యుక్రెయిన్ యుద్ధం: భారత్‌లో వంటనూనెకు కొరత తప్పదా?

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇండోనేషియా తమ దేశంలో వంట నూనెల ధరలను అదుపు చేసేందుకు ఎగుమతులను నిలిపేస్తామని గతవారం ప్రకటించింది. యుక్రెయిన్ యుద్ధమే ఇందుకు కారణమని తెలిపింది. ఇక్కడ భారతదేశంలో వంటనూనెలు ఆహారంలో కీలకమైన పాత్ర పోషిస్తాయి. ప్రపంచంలో వంట నూనెల వినియోగంలో భారత దేశంలో రెండో అతి పెద్ద వినియోగదారు. దేశానికి అవసరమైన వంటనూనెలో 56% విదేశాల నుంచే వస్తుంది.
భారతీయులు ప్రధానంగా పామాయిల్, సోయాబీన్, పొద్దు తిరుగుడు నూనెలను వాడుతుంటారు. పామాయిల్ కోసం భారతదేశం ఎక్కువగా ఇండోనేషియాపై ఆధారపడుతుంది. ఇండియాకు అవసరమైన పామాయిల్‌లో 90% ఇండోనేషియా, మలేషియా నుంచి దిగుమతి అవుతుంది. అందులో దాదాపు సగం ఇండోనేషియా నుంచే వస్తుంది.
ఇండియాకు అవసరమైన పొద్దు తిరుగుడు నూనెలో సగం రష్యా, యుక్రెయిన్‌ల నుంచి వస్తుంది. ఇది ప్రపంచ ఎగుమతుల్లో 80% వాటా. ఒక రిపోర్ట్ ప్రకారం, యుక్రెయిన్ యుద్ధం వచ్చే ఆర్థిక సంవత్సరంలో సన్‌ఫ్లవర్ ఆయిల్ సరఫరాలో 25% కోతకు దారితీసే అవకాశం ఉంది. రెండవ అతిపెద్ద ఉత్పత్తిదారు మలేషియాలో కూడా పామాయిల్ నిల్వలు తక్కువగానే ఉన్నాయి.
ఈ ఏడాది భారతదేశం వంట నూనెను దిగుమతి చేసుకోవడానికి దాదాపు 2,000 కోట్ల డాలర్లు (రూ. 1,50,000 కోట్లు) ఖర్చు చేస్తుంది. ఇది రెండేళ్ల కిందట చేసిన ఖర్చుకంటే రెట్టింపు. "ఏ దేశం కూడా దిగుమతులపై అంతగా ఆధారపడదు. మనం ఇప్పుడు రక్తమోడుతున్నాం. ఇది పెద్ద సంక్షోభం. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం ఎలాగో ఈ యుద్ధం నుండి మనం నేర్చుకోవాలి" అని నూనె వాణిజ్య సంస్థ సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీవీ మెహతా అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ధరలను తగ్గించేందుకు భారత్ వంటనూనె పై సుంకాలను తగ్గించింది. కానీ 2020 నుండి పెరుగుతున్న ధరలు, ఇప్పుడు యుక్రెయిన్‌లో యుద్ధం కారణంగా సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో సమస్య మరింత పెరిగింది. రెండు సంవత్సరాలలో ప్రపంచ వ్యాప్తంగా పామాయిల్ ధరలలో 300% కంటే ఎక్కువ పెరుగుదల ఉంది. ఇండియాలో చాలా ఇళ్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు ఎక్కువగా ఈ చౌక నూనె పైనే ఆధారపడతాయి.
గత నెల రోజులలోనే వంట నూనెల ధరలు 20% కంటే ఎక్కువ పెరిగాయి. ప్రజలు ఇప్పటికే వంట సామాన్లను నిల్వ చేసుకున్నట్లు రిపోర్టులు వస్తున్నాయి. దేశంలోని చాలా వరకు చౌకగా లభించే స్ట్రీట్ ఫుడ్స్ ఎక్కువగా నూనెల్లో ఫ్రై అయ్యేవే ఎక్కువగా ఉంటాయి.
దేశంలోని పేదలకు బియ్యం, గోధుమలు, ఉప్పుతో పాటు వంటనూనె ప్రధానమైనది. ''వంట నూనె ధరల పెరుగుదల పేదలను కచ్చితంగా ఇబ్బంది పెడుతుంది'' అని భారతదేశపు ఆహార శాఖకు చెందిన సీనియర్ అధికారి సుధాన్షు పాండే అన్నారు.
ఇలాంటి పరిస్థితులు మార్చి నెలలో గత 16 నెలల్లోనే గరిష్ట స్థాయి (7.66%)కి చేరుకున్న ద్రవ్యోల్బణాన్ని మరింత రాజేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ''ధరలు ఇదే స్థాయిలో కొనసాగితే, భారతదేశం రేషన్ లో వాటిని సరఫరా చేయవలసి ఉంటుంది, ఎందుకంటే స్వల్పకాలంలో దిగుమతి కొరతను భర్తీ చేయడానికి ప్రత్యామ్నాయం లేదు'' అని ఐక్యరాజ్యసమితి ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ (UNFAO)కి చెందిన ఆహార ఆర్థికవేత్త డి యాంగ్ అన్నారు.
కొరతను పాక్షికంగా భర్తీ చేయడానికి, భారతదేశం ఈ సంవత్సరం ఆవాలు, సోయాబీన్ పంటపై ఆశలు పెట్టుకుంది. "దేశీయ ఉత్పత్తి పెరగడం వల్ల ప్రపంచ ద్రవ్యోల్బణం పూర్తి ప్రభావాన్ని భారతదేశం ఇప్పటికీ అనుభవించలేదు, ఎందుకంటే వంట నూనెల దేశీయ ధరల పెరుగుదల ప్రపంచ ధరల పెరుగుదలలో దాదాపు సగానికి పైగా ఉంది" అని పాండే అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
"కానీ చివరికి, మనం సొంత పంటపై ఆధారపడాలి. రైతులు మరింత ఆకర్షణీయమైన ధరలను పొందినప్పుడే వాళ్లు నూనె గింజలకు మారతారు'' అని పాండే అన్నారు.
ఆయిల్ పామ్‌ను ఎక్కువగా పండించడం దేశం ముందున్న ఒక ఆప్షన్. చూడటానికి ఈ ఆలోచన మంచిదే అనిపిస్తుంది. ఇది అత్యంత సమర్థవంతమైన పంట. సోయాబీన్ వంటి అదే తరహా పంటల కంటే అనేక రెట్లు ఎక్కువ నూనెను ఇస్తుంది. పామాయిల్ బహుళ వినియోగం ఉన్న ఆయిల్. వంట నూనెతో పాటు పారిశ్రామిక అవసరాలకు కూడా వాడుకోవచ్చు.
కానీ, పామాయిల్ కూడా నీటిని ఎక్కువగా తీసుకునే పంట. కొత్తగా తోటలు వేయాలంటే విస్తారంగా అడవులను నరికివేయాల్సి ఉంటుంది. కొత్త ఆయిల్ పామ్ తోటలలో మూడో వంతు తోటలు కొండలు ఎక్కువగా ఉండే ఈశాన్య ప్రాంతంలో రావాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే, ఇదే తరహా ఆలోచనను అమలు చేసిన ఇండోనేషియా, మలేషియాలు అక్కడ పర్యావరణాన్ని పణంగా పెట్టిన విషయాన్ని పర్యావరణవేత్తలు గుర్తు చేస్తున్నారు.
దేశీయంగా ప్రస్తుతం 2.7 శాతం ఉన్న పామాయిల్ ఉత్పత్తిని మరింత పెంచాలని ప్రభుత్వం భావిస్తోందని పాండే అన్నారు.

ఫొటో సోర్స్, WAHYUDI/AFP VIA GETTY IMAGES
భారతీయులు ప్రాంతాన్నిబట్టి ఆవాలు, వేరుశెనగ, కొబ్బరి, నువ్వులు వంటి అనేక నూనెలతో వంటలు వండుతారు. విదేశీ నూనెలైన పామాయిల్, పొద్దు తిరుగుడు వంటి వాటి వినియోగం పెరగడం పట్టణీకరణ, కాస్మోపాలిటనిజం వల్ల ఏర్పడిన పరిణామం. ఈ నూనెలు చౌకగా కూడా ఉంటాయి. పైగా అవి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలుగా కూడా ప్రచారం జరుగుతోంది. "దిగుమతి చేసిన నూనెల వాడకం పెరిగింది. ప్రస్తుత సంక్షోభం స్వీయ నిర్మితం'' అని ఆహార చరిత్రకారుడు ప్రిథా సేన్ చెప్పారు.
ఎక్కువ మంది ప్రజలు నగరాలకు వెళ్లడం, దేశంలోనే వివిధ ప్రాంతాలకు వలస వెళ్లడంతో వివిధ ప్రాంతాలలో ఇలా వలస వచ్చిన వారికి ఇష్టమైన వంటలను తయారు చేయడం కోసం పామాయిల్, సన్ ఫ్లవర్ వంటి రంగు, వాసన లేని నూనెలను వాడటం ఎక్కువైందని నిపుణులు చెబుతున్నారు. ''రోజూ ఇంట్లో చేసుకునే వంటలు తిని తినీ ప్రజలకు బోర్ కొట్టింది. అందుకే కొత్త వంట నూనెలను ఎంచుకుంటున్నారు'' అని ఆహార రచయిత మర్రియమ్ హెచ్.రేషి అన్నారు.
పెరిగిన ఖర్చులతో ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న భారతీయులను ఈ వంట నూనెల ధరల పెరుగుదల ఇంకా బాధిస్తోంది. అయితే, ఈ సంక్షోభం, వంట నూనెను తెలివిగా ఉపయోగించుకునేల ప్రజలను ప్రేరేపించగలదని ఆహార రచయిత సాదియా ధైలీ అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- బిహార్‌లో కేరళకు చెందిన జాతీయ స్థాయి క్రీడాకారిణి ఆత్మహత్య.. ఏం జరిగింది?
- భారత్‌లో ఉద్యోగాల్లో మహిళలు తగ్గిపోతున్నారా? కారణాలు ఏంటి?
- ఎలాన్ మస్క్: ట్విటర్ కొత్త యజమానిని ఇబ్బందుల పాలు చేసిన ఆరు సొంత ట్వీట్లు
- ఏపీ: ‘సీఎంఓ నుంచి అంటూ ఎమ్మెల్యేలకు టోకరా.. 80 లక్షలతో గాజువాకలో ప్రియురాలికి ఇల్లు’
- హీట్‌వేవ్: తెలంగాణకు ఎల్లో అలర్ట్.. వడదెబ్బ తగిలిందని ఎలా తెలుస్తుంది
- నాన్న ఆఫీస్‌కు వెళ్లాడని అమ్మ కారు తాళాలు తీసుకుని ఈ నాలుగేళ్ల పిల్లాడు ఏం చేశాడంటే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














