బీహార్: వికలాంగుల పెళ్లిళ్లను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం
వికలాంగులు ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో తెలుసా? ఎవరైతే తమను జీవితాంతం కాపాడతారని వారు భావిస్తున్నారో ఊహించగలరా?
రూపమ్ కుమారీ నడవలేదు. చిన్నప్పుడే పోలియో రావడంతో ఆమె కాళ్ళు చచ్చుబడిపోయాయి. ఆమె నేలపై చేతుల సహాయంతో కదులుతుంది. మరి ఈమె భవిష్యత్తు ఏంటి? ఈమెను ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం.
బిహార్‌లోని నలందా జిల్లాలో ఉంటున్న రూపమ్ కుటుంబం ఆమెను ఎదో ఓ పేద అబ్బాయికిచ్చి పెళ్లి చేసేయాలని చూస్తోంది. కానీ రూపమ్ కుమారీకి ఇలాంటి పెళ్లి ఇష్టం లేదు. ఎందుకంటే అలాంటి పెళ్లితో ఇద్దరి మధ్య సమానత్వం ఉండదని ఆమె అంటోంది.
"వికాలాంగురాలిని పెళ్లి చేసుకున్నవ్యక్తి ఇతరుల మాటలకు తేలిగ్గా ప్రభావితమౌతాడు. అలాంటి వ్యక్తి భార్యను కొడతాడు. రేప్ చేసి వదిలేయగలడు కూడా. అలాంటి వ్యక్తి భార్యను గౌరవించడు. భార్యను తన అవసరాలకే వాడుకుంటాడు" అని రూపం తెలిపింది.
ఎన్నో ఏళ్ల తర్వాత చివరికి ఈ ఏడాది మే నెలలో రూపమ్ పెళ్లయ్యింది. ప్రభుత్వ పథకమే ఈ పెళ్ళికి కారణమయ్యింది.

రూపమ్ భర్త రాజ్‌కుమార్‌సింగ్ వికలాంగుడు. ఆయన మామూలుగా నడవలేడు కాళ్ళు ముడుచుకుంటేనే నడవగలడు.
బిహార్‌లో నలందా జిల్లా పారఖ్‌పూర్ లో వీరి పెళ్లి జరిగింది.
పేద కుటుంబాలలో వికలాంగులను భారంగా భావిస్తారు. వాళ్లను చదివిస్తారు కానీ వాళ్ళ పెళ్లి గురించి ఆలోచించరు.
వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ పెళ్ళికి ముందు అంగీకరించలేదు.
వాళ్ళు ఈ సంబంధాన్ని అంగీకరించేందుకు చాలా సమయం తీసుకున్నారు.

" మీరు చనిపోతే నన్నెవరు పట్టించుకుంటారు అని అమ్మ, నాన్నను అడిగాను. అన్నయ్య, వదిన ఎలాగో నన్ను పట్టించుకోరు. నాకు భార్య ఉంటే కనీసం ఆమె నాకోసం తినడానికి అన్నమైనా వండి పెడుతుంది’’. అని రాజ్‌కుమార్ అన్నాడు.
వికలాంగుల పెళ్లిని ప్రోత్సహిస్తూ కొన్ని రాష్ర్టాల్లో ప్రత్యేక పథకాలు అమల్లో ఉన్నాయి. వికలాంగులను పెళ్లి చేసుకుంటే ఆయా ప్రభుత్వాలు ఈ పథకం ద్వారా నగదును అందజేస్తున్నాయి.
బిహార్లో గత ఏడాది ఈ పథకం అమలులోకి వచ్చింది. ఈ పథకం కింద వికలాంగులను పెళ్లి చేసుకున్నవారికి రూ.50వేలు ఇస్తారు.
వధూవరులు ఇద్దరూ వికలాంగులయితే ఇద్దరికీ నగదును అందిస్తారు. పెళ్లయి 3 ఏళ్ళు దాటితేనే ఈ పథకం వర్తిస్తుంది.

ఈ పథకం గురించి చాలా మందికి తెలియదు. అందుకే వికలాంగ్ అధికార మంచ్ వంటి స్వచ్చంద సంస్ధ ఈ పథకానికి ప్రచారం చేస్తోంది.
వికలాంగులకు పెళ్లి జరిపిస్తే ఏం లాభమని ఏంతో మంది నన్ను ప్రశ్నించారని ఈ స్వచ్చంద సంస్థ ప్రతినిధి వైష్ణవి స్వావలంబన్ అన్నారు.
అయినా ఆమె వెనక్కి తగ్గలేదు. ఆమె కూడా వికలాంగురాలే. ఈ పథకం వికలాంగులకు ఏంతో సహాయపడుతుందని ఆమె అంటున్నారు. గత రెండేళ్ల నుంచి వికలాంగులకు సామూహిక వివాహాలు జరిపిస్తున్నారు. ఇప్పటివరకూ 16 మంది వికలాంగులకు ఆమె పెళ్లి జరిపించారు.

వైకల్యంలేనివారికి, వికలాంగులతో పెళ్లికి రాజీ కుదర్చడం ఒక పెద్ద సవాలని ఆమె అంటున్నారు. ప్రభుత్వ పథకం ఉన్నా ఇప్పటికీ చాలా మంది వికలాంగులు వికలాంగులనే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారని ఆమె తెలిపారు.
ఇది ఒక రకంగా ప్రభుత్వం నుండి పెళ్ళికి కట్నమా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇంకా పెళ్లిచేసుకున్న తర్వాత ఆ డబ్బు తీసుకొని పారిపోతే పరిస్ధితి ఏంటని కొందరు అంటున్నారు.
కానీ వైష్ణవి ఈ పథకాన్ని కట్నం కాదని అంటున్నారు. "దీనిని కట్నమని భావించను. వారి సంరక్షకులు వదిలేసినా తమకంటూ సొంతంగా ఎదో ఒక వ్యాపారం పెట్టుకొని తమ కాళ్లపై తాము నిలబడేందుకు ఇది సాయపడుతుంది. ఆత్మవిస్వాసం పెంచుతుంది." అని ఆమె తెలిపారు.
ఈ పథకం వారికి ఆర్ధిక స్వాతంత్ర్యం కల్పిస్తుందని రాజ్‌కుమార్, రూపమ్ ఆశిస్తున్నారు. కానీ, ఈ పథకం ఎప్పటికీ విడిపోలేని బంధానికి బలమైన పునాదిగా నిలుస్తుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)