''నువ్వు కాసేపట్లో చనిపోతావు' అని మా నాన్నకు చెప్పమని డాక్టర్లు నన్ను అడిగారు''

డాక్టర్లు ఓ భయంకరమైన నిజాన్ని చెప్పడానికి వచ్చే సమయానికి ఆసుపత్రి బెడ్ మీద ఉన్న తన తండ్రి పక్కనే నిలబడి ఉన్నారు ఫ్రాన్సెస్కా . ఆమె తండ్రి బధిరుడు. వయసు మీద పడటంతో ఆయనను అనేక జబ్బులు చుట్టు ముట్టాయి. నెల రోజులుగా ఆయన ఆసుపత్రిలో ఉంటున్నారు.
చికిత్స సమయంలో ఆయన ఏం చెబుతున్నారో డాక్టర్లకు అర్ధం కావడానికి ఒక ఇంటర్‌ప్రిటేటర్(అనువాదకుడు)ను ఏర్పాటు చేయాలని ఫ్రాన్సెస్కా అధికారులను కోరారు. కానీ అది జరగలేదు.
''ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆయన లిప్ రీడింగ్ చేయగలిగేవారు. కానీ, ఆసుపత్రిలో ఆయన కేవలం కళ్లతో చూడటం తప్ప మరేమీ చేయలేకపోతున్నారు. ఆయనకు ఏదైనా చెప్పాలంటే డాక్టర్లు, నర్సులకు ఇబ్బందిగా ఉంటోంది. వాళ్లు అరిచి పెద్దగా చెప్పాలనకుంటున్నారు. కానీ ఆయన భయపడుతున్నారు'' అన్నారు ఫ్రాన్సెస్కా.
ఇంగ్లాండ్‌లో చెవుడు సమస్యతో బాధపడే అనేక వేలమందిలో ఫ్రాన్సెస్కా తండ్రి ఒకరు. చాలామంది కూతుళ్లలాగే ఆమె కూడా బధిరులకు వాడే సంకేత భాష (సైన్ లాంగ్వేజ్)ను నేర్చుకున్నారు. డాక్టర్లు మోసుకొచ్చిన ఆ భయంకర వార్తను చివరకు ఆమే తండ్రికి చెప్పాల్సి వచ్చింది.
''నీకు ఇక ఎక్కువ సమయం లేదు'' అని ఆమె తన తండ్రికి అర్ధమయ్యే సైన్ లాంగ్వేజ్‌లో చెప్పారు.
''నేనే చెప్పేశాను. మీరు ఎక్కువకాలం బతకరని నేనే చెప్పేశాను'' అని బాధ నిండిన గొంతులో అన్నారు ఫ్రాన్సెస్కా.

సమస్యలతో జీవితం మొదలు
బధిరులైన తల్లిదండ్రులకు 1980లో జన్మించారు ఫ్రాన్సెస్కా. మొబైళ్లు, టెక్స్ట్ మెసేజ్‌లు లేని కాలంలో, తన ఏడో నెల నుంచే సంజ్ఞలను నేర్చుకోవడం ప్రారంభించారామె. ''నేను నేర్చుకున్న మొదటి భాష బ్రిటిష్ సైన్ లాంగ్వేజ్ (బీఎస్ఎల్). ఇది నా జీవితంలో భాగం. ఆ భాషను నేను ప్రేమిస్తాను'' అన్నారామె.
చాలా చిన్న వయస్సులోనే ఫ్రాన్సెస్కా చాలా బాధ్యతలు మోయాల్సి వచ్చింది. మిగిలిన వారు చాలా తేలికగా చేయగలిగే పనులకు కూడా తల్లిదండ్రులు ఆమె మీద ఆధారపడేవారు. నాలుగు సంవత్సరాల వయస్సులో ఆమె, తల్లిదండ్రులకు కోసం ఫోన్ కాల్స్ చేసి మాట్లాడేవారు. ఎనిమిదేళ్ల వయసులోనే బ్యాంకు పనులు కూడా నిర్వహించేవారు.
''నా మీద భారం వేయకూడదని వాళ్లు తపించేవారు. కానీ, నేను అప్పటికే పెద్ద పెద్ద బాధ్యతలు మోయడం నేర్చుకున్నాను. ఏ పనైనా సులభంగా చేసేయగలను. నేను మిగతా పిల్లలకు కొంచెం భిన్నం'' అన్నారు ఫ్రాన్సెస్కా.
''కానీ, ఎప్పుడూ వాళ్లకు సాయం చేస్తూ ఉండటం కూడా అన్నిసార్లు సాధ్యమయ్యేది కాదు. చాలా ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకోవాల్సి ఉండేది. నేను వీరి పనిలో పడి ఆ బాధ్యతలను నిర్లక్ష్యం చేసిన సందర్భం ఒక్కటి కూడా లేదు'' అన్నారామె.
''చిన్నతనంలో నేను ఈ పని చేయను అని చెప్పలేం. ఎందుకంటే మన హద్దులు ఏంటో మనకు అప్పటికి తెలియదు'' అని వివరించారు.

బాధ్యతలు అధికం
బధిరులైన తల్లిదండ్రుల మధ్య పెరగడం మామూలు విషయం కాదు. ''చెవిటి తల్లిదండ్రుల దగ్గర పెరిగే పిల్లలు లాంగ్వేజ్‌లో అద్భుతంగా రాణిస్తారు'' అని హెరియట్-వాట్ యూనివర్సిటీలో సైన్ లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్ నిపుణురాలు ప్రొఫెసర్ జెమీనా నేపియర్ అన్నారు.
''వాళ్లు చిన్నతనంలోనే పెద్దలలో ఉండే ఎమోషన్స్ అన్నీ తెలుసుకుంటారు. సమస్యలను పరిష్కరించే సమర్ధత కూడా చాలా చిన్న వయసులోనే అలవడుతుంది'' అన్నారామె. ప్రొఫెసర్ జెమీనా నేపియర్ కూడా బధిరులైన తల్లిదండ్రులున్న కుటుంబంలో పెరిగారు.
''కానీ, ఇక్కడొక సమస్య ఉంది. డోర్ దగ్గరికొచ్చిన పిజ్జా డెలివరీ బాయ్‌తో మాట్లాడటానికి, ఫ్రాన్సెస్కా లాగా ఆసుపత్రిలో తండ్రికి ఆయన మరణం గురించి చెప్పడానికి మధ్య చాలా తేడా ఉంది. పిల్లల మీద పడే ఆ తీవ్రమైన భావోద్వేగాల ప్రభావం అంత మంచిది కాదు'' అంటారామె.
ముప్పై ఏళ్ల పెర్ల్ క్లింటన్ కూడా ఇలాంటి సమస్యనే ఎదుర్కొన్నారు. తన అమ్మమ్మకు నువ్వు చనిపోతున్నావు అని ఆమే చెప్పాల్సి వచ్చింది. అప్పటికి ఆమె వయసు కేవలం 12 సంవత్సరాలు.
ఇంటర్‌ప్రిటేటర్లతో కాకుండా కుటుంబ సభ్యులతోనే వారి బంధువులకు మరణం గురించి చెప్పించడానికి వ్యతిరేకంగా పెర్ల్ క్లింటన్ ఉద్యమిస్తున్నారు. ఇలాంటి దుర్వార్తలను కుటుంబ సభ్యులే చేరవేయాల్సి రావడం వల్ల వారి మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని ఆమె అన్నారు.
"దీనిపై నేను ఉద్యమం ప్రారంభించిన తర్వాత కూడా, అనేకమందికి ఇలా జరిగినట్లు నాకు తెలిసింది. ఇంకా జరుగుతోంది కూడా'' అన్నారామె.

చట్టాల అమలు సాధ్యమేనా?
బ్రిటన్‌లో అమలులోకి వచ్చిన 2010 నాటి సమానత్వ హక్కు చట్టం ప్రకారం, బధిరులైన పేషెంట్లు ఆసుపత్రిలో చేరినప్పుడు వారికి అనువాదకులను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఉంది. అయితే, చాలా చోట్ల అది జరగడం లేదు. తీవ్ర ఒత్తిళ్ల మధ్య పని చేసే ఆసుపత్రి సిబ్బంది సమస్యను గుర్తించలేకపోతున్నారు.
'' దీనికి వాళ్లను తప్పుబట్టలేం. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్లకు కూడా ఏం చేయాలో తోచదు. చేతులెత్తేస్తారు'' అన్నారు ఫ్రాన్సెస్కా.
అయితే, బధిరురాలైన ఫ్రాన్సెస్కా తల్లి బాల్యంతో పోలిస్తే ప్రస్తుత ప్రపంచంలో ఎన్నో మార్పులు వచ్చాయి. 1952లో ఫ్రాన్సెస్కా తల్లి తన నాలుగేళ్ల వయసులో బోర్డింగ్ స్కూలుకు వెళ్లారు. చెవిటి వ్యక్తులు కూడా మామూలు ప్రజల మాదిరిగాన పని చేసుకోగలిగేలా తీర్చిదిద్దడమే ఆ స్కూలు లక్ష్యం. కానీ, అక్కడ ఆమె ఎదుర్కొన్న సమస్యలు గుర్తుకు తెచ్చుకున్నప్పుడు ఫ్రాన్సెస్కాకు రక్తం మరిగిపోతుంది.
''మా అమ్మకు శరీరమంతటికీ ఒకే గౌన్ వేసేవారు. చేతులను మంచానికి కట్టేవారు. ఒక్కోసారి ఇంటి మీద గాలి వెళ్లడానికి ఏర్పాటు చేసే ఎయిర్ రైడ్ షెల్టర్‌లో బంధించేవారు'' అని వెల్లడించారు ఫ్రాన్సెస్కా.
''ఆమెకు ఏమీ వినపడదు. పక్కన తల్లిదండ్రులు, స్నేహితులు లేరు. సైన్ లాంగ్వేజ్ వాడకుండా నియంత్రించుకోలేక పోయినందుకు అది ఆమెకు విధించిన శిక్ష'' అన్నారామె.
తన తల్లి చాలా తెలివిగల మహిళ అని, కానీ అలాంటి స్కూల్ కారణంగా ఆమె 16 ఏళ్ల వయసులో, ఎలాంటి విద్యార్హతలు సంపాదించకుండానే బయటకు రావాల్సి వచ్చిందని, ఆమె మానసిక స్థితిపై కూడా తీవ్ర ప్రభావం పడిందని ఫ్రాన్సెస్కా చెప్పారు.
'' అక్కడున్న మొత్తం చెవిటి వారికి దాదాపు ఇదే పరిస్థితి ఎదురైంది" అన్నారామె.
తన చిన్నతనం నుంచే తల్లిదండ్రులకు ఇంటర్ ప్రిటేటర్‌గా వ్యవహరించిన ఫ్రాన్సెస్కా, ఈ బాధ్యతల కారణంగా వ్యక్తిగత జీవితాన్ని మరింత సమర్ధవంతంగా తీర్చిదిద్దుకోగలిగారు. ఓ టీవీ చానెల్‌కు సబ్‌టైటిల్ రాసే కెరీర్‌లో ఆమె విజయవంతంగా కొనసాగుతున్నారు.
కానీ, ఒక కూతురుగా, మీరు కాసేపట్లో చనిపోతున్నారు అని తండ్రి చెప్పాల్సి రావడం చాలా బాధాకరం అంటారామె.
"నా జీవితంలో చాలా కష్టమైన పనులు చేసాను, కానీ ఇది అన్నింటికన్నా కష్టమైనది" అన్నారు ఫ్రాన్సెస్కా.
ఇవి కూడా చదవండి:
- సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ 'చివరి సైనికుడు' ఎహసాన్ ఖాదిర్ కథ
- వాతావరణ మార్పులు: 2021లో తీవ్రంగా ఇబ్బంది పెట్టిన ప్రకృతి వైపరిత్యాలకు మానవ తప్పిదాలే కారణమా?
- స్పూన్లు వంచి, గడియారం ముళ్లను పరుగులు పెట్టించి భయపెట్టిన మాంత్రికుడి కథ
- హరిద్వార్ 'ధర్మ సంసద్' ప్రసంగాలపై భారత్‌కు సలహాలు ఇచ్చిన పాకిస్తాన్
- వికలాంగుడి పట్టుదలకు ఆశ్చర్యపోయి జాబ్ ఆఫర్ చేసిన ఆనంద్ మహీంద్రా
- షిఫ్టు డ్యూటీల్లో పని చేసేవారి శరీరంలో ఏం జరుగుతుంది? ఆరోగ్యం దెబ్బతినకుండా తీసుకోవాల్సిన 5 జాగ్రత్తలు
- వాయు కాలుష్యాన్ని అత్యధికంగా సృష్టిస్తున్న దేశాలు ఏమైనా చర్యలు చేపట్టాయా?
- టీ20 వరల్డ్‌కప్ : ఐపీఎల్ ప్రభావం టీమ్ ఇండియాపై పడిందా?
- ‘‘మేం చనిపోయాక మా పిల్లల పరిస్థితేంటి? నాలాంటి తల్లితండ్రులందరినీ వేధించే ప్రశ్న ఇదే’’
- ఆంధ్రప్రదేశ్‌లో ఎయిడెడ్ విద్యా సంస్థల మూసివేత ‘బలవంతమా.. బాగు కోసమా’
- చైనా కొత్త సరిహద్దు చట్టంపై భారత్ అభ్యంతరాలు.. డ్రాగన్ స్పందన ఏంటి?
- పాకిస్తాన్‌కు సహాయం చేస్తే సౌదీ అరేబియాకు ఏంటి లాభం?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













