గుండె, కిడ్నీ మార్పిడికి ఇక వేచి చూడక్కర్లేదా? మనుషులకు పందుల అవయవాలు సెట్ అయినట్లేనా? ఈ ఆపరేషన్లు చేసిన వైద్యుల్లో కొత్త ఆశలు ఎందుకు?

పందుల నుంచి అవయవ మార్పిడి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పందుల నుంచి అవయవ మార్పిడి
    • రచయిత, జేమ్స్ గల్లఘర్
    • హోదా, ఇన్‌సైడ్ హెల్త్ ప్రజంటర్, బీబీసీ రేడియో 4

అవయవ మార్పిడి కోసం గతంలో ఎప్పుడూ లేనివిధంగా మరింత ముందుకెళ్లి పరిశోధనలు చేస్తున్నారు. జెనెటిక్ ఇంజనీరింగ్ చేసిన పందుల నుంచి తీసిన మొదటి అవయవాలను మనుషులకు పెట్టారు.

మొదటి పంది గుండెను పెట్టుకున్న మనిషి రెండు నెలలపాటు జీవించగలిగాడు.

ప్రపంచం ఎదుర్కుంటున్న అవయవాల కొరతను పరిష్కరించడానికి, అపరిమితంగా అవయవాల సరఫరా ఉండేలా పందులను ఉపయోగించడానికి మనం ఎంత దగ్గర్లో ఉన్నాం.

ఆపరేషన్ థియేటర్లో నిశ్శబ్దం అలుముకుని ఉంటుంది. రోగి శరీరంలో కనిపించే మార్పు కోసం సర్జన్లు అందరూ ఉద్వేగంగా చూస్తున్నారు.

అప్పుడే సర్జరీ చేసిన వారు ఒక పంది మూత్రపిండాన్ని ఒక వ్యక్తికి అమర్చారు. క్లాంప్స్ తీశారు. ఇప్పుడు ఆ పంది అవయవంలో మనిషి రక్తం ప్రవహిస్తోంది.

"ఆపరేషన్ థియటర్లో సూది పడినా వినిపించేంత నిశ్శబ్దంగా ఉంటుంది" అంటారు ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డాక్టర్ జైమీ లాకీ.

ఆ సర్జరీ సక్సెస్ అయ్యిందా లేక ఫెయిలయ్యిందా అనేది మరికొన్ని క్షణాల్లో తేలిపోతుంది. అందరి మనసులనూ ఇప్పుడు ఒకే ప్రశ్న తొలుస్తోంది. అది పింక్‌గానే ఉంటుందా, లేక నల్లగా మారుతుందా?

రోగి శరీరం ఆ పరాయి అవయవం మీద తీవ్రంగా దాడి చేస్తే, ఆ పంది అవయవం కణజాలంలోని కణాలు లోపలి నుంచి బయటకు గడ్డకడడం మొదలవుతుంది. దానిపై మొదట మచ్చలు వస్తాయి, తర్వాత అది నీలంగా మారుతుంది, నిమిషాల్లో అది పూర్తిగా నల్లగా మారిపోతుంది.

శరీరం దానిని తీవ్రంగా తిరస్కరించడాన్ని (హైపర్‌అక్యూట్ రెజెక్షన్)ను నివారించగలిగితే, రక్తం, ఆక్సిజన్ లోపలికి రాగానే ఆ అవయవం పింక్‌లోకి మారుతుంది.

"అది పింక్‌గా మారితే, మాకు ఊపిరొచ్చినట్లు ఉంటుంది. ఆపరేషన థియేటర్లో అంతా ఉత్సాహం, ఒక ఆశ వచ్చేస్తుంది. మేం హై ఫైవ్ కూడా చేసుకుంటాం" అని లాకీ చెప్పారు. ఆమె అమెరికా, బర్మింగ్‌హాంలో యూనివర్సిటీ ఆఫ్ అలబామాలో పనిచేస్తున్నారు.

జీనోట్రాన్స్‌ప్లాంటేషన్ రంగంపై మళ్లీ ఆసక్తిని పెంచిన వైద్యపరమైన వరుస పురోగతుల్లో ఈ ఆపరేషన్ ఒకటి.

బర్మింగ్‌హాంలోని అలబామా యూనివర్సిటీ సర్జన్ల బృందం

ఫొటో సోర్స్, STEVE WOOD

ఫొటో క్యాప్షన్, బర్మింగ్‌హాంలోని అలబామా యూనివర్సిటీ సర్జన్ల బృందం

మనిషి శరీరంలో జంతువుల అవయవాలు ఉపయోగించడం అనేది పాత ఆలోచనే. చింపాజీల నుంచి వృషణాల ఇంప్లాంట్స్ తీసుకోవడం నుంచి, వానరాల మూత్రపిండాలు, గుండెలు తీసుకోవడం వరకూ జరిగింది. తర్వాత ఆ అవయవాలు మార్చుకున్నవారు చనిపోయారు కూడా.

ఇక్కడ సమస్యేంటంటే, మనిషి శరీరంలో జంతువుల అవయవాలను అమర్చినపుడు, మన రోగనిరోధక శక్తి వాటిని ఒక ఇన్ఫెక్షన్లా, దాడిలా భావిస్తుంది.

పందుల అవయవాలు దాదాపు మనకు సరిపోయే పరిమాణంలో ఉండడం వల్ల, ఈమధ్య వాటి అవయవాలను తీసి మనుషులకు పెట్టడంపై దృష్టిపెట్టారు.

కానీ హైపరక్యూట్ రెజెక్షన్ వల్ల, ఆ అవయవం నల్లగా మారకుండా చూసుకోవడంలో వైద్యులకు సవాలు ఎదురవుతోంది.

ఈ ప్రక్రియలో మనం అలా పందుల దొడ్డిలోకి వెళ్లి ఒక పందిని ఎంచుకుని, దాని అవయవం తీసేసుకోవడం కుదరదు. వాటి అవయవాలు మన రోగనిరోధకశక్తికి మరింత అనుకూలంగా ఉండేలా చేయడానికి, పందుల డీఎన్ఏను మార్చేలా జెనెటిక్ ఇంజనీరింగ్‌లో భారీ పురోగతి సాధించారు.

ఇటీవల జరిగిన మూత్రపిండం, గుండె మార్పిడి చికిత్సల కోసం ప్రత్యేకంగా సృష్టించిన 10-జీన్ పిగ్ నుంచి అవయవాలు సేకరించారు.

దానం చేసిన ఏవైనా అవయవాలు మనిషి గ్రోత్ హార్మోన్లకు స్పందించి, నియంత్రణ దాటి పెరగకుండా అడ్డుకునేలా ఆ పందిలో ఒక జెనెటిక్ మెలిక ఉంటుంది.

దీనిలో ఆల్ఫా-గాల్ అనే చక్కెర అణువును తొలగించడం అనేది మరో ముఖ్యమైన జన్యు మార్పు. ఇది పంది కణాల ఉపరితలంపై అతుక్కుని ఉంటుంది. మనిషి శరీరం దానిని మరో జీవి అవయవం అని సులభంగా గుర్తించగలిగేలా ఈ చక్కెర అణువు ఒక నియాన్ సైన్‌బోర్డులా మెరుస్తుంటుంది.

మనిషి రోగనిరోధక శక్తిలోని 'కాంప్లిమెంట్ సిస్టమ్' అనే ఒక విభాగం ఆల్ఫా-గాల్ కోసం వెతుకుతూ మన శరీరంలో గస్తీ కాస్తుంటుంది. అందుకే, అవయవ మార్పిడి జరిగిన కొన్ని క్షణాల్లోనే అది దానిని తిరస్కరించి చంపేస్తాయి.

ఇలాంటి మరో మరో రెండింటిని కూడా జన్యుపరంగా తొలగిస్తారు. దానికి మనిషికి సంబంధించిన ఆరు జోడిస్తారు. ఇవి పంది కణాలపై ఉంటూ దాని గురించి శరీరానికి తెలీకుండా మభ్య పెట్టే ఒక వలలా పనిచేస్తాయి. ఆ అవయవాన్ని మన రోగనిరోధక శక్తికి తెలీకుండా దాచడానికి సాయం చేస్తాయి. ఈ 10-జీన్ పందులను అవయమ మార్పిడికి తగినట్లు ఉండేలా చాలా పరిశుభ్రమైన పరిస్థితుల్లో పెంచుతారు.

మూత్ర పిండాలు జిమ్ పార్సన్స్

ఫొటో సోర్స్, PARSONS FAMILY

ఫొటో క్యాప్షన్, బ్రెయిన్ డెడ్‌కు గైరన జిమ్ పార్సన్స్‌కు పంది మూత్ర పిండాలు పెట్టారు

మూత్రపిండం, గుండె

ఈ పంది నుంచి తీసిన రెండు మూత్రపిండాలను 2021 సెప్టెంబర్‌లో బ్రెయిన్ డెడ్‌కు గురైన జిమ్ పార్సన్స్ వ్యక్తి శరీరంలో అమర్చారు.

అవయవాలు దానం చేయాలనుకున్న పార్సన్స్ చనిపోగానే, ఆయన కిడ్నీలను దానం చేశారు. దీంతో కుటుంబ సభ్యుల అనుమతితో పంది మూత్ర పిండాలను వైద్యులు ఆయన శరీరంలో పెట్టారు.

ఆయన శరీరంలోని పంది మూత్రపిండాల్లో ఒకటి మూత్రం తయారుచేసిన క్షణాన్ని డాక్టర్ లాకీ ఒక అద్భుతంగా వర్ణించారు. "జీనోట్రాన్స్‌ప్లాంటేషన్ నిజంగా ప్రజల జీవితాలను మార్చగలదు, ఇంకా చెప్పాలంటే ప్రజల ప్రాణాలు కాపాడగలదు" అన్నారు.

ఆమె ఈ ఏడాది ద్వితీయార్థంలో క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించాలనుకుంటున్నారు. ఈ ఆపరేషన్ మూడు రోజులపాటు జరిగిన ఒక సుదీర్ఘ ప్రయోగం.

కానీ, ఈలోపు మేరీలాండ్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్లోని సర్జన్లు మరో అడుగు ముందుకు వేసే ఆలోచనల్లో ఉన్నారు.

వారి 57 ఏళ్ల పేషెంట్ డేవిడ్ బెనెట్ గుండె తీవ్రంగా విఫలమైంది. మనిషి గుండె మార్చడానికి ఆయన సరిపోరని భావించారు. గుండె, ఊపిరితిత్తులకు సపోర్ట్ ఇచ్చే ఎక్మో మెషిన్ మీద బెనెట్‌ను సజీవంగా ఉంచారు.

బెనెట్ తనకు పంది గుండె పెట్టడాన్ని చీకట్లో బాణం వేయడంగా వర్ణించారు.

మనిషికి మొదటి పంది గుండె మార్పిడి సర్జరీ బాల్టిమోర్‌లో జరిగింది

ఫొటో సోర్స్, UMSOM

ఫొటో క్యాప్షన్, మనిషికి మొదటి పంది గుండె మార్పిడి సర్జరీ బాల్టిమోర్‌లో జరిగింది

ఒక 10-జీన్ పిగ్‌ను జనవరి 7న నేరుగా ఆస్పత్రికి తీసుకెళ్లారు. దాని గుండెను తీసి డేవిడ్ బెనెట్ చాతీలో అమర్చారు. ఆ ఆపరేషన్ చాలా క్లిష్టమైనది. ఎందుకంటే పాడైన బెనెట్ గుండె బాగా ఉబ్బిపోయి ఉంది. దాంతో చిన్నగా ఉన్న పంది గుండెకు దాని రక్తనాళాలు అమర్చడం సర్జన్లకు సవాలుగా నిలిచింది.

తర్వాత పంది గుండెను బెనెట్ శరీరం తిరస్కరిస్తోందేమోనని డాక్టర్లు ఉత్కంఠగా ఎదురుచూశారు. కానీ అది కొట్టుకుంటూనే ఉంది, పింక్‌గానే కనిపిస్తోంది.

"నా జీవితంలో అలాంటిది చూస్తానని అనుకోలేదు" అని కార్డియాక్ జీనోట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగిన ఆ ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ మొహమ్మద్ మొహియుద్దీన్ చెప్పారు.

ఆ ఆపరేషన్ జరిగి ఒక నెల పూర్తైన సందర్భంగా నేను ఆయనతో మాట్లాడినప్పుడు, ఆ గుండెను బెనెట్ శరీరం తిరస్కరించినట్లు ఎలాంటి సంకేతాలూ కనిపించలేదని, కానీ, ఆయన ఇంకా బలహీనంగానే ఉన్నారని మొహియుద్దీన్ చెప్పారు.

"మేం 1960ల నాటి కారులో, సరికొత్త ఫెరారీ ఇంజన్ పెట్టాం.. ఆ ఇంజన్ చాలా బాగా పనిచేస్తోంది. కానీ మిగతా శరీరం దానికి అడ్జస్ట్ కావాల్సుంటుంది" అని ఆయన అన్నారు.

కానీ, ఆ ట్రాన్స్‌ప్లాంట్ జరిగిన రెండు నెలల తర్వాత బెనెట్ చనిపోయారు. దాంతో జీనోట్రాన్స్‌ప్లాంటేషన్‌లో ఎదురయ్యే చిక్కులు ఇప్పటికీ అనిశ్చితిలోనే ఉండిపోయాయి.

డేవిడ్ బెనెట్‌తో జనవరిలో సర్జన్ బార్ట్లీ పి.గ్రిఫిత్ ఫొటో

ఫొటో సోర్స్, UNIVERSITY OF MARYLAND SCHOOL OF MEDICINE

ఫొటో క్యాప్షన్, డేవిడ్ బెనెట్‌తో జనవరిలో సెల్ఫీ దిగిన సర్జన్ బార్ట్లీ పి.గ్రిఫిత్

బెనెట్ ఈ ఆపరేషన్ ముందు చాలా బలహీనంగా ఉన్నారు. ఆయన కోలుకోడానికి కొత్త గుండె కూడా సరిపోదని చెప్పడానికి అవకాశం ఉంది.

పంది గుండెను బెనెట్ శరీరం తిరస్కరించినట్టు సంకేతాలు కనిపించినట్లు రిపోర్టులు రాలేదు. కానీ, ఈ గుండెను నిశితంగా పరిశీలించినప్పుడు, రోగనిరోధశక్తి దానిపై దాడిచేసిన సంకేతాలు ఏవైనా కనిపిస్తే, మనిషి శరీరానికి అనుకూలంగా ఉండే అవయవాల తయారీ కోసం 10-జీన్ పిగ్‌కు మరిన్ని మార్పులు చేయాల్సుంటుంది.

మరోలా చూస్తే, ఇది అనాటమీ(శరీర నిర్మాశ శాస్త్రం) కిందికి రావచ్చు, పంది గుండెలు బహుశా మనిషి శరీరానికి పనికిరాకపోవచ్చు. మనం నాలుగు కాళ్లకు బదులు రెండు కాళ్లపై నడుస్తాం కాబట్టి, మన గుండె గురుత్వాకర్షణతో పోరాడ్డానికి పంది గుండె కంటే మరింత కఠినంగా పనిచేయాల్సుంటుంది..

యూనివర్సిటీ ఆఫ్ నాటింగ్‌హామ్‌లో స్టెమ్ సెల్ బయాలజీ ప్రొఫెసర్ క్రిస్ డెనింగ్ హైపరక్యూట్ రెజెక్షన్‌ను అధిగమించడాన్ని గుండె మార్పిడిలో విజయంగా భావిస్తున్నారు.

"సమస్య బలహీనతే అయితే జీనోట్రాన్స్‌ప్లాంటేషన్ భవిష్యత్తులో విజయవంతం కావచ్చు. కానీ, అది శరీరనిర్మాణం కిందికి వస్తే మాత్రం, బహుశా దీని పురోగతికి అది ఒక పెద్ద అడ్డంకిగా మారవచ్చు అన్నారు.

దీనిపై, క్లినికల్ ట్రయల్స్ కొనసాగించాలని ఆస్పత్రి ప్లాన్ చేస్తోంది.

వీడియో క్యాప్షన్, మానసిక ఆరోగ్యం: మీకు దిగులుగా ఉంటోందా... గుండె దడ పెరుగుతోందా?

"ఎక్కువమంది ప్రాణాలు కాపాడ్డానికి పంది గుండె మనిషి గుండె అంత బలంగా ఉండాల్సిన అవసరం లేదు. అవయవ మార్పిడి కోసం ఎదురుచూస్తూ చాలామంది చనిపోతున్నారు" అని బ్రిటన్ ప్రముఖ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్లలో ఒకరైన ప్రొఫెసర్ జాన్ వాల్‌వర్క్ అంటున్నారు.

ప్రపంచంలో మొదటి గుండె, ఊపిరితిత్తులు, కాలేయం మార్పిడి సర్జరీ చేసిన ప్రొఫెసర్ వాల్‌వర్క్ జీనోట్రాన్స్‌ప్లాంటేషన్‌కు మార్గదర్శిగా నిలిచారు.

"వంద మందికి మనిషి గుండెతో 85 శాతం జీవించే అవకాశం ఇవ్వడం కంటే, పంది గుండె అమర్చి వెయ్యి మందికి 70 శాతం జీవించే అవకాశాలు ఇవ్వవచ్చు. అంటే అది మనిషి అవయవం అంత బలంగా లేకపోయినా, వెయ్యి మంది రోగులకు అసలు మార్పిడి జరగకపోవడం కంటే పంది గుండె పెట్టడం మంచిదే కదా" అన్నారు.

ట్రాన్స్‌ప్లాంటేషన్ వైద్యంలో జీనోట్రాన్స్‌ప్లాంటేషన్‌ను ఎప్పుడూ భవిష్యత్ అద్భుతంగా చెబుతూవస్తున్నారు. మైలురాళ్లలా నిలిచిపోయేలా ఎన్నో వరుస అవయవ మార్పిడి సర్జరీలు జరిగాయి. అందులో సందేహం లేదు. కానీ ఆ రంగంలో కంటున్న కలలన్నీ ఎప్పటికి నిజమవుతాయి అనేది ఆ దిశగా జరిగే మరింత పరిశోధనల్లోనే తేలుతుంది.

"మూత్రపిండాలు విఫలమైన రోగి, కాలేయం ఫెయిలైన రోగి, గుండె విఫలమైన రోగి, ఊపిరితిత్తుల వ్యాధితో చివరి దశలో ఉన్న ఒక రోగి ప్రాణాలు కాపాడగలిగేలా ఒక 10-జీన్ పిగ్‌ను సృష్టించాలనేదే మా లక్ష్యం" అంటున్నారు డాక్టల్ లాకీ.

"అది నిజంగా ఒక గొప్ప విజయమే అవుతుంది. నా జీవితంలో నేను దాన్ని చూడగలనని బలంగా నమ్ముతున్నా" ఆంటారామె.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)