మనిషికి పంది గుండె.. ప్రపంచంలో మొదటి సర్జరీ విజయవంతం

ఫొటో సోర్స్, University of Maryland School of Medicine
ప్రపంచంలో మొట్టమొదటి సారిగా.. జన్యుసవరణ చేసిన పంది గుండెను ఒక మనిషికి అమర్చారు.
అమెరికాలోని బాల్టిమోర్‌లో డేవిడ్ బెనెట్ (57) అనే వ్యక్తికి ఏడు గంటల పాటు శస్త్రచికిత్స చేసి పంది గుండెను అమర్చారు వైద్యులు.
మూడు రోజుల కిందట ఈ సర్జరీ జరిగింది. డేవిడ్ ప్రస్తుతం కోలుకుంటున్నారని వైద్యులు చెప్పారు.
డేవిడ్ ప్రాణాలను కాపాడటానికి చివరి అవకాశంగా ఈ గుండె మార్పిడి చేశారు. అయితే ఈ గుండె ఆయనను ఎంత కాలం కాపాడుతుందనే అంశంపై ఇంకా స్పష్టతలేదు.
‘‘చనిపోవటమో, ఈ గుండె మార్పిడి చేసుకోవటమో జరగాలి. ఇది చీకట్లో రాయి విసరటమేనని నాకు తెలుసు. కానీ ఇదే నాకు మిగిలిన చివరి అవకాశం’’ అని సర్జరీ ముందు రోజు డేవిడ్ చెప్పారు.

ఫొటో సోర్స్, University of Maryland School of Medicine
ఈ సర్జరీ చేయకపోతే ఆయన చనిపోతారనే కారణంతో యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్ మెడికల్ సెంటర్ వైద్యులు ఈ శస్త్రచికిత్స చేయటానికి అమెరికా వైద్య నియంత్రణ సంస్థ ప్రత్యేక అనుమతి ఇచ్చింది.
మానవ గుండె అమర్చి గుండె మార్పిడి శస్త్రచికిత్స చేయటానికి డేవిడ్‌ను అనర్హుడిగా గుర్తించారు వైద్యులు. ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉండటం ఈ నిర్ణయం తీసుకోవటానికి ప్రాతిపదిక.
ఎన్నో ఏళ్ల పరిశోధనల ఫలితం ఈ గుండె మార్పిడి అని.. మున్ముందు ప్రపంచంలో మనుషుల జీవితాలు మారటానికి ఇది నాంది పలుకుతుందని ఈ సర్జరీ నిర్వహించిన వైద్య బృందం చెప్తోంది.
ప్రపంచంలో ‘‘అవయవ కొరత సంక్షోభాన్ని పరిష్కరించే దిశగా ఒక అడుగు ముందుకు’’ పడినట్లయిందని సర్జన్ బార్ట్లీ గ్రిఫిత్ పేర్కొన్నట్లు యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఒక ప్రకటనలో తెలిపింది.
అమెరికాలో అవయవదానం కోసం నిరీక్షిస్తూ సగటున రోజుకు 17మంది చనిపోతున్నారు. ఈ వెయిటింగ్ లిస్ట్‌లో లక్ష మందికి పైగా ఉన్నట్లు చెప్తున్నారు.
ఈ డిమాండ్‌ను తీర్చటానికి జంతువుల అవయవాలను ఉపయోగించే అంశం – అంటే క్జీనోట్రాన్స్‌ప్లాంటేషన్ - చాలా కాలంగా పరిశీలనలో ఉంది. పంది గుండె కవాటాలను ఇప్పటికే విస్తృతంగా ఉపయోగిస్తున్నారు కూడా.
2021 అక్టోబర్‌లో న్యూయార్క్‌కు చెందిన కొందరు సర్జన్లు.. ఒక మనిషికి పంది కిడ్నీని విజయవంతంగా అమర్చినట్లు ప్రకటించారు. అప్పటికి ఈ రంగంలో ఆ శస్త్రచికిత్స అత్యంత అధునాతమైనది.
కానీ.. ఆ కిడ్నీ మార్పిడి జరిగిన వ్యక్తి అప్పటికే బ్రెయిన్ డెడ్ అయ్యారు. ఆయన కోలుకునే అవకాశాలు లేవని వైద్యులు నిర్ధరించారు.
అయితే ఇప్పుడు పంది గుండె అమర్చిన డేవిడ్ బెనెట్.. తను తిరిగి తన సాధారణ జీవితం గడుపుతానని ఆశిస్తున్నారు. సర్జరీకి ముందు ఆరు వారాలుగా ఆయన మంచానికే పరిమితమయ్యారు. ఆయనకు తీవ్రమైన గుండె జబ్బు ఉన్నట్లు గుర్తించాక.. ఒక యంత్రాన్ని అమర్చి ఆయన ప్రాణాలను కాపాడుతూ వచ్చారు.
‘‘కోలుకున్న తర్వాత మంచం దిగి మళ్లీ నా జీవితాన్ని కొనసాగించాలని ఎదురు చూస్తున్నా’’ అని ఆయన గత వారంలో చెప్పారు.
సోమవారం నాడు వేవిడ్ సొంతంగా శ్వాస తీసుకుంటున్నారని, ఆయన ఆరోగ్యాన్ని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని వైద్యులు వెల్లడించారు.
కానీ తర్వాత ఏం జరుగుతుందనేది అస్పష్టంగా ఉంది. ఈ గుండె మార్పిడి కోసం ఉపయోగించిన పందిని.. దాని గుండెను మనిషి శరీరం తిరస్కరించటానికి కారణమయ్యే కొన్ని జన్యువులను తొలగించటం ద్వారా జన్యుసవరణ చేసి రూపొందించారని ఏఎఫ్‌పీ వార్తా సంస్థ చెప్పింది.
ప్రస్తుతం తమ కుటుంబం ఏమీ పాలుపోని స్థితిలో ఉందని డేవిడ్ బెన్నెట్ కుమారుడు అసోసియేటెడ్ ప్రెస్‌తో వ్యాఖ్యానించారు.
అయితే.. ‘‘ఈ శస్త్రచికిత్స తీవ్రత ఎంతటితో ఆయనకు తెలుసు. ఇది ఎంత ముఖ్యమో కూడా ఆయనకు బాగా తెలుసు’’ అని డేవిడ్ బెన్నెట్ జూనియర్ చెప్పారు.
‘‘మేం ఎన్నడూ మనిషిలో ఇలాంటిది చేయలేదు. ఆయన చికిత్సను కొనసాగించటం కన్నా మెరుగైన ప్రత్యామ్నాయం అందించామని మేం భావిస్తున్నాం’’ అని గ్రిఫిత్ పేర్కొన్నారు.
‘‘అది ఒక రోజా, ఒక వారమా, ఒక నెలా, ఒక సంవత్సరమా అనేది నాకు తెలీదు’’ అన్నారాయన.
ఇవి కూడా చదవండి:
- తరతరాలుగా అమ్మమ్మలు, నానమ్మలు చేసే సంప్రదాయ మసాజ్ రహస్యం కనిపెట్టిన అమెరికా పరిశోధకులు
- బిడ్డ పుట్టిన నిమిషం లోపే బొడ్డు తాడు కత్తిరిస్తే ఏమవుతుంది
- హెరాయిన్: ఒకనాటి ఈ దగ్గు మందు మత్తు మందుగా ఎలా మారింది... చరిత్రలో ఏం జరిగింది?
- తల్లిపాలు తాగిన పిల్లల్లో ఎక్కువ తెలివితేటలు ఉంటాయా... పాలిచ్చే తల్లి మద్యం తాగవచ్చా?
- పళ్లు ఎంతసేపు తోముకోవాలి? రెండు నిమిషాలు బ్రష్ చేస్తే చాలా? సైన్స్ ఏం చెబుతోంది?
- 'నా పాపను బయోవేస్ట్ అన్నారు. ఆ మాటకు నా గుండె పగిలింది‘
- 'వృద్ధాప్యం ఒక వ్యాధి, దాన్ని నయం చేయవచ్చు' -హార్వర్డ్ శాస్త్రవేత్త డేవిడ్ సింక్లెయిర్
- గర్భిణులు కుంకుమ పువ్వు కలిపిన పాలు తాగితే.. పిల్లలు ఎర్రగా పుడతారా
- కాన్పు నొప్పులను తట్టుకొనేందుకు వీఆర్ హెడ్సెట్
- గర్భస్థ శిశువుల చేతుల్లో తొండల మాదిరి కండరాలు... పుట్టిన తరువాత ఏమై పోతున్నాయి...
- అండ దానం: ‘కొన్ని కుటుంబాల ఆశలు నామీదే ఉన్నాయి’
- సరోగసీ నియంత్రణ బిల్లు: ఈ బిల్లు ఎందుకు అవసరం?
- యోని గురించి తెలుసుకోవాల్సిన అయిదు ముఖ్యమైన విషయాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











