Cassava: కర్రపెండలం అంటే ఏమిటి? గోదుమకు ప్రత్యామ్నాయంగా దీన్ని తినాలని ఈ దేశాధ్యక్షుడు ఎందుకు అన్నారు?

కసావా

ఫొటో సోర్స్, Getty Images

యుగాండా అధ్యక్షుడు యొవేరీ ముసెవెనీ ప్రపంచవ్యాప్తంగా గోదుమ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో దేశ ప్రజలంతా కసావా (కర్రపెండలం) తినాలని పిలుపునిచ్చారు. ఘనా జర్నలిస్టు ఎలిజబెత్ ఒహెనె దీని గురించి వివరించారు.

పశ్చిమ ఆఫ్రికాలో ప్రధానంగా లభించే కసావా, యామ్ అనేవి రెండూ దుంప జాతికి చెందిన కూరగాయలు. భార‌త్‌లో.. అందులోనూ తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా కర్రపెండలం దొరుకుతుంది. సగ్గు బియ్యం దీని నుంచే తయారు అవుతుంది.

కర్రపెండలం దుంప సంవత్సరం పొడుగునా లభిస్తుంది. ఇది చాలా చౌకగా దొరుకుతుంది. ఇంకా చెప్పాలంటే దీనికి పేదవారి ఆహారం అని పేరు.

ఆఫ్రికాలో మరో ప్రముఖ దుంప యామ్. ఇది చూడటానికి కందగడ్డను పోలి ఉంటుంది. ఈ దుంపను '' ద కింగ్ ఆఫ్ క్రాప్స్'' అని నైజీరియా రచయిత చినువా అచెబె వర్ణించారు.

యామ్ పంటకోత కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తారు. యామ్ కొత్తపంటను తినడానికి ముందు కొత్త దుస్తులు ధరించి పండుగలా ప్రత్యేక పూజలు చేస్తారు.

రోజూ తినే ఆహారపదార్థాల్లో కర్రపెండలం ఉత్తమమైనది. పేదలకు అందుబాటులో ధరల్లో ఇది దొరుకుతుంది.

ప్రపంచవ్యాప్తంగా జీవన వ్యయ సంక్షోభం నెలకొన్న ఈ సమయంలో పెరుగుతోన్న గోదుమ ధరలకు విరుగుడుగా కర్రపెండలంను ఆహారంలో ఎక్కువగా తీసుకోవాలని యుగాండా అధ్యక్షుడు యొవేరీ ముసెవెనీ తన దేశ ప్రజలను కోరినట్లు నేను గమనించాను.

''ఒకవేళ రొట్టెలు లేకపోతే, మువోగో (కసావా)ను తినండి'' అని ఆయన ప్రజలకు చెప్పారు.

స్నాక్‌లా కూడా కసావాను తినొచ్చు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, స్నాక్‌లా కూడా కసావాను తినొచ్చు

ముసెవేనీ చేసిన ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. జీవన వ్యయ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ఆయన వద్ద అసలు ప్రణాళిక ఏదీ లేదని విమర్శకులు అంటున్నారు.

1960లలో ఘనాలో ప్రతిపాదిత పన్నుల పెరుగుదలను సమర్థించుకునే ప్రయత్నంలో భాగంగా అప్పటి ఆర్థికమంత్రి మాట్లాడుతూ... ''పన్నుల పెరుగుదల ప్రభావం పేదవారిపై పడదు. ఎందుకంటే వారు 'గారి' (కర్రపెండలంను ప్రాసెస్ చేయడం ద్వారా లభించే పిండి) తింటారు. సగం కప్పు గారి పిండికి నీటిని చేరిస్తే అది బాగా ఉబ్బిపోయి ముగ్గురికి సరిపడా ఆహారంగా మారుతుంది'' అని అన్నారు.

అన్నం, రొట్టెలు లేదా ఇతర ఫ్యాన్సీ ఆహారపదార్థాలను పేదవారు తినరనే అంశాన్ని మంత్రి చెప్పకుండానే చెప్పారు. ఆ సమయంలో అది నిజం కూడా.

అప్పట్లో పేదవారి ముఖ్య ఆహారంగా 'గారి'ని పరిగణించేవారు. ఇది చాలా చౌకగా లభించే పేదల కడుపు నింపే ఆహార పదార్థం.

తర్వాత చాలా ఏళ్లకు, పెరుగుతున్న ఆహార ధరల గురించి మాట్లాడిన ఒక మంత్రి... బియ్యం, ఇతర ఆహారాలకు ప్రత్యామ్నాయంగా ప్రజలు ఎల్లప్పుడూ 'కొకొంటే'ను తినవచ్చని చెప్పారు.

కర్రపెండలం పిండితో కొకొంటేను తయారు చేస్తారు. కర్రపెండలంతో చేసే అన్ని పదార్థాలను పేదలు తినే ఆహారంగా పిలుస్తారు.

తాను కూడా కర్రపెండలం తిన్నానని అధ్యక్షుడు ముసెవెనీ చెప్పారు. ఇప్పుడు ఇది అధ్యక్ష సంబంధమైన ఆహారం అయినందున దీన్ని తినడానికి ఎవరూ సిగ్గుపడకూడదనేది ఆయన అంతరార్థం.

కర్రపెండలంలో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని కూడా ప్రచారం జరుగుతుంది. కసావా దుంప గ్లూటెన్ రహితమైనదని, ఇందులో విటమిన్ 'సి', కాపర్ సమృద్ధిగా ఉన్నాయని చెబుతున్నారు.

కసావా పిండి గ్లూటెన్ రహితమైనంది. బేకింగ్‌లో దీన్ని వాడొచ్చు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కసావా పిండి గ్లూటెన్ రహితమైనంది. బేకింగ్‌లో దీన్ని వాడొచ్చు

ఉగాండాలో కర్రపెండలంను ఇంకా పేదవారి ఆహారంగానే చూస్తున్నారో లేదో నాకు తెలియదు. కానీ, ఘనాలో మాత్రం ఈ విషయంలో చాలా మార్పు వచ్చింది.

ఉదాహరణకు 'గారి'నే తీసుకుంటే... ఇక్కడ దీనికి పేదవారి ఆహారం అనే ముద్ర లేదు. ఎందుకంటే బోర్డింగ్ స్కూల్ విద్యార్థులందరికీ దీన్నే అందజేస్తారు. కాబట్టి ఆ ముద్ర తొలిగిపోయింది.

బాక్సుల్లో 'గారి'ని తీసుకొని విద్యార్థులంతా స్కూళ్లకు వెళ్తారు. 'గారి' పిండితో చేసే అనేక రకాల ఆహారాలను 'సోకింగ్స్' అని పిలుస్తారు.

దీనితో చాలా సులభంగా, వేగంగా ఆహారపదార్థాలు తయారవుతాయి. వండటం, మైక్రోవేవ్‌లో వేడి చేయడం వంటివి అక్కర్లేదు. గిన్నెలో కాస్త 'గారి' పిండి తీసుకొని నీటిని వేసి చక్కెర, పాలు పోసి బాగా కలిపితే సరిపోతుంది. బాగా రుచికరమైన, కడుపు నింపే స్నాక్ తయారైపోతుంది.

ఈ పిండితో చేసే మరో వంటకం చాలా ప్రసిద్ధి చెందింది. ఒక కప్పు పొడి గారి పిండిలో కాస్త నీటిని చిలకరించి సాఫ్ట్‌గా చేసుకోవాలి. దానికి టేబుల్ స్పూన్ పెప్పర్ సాస్, ఒక సార్డిన్స్ టిన్ (ప్రాసెస్ చేసిన చేపలు) వేసి బాగా కలిపితే మరో రుచికరమైన ఆహారం తయారు అవుతుంది.

ఘనాకు చెందిన దిగ్గజ క్యాటరర్ బార్బరా బేటా, 'గారీ ఫొటో' పేరుతో ఒక రెసిపీని రూపొందించినప్పుడు 'గారి' నిజంగా ఒక హాట్ క్విజిన్‌గా మారిపోయింది.

ఈ రెసిపీలో గారీని సీఫుడ్‌తో కలుపుతారు. ఇలా తయారు చేసిన వంటకాన్ని 1970లో ప్రధానమంత్రి కోఫీ అబ్రెఫా బుసియా ఆతిథ్యమిచ్చిన అధికార విందులో కూడా ఉంచారు.

ఒక్కసారిగా ఇది గొప్ప వ్యక్తులు, పెద్ద మనుషుల విందులో వడ్డించే ఆహారంగా మారిపోయింది.

వీడియో క్యాప్షన్, బందరు లడ్డూ ఇలా చేస్తారా

కర్రపెండలంతో తయారయ్యే వంటకాలు కొన్ని గొప్ప వంటకాలుగా రూపాంతరం చెందాయి. వాటిని తినడం గురించి ప్రజలు గొప్పగా చెప్పుకుంటారు.

1960లలో బానిసలు తినే ఆహారంగా ఉన్న కర్రపెండలం ఇప్పుడు ఫ్యాన్సీ ఆహారంగా మారిపోయింది.

ఘనాకు చెందిన కొంతమంది క్యాటరర్లు, యుగాండాకు వెళ్లి కేవలం కర్రపెండలంతో తయారయ్యే వంటకాలకు సంబంధించిన రెస్టారెంట్లను ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉందని నేను అనుకుంటున్నా.

యుక్రెయిన్ సంక్షోభం ముగిసేనాటికి, కర్రపెండలం అనేది ఆఫ్రికా వ్యాప్తంగా ప్రజలు ఇష్టంగా ఎంచుకునే ఆహారంగా మారుతుందని ఆశిస్తున్నా. అప్పుడు గోదుమ, అవి పండించే వారికే పరిమితం అవుతుంది.

కర్రపెండలంపై గొప్ప వ్యాఖ్యలు చేయడానికి చినువా లేకపోవచ్చు. మనం కర్రపెండలం పండుగను జరుపకపోవచ్చు. కానీ, ఎవరూ దీన్ని పేదల ఆహారంగా మళ్లీ పేర్కొనరు. కర్రపెండలం తినాలని ప్రజలను ప్రోత్సహించేందుకు అధ్యక్షుడు ముసెవెనీ ప్రసంగాలు ఇవ్వాల్సిన అవసరం లేదు.

వీడియో క్యాప్షన్, తెలంగాణ: ఈ మహిళల సంస్థకు పేరు కూడా లేదు, కానీ వీళ్ల ఉత్పత్తులు అమెరికా వెళ్తున్నాయి

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)