CREDIT CARD: కొత్తగా క్రెడిట్ కార్డు తీసుకునే వాళ్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

ఫొటో సోర్స్, PA Media
- రచయిత, రవి కుమార్ పాణంగిపల్లి
- హోదా, బీబీసీ ప్రతినిధి
కోవిడ్ సమయంలో క్రెడిట్ కార్డ్ వినియోగం తగ్గినప్పటికీ, తాజాగా జనవరి 2022 నాటికి రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలో బ్యాంకులు, ఆర్థిక లావాదేవీలు జరిపే వివిధ సంస్థలు జారీ చేసిన క్రెడిట్ కార్డుల సంఖ్య అక్షరాల 7కోట్ల 2లక్షల 52వేల 69.
కేవలం డిసెంబర్, జనవరి నెలల్లోనే మొత్తం 26 లక్షలకు పైగా కొత్త క్రెడిట్ కార్డులు జారీ అయ్యాయి.
ఈ నేపథ్యంలో కొత్తగా క్రెడిట్ కార్డు తీసుకునే వాళ్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ఏయే అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి?
అసలు క్రెడిట్ కార్డు తీసుకోవడం వల్ల లాభమా? నష్టమా? ఈ వివరాలను ఓసారి చూద్దాం.
అప్పు... ఎప్పుడైనా అప్పే. దాన్ని తీరాల్సిందే. అయితే అత్యవసర పరిస్థితుల వల్ల ఎవరెవర్నో అడిగి, లేదనిపించుకునే బదులు, అడక్కుండానే అప్పు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న వడ్డీ వ్యాపారే ఈ క్రెడిట్ కార్డ్.
అవసరానికి వాడుకొని, అడగ్గానే బిల్లు కట్టేసినంత కాలం ఎలాంటి సమస్యా ఉండదు. పైగా అప్పుతో పాటు ఆఫర్లు, రివార్డు పాయింట్లు కూడా ఉంటాయి.
సమయానికి చెల్లించకపోతేనే అసలు సమస్య. ఇది రెండు వైపులా పదునుండే కత్తి లాంటిది.

ఫొటో సోర్స్, Getty Images
1. ఏ కార్డు కావాలి?
ప్రశ్న బాగానే ఉంటుంది. కానీ సమాధానం మాత్రం మీ ఆదాయంపైనే ఆధారపడి ఉంటుంది. ఏ సంస్థ అయినా ముందు మీ సంపాదన చూస్తుంది. ఏటా అది పెరుగుతోందా.. తగ్గుతోందా అనే సంగతి కూడా పరిశీలిస్తుంది.
మీ ఆదాయంలో క్రమంగా పెరుగుదల కనిపిస్తేనే మీకు కార్డు ఎంచుకోవడంలో అనేక ఆప్షన్లు ఉంటాయి.
క్రెడిట్ కార్డుల్లో కూడా రివార్డ్ పాయింట్ కార్డులు, క్యాష్ బ్యాక్, ట్రావెల్, బిజినెస్, స్పోర్ట్స్ ఇలా ఎన్నో రకాలు ఉంటాయి. వాటిల్లో మీ అవసరాలకు ఏది తగినదో చూసుకొని ఎంచుకోవాలి.
అలాగే కార్డు రాగానే అది మీరు అప్లై చేసిన రకమా.. కాదా ? అలాగే కార్డుపై మీ పేరు సరిగ్గా ఉందా.. లేదా ? అనే విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించండి.
2. ఒక్క కార్డుకే పరిమితం కండి
మీరు క్రెడిట్ కార్డుకు అప్లై చెయ్యగానే.. చాలా ఆఫర్లు మీ ముందుకొస్తాయి. అంటే వచ్చిన ప్రతి ఆఫర్‌కి ఓకే చెప్పేయమని కాదు. మొట్టమొదటి సారి క్రెడిట్ తీసుకుంటున్న వారు ఒక్క కార్డుని, అది కూడా మీ అవసరాలకు తగిన సరైన కార్డును ఎంచుకోండి.
ఒక్క విషయం గుర్తుంచుకోండి..ఎక్కువ కార్డులు తీసుకునే కొద్దీ మీ అప్పులు కూడా పెరిగిపోయే అవకాశాలు ఎక్కువవుతాయి.
3. తక్కువ క్రెడిట్ లిమిట్ ఉన్న కార్డు ఉత్తమం
సాధారణంగానే క్రెడిట్ కార్డుపై ఉన్న ఆఫర్లు మనల్ని టెంప్ట్ చేస్తుంటాయి. అలాగని ఎంత ఎక్కువ ఖర్చు పెడితే అంతే ఎక్కువ తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
కొన్నిసార్లు అది మీకు సాధ్యం కాకపోవచ్చు. సరిగ్గా ఇక్కడే మీ క్రెడిట్ లిమిట్ మిమ్మల్ని ఓ రకంగా కాపాడుతుంది. తక్కువ క్రెడిట్ లిమిట్ ఉండటం వల్ల మీరు పరిధి దాటి ఖర్చు పెట్టే అవకాశం ఉండదు.
ఇది ఓ రకంగా మీ ఆర్థిక పరిస్థితిని ఆరోగ్యకరంగా ఉంచుతుంది. మీ క్రెడిట్ కార్డు వినియోగం పెరిగే కొద్దీ సదరు సంస్థలు మీ క్రెడిట్ లిమిట్‌ను పెంచేందుకు ఉత్సాహం చూపిస్తూ పదే పదే ఫోన్లు చేస్తుంటాయి.
ఇస్తామంటున్నారు కదా అని అనవసరంగా ఉచ్చులో పడిపోకండి. ఎంత ఆర్థిక క్రమ శిక్షణ ఉన్నప్పటికీ ఒక్కోసారి చిక్కులు తప్పకపోవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
4. గడువు తేదీని గుర్తుంచుకోండి
మొదటిసారి క్రెడిట్ కార్డు తీసుకునే వాళ్లు గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం గడువు లోపు బిల్లు చెల్లించడం.
సాధారణంగా మొదటిసారి కార్డు వినియోగించే వారికి బ్యాంకులు కొన్ని రోజులు ఉచిత గ్రేస్ పీరియడ్‌ను కూడా ఇస్తుంటాయి. ఆపై మీరు ఎంత ఆలస్యం చేస్తుంటే.. అంతగా ఆలస్య రుసుములు పెరుగుతాయి.
గడువులోగా బిల్లు చెల్లించడం వల్ల మీ క్రెడిట్ స్కోర్ బాగుంటుంది. అలాగే కార్డు తీసుకునే ముందు ఆలస్య రుసుముల గురించి, వడ్డీ రేట్ల గురించి కూడా తప్పనిసరిగా తెలుసుకోవాలి.
5.తెలివిగా ఉపయోగించండి.. తరచూ ఖర్చు పెట్టండి
కార్డు వినియోగంలో తప్పనిసరిగా తెలివిని ప్రదర్శించాలి. ఏ వస్తువు తీసుకునే సమయంలోనైనా మనం వినియోగిస్తున్న కార్డుకు ఎక్కెడెక్కడ ఆఫర్లు ఉన్నాయన్న విషయం ఆరా తియ్యండి.
కొన్నిసార్లు ఆన్‌లైన్ మార్కెట్లలో నిర్ణీత గడువులో కొన్ని కార్డులపై ప్రత్యేక ఆఫర్లు అందిస్తుంటాయి.
అవసరం అనుకున్నప్పుడు వాటిని వినియోగించుకోవడంలో మొహమాటపడొద్దు. అలాగే తీసుకున్న కార్డును ఉపయోగించకుండా వదిలేయకండి.
ఎందుకంటే నిర్ణీత సమయంలో తగిన మొత్తంలో ఖర్చు పెట్టడం ద్వారా కార్డులపై ఉండే వార్షిక రుసుము నుంచి తప్పించుకోవచ్చు.
తీసుకున్న కార్డును వాడకుండా వదిలేస్తే కొన్నిసార్లు సదరు సంస్థలు అదనపు రుసుముల్ని కూడా వసూలు చేయవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
6. మరిన్ని ముఖ్యమైన విషయాలు
బ్యాంకు ఖాతాలో ఫోన్ నెంబర్ అప్‌డేట్ అయ్యిందో లేదో చూసుకోండి. కార్డు ఉపయోగించే ప్రతిసారీ లావాదేవీలకు సంబంధించి మెసేజ్ మీకు వస్తూ ఉండాలి.
అలాగే కార్డును ఎప్పుడు, ఎక్కడ స్వైప్ చేస్తున్నారో కూడా జాగ్రత్తగా చూసుకోండి. పిన్ నెంబర్ విషయంలో తప్పనిసరిగా గోప్యత పాటించండి.
కొన్ని క్రెడిట్ కార్డులు ఉచితంగా బీమా కూడా అందిస్తున్నాయి. వాటిని కూడా పరిశీలించవచ్చు.
అలాగే మీ క్రెడిట్ కార్డు వినియోగం మీ క్రెడిట్ స్కోరుపై కూడా ప్రభావం చూపిస్తుంది. కనుక కార్డును ఎప్పుడూ నిర్ణీత మొత్తంలో 40 శాతానికి మించి ఖర్చుపెట్టకపోవడం మంచిది.
అలాగే క్యాష్ లిమిట్ ఉంది కదా అని ఏటీఎంల నుంచి క్రెడిట్ కార్డు ద్వారా నగదును డ్రా చెయ్యవద్దు. అలాగే క్రెడిట్ లిమిట్‌ను కూడా పరిమితం చేసుకోండి.
ఫలితంగా కార్డు హ్యాక్ చేసినా నష్టం భారీగా ఉండదు. ఒక వేళ క్రెడిట్ కార్డు పోతే వెంటనే కస్టమర్ కేర్‌కి ఫోన్ చేసి కార్డును బ్లాక్ చెయ్యండి.
చివరిగా ఒక్క విషయం గుర్తుంచుకోండి. క్రెడిట్ కార్డు తీసుకునే విషయంలో ఆచి తూచి వ్యవహరించండి. అవసరానికి తగట్టు వాడండి.
అత్యవసర పరిస్థితుల్లో క్రెడిట్ కార్డు ఆదుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అదే సమయంలో అతి పెద్ద బాధ్యతను నెత్తిన పెట్టుకుంటున్నారన్న విషయాన్ని మర్చిపోవద్దు.
బాధ్యత గుర్తెరిగి వ్యవహరిస్తున్నంత కాలం అంతా బాగానే ఉంటుంది. లేదంటే అది నెత్తిన గుదిబండై కూర్చుంటుంది.
ఇవి కూడా చదవండి:
- రష్యా-యుక్రెయిన్ యుద్ధంలో 'డీప్‌ఫేక్' ప్రెసిడెంట్స్ ఎవరు, వారు ఏమంటున్నారు?
- నా కొడుకుని వెనక్కు తీసుకురావాలంటే నేనెవరి తలుపు తట్టాలి?: రష్యా సైనికుడి తల్లి ఆవేదన
- డాలర్ల గ్రామంలోని తండ్రీకొడుకులు కోట్ల రూపాయలు ఎలా కొల్లగొట్టారంటే...
- పాకిస్తాన్లోకి భారత్ మిస్సైల్: జర్మనీతో మాట్లాడిన పాకిస్తాన్.. అమెరికా, చైనాల రియాక్షన్
- నాటోకు రష్యా భయపడుతుందా, యుక్రెయిన్‌ను ఎందుకు చేర్చుకోవద్దంటోంది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














