యుక్రెయిన్ శరణార్థుల ఆకలి తీర్చి, ఆదుకుంటున్న భారతీయులు- గ్రౌండ్ రిపోర్ట్

- రచయిత, దివ్య ఆర్య
- హోదా, బీబీసీ ప్రతినిధి, యుక్రెయిన్-పోలాండ్ సరిహద్దుల నుంచి
రష్యా దాడి కారణంగా ఇప్పటివరకు 20 లక్షలకు పైగా ప్రజలు యుక్రెయిన్‌ను వదిలి వెళ్లిపోయినట్లు ఐక్యరాజ్యసమితి చెబుతోంది. పొరుగు దేశమైన పోలాండ్‌కు అత్యధికంగా 15 లక్షల మంది శరణార్థులుగా వెళ్లారు.
సరిహద్దుల వద్ద విధులు నిర్వహిస్తోన్న పోలాండ్ ఉద్యోగులకు వివిధ దేశాల నుంచి ఉద్యోగాల కోసం అక్కడికి వెళ్లినవారు సహాయపడుతున్నారు.
గడిచిన కొన్నిరోజుల్లో 'ఆపరేషన్ గంగ' కార్యక్రమం కింద యుక్రెయిన్‌లో చిక్కుకున్న చాలామంది భారతీయును స్వదేశానికి తీసుకొచ్చారు. అయినప్పటికీ భారతీయుల్లో చాలామంది యుక్రెయిన్ నుంచి సరిహద్దులకు తరలివస్తోన్న శరణార్థుల కోసం స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

యుక్రెయిన్-పోలాండ్ సరిహద్దుల్లోని మెడికా చెక్‌పాయింట్ వద్ద వాలంటీర్లుగా పనిచేస్తోన్న కొంతమంది భారతీయులతో మా బీబీసీ ప్రతినిధి మాట్లాడారు.
ప్రస్తుతం ఈ ప్రాంతంలో గడ్డకట్టే చలి ఉంది. కొన్ని ప్రాంతాల్లో మంచు కురుస్తోంది. రాత్రివేళల్లో చాలా ప్రాంతాల ఉష్ణోగ్రతలు '0' డిగ్రీల కంటే కిందికి పడిపోతాయి. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో కూడా పిల్లలు, వారి తల్లిదండ్రులు, వృద్ధులు ఎలాగోలా పోలాండ్‌కు సురక్షితంగా చేరాలని ప్రయత్నిస్తున్నారు.
ఇక్కడ స్వచ్ఛంద కార్యకర్తల అవసరం చాలా ఉంది. కీయెవ్‌లో బాంబు దాడి నుంచి పారిపోయి ఒక్సానా తన ఇద్దరు కూతుళ్లతో కలిసి సరిహద్దులకు చేరుకున్నారు. ''మాకు చాలా అన్యాయం జరిగింది. మా ఇంటిపై బాంబు దాడి జరిగింది. మా ఇంటిని కాపాడుకోలేకపోయాం. పిల్లలు చాలా భయపడిపోయారు. కానీ ఇప్పుడు బాగానే ఉన్నారు. అమ్మమ్మ వాళ్ల ఇంటికి ఫిన్లాండ్‌కు వెళ్దామని నేను వారికి చెబుతున్నాను'' అని ఆమె చెప్పారు.
ఒక్సానా వంటి శరణార్థులకు సహాయం చేసేందుకు చాలామంది భారతీయులు ముందుకు వచ్చారు.
రెండు సూట్‌కేసుల సామాను, ఇద్దరు పిల్లలతో పారిపోయి వచ్చిన ఒక్సానా ఆశ్రయం కోసం వెతుకుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆమె ఫిన్లాండ్‌కు చేరుకోవడం అంత సులభమేమీ కాదు. కానీ తన ప్రయాణంలో పలువురు ఆమెకు సహాయం చేసేందుకు చొరవ చూపించారు. అలాంటివారిలో న్యూయార్క్‌లో నివసించే హర్‌దయాల్ సింగ్ కూడా ఒకరు.

దీని గురించి హర్‌దయాల్ సింగ్ మాట్లాడారు. ''మాకు ఒకవైపు యుక్రెయిన్ ఉంది. మరోవైపు పోలాండ్ సరిహద్దు ఉంటుంది. ఇది గ్రీన్ జోన్. దీన్ని 'డీమిలిటరైజ్డ్' జోన్‌గా పిలుస్తారు. ఇక్కడ సైనికులు ఉండరు. ఇక్కడికి వచ్చే శరణార్థుల కోసం లంగర్ ఏర్పాటు చేసి భోజన సదుపాయం కల్పిస్తున్నాం. వారికి కావాల్సిన తక్షణ సహాయం, ఉన్నిదుస్తులు అందిస్తున్నాం. దీనితో పాటు మేం యుక్రెయిన్‌కు కూడా ఆహారాన్ని తీసుకెళ్తున్నాం. 16, 17 గంటల పాటు నడిచి మేం అక్కడికి చేరుకుంటాం. అక్కడ తినడానికి ఏమీ లేదు. అన్నీ మూతపడ్డాయి. అక్కడ కూడా మేం లంగర్ ఏర్పాటు చేస్తాం'' అని హర్‌దయాల్ సింగ్ వివరించారు.
ఇక్కడొక ఫుడ్ ట్రక్ ఉంది. ఈ ట్రక్‌లో రోజుకు 2 వేలకు పైగా ప్రజలకు ఆహారం తయరు చేస్తారు.

యుక్రెయిన్‌లో పనిచేస్తోన్న మానవతా సంస్థల్లో 'యునైటెడ్ సిక్క్స్' ఒకటి. ఈ సంస్థ సభ్యురాలైన కమ్‌నీవ్ కౌర్, సరిహద్దుల్లో సమస్యలు ఎదుర్కొంటోన్న ప్రజలకు సహాయం చేస్తున్నారు. ''నా దగ్గర కొంత బియ్యం, పప్పులు ఉన్నాయి. కొంత సూప్ కూడా ఉంది. మేం ఇక్కడకు వస్తోన్న ప్రజలకు టీ, కాఫీలు అందించేందుకు ప్రయత్నిస్తున్నాం'' అని ఆమె చెప్పారు.
ఫుడ్ ట్రక్‌లు ఉన్న కొంతమంది ప్రజలు కూడా సరిహద్దులకు వచ్చారు. అక్కడ చలితో వణుకుతోన్న వారికి ఆహారం అందించేందుకు వీరు ప్రయత్నిస్తారు. అలాంటి ఒక ఫుడ్‌ట్రక్‌కు యజమాని నికుల్.
''నాకు చిన్న వ్యాపారం ఉంది. రెండు రెస్టారెంట్లతో పాటు ఒక ఫుడ్ ట్రక్ ఉంది. నా భార్య పోలాండ్‌కు చెందిన వ్యక్తి. మాకు ఇద్దరు పిల్లలు. దురదృష్టవశాత్తు మాకు రేపు ఏదైనా జరిగితే, ఇప్పుడు మేం చేస్తున్నట్లుగానే రేపు మాకు కూడా ఎవరైనా సహాయం చేయడానికి వస్తారు. భగవంతుని దయ వల్ల అలాంటి రోజు రాకూడదని కోరుకుంటున్నా'' అని ఆయన అన్నారు.
చలి, ఆకలి కారణంగా శరణార్థుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది.
''మూడు, నాలుగు రోజుల ముందు మా కళ్లముందే ఏడు ఏనిమిది మంది వృద్ధ మహిళలు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. వారిని ఎలాగోలా కాపాడగలిగాం. తీవ్రమైన చలి కారణంగా చిన్న పిల్లలు వాంతులు చేసుకుంటున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి బాగా లేదు. ఇది తెలియగానే మేం ఇక్కడ గుడారం ఏర్పాటు చేశాం. అందులో హీటర్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రజలు కాసేపు సేదతీరేలా కుర్చీలు, టేబుళ్లు కూడా ఉంచుతాం'' అని హర్‌దయాళ్ వివరించారు.

మానవతా సహాయం అందించాలనే ఉద్దేశంతో గుజరాత్ మూలాలున్న బ్రిటిష్ యువతి దిషితా సోలంకీ కూడా అక్కడికి చేరుకున్నారు.
బీబీసీతో దిషిత మాట్లాడారు. ''మేం చిన్న చిన్న సహాయం అందిస్తున్నాం. ఎవరైనా వృద్ధులు ఇక్కడికి వస్తే, వారి లగేజీ మోయడం, దాన్ని భద్రపరచడం లాంటివి చేస్తుంటా. ఒక్కొక్కరు చేతుల్లో పిల్లల్ని ఎత్తుకొని చలిలో 15-20 గంటలపాటు నడుచుకుంటూ వస్తారు. వారికి సహాయపడుతుంటా. ఇక్కడికి వచ్చిన వారికి కావాల్సిన వస్తువుల కొరత లేదు. ఆహారం కూడా అందుతుంది. కానీ సరుకులు మోసుకొని వస్తోన్న వారికే సహాయం అందించేవారు లేరు. అందుకే వారికి సహాయపడుతున్నా'' అని ఆమె చెప్పారు.
వేలాదిమంది ప్రజల కఠినమైన, సుదీర్ఘమైన ప్రయాణం ఇంకా కొనసాగుతోంది. భయంకరమైన చలిలో కఠినమైన ప్రయాణం చేస్తోన్న ఈ శరణార్థులకు మానవతాసహాయం అందిస్తోన్న కార్యకర్తల కారణంగా కాస్త ఉపశమనం కలుగుతోంది.
ఇవి కూడా చదవండి:
- పవన్ కల్యాణ్: జనసేనాని 'జన నేత' ఎందుకు కాలేకపోతున్నారు? జనసేన పార్టీ ఎందుకు ఎదగడం లేదు?
- గుండె, కిడ్నీ మార్పిడికి ఇక వేచి చూడక్కర్లేదా? మనుషులకు పందుల అవయవాలు సెట్ అయినట్లేనా?
- జంగారెడ్డిగూడెంలో 18 మంది మృతి: ఇవి నాటుసారా కల్తీ మరణాలా? సహజ మరణాలా?
- ‘అనుభవం ఉందా’ అని అడిగే కంపెనీలకు ఆన్సర్ NATS
- ఇమ్రాన్ ఖాన్: ‘తల్చుకుంటే ఏదైనా చేయగలం.. కూరగాయల ధరలు తెలుసుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












