గుజరాత్: డాలర్ల గ్రామంలోని తండ్రీకొడుకులు కోట్ల రూపాయలు ఎలా కొల్లగొట్టారంటే...

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, లక్ష్మీ పటేల్
- హోదా, బీబీసీ కోసం
''నేను రూ. 25 లక్షల రూపాయలు మోసపోయాను. నన్ను మోసం చేసిన ఆ తండ్రీకొడుకులను నేనెప్పటికీ మరిచిపోను. రూ. 15 లక్షలు లోన్ తీసుకున్నాను. ఆ లోన్ వాయిదాలు కూడా నేనే కట్టాలి. దయచేసి నా పేరును బయటపెట్టొద్దు.''
రాజస్థాన్‌లోని జైపూర్ నివాసి ఆవేదన ఇది. తన బాధ గురించి వివరిస్తూ ఆ వ్యక్తి ఏడ్చినంత పనిచేశారు. మోసపోయిన వాళ్లనే సమాజం నిలదీస్తుందని అన్నారు.
ఇలాంటి మోసపూరిత ఘటనలు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో జరిగాయి.
గుజరాత్ రాష్ట్రం మెహసణాలోని అఖాజ్ గ్రామానికి చెందిన తండ్రీకొడుకులు ఇలాంటి మోసాలు చేస్తూ ప్రజల నుంచి కోట్లాది రూపాయలు కొల్లగొట్టారు.
అహ్మదాబాద్‌కు సుమారు 70 కి.మీ దూరంలో ఉండే ఈ గ్రామం, 'డాలరియా' గ్రామం అనే పేరుతో ప్రసిద్ధి చెందింది.
నిజానికి ఈ గ్రామంలోని ప్రతీ కుటుంబంలో కనీసం ఒకరైనా విదేశాల్లో నివసిస్తూ డాలర్లలో సంపాదిస్తుంటారు. ఇక్కడ మొత్తం జనాభా 5,000 కాగా ఇందులో 2000 మంది విదేశాల్లోనే నివసిస్తున్నారు. ఎక్కువగా అమెరికాలో ఉంటున్నారు.
మరోసారి ఈ గ్రామంపై చర్చ ప్రారంభమైంది. డాలర్ల గ్రామంగా గొప్ప పేరు సంపాదించుకున్న దీని ప్రతిష్ట మసకబారుతోంది. దీనికి కారణం మోసాలకు పాల్పడుతోన్న తండ్రీ, కొడుకుల ద్వయం.
ఈ గ్రామంలో నివసించే 41 ఏళ్ల నీల్ అలియాస్ హితేశ్ పటేల్, ఆయన తండ్రి గోర్ధన్‌భాయి పటేల్‌లపై కోట్లాది రూపాయల కుంభకోణం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మొబైల్ అప్లికేషన్లు, కంపెనీలు ఏర్పాటు చేసి ప్రజల నుంచి భారీ మొత్తంలో లూఠీ చేసినట్లు వారిపై ఆరోపణలు వచ్చాయి.
అత్యధికంగా గుజరాత్‌కు చెందినవారే వీరిద్దరి చేతిలో మోసపోయినట్లు అంచనా. వీరిలో చాలామంది పోలీస్ స్టేషన్లలో, సైబర్ క్రైమ్ విభాగాల్లో ఫిర్యాదు చేశారు.
2022 ఫిబ్రవరి 20న హైదరాబాద్ పోలీసులు అహ్మదాబాద్‌కు వచ్చి గోర్ధన్‌భాయిని అదుపులోకి తీసుకున్నారు. ఆయనను హైదరాబాద్‌కు తరలించారు.
ఈ కేసు గురించి హైదరాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ సీహెచ్ గంగాధర్ మాట్లాడారు. ''మేం గోర్ధన్‌భాయి పటేల్‌ను అరెస్ట్ చేశాం. ప్రజల్ని మోసగించినట్లు ఒక కంపెనీపై కేసు నమోదైంది. ఆ కంపెనీకి ఆయన ఎండీగా ఉన్నారు. తెలంగాణలో ఈ కంపెనీపై 5 ఫిర్యాదులు ఉన్నాయి. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ కంపెనీపై మరో 90 ఫిర్యాదులు నమోదైనట్లు మాకు తెలిసింది. గోర్ధన్‌భాయి పటేల్ కస్టడీ కోరుతూ రాజస్థాన్, కర్ణాటక పోలీసులు మమ్మల్ని సంప్రదించారు'' అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
స్క్వీక్స్ టెక్నాలజీ సర్వీసెస్ అనే కంపెనీకి నీల్ పటేల్, గోర్ధన్ పటేల్ యజమానులు.
అనేక వెబ్‌సైట్లు, మొబైల్ అప్లికేషన్లు తయారు చేస్తూ ప్రజలను మోసం చేస్తోందని ఈ కంపెనీపై ఆరోపణలు ఉన్నాయి.
నీల్ తండ్రి గోర్ధన్ కంపెనీకి డైరెక్టర్‌గా ఉన్నారు. అందుకే ఆయనను అరెస్ట్ చేశారు. నీల్ కూడా పోలీసుల అదుపులోనే ఉన్నారు.
ఈ తండ్రీకొడుకులకు వ్యతిరేకంగా గుజరాత్ నుంచి కూడా చీటింగ్‌కు సంబంధించిన అనేక ఫిర్యాదులు వస్తున్నాయి.
అయితే, ఇప్పటివరకు ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదని అహ్మదాబాద్ సైబర్ సెల్ డీసీపీ అమిత్ వాసవా అన్నారు.
'చాలామంది పెద్ద నేతలు, అధికారులు కూడా లింక్‌ను షేర్ చేశారు'
వారి చేతిలో మోసానికి గురైన వారిలో జైపూర్‌కు చెందినవారు ఉన్నారు. 2020 సెప్టెంబర్‌లో ట్విట్టర్ ద్వారా తమకు నీల్‌తో పరిచయం ఏర్పడిందని జైపూర్‌కు చెందిన ఒక వ్యక్తి చెప్పారు.
''ఆయనది వెరిఫైడ్ ట్విట్టర్ అకౌంట్. చాలామంది పెద్ద నాయకులు, అధికారులు ఆయన ట్విట్టర్ ఖాతాను షేర్ చేశారు. అందుకే నేను నీల్ పటేల్‌పై విశ్వాసం ఉంచాను'' అని ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, HARYANA POLICE
''ముందుగా నీల్ పటేల్ దగ్గర 'నారద్ పే' పేరిట ఒక అప్లికేషన్ ఉండేది. ఇందులోని ఒక స్కీమ్ ప్రకారం మీరు రూ. 15,000 ప్లాన్‌ను తీసుకున్నట్లయితే, మీకు ప్రతీనెల రూ. 3,334 వెనక్కి ఇస్తారు. ఒక సంవత్సరం తర్వాత రూ. 15,000 తిరిగి ఇచ్చేస్తారు.''
''నేను అందులోని చాలా ప్లాన్లను సబ్‌స్క్రైబ్ చేశాను. మా సోదరికి కూడా ఇందులో పెట్టుబడి పెట్టాలని సలహా ఇచ్చాను. మూడు నెలల పాటు అన్నీ సజావుగానే జరిగాయి. ఆ తర్వాత స్కీమ్‌ను ఆపేశారు.''
''దీనితో పాటు నీల్ దగ్గర 15,000 రూపాయల విలువ చేసే ఐఫోన్ స్కీమ్ కూడా ఉంది. నేను ఐఫోన్లు ఆర్డర్ చేశాను. నాకు 2 ఐఫోన్లు ఇచ్చారు. అందుకే నీల్‌ను నమ్మడం ప్రారంభించారు.''
''దీని తర్వాత క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ నేర్చుకోవడంతో ముడిపడి ఉన్న ఒక స్కీమ్ గురించి నీల్ చెప్పారు. దాని కోసం రూ. 43,000 ఇవ్వాలని అన్నారు. ఆ తర్వాత ఒక సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. సర్టిఫికెట్ వచ్చాక ఆయన రెండేళ్ల కాలపరిమితితో ఒక ఉద్యోగాన్ని ఇచ్చారు.''
''నేను పెళ్లి చేసుకోబోతున్నా. నాకు శాశ్వత ఉద్యోగం లేదు. అందుకే నేను ఆయన చెప్పిన స్కీమ్‌ను తీసుకున్నా. ట్రేడింగ్‌లో మెళకువలు నేర్పించిన తర్వాత ఇథేరియం క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఆయన నాకు చెప్పారు. మూడు నెలల లాక్ ఇన్ పీరియడ్ ఉంటుందని అన్నారు. నేను 5 ఇథేరియం కరెన్సీ, 20 బిట్‌కాయిన్లు కొన్నాను.''
''ఆయనకు వ్యతిరేకంగా అనేక మంది బయటకొచ్చారు. కానీ తన తండ్రి పేరున్నవాడని, తమ అవసరం లేదనుకున్న వారికి డబ్బు తిరిగి ఇచ్చేస్తానని ఆయన చెప్పారు. అందుకే ప్రజలు ఆయనను నమ్మారు. కొందరు మాత్రం ఆయన దగ్గర నుంచి డబ్బు వెనక్కి తీసుకున్నారు'' అని ఆయన చెప్పుకొచ్చారు.
టెస్లా, క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడుల పేరిట మోసాలు
నీల్, గోర్ధన్ మోసాల గురించి బాధితుడు మరింత వివరించారు. ''ఆ తర్వాత 'ద బుల్ రన్' పేరిట నీల్ ఒక వెబ్‌సైట్‌ను తయారు చేశారు. వెబ్‌సైట్ లాగిన్ కోసం అకౌంట్ నంబర్, పాస్‌వర్డ్ ఇచ్చారు. ఆ అకౌంట్‌లో మనకు ఇథేరియం క్రిప్టో కరెన్సీ కనిపిస్తుంది. దీని తర్వాత టెస్లాలో పెట్టుబడి కోసం 1000 డాలర్ల (రూ. 76,351)ను తీసుకున్నారు.''
''టెస్లా షేర్లకు 10 వేల డాలర్ల విలువ ఉంటుందని ఆయన చెప్పారు. అమెరికాలో నివసిస్తోన్న ఒక వ్యక్తి జారీ చేసిన చెక్‌ను నాకు ఇచ్చారు. ఈ చెక్‌ను డిపాజిట్ చేసినప్పుడు బౌన్స్ అయింది. దీని తర్వాత నీల్ పటేల్ కనిపించకుండా పోయారు. ఆయన వెబ్‌సైబట్, సామాజిక మాధ్యమ ఖాతాలు కూడా కనిపించట్లేదు.''
''నేను మోసపోయినట్లు తెలుసుకున్న తర్వాత నీల్, ఆయన తండ్రి గోర్ధన్‌ను కలిసేందుకు ప్రయత్నించాను.''
''అయిదు నెలల క్రితం, గుజరాత్‌లోని అఖాజ్ గ్రామానికి వెళ్లాను. అక్కడ గోర్ధన్ పటేల్‌ను కలిశాను. డబ్బులు తిరిగి ఇస్తానని ఆయన మాట ఇచ్చారు. రెండు నెలల తర్వాత కూడా డబ్బులు చేతికి రాలేదు. ఇక డిసెంబర్ నెలలో నాలాగే మోసపోయిన 20-30 మంది బాధితులతో కలిసి ఆ గ్రామానికి వెళ్లాను.''
''అక్కడి కమ్యూనిటీ హాల్‌లో గోర్ధన్ పటేల్‌తో అందరం సమావేశమయ్యాం. 15 రోజుల్లో తప్పకుండా డబ్బు ఇచ్చేస్తానని ఆయన చెప్పారు.''

ఫొటో సోర్స్, Getty Images
కోట్ల రూపాయల మోసం?
అకాశ్ అహ్మదాబాద్ నివాసి. ఆయన ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తారు. ''నీల్ పటేల్ చేసిన మోసంలో నేను రూ. 2.35 లక్షలు నష్టపోయాను. 'నారద్ పే', క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడుల పేరిట నన్ను మోసం చేశారు. ఆన్‌లైన్ సైబర్ సెల్‌లో ఫిర్యాదు ఇచ్చాను. నాలుగైదుసార్లు వారి ఊరికి వెళ్లాను. ప్రతీసారి నా డబ్బులు నాకు ఇచ్చేస్తాననే ఆయన చెప్పారు.''
''ఇప్పటికీ ఏడాది గడిచిపోయింది. కానీ ఒక్క రూపాయి కూడా చేతికి రాలేదు. గుజరాత్‌కు చెందిన 10-15 బాధితులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాను. వారు మా ఫిర్యాదు గురించి విన్నారు. కానీ మా ఫిర్యాదును నమోదు చేసుకోలేదు'' అని తన ఆవేదనను వెళ్లగక్కారు.
ముంబైలో నివసిస్తోన్న గుజరాత్‌కు చెందిన ఒక యువకుడు కూడా ఈ బాధితుల్లో ఉన్నారు. ''నేను రూ. 16 లక్షలు పోగొట్టుకున్నాను. మా అమ్మ, సోదరి పొదుపు చేసుకున్న డబ్బును కూడా తీసుకెళ్లి నేను పెట్టుబడి పెట్టాను. ఆ డబ్బు అంతా పోయింది. వారి గ్రామానికి వెళ్లి అక్కడ గోర్ధన్ పటేల్‌ను కలిశాం.''
''ఆయన మాకు వారి విలాసవంతమైన భవనాన్ని చూపించారు. ఉగాండా నుంచి డబ్బులు సంపాదించానని చెప్పారు. మా డబ్బులు మాకిచ్చేస్తానని మాట ఇచ్చారు. కానీ డబ్బు తిరిగి రాలేదు'' అని ఆకాశ్ తన అనుభవాన్ని పంచుకున్నారు.
మరో బాధితుడు దినేశ్, కచ్ జిల్లాకు చెందినవారు. ''నారద్ పే, ఇథేరియం క్రిప్టో కరెన్సీ పేరుతో నేను రూ. 6 లక్షలు నష్టపోయాను. మేం దీనిగురించి వినియోగదారుల పరిరక్షణ ఫోరంలో ఫిర్యాదు చేశాం. కానీ డబ్బు వెనక్కి వస్తుందనే ఆశ మాత్రం లేదు. ఈ అంశంలో ఎవరూ కఠిన చర్యలు తీసుకోవట్లేదు'' అని దినేశ్ చెప్పారు.
హరియాణాలోని జీంద్‌కు చెందిన కౌశిక్ రూ.16 లక్షలు మోసపోయారు.
''గుజరాత్‌లో దాదాపు 15 మందిని వారు మోసం చేశారు. వారితో నేను మాట్లాడుతుంటాను. గుజరాత్ పోలీసులు తమ ఫిర్యాదును పట్టించుకోవడం లేదని వారు నాతో చెప్పారు. 2021 ఏప్రిల్ నుంచి నీల్‌పై ఫిర్యాదు నమోదు చేసేందుకు నేను ప్రయత్నిస్తూనే ఉన్నా. కానీ విజయం సాధించలేకపోయాను'' అని కౌశిక్ అన్నారు.
''250 మంది సభ్యులతో ఒక టెలిగ్రామ్ గ్రూప్‌ను ఏర్పాటు చేశాను. గతవారం నీల్ ఫోన్ చేసి నన్ను బెదిరించారు. 'మా అంకుల్ బీజేపీ ఎమ్మెల్యే. అందుకే నాకు వ్యతిరేకంగా గుజరాత్ పోలీసులు ఎలాంటి చర్య తీసుకోరు' అని అన్నారు. బహుశా ఆయన చెప్పింది నిజమేనేమో. ఎందుకంటే చాలామంది బాధితులు గుజరాత్‌లోనే ఉన్నప్పటికీ పోలీసులు ఆయనకు వ్యతిరేకంగా ఫిర్యాదు దాఖలు చేయట్లేదు'' అని కౌశిక్ ఆరోపించారు.
అఖాజ్ గ్రామానికి చెందిన పేరు చెప్పడానికి ఇష్టపడిన ఒక వ్యక్తి కూడా దీని గురించి మాట్లాడారు.
''గోర్ధన్‌భాయి పటేల్ అఖాజ్ గ్రామానికి చెందినవారు. ఆయన ఉగాండాకు వెళ్లి వచ్చారు. మూడేళ్ల క్రితమే ఆయన ఇక్కడికి తిరిగి వచ్చారు. దాదాపు ఏడెనిమిదేళ్లు ఆయన ఉగాండాలో ఉన్నారు. ఇక్కడికి వచ్చాక వారసత్వంగా సంక్రమించిన ఇంటిని కోట్లు వెచ్చించి పునర్నిర్మించుకున్నారు. ఇంత డబ్బెలా వస్తోందని గ్రామస్థులు అడిగితే, తన కొడుకు నీల్ అమెరికాలో లాటరీ గెలిచాడని చెప్పారు.''
''గత మూడేళ్లుగా గోర్ధన్‌భాయి పటేల్ సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటున్నారు. అనేక విరాళాలు ఇచ్చారు. పాఠశాలల పిల్లలకు పుస్తకాలు పంపిణీ చేశారు. అందుకే ప్రజల్లో ఆయనకు గుర్తింపు వచ్చింది. నెమ్మదిగా ఆయన ప్రజలను ఆకర్షించడం మొదలుపెట్టారు.''
''60 వేల రూపాయల విలువ చేసే ఐఫోన్‌ను కేవలం 15 వేలకే ఇవ్వడం ప్రారంభించారు. వారు ప్రవేశపెట్టిన పథకం విజయవంతం కానప్పటికీ, ఆయన కొంతమంది గ్రామస్థులకు డబ్బులను తిరిగి ఇచ్చేశారు'' అని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- The Kashmir Files: 'ఏళ్ల తరబడి అణచిపెట్టిన సత్యాన్ని వెలుగులోకి తీసుకొస్తే... ఆందోళన ఎందుకు?' -ప్రధాని మోదీ
- ఆంధ్రప్రదేశ్: 'మా ఇంటిని మళ్లీ మేమే ఎక్కువ రేటిచ్చి కొనుక్కోవాలా...' యూఎల్సీ నోటీసులపై మండిపడుతున్న జనం
- రష్యా టీవీ లైవ్‌లో యుద్ధానికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన జర్నలిస్ట్ ఏమయ్యారు?
- పాకిస్తాన్లోకి భారత్ మిస్సైల్: జర్మనీతో మాట్లాడిన పాకిస్తాన్.. అమెరికా, చైనాల రియాక్షన్
- యుక్రెయిన్ శరణార్థుల ఆకలి తీర్చి, ఆదుకుంటున్న భారతీయులు- గ్రౌండ్ రిపోర్ట్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














