ఎండలు పెరగడంతో మండిపోతున్న గోదుమ పిండి ధర

గోదుమ పిండి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గోదుమ పిండి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి
    • రచయిత, సరోజ్ సింగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారత రిటైల్ మార్కెట్‌లో గోదుమ పిండి ధర ఏడాది కిందట క్వింటాలుకు రూ.2880. కానీ, ఇప్పుడు అది 3291 రూపాయలకు పెరిగింది.

ఏడాది కాలంలో రిటైల్ మార్కెట్‌లో గోదుమ పిండి ధర క్వింటాల్‌కు సుమారు రూ. 400 పెరిగింది. అంటే, మీ ఇంటి పిండి బడ్జెట్ ఎంతో కొంత ప్రభావితమైందన్నమాట.

2010 సంవత్సరం తర్వాత గోదుమ పిండి ధర రికార్డు స్థాయిలో పెరిగింది. మరి దీనికి కారణమేంటి ?

మార్చి-ఏప్రిల్‌లో రికార్డు వేడి

ఉత్తర భారతదేశంలో గోదుమ సాగు ఎక్కువ. మధ్య భారతదేశంలో, మధ్యప్రదేశ్‌లో కూడా గోదుమ ఉత్పత్తి ఎక్కువగానే ఉంది. చాలా ప్రాంతాల్లో గోదుమలు మార్చి, ఏప్రిల్ నెలల్లోనే పండిస్తారు.

ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌లో ఉత్తర భారతదేశంలో రికార్డు స్థాయిలో వేడి నమోదైంది. దీని కారణంగా గోదుమ దిగుబడి బాగా దెబ్బతింది.

గోదుమలకు మార్చి వరకు 25-30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అవసరం. కానీ మార్చిలో, ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో టెంపరేచర్ దీని కంటే ఎక్కువగా ఉంది.

ప్రభుత్వ రికార్డుల ప్రకారం గోదుమల దిగుబడి దాదాపు 5 శాతం తక్కువగా ఉంది. అయితే, వాస్తవాలు అందుకు ఇంకా భిన్నంగా ఉన్నాయన్న మాట కూడా వినిపిస్తోంది. ''నేను పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్, హరియాణ, మధ్యప్రదేశ్‌లో రైతులతో మాట్లాడాను. ఈసారి దిగుబడి 15-25 శాతం తగ్గింది'' అని సీనియర్ జర్నలిస్ట్ హర్వీర్ సింగ్ అభిప్రాయపడ్డారు.

దిగుబడి తగ్గడంతో గోదుమల ధరలు పెరిగాయి. ఆటోమేటిక్‌గా దాని ప్రభావం గోదుమ పిండి ధరపై కూడా పడింది.

ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటంతో గోధుమ దిగుబడి తగ్గింది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటంతో గోధుమ దిగుబడి తగ్గింది

రష్యా-యుక్రెయిన్ యుద్ధం

గోదుమల ధరలు పెరగడానికి ప్రపంచ పరిస్థితులు కూడా కొంత వరకు దోహదపడ్డాయి. ఫిబ్రవరి చివరలో మొదలైన రష్యా-యుక్రెయిన్ యుద్ధం ప్రపంచంలో భారతదేశ గోదుమలకు డిమాండ్‌ను మరికొంత పెంచింది.

ప్రపంచంలో గోదుమలను ఎగుమతి చేసే టాప్-5 దేశాలలో రష్యా, అమెరికా, కెనడా, ఫ్రాన్స్, యుక్రెయిన్ ఉన్నాయి. ఈ ఎగుమతిలో 30 శాతం రష్యా, యుక్రెయిన్ నుంచి వస్తుంది.

రష్యాలో పండే గోదుమలలో సగం గోదుమలను ఈజిప్ట్, టర్కీ, బంగ్లాదేశ్‌లు కొనుగోలు చేస్తాయి. ఈజిప్ట్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, టర్కీ, ట్యునీషియాలు యుక్రెయిన్‌లో పండే గోధుమలను కొనుగోలు చేస్తాయి.

ఇప్పుడు ప్రపంచంలోని అత్యధికంగా గోదుమలను ఎగుమతి చేసే రెండు దేశాలు యుద్ధంలో చిక్కుకున్నాయి. అందువల్ల వాటి కస్టమర్లకు సరఫరాలో అంతరాయం ఏర్పడింది.

యుద్ధం ప్రారంభమైన కొన్ని వారాల తర్వాత, భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒక కార్యక్రమంలో గోదుమ ఎగుమతిదారులను ఉద్దేశించి ఒక మాట అన్నారు.

''ప్రస్తుతం భారతదేశ గోధుమల పట్ల ప్రపంచదేశాలు ఆకర్షితులవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మన గోధుమ ఎగుమతిదారులు ఇది గమనించారా? మన ఆర్ధిక సంస్థలు దీనిని గుర్తించాయా?'' అని వ్యాఖ్యానించారు.

గోదుమల ఎగుమతుల్లో రికార్డు పెరుగుదల

ప్రపంచ పరిణామాల కారణంగా గోదుమల ఎగుమతులు కూడా ఈసారి రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. గత మూడేళ్లలో గోదుమల ఎగుమతులు రికార్డు స్థాయిలో పెరిగాయి.

కింద ఇచ్చిన గ్రాఫ్ ఈ పెరుగుదల సులభంగా అర్థమవుతుంది.

గోధుమల ఎగుమతులు పెరిగిన తీరు
ఫొటో క్యాప్షన్, గోధుమల ఎగుమతులు పెరిగిన తీరు

రష్యా-యుక్రెయిన్ సంక్షోభం ప్రభుత్వ గోదుమల సేకరణ పై కూడా ప్రభావం చూపించింది.

ప్రైవేట్ వ్యాపారులు ఎమ్ఎస్‌పీ (మినిమమ్ సపోర్ట్ ప్రైస్-కనీస మద్ధతు ధర) కంటే ఎక్కువ ధరకు గోదుమలను కొనుగోలు చేయడంతో ఈ ఏడాది ప్రభుత్వ కొనుగోళ్లు తగ్గాయని కేంద్ర ప్రభుత్వమే అంగీకరించింది.

''ప్రభుత్వ కొనుగోళ్లు తగ్గడానికి కేంద్ర మంత్రుల వైఖరి కూడా కారణం. రాబోయే రోజుల్లో ధరలు ఇంతగా పెరుగుతాయని వారికి అర్ధం కాలేదు'' అని జర్నలిస్ట్ హర్వీర్ సింగ్ అన్నారు.

మార్కెట్ సెంటిమెంట్ - ధరలు తగ్గవు

ఎగుమతుల పెరుగుదల దృష్ట్యా, మార్కెట్లో దేశీయ కొనుగోలుకు అవసరమైన గోదుమలు తక్కువగా ఉన్నాయి. ధర మరింత పెరిగే అవకాశం ఉన్న దృష్ట్యా కొందరు వ్యాపారులు మార్కెట్‌లోని మొత్తం స్టాక్‌ను బయటకు తీయడం లేదు.

దేశీయ మార్కెట్‌లో కూడా ఎమ్‌ఎస్‌పీ కంటే ఎక్కువగా కొనుగోలు చేయడంతో వివిధ నగరాల్లో గోదుమల ధరలు పెరిగాయి. మార్కెట్‌లో పెరిగిన ధరల దృష్ట్యా గోదుమల ధరలను పెంచబోతున్నట్లు సందేశం పంపింది ప్రభుత్వం.

దీంతో గోదుమలతో తయారయ్యే ప్రతి పదార్ధం ధర పెరిగింది. గత కొన్ని నెలల్లో, బ్రెడ్, బేకరీ పదార్ధాల ధరలు 8-10% పెరిగాయి. గోదుమ పిండి ధర కూడా పెరిగింది.

వీడియో క్యాప్షన్, కోటిన్నర ఖర్చుతో ఎకరా స్థలంలో బావి తవ్వించాడు

ఏప్రిల్‌ నెలలో ఎగుమతులు రికార్డు స్థాయిలో పెరగడానికి ప్రభుత్వ విధానాలు కూడా కారణమని కొన్ని నివేదికలు వెల్లడించాయి. గోదుమల ఎగుమతిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది.

మధ్యప్రదేశ్ పర్యటనలో ఉన్న కేంద్ర ఆహార కార్యదర్శి సుధాంశు పాండే, ఎగుమతి ఆర్డర్‌లు పెరిగితే, రైల్వే మంత్రిత్వ శాఖ నుండి వెంటనే రేక్‌ (గూడ్స్ రైలు) ఏర్పాటు చేస్తామని ప్రకటించడం ఇందుకు ఉదాహరణ.

దీనితో పాటు, అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (APEDA) ద్వారా అనేక దేశాలలో వ్యాపార సదస్సులను కూడా ఏర్పాటు చేశారు. నాణ్యమైన గోదుమలను ఎగుమతి చేయడానికి పరీక్షా సౌకర్యాలు పెద్ద ఎత్తున అందుబాటులోకి వచ్చాయి.

మార్కెట్‌లో గోధుమల రేట్లు పెరగడంతో గోధుమ పిండితో తయారు చేసే అన్ని పదార్ధాల ధరలు పెరిగాయి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మార్కెట్‌లో గోధుమల రేట్లు పెరగడంతో గోధుమ పిండితో తయారు చేసే అన్ని పదార్ధాల ధరలు పెరిగాయి

ప్రభావం ఎంత?

ప్రస్తుతం ప్రభుత్వ దగ్గర నిల్వలో ఉన్న గోదుమల పరిమాణం ఈసారి కాస్త తక్కువగానే ఉంది. ఉత్పత్తి లేకపోవడం ఒక కారణం. ఉత్పత్తి తగ్గడంతో ప్రభుత్వ సేకరణ కూడా ప్రభావితమైంది.

రెండో కారణం ‘ప్రధానమంత్రి గరీబ్ అన్న కళ్యాణ్ యోజన’ ను సెప్టెంబర్ 2022 వరకు పొడిగించడం. ఈ ఏడాది ఏప్రిల్ 1న సెంట్రల్ పూల్‌లో గోదుమల ప్రారంభ నిల్వ దాదాపు 190 లక్షల టన్నులు. ఈ ఏడాది 195-200 లక్షల టన్నుల గోధుమలను మాత్రమే కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

''గోదుమ దిగుమతులు, ఎగుమతుల పూర్తి డేటాను చూసిన తర్వాత కూడా ఈ పరిస్థితిని ఎదుర్కోవటానికి ప్రభుత్వానికి మెరుగైన వ్యూహం ఉన్నట్లు కనిపించడం లేదు. పౌర సరఫరా వ్యవస్థ, ప్రధాన మంత్రి గరీబ్ అన్న కళ్యాణ్ యోజనలో గోధుమ పంపిణీ అవసరం. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే ప్రభుత్వానికి 480 లక్షల టన్నుల గోదుమలు అవసరమవుతాయి. కానీ, గత ఏడాది, ఈ ఏడాది గోదుమల నిల్వలను పరిశీలిస్తే కేవలం 380 లక్షల టన్నుల గోదుమలు మాత్రమే వస్తాయని అంచనా. అంటే, 100 లక్షల టన్నుల కొరత ఉంది. ఈ అంచనాల ప్రకారం భవిష్యత్తులో గోదుమల ధరలు పెరగవచ్చు'' అన్నారు హర్వీర్ సింగ్

గోధుమ పిండి కొనుక్కునే వారిపైనే పెరుగుదల భారం పడనుంది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గోధుమ పిండి కొనుక్కునే వారిపైనే పెరుగుదల భారం పడనుంది

అయితే, గోదుమ పిండి ధర పెరగడానికి వాతావరణ పరిస్థితులే ప్రధాన కారణమని హర్వీర్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఎగుమతులను నియంత్రించేందుకు భారత ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవాలని, సరుకును అక్రమ నిల్వలు (అలాంటిది జరిగితే), మార్కెట్‌లో ధరను నియంత్రించడానికి ఇదే సరైన సమయమని కూడా ఆయన అన్నారు.

''ఈసారి రైతులు ఎమ్ఎస్‌పీ కంటే ఎక్కువ ధరకు గోదుమలను విక్రయించారు. ఇది రైతులతో పాటు కేంద్ర ప్రభుత్వానికి కూడా శుభవార్త'' అని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మాజీ ఛైర్మన్ అలోక్ సిన్హా బీబీసీతో అన్నారు.

''ప్రభుత్వ సేకరణ అంచనాలు ఇంకా బయటకు రాలేదు. అయితే ఆహార భద్రతకు అవసరమైన గోధుమల నిల్వలో లోటు ఉంటుందని నేను భావించడం లేదు. దేశంలోని మూడింట రెండొంతుల జనాభా గోదుమ పిండి కోసం దుకాణాలకు వెళ్లరు. ఆహార పంపిణీ వ్యవస్థ, ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద వారు గోదుమలను పొందుతారు, వాటితో పిండి తయారు చేసుకుంటారు. అంటే కొనుక్కుని తినే వారిపైనే గోదుమ పిండి ధర పెరుగుదల భారం పడుతుంది. గోదుమల ఎగుమతి వల్ల ఇటు రైతులు, అటు కేంద్ర ప్రభుత్వం రెండూ లాభపడుతున్నాయి'' అన్నారు అలోక్ సిన్హా.

వీడియో క్యాప్షన్, మండు వేసవిలో చల్లదనం అందిస్తున్న కర్నూలు స్పెషల్ షర్బత్ 'నన్నారి'

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)