స్పెయిన్‌లో తీవ్ర కరవు.. ఆలివ్ ఆయిల్ ధరలు ఇంకా పెరుగుతాయా?

- రచయిత, మార్క్ లోవెన్, బెకీ మోర్టన్
- హోదా, బీబీసీ న్యూస్
కరవుకు బాగా ఎండిపోయిన ఆలివ్ పంట మధ్య నుంచి వెళ్తూ, వాడిపోయినట్లు కనిపిస్తున్న ఓ మొక్కను ఫ్రాంకోయిస్ ఎల్వీరా చూపించారు.
‘‘దానివైపు ఒకసారి చూడండి’’అని నిట్టూరుస్తూ ఆయన అన్నారు. ‘‘ఈ పాటికి ఇవి ఆలివ్‌లతో కళకళలాడుతూ ఉండాల్సిన మొక్కలు. కానీ, ఇప్పుడు ఇలా ఎండిపోయాయి. వచ్చే ఏడాది మార్కెట్‌లో ఆలివ్ నూనె అందించాల్సిన పంట ఇది’’అని ఆయన చెప్పారు.
దక్షిణ స్పెయిన్‌లోని సారవంతమైన మైదానాల్లో ఎటుచూసినా ఆలివ్ చెట్లే కనిపిస్తాయి. ఆలివ్ ఆయిల్ ఉత్పత్తిలో స్పెయిన్‌ది మొదటి స్థానం. ప్రపంచ మార్కెట్లకు సగం ఆలివ్ ఆయిల్ ఇక్కడి నుంచే వెళ్తుంది.
అయితే, ముందెన్నడూ లేని రీతిలో ఇక్కడ కరవు విరుచుకుపడుతోంది. ‘‘గ్రీన్ గోల్డ్’’గా భావించే ఆలివ్ పంటపై విధ్వంసకర రీతిలో ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే ఈ ఏడాది దిగుబడి మూడో వంతుకు పడిపోయింది. మరోవైపు వర్షాలు పడే సూచనలేవీ కనిపించడం లేదు.

ఫొటో సోర్స్, Reuters
స్పెయిన్ నుంచి వచ్చే ఆయిల్ ఎగుమతుల్లో సగం జేన్ ప్రావిన్స్ నుంచే ఉంటాయి. ఇక్కడి ప్రధాన ఫ్యాక్టరీల్లో ఇంటెరోలియో ఇప్పుడు ఖాళీగా ఉంది.
వేగంగా పడిపోతున్న ఎగుమతులు, పెరుగుతున్న ధరలతో ప్రపంచ ఆహార సంక్షోభం మరింత పెరుగుతుందని సంస్థ భావిస్తోంది.
‘‘ఇప్పటికే గత ఏడాదితో పోలిస్తే, ఆలివ్ ఆయిల్ కోసం సంస్థలు మూడో వంతు అధికంగా చెల్లిస్తున్నాయి. ఈ ధరలు మరింత పెరగొచ్చు’’అని సంస్థ అధిపతి జుయాద్ గడేయో చెప్పారు. స్పెయిన్‌కు జీవనాడిలా భావించే ఈ రంగం ఇప్పుడు ప్రమాదంలో పడిందని ఆయన చెబుతున్నారు.
‘‘దిగుబడి పడిపోవడంతో మేం కొంతమంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించాల్సి రావొచ్చు. ఆర్థిక మందగమనం, ఆనిశ్చితి నెలకొన్నట్లు అనిపిస్తోంది. ఇలా ఇంకొక ఏడాది కొనసాగితే, పరిస్థితులు విధ్వంసకరంగా ఉంటాయి’’అని ఆయన అన్నారు.
ఇక్కడి వ్యవసాయ రంగం మొత్తం పరిస్థితి ఇలానే కనిపిస్తోంది. గత 1200 ఏళ్లలో ఐబేరియా పీఠభూమి ఇలాంటి కరవును చూడలేదని అధ్యయనాలు కూడా చెబుతున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
పొద్దుతిరుగుడు వైపు చూపులు
ఈ ఏడాది మొదట్నుంచి స్పెయిన్ రైతులు ఎక్కువగా పొద్దు తిరుగుడు పంట వేయడం మొదలుపెట్టారు. ఈ నూనె ఎక్కువగా యుక్రెయిన్ నుంచి వస్తుంది. అయితే, అక్కడ యుద్ధం నడుమ పొద్దుతిరుగుడు నూనె సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.
మరోవైపు ఈ పొద్దుతిరుగుడు పంటకు కూడా వర్షాలు చాలా ముఖ్యం. దీంతో ఆ పంట కూడా ఎండిపోతోంది.
ఎండిపోయిన పంట మధ్యలో నుంచి వెళ్తూ అసలు ఏం చేయాలో అర్థం కావడంలేదని ఇసాబెల్ విలేగస్ ఆందోళన వ్యక్తంచేశారు.
‘‘ఈ ఏడాది చివరివరకు వర్షం పడకపోతే, ఇక ఇక్కడ పంటలు వేయడం వృథా’’అని ఆమె అన్నారు. ‘‘మేం అసలు దిగుబడి రాని పంట కోసం డబ్బులు పోస్తున్నాం. ఎందుకంటే అసలు వర్షం పడే అవకాశం లేదని ఇప్పటికే అంచనాలు స్పష్టంచేశాయి’’అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, EPA
గత 500ఏళ్లలో యూరప్‌లో ఇలాంటి పరిస్థితి లేదు..
గత 500 ఏళ్లలో యూరప్‌లో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదని ఇటీవల ద గ్లోబల్ డ్రాట్ అబ్జర్వేటరీ ఒక నివేదక విడుదల చేసింది.
ఒకవైపు కార్చిచ్చులు, మరోవైపు హీట్‌వేవ్‌లు యూరప్‌ను కుదిపేస్తున్నాయి. స్పెయిన్‌పై ఈ ప్రభావం మరింత ఎక్కువగా కనిపిస్తోంది. ఈ ఏడాది 2,70,000 హెక్టార్ల పచ్చటి ప్రాంతం ఇప్పటికే బూడిదైందని యూరోపియన్ ఫారెస్ట్ ఫైర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంచనా వేసింది.
ఒకవైపు హీట్‌వేవ్‌లు, మరోవైపు వర్షాలు తగ్గిపోవడంతో స్పెయిన్‌లోని నీటి రిజర్వులు పూర్తిగా పడిపోయాయి. దీంతో సముద్రపు నీటిని మంచి నీటిగా మార్చే ప్రయత్నాలపై స్పానిష్ ప్రభుత్వం దృష్టిపెడుతోంది.
సముద్రపు నీటిని వడకాసే ప్లాంట్ల నుంచి వస్తున్న సగం నీటిని సాగు కోసమే వినియోగిస్తున్నారు.
20 నుంచి 25 శాతం ధరల పెరుగుదల..
మొత్తంగా కరవు వల్ల ఆలివ్ ఆయిల్ ధరలు 20 నుంచి 25 శాతం పెరగొచ్చని అసెసూర్ సంస్థ అంచనా వేసింది. స్పెయిన్‌కు చెందిన ఈ సంస్థ యూరప్‌తోపాటు చాలా దేశాలకు నూనెను ఎగుమతి చేస్తుంటుంది.
స్పెయిన్‌తోపాటు ఇటలీ, పోర్చుగల్‌లోని ఆలివ్ ఆయిల్ పంటలపైనా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వర్షాల లేమి ప్రభావం చూపిస్తున్నాయి.
ఏడాదికి మొత్తంగా 14 లక్షల టన్నుల ఆలివ్ అయిల్‌ను స్పెయిన్‌లో అసెసూర్ ఉత్పత్తి చేస్తుంది. టెస్కో, వెయిట్‌రోస్, మోరిసన్, అస్డా లాంటి పేర్లతో భిన్న మార్కెట్లలో వందకుపైగా దేశాల్లో ఈ నూనెను విక్రయిస్తుంది.
అయితే, ప్రస్తుతం తమ ఉత్పత్తి 10 లక్షల టన్నులకు పడిపోయిందని సంస్థ చెబుతోంది. మరోవైపు వచ్చే సీజన్ మరింత దారుణంగా ఉండబోతోందని సంస్థ వెల్లడించింది.
మరోవైపు పరిస్థితులు ఇలానే కొనసాగితే, ధరలు మరింత పెరిగే అవకాశముందని మిన్‌టెక్ సంస్థ మార్కెట్ విశ్లేషకురాలు రొక్సానే నికోరో అంచనా వేశారు.
‘‘యుక్రెయిన్ ప్రతిష్టంభన వీడి అక్కడి నుంచి పొద్దుతిరుగుడు నూనె మార్కెట్‌లోకి వస్తే, ధరలు కాస్త తగ్గొచ్చు’’అని ఆమె అన్నారు.
ఇవి కూడా చదవండి:
- నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేత పూర్తి కథ
- అగ్నిపథ్ పథకంపై నేపాలీ గూర్ఖాలు ఎందుకు కోపంతో ఉన్నారు... వారు, పాక్, చైనా ఆర్మీలో చేరాలనుకుంటున్నారా?
- ఇండియా, పాకిస్తాన్.. రెండు జట్లకూ ఆడిన క్రికెటర్
- అపోలో: ఈ ఫొటోలు చూస్తే మీరు కూడా చంద్రుడిపైకి వెళ్లిన ఫీల్ కలుగుతుంది
- బిల్కిస్ బానో గ్రామం రంథిక్ పూర్ నుంచి ముస్లిం కుటుంబాలు ఎందుకు వెళ్లిపోతున్నాయి? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















