పాకిస్తాన్‌ ద్రవ్యోల్బణం: పెట్రోలు ఖర్చని బంధువుల ఇంటికి వెళ్లడం లేదు, ఎవరైనా పెళ్లికి పిలిచినా వెళ్లలేకపోతున్నారు

ద్రవ్యోల్బణం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఫర్హత్ జావేద్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

పాకిస్తాన్‌లో ప్రతి ప్రభుత్వ పాలనలోనూ ద్రవ్యోల్బణం మాట వినిపిస్తూనే ఉంటుంది. తాజాగా, గత కొన్ని నెలలుగా ఆ దేశంలో ధరలు అసాధారణంగా పెరిగిపోయాయి. పేదలు, మధ్యతరగతి సహా అన్ని వర్గాలవారు ఇబ్బందులు పడుతున్నారు. సాధారణ ప్రజలకు ఇది నిత్య పోరాటంగా మారింది.

ద్రవ్యోల్బణం ఒక సొరంగంలాంటిది కానీ, దాని చివర కాంతి కనిపించడం లేదని రావల్పిండి నివాసి ఖలీదా ఖ్వాజా అన్నారు. ఆమె మధ్యతరగతి కుటుంబానికి చెందిన మహిళ. తనకు సొంత ఇల్లు ఉండడం, పిల్లలకు విద్య అందడం కొంత ఉపశమనమని ఆమె అన్నారు.

పిల్లలకు పెళ్లి చేయాలని ఆలోచిస్తున్న తరుణంలో ద్రవ్యోల్బణం తన వెన్ను విరిచిందని ఖలీదా అన్నారు.

‘ఇలాంటి పరిస్థితుల్లో వేరొకరి పెళ్లికి వెళ్లాలంటేనే చాలాసార్లు ఆలోచించాల్సి వస్తుంది. మన ఇంట్లో పెళ్లిళ్లు చేయాలంటే చాలా కష్టం" అన్నారామె.

పాకిస్తాన్‌లో తీవ్ర ద్రవ్యోల్బణం

ఫొటో సోర్స్, Getty Images

కూరగాయలు, పాలు, గుడ్లు, ఆహార పదార్థాల ధరలు ఎలా ఉన్నాయి?

గత సంవత్సరంతో పోలిస్తే ఈ జులైలో ద్రవ్యోల్బణం దాదాపు 25 శాతం పెరిగిందని పాకిస్తాన్ స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ గణాంకాలు చెబుతున్నాయి.

పప్పుల ధర 92 శాతం పెరిగింది.

ఉల్లి ధర 60 శాతం వరకు పెరగగా, మాంసం ధర 26 శాతం పెరిగింది.

కూరగాయల ధరలు 40 శాతం, పండ్ల ధరలు 39 శాతం పెరిగాయి.

పాలు ధర 25 శాతం, గుడ్లు, తేయాకు 23 శాతం పెరిగాయి.

మిగతా వస్తువుల ధరలు ఎలా ఉన్నాయి?

ఆహారపదార్థలు సరే, ఇతర వస్తువుల ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

స్నానానికి వాడే సబ్బులు, బట్టలు ఉతుక్కునే వాషిగ్ పౌడర్, ఆఖరికి అగ్గిపెట్టె ధర కూడా 25 శాతం పెరిగింది.

దుస్తుల ధర 18 శాతం, బూట్లు 19 శాతం, ప్లాస్టిక్ వస్తువుల ధర 19 శాతం పెరిగింది.

గత ఏడాదితో పోలిస్తే, వాహన ఇంధనం ధర తల తిరిగిపోయే రేంజ్‌లో 95 శాతం పెరిగింది.

విద్యుత్తు రేటు 87 శాతం పెరిగింది.

వీడియో క్యాప్షన్, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల ప్రభావం.. ఓ మధ్యతరగతి ఇల్లాలిపై ఎలా ఉంది?

'బిర్యానీ మసాలా కొనడం అనవసర ఖర్చు అనిపిస్తోంది'

ఒక సామాన్య కుటుంబంలో ఖర్చులు నిర్వహించడం తలకు మించిన భారంగా మారిందని ఖలీదా ఖ్వాజా అన్నారు.

ఖలీదాకు నలుగురు పిల్లలు. ఆమె భర్త చిన్న వ్యాపారం చేస్తుంటారు. ఒక కొడుకు ఇటీవలే ప్రైవేట్ రంగంలో ఉద్యోగంలో చేరారు.

ధరలు పెరిగిపోతున్నాయి గానీ ఆదాయం పెరగడం లేదని ఆమె అన్నారు.

"సగటు ఆదాయం మూడేళ్ల క్రితం ఎంత ఉందో, ఇప్పుడూ అంతే ఉంది. అవసరాలూ అలాగే ఉన్నాయి. కానీ ధరలు పెరగడంతో ఖర్చులు పెరిగిపోయాయి. అయిదు వేలు తీసుకుని కిరాణా దుకాణానికి వెళితే రెండు సంచీల నిండా సరుకులు రావట్లేదు. జేబు మాత్రం ఖాళీ అయిపోతోంది. ఏదైనా వస్తువు కొన్న ప్రతిసారి, ఇది అవసరమా కాదా అని ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి వస్తోంది. బుట్టలో వేసుకునే ముందు, ఇది లేకుండా రోజు గడవదా అని ఆలోచిస్తుంటాను. ఇలా ఆలోచించి సగం వస్తువులు వెనక్కి పెట్టేస్తుంటాను. ఇంతకు ముందు అవసరం లేకపోయినా, నచ్చితే కొనేదాన్ని. ఇప్పుడు బిర్యాని మసాలా కొనడం కూడా దండగ ఖర్చు అనిపిస్తోంది.

పాకిస్తాన్‌లో తీవ్ర ద్రవ్యోల్బణం

'బిర్యానీకి బదులు సెనగల కూర-అన్నం వండుతున్నా'

ధరలు పెరిగిపోయాయని తినడం మానేయలేం కదా అంటారు ఖలీదా.

'నూనె, నెయ్యి, పిండి, పప్పులు వదిలేయలేం కదా. కోడి, మేక మాంసాలు కొనలేనంత ధరలో ఉన్నాయి. ఇంతకుముందు ప్రతి పూటా తాజాగా వండుకుని తినేవాళ్లం. ఇప్పుడు మధ్యాహ్నం వండిన అన్నమే రాత్రికి దాచుకుని తినడానికి ప్రయత్నిస్తున్నాం. ఇంతకుముందు బిర్యానీ వండుకునేవాళ్లం. ఇప్పుడు సెనగల కూర-అన్నంతో కడుపు నింపుకొంటున్నాం. ఇదే మేం చేయగలిగిన ఖర్చు తగ్గింపు" అన్నారామె.

కరెంటు బిల్లు 30 వేలు

కరెంటు బిల్లు దారుణంగా పెరిగిపోయిందని చెప్పారు ఖలీదా.

"కరెంటు బిల్లు అందరికీ భారంగా మారింది. మా ఇంట్లో రెండు ఏసీలు ఉన్నాయిగానీ ఒకటే వాడుతున్నాం. అది కూడా బాగా వేడిగా ఉంటేనే ఏసీ వేసుకుంటున్నాం. ఇది కాకుండా, ఫ్రిడ్జ్ వాడుతున్నాం. వాషింగ్ మిషన్ వారానికి ఒకసారే వేస్తున్నా. అయినా సరే, ఈ నెల కరెంటు బిల్లు 30,000(పాకిస్తాన్ కరెన్సీలో) వచ్చింది" అంటూ ఖలీదా వాపోయారు.

పాకిస్తాన్‌లో తీవ్ర ద్రవ్యోల్బణం
ఫొటో క్యాప్షన్, ఖలీదా ఖ్వాజా

బంధువుల ఇంటికి వెళ్లడం అంటే పెట్రోలు ఖర్చు

బయటకు వెళ్లాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నామని ఖలీదా అన్నారు.

"మగవాళ్లు మోటార్ సైకిల్ వాడతారు. కుటుంబం అంతా బయటకు వెళ్లాలంటే కారు కావాలి. ఇప్పుడు బంధువుల ఇళ్లకు వెళ్లడం బాగా తగ్గిపోయింది. పెట్రోల్ ఖర్చు. పైగా ఉత్తి చేతులతో వెళ్లలేం. ఏదో ఒకటి కొనుక్కుని తీసుకెళ్లాలి."

"ఆకాశాన్నంటుతున్న ధరల వలన రోజువారీ ఖర్చులే భరించలేకపోతున్నాం. ఇక, అత్యవసర పరిస్థితి వస్తే ఏం మిగలదని" ఖలీదా అన్నారు.

వీడియో క్యాప్షన్, దేశం దివాలా తీయకుండా ఉండాలంటే ధరలు పెంచడం తప్పనిసరైందన్న ఆర్థిక మంత్రి మిఫ్తా ఇస్మాయిల్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)