు ఇవ్వాలి అనేదానిపై ప్రభుత్వాలు ఒక నిర్ణయం తీసుకున్నాయి. స్కూళ్లలో 14 ఏళ్ల పిల్లల వరకూ మధ్యాహ్న భోజనం అందించే ఏర్పాట్లు చేశారు.

ఇలాగే అన్ని రాష్ట్రాలు అంగన్‌వాడీల్లో తల్లులు, ఐదేళ్ల లోపు పిల్లలకు పోషకాహారం అందించే ఏర్పాట్లు చేశారు. స్కూళ్లలో మధ్యాహ్న భోజనం, అంగన్‌వాడీల్లో పోషకాహారం ఎప్పుడు, ఎలా అందించాలి అనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర మార్గదర్శకాలు అనుసరిస్తున్నాయి.

దీనికోసం చాలా రాష్ట్రాలు ఆరోగ్య మంత్రిత్వ శాఖ కింద పనిచేసే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సాయం తీసుకుంటాయి. రాష్ట్రాల కోరికపై ఈ సంస్థ వాటి కోసం ఒక శాంపిల్ మెనూ తయారుచేసి ఇస్తుంది.

ఆ మెనూను నిర్ణయించే హక్కు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. కానీ అంగన్‌వాడీ, స్కూళ్ల మెనూలో పిల్లలకు గుడ్డు ఇవ్వాలా, వద్దా అనేదానిపై ఇప్పుడు చర్చ మొదలైంది. కొంతవరకూ రాజకీయాలు కూడా జరుగుతున్నాయి. కానీ, గుడ్డు పిల్లలకు మేలు చేస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

గుడ్డు

ఫొటో సోర్స్, Getty Images

మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు

మధ్యప్రదేశ్‌లోని అంగన్‌వాడీల్లో పిల్లలకు గుడ్డు ఇవ్వకూడదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మంగళవారం నిర్ణయం తీసుకున్నారు.

దీనిపై మీడియాకు సమాచారం ఇచ్చిన శివరాజ్ సింగ్..”అంగన్‌వాడీల్లో ఉన్న పిల్లలకు మేం గుడ్డుకు బదులు పాలు ఇస్తాం, పిల్లల్లో పోషకాహార లోపంపై రాష్ట్రంలో ప్రచారం కూడా నిర్వహిస్తాం” అన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఒక ప్రదర్శన ప్రారంభించిన ముఖ్యమంత్రి ఆ కార్యక్రమం తర్వాత మీడియాతో ఈ విషయం చెప్పారు.

శివరాజ్ సింగ్ చౌహాన్ గత పదవీకాలంలో కూడా స్కూలు విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో గుడ్డు ఇచ్చేవారు కాదు.

కానీ, ఆయన మళ్లీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఇమ్రతీ దేవి అంగన్‌వాడీల్లో ఉన్న పిల్లలకు గుడ్లు ఇవ్వాలన్నారు. దానిగురించి ఆమె 2019 నవంబర్లో ఏఎన్ఐతో మాట్లాడారు.

“మేం రాష్ట్ర ముఖ్యమంత్రితో దీనిపై మాట్లాడినపుడు, ఆయన అది మంచి విషయమే అన్నారు. అంగన్‌వాడీల్లో పిల్లలకు గుడ్లు ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. మేం వైద్యుల సలహా కూడా తీసుకున్నాం. వారు కూడా పిల్లలకు గుడ్లు ఇవ్వాలన్నారు” అన్నారు.

పిల్లలకు పోషకాహారం అందించడంపై దృష్టి పెట్టిన శివరాజ్ సింగ్ ప్రభుత్వానికి, అప్పుడు అంగన్‌వాడీల్లో పిల్లలకు గుడ్లు ఇవ్వవచ్చు అనిపించింది. కానీ, ముఖ్యమంత్రి తాజా ప్రకటనతో అది దానికి మళ్లీ తెరపడింది.

అయితే శివరాజ్ సింగ్ ప్రకటనపై ఇమ్రతీ దేవి ఇంకా స్పందించలేదు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అది అంగన్‌వాడీల్లో పిల్లలకు గుడ్లు ఇవ్వడానికి అంగీకరించింది. తర్వాత సెషన్‌లో దానిని ప్రారంభిస్తామని మాట కూడా ఇచ్చింది. కానీ ఆలోపే ఆ ప్రభుత్వం పడిపోయింది.

ఇప్పుడు, శివరాజ్ సింగ్ చౌహాన్ నిర్ణయంపై కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ ట్విటర్‌లో వ్యంగ్యంగా స్పందించారు. అయితే రాజస్థాన్‌లో ఉన్నది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. కానీ, అక్కడ కూడా పిల్లలకు గుడ్డు ఇవ్వడం లేదు.

మధ్యాహ్న భోజన పథకం

ఫొటో సోర్స్, SHAWN SEBASTIAN

గుడ్డు వర్సెస్ పాలు

“మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం వెనుక ఒక వాదన వినిపిస్తోంది. తమది ‘శాకాహారి’ రాష్ట్రం అని అది చెబుతోంది” అని ‘రైట్ టు ఫుడ్’ కాంపైన్‌కు సంబంధించిన సచిన్ కుమార్ జైన్ అన్నారు.

ఏ రాష్ట్రం శాకాహారి, ఏ రాష్ట్రం మాంసాహారి అనేది కేంద్రం 2014 బేస్‌లైన్ సర్వే ద్వారా మనం తెలుసుకోవచ్చు.

ఈ సర్వే ప్రకారం మధ్యప్రదేశ్‌లో 48.9 మంది పురుషులు, 52.3 శాతం మహిళలు శాకాహారులు. ఇక మాంసాహారుల్లో పురుషులు 51.1 శాతం, మహిళలు 47.7 శాతం ఉన్నారు.

సచిన్ కుమార్ చెప్పిన ప్రభుత్వ వాదనకు, ఈ లెక్కలకు ఎలాంటి పొంతన లేదు. ప్రభుత్వం 50 శాతం ప్రజల మాట ప్రకారం వెళ్తుంటే, మిగతా 50 శాతం మందిని ఎందుకు పట్టించుకోవడం లేదు.

మరో విషయానికి వస్తే, మధ్యప్రదేశ్‌లో ఆదివాసీల జనాభా ఎక్కువ. వారికి మాంసాహారం, శాకాహారం అనే ప్రత్యామ్నాయం ఉండదు.

“గుడ్డు విషయంలో కల్తీ సమస్య ఉండదు. అందుకే, పాల కంటే అది మెరుగైన ప్రత్యామ్నాయం. పాలతో పోలిస్తే గుడ్లను ఎక్కువ రోజులు నిల్వ చేయవచ్చు. ఇది సులభంగా కూడా దొరుకుతుంది” అంటారు సచిన్ కుమార్.

మధ్యాహ్న భోజన పథకం

ఫొటో సోర్స్, Getty Images

200 గ్రాముల పాలలో 120 కిలో క్యాలరీలు

  • ప్రొటీన్- 6 గ్రాములు
  • ఫ్యాట్-10 %
  • విటమిన్ A- 4%
  • విటమిన్ C- 0
  • ఐరన్ - 0%
  • కాల్షియం- 22%

“పాల ఉత్పత్తుల కోసం ఇప్పుడు పాల వినియోగం పెరిగింది. అందుకే ఇంతకు ముందులా ఇప్పుడు పాలు ఎక్కువగా లభించడం లేదు. ఇక్కడ, మరో సమస్య కూడా ఉంది. స్వచ్ఛమైన పాలు దొరకడం లేదు. వాటిలో ఎక్కువ నీళ్లు కలిపినవే ఉంటున్నాయ”ని సచిన్ కుమార్ జైన్ చెబుతున్నారు.

మధ్యప్రదేశ్‌లో 2015లో కూడా 10 గ్రాముల పాల పౌడర్‌లో 90 గ్రాముల నీళ్లు కలిపి ఇచ్చే నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. కానీ అది సఫలం కాలేదు. ఎందుకంటే పిల్లలకు దాని రుచి నచ్చలేదు. ఇక ఇప్పుడు స్థానికంగా స్వచ్ఛమైన పాలు ఎలా లభిస్తాయో చూడాలి.

ఈ నిర్ణయానికి ‘శాకాహారి’ రాష్ట్రం అనే ట్యాగ్ ఉండడమే పెద్ద కారణం అని రితికా ఖేడా భావిస్తున్నారు.

“2015 నుంచీ మధ్యప్రదేశ్ జైన్ లాబీ దీని వెనుక ఉంటూ వచ్చింది. జనాభాపరంగా వారు 1 నుంచి 2 శాతమే ఉన్నారు. కానీ అధికారంలో వారి జోక్యం ఎక్కువ. మరో విషయం ఏంటంటే, శాకాహారి రాష్ట్రంగా చెప్పుకుంటున్న మధ్యప్రదేశ్ ప్రభుత్వం డబ్బులు ఆదా చేసే ప్రయత్నం కూడా చేస్తోంది” అన్నారు.

శివరాజ్ ప్రకటన గురించి మాట్లాడుతూ “ప్రభుత్వ నిబంధనల ప్రకారం లీటర్ పాలను ఐదుగురు పిల్లలకు ఇవ్వాలి. అయితే, నీళ్లు కలిపి మనం ఆ పాలను 10 మంది పిల్లలకు తాగించేయచ్చు. దానిపై ఎవరి పర్యవేక్షణ ఉంటుంది. కానీ, గుడ్డుతో అది అలా చేయలేదు” అంటారు రితిక.

“డబ్బులు ఆదా చేయాలనే ప్రయత్నంలో, పిల్లల ప్రాణాలు ప్రమాదంలో పెడుతున్నారు. పాలు పాడయితే, పిల్లలు అనారోగ్యానికి గురవుతారు. పాల పౌడర్ ఇచ్చినా, దానిని బ్లాక్ మార్కెట్‌కు తరలించే అవకాశం ఉంటుంది. కర్ణాటక టీచర్లు కూడా పిల్లలకు పాల పౌడర్ రుచి నచ్చడం లేదని చెబుతున్నారు” అన్నారు.

ఇలాంటి సమయంలో భారత్‌లోని మిగతా రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటి అనే ప్రశ్న కూడా వస్తుంది.

‘రైట్ టు ఫుడ్’ కాంపైన్ సంస్థ ఈ గణాంకాలు సేకరించింది. దాని ప్రకారం బిహార్, పశ్చిమ బెంగాల్, ఒడిషా, త్రిపుర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో అంగన్‌వాడీల్లో పిల్లలకు పోషకాహారంగా గుడ్డు ఇస్తున్నారు.

2014 బేస్‌లైన్ సర్వే ప్రకారం వీటిలో చాలావరకూ ‘మాంసాహారి’ రాష్ట్రాలు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)