పుచ్చకాయలు తింటే ఒకప్పుడు మనుషులు చనిపోయేవారా... ఆ విష పదార్థాలు ఇప్పుడు ఏమయ్యాయి?

పుచ్చకాయలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అలెగ్జాండ్ర మార్టిన్స్
    • హోదా, బీబీసీ ముండో

పుచ్చకాయలను వేల ఏళ్ల నుంచీ ఆహారంగా తీసుకుంటున్నారు. ఈజిప్టులో 4,300 ఏళ్ల క్రితం అక్కడి ప్రజలు వీటిని తిన్నట్లు ఆధారాలు ఉన్నాయి.

అయితే, ఉత్తర ఆఫ్రికాలోని లిబియాలో అత్యంత ప్రాచీనమైన పుచ్చకాయల విత్తనాలను పురాతత్వ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇవి 6,000 ఏళ్లనాటివని అధ్యయనంలో వెల్లడైంది.

ఈ ప్రాచీన పుచ్చకాయల విత్తనాలకు శాస్త్రవేత్తలు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించారు. ఇప్పుడు మార్కెట్‌లో దొరికే పుచ్చకాయల కంటే ఇవి చాలా భిన్నమైనవని వారి పరిశోధనలో తేలింది.

6000 ఏళ్లనాటి పుచ్చకాయల గుజ్జు కాస్త చేదుగా, తెల్లగా ఉండేదని పురాతత్వ శాస్త్రవేత్తలు తేల్చారు. అంతేకాదు, అప్పట్లో దీన్ని తింటే మరణం కూడా సంభవించే ముప్పు ఉండిందని వారు అంచనా వేశారు.

పుచ్చకాయలు

ఫొటో సోర్స్, Gentileza Oscar A. Pérez-Escobar

ఎలా కనిపెట్టారు?

దక్షిణ లిబియాలోని సహారా ఎడారిలో ఉవాన్ ముహుగ్గియాగ్ అనే పురావస్తు ప్రదేశంలో ఈ పుచ్చకాయల విత్తనాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

ఈ విత్తనాల మూలాలను కనిపెట్టేందుకు ‘‘ఆర్కియోజీనోమిక్స్’’ పరిజ్ఞానాన్ని శాస్త్రవేత్తలు ఉపయోగించారు. పురాతత్వ జీనోమ్‌లను విశ్లేషించేందుకు ఈ సాంకేతికత ఉపయోగపడుతుంది.

‘‘ఆర్కియోజీనోమిక్స్ అనేది ఒక టైమ్ మెషీన్ లాంటిది’’అని కొలంబియా పురాతత్వ శాస్త్రవేత్త ఆస్కార్ అలెగ్జాండ్రో పెరెజ్ ఎస్కోబార్ చెప్పారు. లండన్ బొటానిక్ గార్డెన్స్‌లో జరిగిన ఈ పుచ్చకాయల విత్తనాల డీఎన్ఏ అధ్యయనానికి ఆయన నేతృత్వం వహించారు.

‘‘వేల ఏళ్లనాటి మొక్కల డీఎన్ఏను విశ్లేషించేటప్పుడు చాలా సమస్యలు ఉంటాయి. కేవలం ఒకటి లేదా రెండు శాతం డీఎన్ఏ మాత్రమే మనకు ఈ విత్తనాల్లో లభిస్తుంది’’అని పెరెజ్ వివరించారు.

‘‘అయితే, తాజా పరిశోధనలో మేం 6,000ఏళ్లనాటి విత్తనాల 30 శాతం జన్యు సమాచారాన్ని డీకోడ్ చేయగలిగాం. ఇప్పటివరకు విజయవంతంగా జన్యు సమాచారాన్ని విశ్లేషించిన పురాతన మొక్కల అవశేషాల్లో ఇవే అత్యంత పురాతనమైనవి’’అని ఆయన తెలిపారు.

సూడాన్‌లో బయటపడిన 3,000ఏళ్లనాటి పుచ్చకాయల విత్తనాలతో తాజా విత్తనాలను పరిశోధకులు సరిపోల్చారు. సూడాన్‌లోని క్యూ గార్డెన్స్‌లో ఆ విత్తనాలు బయటపడ్డాయి.

‘‘లిబియాలో బయటపడిన విత్తనాలకు ప్రస్తుతం మనకు మార్కెట్‌లో కనిపిస్తున్న పుచ్చకాయల విత్తనాలకు కాస్త దగ్గర సంబంధాలున్నాయి. అయినప్పటికీ, ఇవి రెండూ చాలా భిన్నమైనవి’’అని పెరెజ్ చెప్పారు.

పుచ్చకాయలు

ఫొటో సోర్స్, Gentileza Oscar A. Pérez-Escobar

ఫొటో క్యాప్షన్, ఆస్కార్ అలెగ్జాండ్రో పెరెజ్ ఎస్కోబార్

ప్రాణాంతకంగా...

విత్తనాల్లో ప్రస్తుతమున్న జన్యువులను విశ్లేషించడం ద్వారా 6,000 ఏళ్ల క్రితం ఈ పళ్లలో ఎలాంటి జన్యువులు ఉండేవో శాస్త్రవేత్తలు అంచనా వేశారు.

‘‘ఈ పరీక్షల్లో బహుశా ఆ పుచ్చకాయలు తెల్లగా, చేదుగా ఉండొచ్చని తేలింది’’అని పెరెజ్ చెప్పారు.

‘‘మరోవైపు ఆ పుచ్చకాయల గుజ్జులో కుకుర్‌బిటాసిన్‌గా పిలిచే సమ్మేళనాలు ఉండేవి. వీటి వల్ల కొన్ని గుమ్మడికాయలు చేదుగా ఉంటాయి’’అని ఆయన తెలిపారు.

‘‘ఆ సమ్మేళనాలను ఎక్కువ మొత్తంలో తీసుకుంటే, మనుషులు చనిపోయే ప్రమాదం ఉంటుంది’’అని ఆయన వెల్లడించారు.

‘‘కుకుర్‌బిటాసిన్‌ ఎక్కువగా కుకుర్‌బిటాసియాగా పిలిచే మొక్కల్లో కనిపిస్తుంటుంది. గుమ్మడికాయలు, పుచ్చకాయలు ఈ జాతి పళ్లే. జంతువులు తమ పళ్లను తినేయకుండా మొక్కలు ఈ విష పదార్థాలను పళ్లలో నిల్వ చేస్తాయి. ఇవి పరిణామ క్రమంలో వచ్చిన మార్పులు’’అని ఆయన తెలిపారు.

ఇప్పటికీ కొన్ని అడవి జాతి పుచ్చకాయల్లో కుకుర్‌బిటాసిన్‌ స్థాయిలు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తాయని, వీటిని తింటే మరణ ముప్పు వెంటాడుతుందని పరిశోధకులు చెబుతున్నారు.

‘‘యూరప్, ఆసియాలలో అడవి పుచ్చకాయలను గుమ్మడికాయలుగా పొరబడి తినడంతో శరీరంలోకి విషయం చేరడం, లేదా చనిపోవడం లాంటి ఘటనలు అప్పుడప్పుడు వెలుగులోకి వస్తుంటాయి. కుకుర్‌బిటాసిన్‌ స్థాయిలు వీటిలో చాలా ఎక్కువగా ఉండటమే దీనికి కారణం’’అని పెరెజ్ అన్నారు.

పుచ్చకాయలు

ఫొటో సోర్స్, Getty Images

విత్తనాల్లో కనిపించడం అరుదు

సాధారణంగా గుజ్జులోనే కుకుర్‌బిటాసిన్‌ కనిపిస్తుంది. అందుకే ఇది చేదుగా ఉంటుంది. కానీ, 6,000ఏళ్లనాటి పళ్ల విత్తనాల్లోనూ ఈ సమ్మేళనాలు కనిపిస్తున్నాయని పరిశోధకులు తేల్చారు.

‘‘విత్తనాల్లో కుకుర్‌బిటాసిన్ కనిపించడం చాలా అరుదు’’అని అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకురాలు సుశానే రెన్నెర్ చెప్పారు. ఆమె కూడా తాజా పరిశోధనలో పాలుపంచుకున్నారు.

‘‘బహుశా నిల్వ చేయడం కోసమే ఈ విత్తనాలను ఇక్కడ సేకరించి ఉండొచ్చు. వీటిపై మనుషుల పళ్ల అచ్చులు కూడా కనిపిస్తున్నాయి’’అని అధ్యయనంలో పాలుపంచుకొన్ని ఇంగ్లండ్‌లో షెప్ఫీల్డ్ యూనివర్సిటీకి చెందిన గిల్యూమ్ చోమిస్కీ చెప్పారు.

పుచ్చకాయలు

ఫొటో సోర్స్, Getty Images

ఏమిటీ మర్మం?

ప్రస్తుతం మనకు మార్కెట్‌లో కనిపిస్తున్న పుచ్చకాయలు (సిట్రలస్ లనటస్ సబస్ప్ వల్గారిస్) నేరుగా లిబియాలో బయటపడ్డ పుచ్చకాయ రకాల నుంచి అభివృద్ధి చెందలేని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

అయితే, నేడు మనం ఆహారంగా తీసుకుంటున్న పుచ్చకాయలను పండిస్తున్నారు. ఇంతకీ మొదట చేదుగా ఉండే వీటిని అసలు పండించాలనే ఆలోచన ఎలా వచ్చిందనే ప్రశ్న నేడు ప్రశ్నగానే మిగిలిపోయింది.

‘‘నిజానికి వేరే అవసరాల కోసం వీటిని మొదట పండించి ఉండొచ్చు. విత్తనాలు, లేదా గుజ్జు లేదా ఇంకేదైనా అవసరం కోసం వీటిని పండించాలని భావించొచ్చు’’అని పెరెజ్ అన్నారు.

‘‘అయితే, తర్వాత కొన్ని జన్యు పరివర్తనల వల్ల వీటిలోని గుజ్జు పసుపు లేదా ఎరుపు రంగులోకి మారడంతోపాటు తియ్యగా కూడా అయ్యుండొచ్చు’’అని ఆయన వివరించారు.

వీడియో క్యాప్షన్, లండన్ చేరేనాటికి పటేల్ దంపతుల చేతిలో కేవలం 12 పౌండ్లున్నాయి.

ఈ అధ్యయనం ఎందుకు ముఖ్యం?

పుచ్చకాయల భవిష్యత్‌పై అంచనాలకు వీటి చరిత్రను తెలుసుకోవడం చాలా ముఖ్యమని పెరెజ్ చెప్పారు.

‘‘మనుషులు ఏదైనా మొక్కను వ్యవసాయంలోకి తీసుకొచ్చేటప్పుడు.. సహజంగానే ఆ మొక్క కొన్ని జన్యువులను కోల్పోతుంటుంది. అంతకుముందు ఉండే పళ్లకు వ్యవసాయం తర్వాత వచ్చే పళ్లకు చాలా తేడాలు ఉంటాయి’’అని ఆయన చెప్పారు.

చరిత్రను తెలుసుకోవడం ద్వారా ఈ మొక్కల ‘‘జన్యు రిజర్వాయర్లు’’పై మనకు అవగాహన ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.

వీడియో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్‌లోనే అరుదైన పంట జాపత్రి

‘‘వాతావరణ మార్పుల నడుమ భారీగా, వేగంగా ఆహారాన్ని ఉత్పత్తి చేసే అవసరం ఏర్పడింది. ముఖ్యంగా మారుతున్న వాతావరణ పరిస్థితులకు తట్టుకుని నిలబడగలిగే మొక్కల కోసం పరిశోధకులు ప్రస్తుతం అన్వేషిస్తున్నారు’’అని పెరెజ్ చెప్పారు.

‘‘ఆ పురాతన పుచ్చకాయల్లో కొన్ని రకాల పురుగులు, ఉప్పు నీటిని తట్టుకుని నిలబడగలిగే జన్యువులు ఉండొచ్చు’’ అని ఆయన వివరించారు.

‘‘ఆర్కియోజీనోమిక్స్ సాయంతో ఒకప్పటి మొక్కలు వాతావరణ మార్పులు, వ్యాధులకు ఎలా తట్టుకోగలిగేవో మనం తెలుసుకోవచ్చు’’ అని ఆయన తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)