భారత్‌లో ఉద్యోగాల్లో మహిళలు తగ్గిపోతున్నారా? కారణాలు ఏంటి?

మహిళలు
    • రచయిత, షాబాద్ నజ్మీ
    • హోదా, బీబీసీ విజువల్ జర్నలిజం టీమ్

భారత్‌లో చాలామంది మహిళలు ఉద్యోగాల కోసం వెతకడం లేదు. గత కొన్ని సంవత్సరాలతో పోలిస్తే ఉద్యోగం చేయాలని కోరుకునే మహిళల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఇది చాలా ఆందోళన కలిగించే విషయం.

భారత్‌లో శ్రామిక వర్గం నుంచి ఎంతమంది మహిళలు దూరం అయ్యారు?

2017-2022 మధ్య దాదాపు 2.1 కోట్ల మంది మహిళలు శాశ్వతంగా ఉద్యోగాలను వదిలిపెట్టారు. అంటే దీనర్థం ఇప్పుడు ఈ మహిళలంతా నిరుద్యోగులుగా ఉండి ఉంటారు. లేదంటే వారు ఉద్యోగాలను వెదుక్కోవడం లేదు.

మహిళలు ఉద్యోగాలకు దూరంగా ఉండటం వల్ల కలిగే పర్యవసానాల్లో ఒకటి, దేశ ఆర్థిక వ్యవస్థలో శ్రామికుల భాగస్వామ్యం క్షీణించడం.

మహిళలు

సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) తాజా నివేదిక ప్రకారం... 2017లో జనాభాలో 46 శాతం మంది ఆర్థిక వ్యవస్థలో పాలు పంచుకున్నారు. 2022 నాటికి ఈ వాటా 40 శాతానికి తగ్గింది.

అంటే, గత ఐదేళ్ల కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థలో కార్మికుల భాగస్వామ్యంలో ఆరు శాతం క్షీణత నమోదైంది.

ఈ గణాంకాలు పెద్దగా ఆశ్చర్యం కలిగించనప్పటికీ, దేశంలోని శ్రామికశక్తిలో మహిళల భాగస్వామ్యం క్రమంగా తగ్గుతున్నట్లుగా చూపిస్తున్నాయి.

2004-05లో యువ గ్రామీణ మహిళల (15-29 ఏళ్లు) లేబర్ పార్టీసిపేషన్ రేటు 42.8 శాతం. అప్పటి నుంచి ఇది స్థిరంగా క్షీణిస్తూ వస్తోంది. 2018-19 నాటికి ఈ రేటు 15.8 శాతానికి తగ్గింది.

మహిళలు పని

పని, నిరుద్యోగం

ఇంటి పనుల పేరిట మహిళలు ఎన్ని గంటలు చాకిరీ చేస్తారో మీకు తెలుసా?

భారతీయ మహిళలు ప్రతిఫలం ఏమీ ఆశించకుండా రోజుకు సగటున నాలుగు గంటలు కుటుంబంలోని ఇతర సభ్యుల కోసం వెచ్చిస్తున్నారు. ఇంట్లోని పెద్దవారిని చూసుకోవడం, పిల్లల పెంపకం, వంట చేయడం, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం వంటి పనులు చేస్తుంటారు. పిల్లల సంరక్షణకే ఎక్కువ సమయం కేటాయిస్తారు.

గణాంకాల మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం... మహిళలతో పోలిస్తే పురుషులు తమ రోజులో కేవలం 25 నిమిషాలు మాత్రమే ఇంటి పనుల్లో గడుపుతున్నారు. పురుషులు తమ రోజులో ఎక్కువ భాగం ఉద్యోగం, దానికి సంబంధించిన ఇతర పనులకు కేటాయిస్తారు.

మహిళలు ఉద్యోగం కోసం ఇళ్లను వదిలి రాకపోవడానికి ఉన్న కారణాలలో అతిపెద్దది... వారి ఉద్యోగాలు, కుటుంబసభ్యుల అభిప్రాయాలతో ముడిపడి ఉండటం.

మహిళలు

పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్ఎఫ్ఎస్) ప్రకారం, 2018-19లో పట్టణ యువ మహిళల (15-29) నిరుద్యోగిత రేటు 25.7 శాతం. అదే సమయంలో, అదే వయస్సులో ఉన్న పట్టణ పురుషుల నిరుద్యోగిత రేటు 18.7 శాతం మాత్రమే.

సీఎంఐఈ తాజా గణాంకాలు మరింత ఆందోళనకరంగా ఉన్నాయి. 2016లో జనవరి-ఏప్రిల్ వరకు 2.8 కోట్ల మంది నిరుద్యోగ మహిళలు ఉన్నారు. వారు మళ్లీ ఉద్యోగాలు చేయాలని అనుకున్నారు. కానీ, 2021 డిసెంబర్‌కు వచ్చేసరికి ఇలా ఉద్యోగాలు చేయాలనుకునే మహిళల సంఖ్య 80 లక్షలకు పడిపోయింది.

గ్రామీణ ప్రాంతాల్లో పురుషుల కంటే నిరుద్యోగ మహిళలు తక్కువ. కానీ, దీన్ని ఆశావహ ఫలితంగా చూడలేం. గ్రామీణ ప్రాంతాల్లో కూడా పురుషులు, మహిళల్లో నిరుద్యోగిత రేటు పెరుగుతోంది. పట్టణ మహిళల నిరుద్యోగిత రేటు మరింత స్థిరంగా పెరుగుతోంది.

మహిళలు

రవాణా సమస్యలు

తెలంగాణలో నివసించే అంగన్‌వాడీ కార్యకర్త బాలమ్మ మాట్లాడుతూ... '' నేను పనిచేసే చోటు దగ్గరికి నన్ను తీసుకెళ్లడానికి, అక్కడి నుంచి మళ్లీ ఇంటికి తీసుకురావడానికి నాకు భర్త లేరు, తండ్రి కూడా లేరు. బస్సు లేదా కారు ఉంటే అక్కడికి వెళ్లగలం. ఇలాంటి సౌకర్యాలు లేకపోతే నేను ఎలా వెళ్లగలను?'' అని అన్నారు.

కోవిడ్-19 మహమ్మారి విజృంభించిన సమయంలో ఫ్రంట్‌లైన్‌లో పనిచేసిన మహిళల్లో బాలమ్మ కూడా ఉన్నారు.

అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ నివేదిక ప్రకారం... వివాహితులైన అంగన్‌వాడీ, ఆశా వర్కర్లు వారు పనిచేస్తోన్న చోటుకు, ఇతర ప్రాంతాలకు వెళ్లిరావడానికి భర్త లేదా అత్తవారింటి సభ్యులపై ఆధారపడతారు.

పట్టణాల్లోని సగం మంది మహిళలు రెగ్యులర్ ఉద్యోగాల్లో ఉన్నారు. వారు ఎదుర్కొనే సవాళ్లలో రవాణా సమస్యలు కూడా ఉంటాయి. సామాజిక భద్రత లేకపోవడం, వేతనాల్లో తేడాలు కూడా మహిళలు ఉద్యోగాలను వదిలి పెట్టడానికి కారణం అవుతుంటాయి.

మహిళలు

నేరాలు

మహిళలపై జరిగే నేరాలు వారు ఇళ్లు దాటి వెళ్లకుండా, ఉద్యోగాలు చేయకుండా ప్రభావం చూపిస్తాయా?

మహిళలపై, బాలికలపై నేరాల రేటు అధికంగా ఉన్న రాష్ట్రాల్లోనే... శ్రామికశక్తిలో మహిళల భాగస్వామ్యం తక్కువగా ఉన్నట్లు 'ఇనీషియేటివ్ ఫర్ వాట్ వర్క్స్ టు అడ్వాన్స్ వుమెన్ అండ్ గర్ల్స్ ఇన్ ద ఎకానమీ' అనే సర్వేలో తేలింది.

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఆధారంగా రాష్ట్ర స్థాయి క్రైమ్ డేటాను విశ్లేషిస్తే 2011-2017 మధ్య బిహార్, దిల్లీల్లో మహిళలపై నేరాలు కాస్త పెరిగాయి. ఇదే సమయంలో శ్రామికశక్తిలో మహిళల భాగస్వామ్యం కూడా తగ్గింది.

నేరాలకు, మహిళల ఉద్యోగాలకు మధ్య ప్రతికూల సంబంధం ఉంటుందని ఈ పరిశోధన చూపిస్తోంది. మహిళలు పనిచేసే విషయంలో ఎదురయ్యే సమస్యలన్నింటిలో వారిపై జరిగే నేరాలు అతిపెద్ద సమస్య అని దీని ద్వారా తెలుస్తోంది. ఈ కారణంగానే వారు ఇల్లు వదిలి ఉద్యోగాలకు వెళ్లేందుకు భయపడుతున్నారు.

మహిళలు

గ్రామాలు, పట్టణాల మధ్య వ్యత్యాసం

భారత్‌లోని నగర మహిళల ఉద్యోగిత రేటు 2020తో పోలిస్తే 2021లో 6.9 శాతం తక్కువగా నమోదైంది. 2021తో పోలిస్తే 2019లో 22.1 శాతం ఎక్కువ మంది మహిళలు ఉద్యోగాల్లో ఉన్నారు.

అయితే, గ్రామీణ మహిళల్లో ఈ ధోరణి కనిపించడం లేదు. 2019తో పోలిస్తే 2021లో గ్రామీణ మహిళల ఉపాధి రేటు 0.1 శాతం తక్కువ. దీన్ని బట్టి చూస్తే కరోనా మహమ్మారి తర్వాత గ్రామీణ మహిళల కంటే నగర మహిళలే ఉద్యోగాలు పొందడంలో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు అర్థం అవుతుంది.

2019లో ప్రతీనెలా సగటున 95.2 లక్షల మంది మహిళలు ఉద్యోగాల కోసం వెదికారు. 2020లో ఈ సంఖ్య 83.2 లక్షలకు, 2021లో 65.2 లక్షలకు పడిపోయింది. అదే సమయంలో 2019తో పోలిస్తే 2021లో ఉద్యోగాల కోసం వెదుకుతోన్న పురుషుల సంఖ్య పెరిగింది.

కరోనా తర్వాత మహిళలు తక్కువ సంఖ్యలో పని చేస్తుండటమే కాకుండా... అంతకంటే తక్కువ సంఖ్యలో మహిళలు ఉద్యోగాల కోసం చూస్తున్నారని ఈ గణాంకాలు తెలుపుతున్నాయి.

వీడియో క్యాప్షన్, భవిష్యత్‌లో రాబోయేవన్నీ టెంపరరీ ఉద్యోగాలేనా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)