మానసి జోషి: BBC Indian Sportswoman of the Year నామినీ

- రచయిత, దీప్తి బత్తిని
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఒక శనివారం మధ్యాహ్నం భారత పారా అథ్లెట్ మానసి జోషిని హైదరాబాద్‌లోని ఆమె ఇంటి దగ్గర కలిశాం. ఆమె మరో ఇద్దరు స్నేహితులతో కలసి ఒక ఫ్లాట్‌లో ఉంటున్నారు. మేం వెళ్లేప్పటికి మానసి భోజనం చేస్తున్నారు. మమ్మల్ని సాదరంగా ఆహ్వానించిన ఆమె, తన ప్రొస్థెటిక్ కాలుని అమర్చుకునేందుకు లోపలికి వెళ్లారు.
నిజానికి వారం మొత్తం కఠిన శిక్షణ తరువాత, శనివారం మధ్యాహ్నం నుంచి ఆదివారం వరకు తాను విశ్రాంతి తీసుకుంటానని మానసి చెప్పారు.
"నేను రోజుకి 7 నుంచి 8 గంటలు సాధన చేస్తాను. మధ్యాహ్నాలు నిద్రపోతాను. శనివారాలు కేవలం ఉదయమే సాధన చేస్తాను. ఆ తరువాత పుస్తకాలు చదవడం, తోట పనిచేయడం లాంటి వ్యాపకాలకు సమయం కేటాయిస్తాను" అని చెప్పారామె.


౩౦ ఏళ్ల మానసి గిరిష్ చంద్ర ప్రసాద్ జోషి భారత పారా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. 2015 నుంచి ఆమె దేశం తరఫున బ్యాడ్మింటన్ ఆడుతున్నారు. 2019 ఆగస్టులో ప్రపంచ పారా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ఆమె కాంస్య పతకం గెల్చుకున్నారు. ఒక రోడ్డు ప్రమాదంలో మానసి తన కాలు పోగొట్టుకున్నారు. కానీ, బ్యాడ్మింటన్ తనకు కొత్త జీవితాన్ని ఇచ్చిందంటారామె.
ఆరేళ్ల వయస్సు నుంచే మానసి బ్యాడ్మింటన్ ఆడటం మొదలుపెట్టారు. స్కూల్‌లో ఉన్నప్పుడు మహారాష్ట్రలో జిల్లా స్థాయిలో ఆడారు. ఇంజినీరింగ్ పూర్తయ్యాక ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగంలో కూడా చేరారు. రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన కొన్నాళ్ల తరువాత, మానసి తన ఆఫీస్‌లో సరదాగా ఒక రోజు బ్యాడ్మింటన్ మ్యాచ్ ఆడారు. "అప్పుడే అనిపించింది.. నేను ఒక కాలితో కూడా బ్యాడ్మింటన్ ఆడగలను అని" అన్నారామె.

ఫొటో సోర్స్, Getty Images
చిన్న చిన్న విషయాలు తనకు ఆనందం కలిగిస్తాయని మానసి చెబుతారు.
"ఒకసారి గోల్కొండ కోటకు వెళ్ళినప్పుడు, కోట పైవరకు వెళ్లాలని నిర్ణయించుకున్నాను. దాదాపు 300 మెట్లు ఉంటాయి. అయితే నేను నెమ్మదిగా ఎక్కుతూ వెళ్లాను. అప్పుడనిపించింది.. మనం ఎలా ఉన్నా కుటుంబ సభ్యులు మనల్ని ప్రేమిస్తారు అని. మా చెల్లి కూడా నాతో పాటు నిదానంగానే ఎక్కింది. అంత కష్టపడి కోటపైకి ఎక్కాక ఏదో తెలీని ఆనందం కలిగింది. ఇకపై కూడా నేను జీవితంలో ఎంతో సాధించగలనన్న ఆత్మవిశ్వాసం ఆ క్షణం కలిగింది" అన్నారు మానసి.
మాటల్లో మాటగా తన రోడ్డు ప్రమాదం ప్రస్తావన వచ్చింది.
"మీడియా నన్ను పదే పదే రోడ్డు ప్రమాదం గురించి అడిగినప్పుడల్లా ఒకే సమాధానం చెప్పి విసిగి పోయాను. నన్ను నా ఆట గురించి అడిగితే చాలా సంతోషంగా అనిపిస్తుంది. నేను ఆడుతున్న ఆట గురించి కానీ, నేను కొత్తగా నేర్చుకున్న మెలకువల గురించి గానీ ఎందుకు అడగరు అని అనిపిస్తుంది. నాకు యాక్సిడెంట్ అవ్వడం, దాని తరువాత నేను బ్యాడ్మింటన్ ఆడటం.. ఇవన్నీ వాస్తవాలే. కానీ నేను ఇప్పుడు ఆ ప్రమాదం నుంచి తేరుకొని, ఎంతో కొంత సాధించానని అనుకుంటున్నా. అందుకే ఆ ఘటనను వదిలేసి ఆట గురించి అడిగితే బావుండును అనిపిస్తుంది. చాలాసార్లు చాలామంది నన్ను అడిగే ప్రశ్న.. ఆ ప్రమాదం తరువాత ఏమనిపించిందని. ఎలోగోలా బతికి బయటపడ్డాను కదా. అంతకంటే ఇంకా ఏమనిపిస్తుంది?" అన్నారు మానసి నవ్వుతూ.
అయితే ఇలాంటి ప్రశ్నలకు కూడా సమాధానం సిద్ధం చేసి పెట్టుకోవాలని మానసి చెల్లి తనతో తరచూ చెబుతుంటుందని ఆమె అన్నారు. "జరిగింది పెద్ద ప్రమాదమే. కానీ నా ఆట, నా సిద్ధాంతాలే నాకు గుర్తింపును ఇవ్వాలని నేను కోరుకుంటాను" అన్నారు మానసి.
2015లో మానసి బ్యాడ్మింటన్ విజయ ప్రస్థానం మొదలైంది. ఆ ఏడాదిలో ఆమె మొట్టమొదటిసారి ఇంగ్లండ్‌లో ప్రపంచ పారా-బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ మిక్సిడ్ డబుల్స్‌లో ఆడారు. రజత పతకం కూడా గెలిచారు. ఆలా మొదలైన మానసి ప్రయాణంలో ఆ తరువాత ఎన్నో పతకాలు, మరెన్నో టైటిల్స్ చేరాయి.
2016లో ఏషియన్ పారా బ్యాడ్మింటన్ పోటీ మహిళల సింగిల్స్ విభాగంలో కాంస్య పతకం గెలిచారు.
2017లో ప్రపంచ పారా-బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించారు.
2018 థాయిలాండ్ పారా-బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం పొందారు.
ఏషియన్ గేమ్స్ 2018లోనూ కాంస్యం గెలుపొందారు.
2019లో స్విట్జర్లాండ్‌లో జరిగిన ప్రపంచ పారా-బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించారు.

రానున్న టోక్యో పారా ఒలింపిక్స్ కోసం ప్రస్తుతం మానసి సాధన చేస్తున్నారు. అయితే పారాలింపిక్స్‌లో సింగిల్స్ విభాగం లేకపోవటంతో ఆమె మిక్స్‌డ్ డబుల్స్ కోసం సన్నద్ధమవుతున్నారు.
మేం మానసితో కలిసి ఆమె ట్రైనింగ్ సెషన్‌కి కూడా వెళ్లాం. అకాడమీకి చేరుకోగానే ముందుగా ఆమె తన ప్రోస్థెటిక్ కాలు అమర్చుకున్నారు.
"నేను నా ప్రొస్థెటిక్‌ను మార్చుకున్నాను. కొత్తది కాస్త తేలికగా ఉండటంతో ఇప్పుడు ఆడటం మరింత సౌకర్యంగా ఉంది. రోజువారీ పనుల కోసం ఒక ప్రోస్థెటిక్ వాడతాను. శిక్షణ తీసుకునేప్పుడు, మ్యాచ్ ఆడేప్పుడు మరొకటి ఉపయోగిస్తాను" అని చెబుతూ సాధన చేసేందుకు కోర్టులోకి అడుగుపెట్టారు. కొన్నాళ్లుగా ఆమె గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నారు.
కోర్టులో మానసి చాలా ఏకాగ్రతతో కనిపిస్తారు. ఎప్పటికప్పుడు తనకు తానే కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంటారు. ఆమె ఒక నిత్య విద్యార్థి.
"నాకు ట్రైనింగ్ సెషన్లు చాలా ముఖ్యం. అప్పుడే కొత్త మెలకువలు నేర్చుకోవడానికి, నేర్చుకున్నవి ఆచరణలో పెట్టడానికి నేను ప్రయత్నిస్తాను. నా కుటుంబం, స్నేహితుల తరువాత నేను ఈ స్థాయికి చేరడంలో కీలకపాత్ర పోషించింది అకాడమీనే. నా స్పాన్సర్లు కూడా నాకు అండగా నిలబడ్డారు" అంటారామె.
ఈలోగా ఒక చిన్న పిల్లాడు మానసి దగ్గరకు ఆటోగ్రాఫ్ కోసం వచ్చాడు. ఆమె అతడి పేరు, ఇతర వివరాలు అడుగుతూ ఆటోగ్రాఫ్ ఇచ్చారు. "ఇలా చిన్నపిల్లలు నా దగ్గరకు వచ్చినప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది" అంటారామె.

ఫొటో సోర్స్, Getty Images
ఏదైనా టోర్నమెంట్ కోసం కేవలం శారీరకంగా సిద్ధపడితే సరిపోదంటారామె.
"నేను చాలా విషయాలు ప్లాన్ చేసుకోవాలి. ప్రయాణానికి ఎంతసేపు పడుతుందో లెక్కించుకోవాలి. దానికి తగ్గట్లే నా విరామాలు, విమానంలో కూర్చునే స్థలం గురించి కూడా ఆలోచించుకోవాలి.
చాలాసార్లు విమానాశ్రయాల్లో నన్ను భద్రతా పరీక్షల కోసం ప్రోస్థెటిక్ కాలును తొలగించమని చెబుతారు. వాళ్లు అలా నా ప్రోస్థెటిక్‌ను తొలగించి పరీక్షించే సమయంలో ఒక కాలితో అటూఇటూ తిరగడం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది.
ఒక్కోసారి ప్రయాణికులు సెక్యూరిటీ స్కానర్లలో ల్యాప్‌టాప్‌లు, హ్యాండ్ బ్యాగ్‌లు పెడుతుంటే నేను నా ప్రోస్థెటిక్ కాలుని అందులో పెట్టాల్సి వస్తుంది. ఆ దృశ్యాన్ని చూస్తుంటే బాధగా అనిపిస్తుంది. కొన్నిసార్లు భద్రతా సిబ్బంది నా దగ్గరకు వచ్చి నన్ను వార్తల్లో చూశామని చెబుతుంటారు. అయినా ఈ ఇబ్బందులు మాత్రం తప్పవు. ఈ విధానంలో మార్పు రావాలి" అంటారామె.
మానసి హైదరాబాద్‌లో కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. ప్రతిరోజూ అకాడమీకి కాబ్‌లోనో, ఆటోలోనో వెళ్తుంటారు. అకాడమీలో కూడా కొన్ని మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. అయినా క్రమం తప్పకుండా ట్రైనింగ్‌కు సమయానికి వచ్చేస్తారు.
"ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఆట ఆడాలి. వయసుతో నిమిత్తం లేకుండా ఆడాలి. అది చాలా అవసరం. మన దేశంలో క్రీడల పట్ల అవగాహన ఇంకా పెరగాలి. మనం అందరం ఆడుతుంటేనే కదా ప్రభుత్వాల నుంచి సదుపాయాల కోసం కాస్త గట్టిగా అడగగలం. అప్పుడే ప్రభుత్వాలు కూడా ఆటల కోసం కనీస సదుపాయాలు కల్పించే దిశగా ఆలోచిస్తాయి" అంటారామె.
మానసి మితభాషి. "నాకు త్వరగా కోపం రాదు. నేను చేసే పనుల ద్వారానే అందరూ నన్ను గుర్తుపెట్టుకోవాలి. నా ఆట ద్వారానే అందరికీ నేను గుర్తుండిపోవాలి" అన్నది మానసి చెప్పే మాట.

ఇవి కూడా చదవండి:
- కరోనా వైరస్: వెయ్యి పడకల ఆస్పత్రిని చైనా ఆరు రోజుల్లోనే ఎలా నిర్మిస్తోంది?
- కరోనా వైరస్: ఇన్ఫెక్షన్ సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆరు మ్యాపుల్లో...
- కరోనా వైరస్: వుహాన్‌లో చిక్కుకుపోయిన భారత విద్యార్థులు ఇప్పుడేం చేస్తున్నారు
- ‘వీళ్లు అధికారంలో లేకపోతే ప్రపంచం మెరుగ్గా ఉండేది’.. ట్రంప్, జిన్‌పింగ్ పాలనపై జార్జ్ సోరస్ విమర్శలు
- కరీమ్ లాలా: ఈ ముంబయి మాఫియా డాన్‌ను ఇందిరా గాంధీ ఎందుకు కలిశారు?
- సముద్రజీవులను, భారీ తిమింగలాలను సైతం చంపేస్తున్న ‘ఘోస్ట్ గేర్’
- బంగారం ధరలకు, అంతర్జాతీయ సంక్షోభాలకు ఏమిటి సంబంధం...
- మీ జుట్టు తెల్లబడుతోందా? అయితే కారణం అదే కావొచ్చు...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










