ప్లేబాయ్ వ్యవస్థాపకుడు హ్యూ హెఫ్నర్ కన్నుమూత

ఫొటో సోర్స్, Reuters
అడల్ట్ మేగజైన్ 'ప్లేబాయ్' వ్యవస్థాపకుడు హ్యూ హెఫ్నర్ లాస్ ఏంజెల్స్‌లో కన్నుమూశారు. ఆయన వయసు 91 సంవత్సరాలు.
హెఫ్నర్ తన నివాసంలో ప్రశాంతంగా మరణించినట్లు ప్లేబాయ్ సంస్థ ప్రకటించింది.
1953లో హెఫ్నర్ ప్లేబాయ్‌ను ప్రచురించడం ప్రారంభించారు. ఆ తర్వాత అది ప్రపంచంలో పురుషులు అత్యధికంగా చదివే పత్రికగా పేరొందింది. దాని అత్యధిక సర్క్యులేషన్ 7 మిలియన్ కాపీలు.
మార్లిన్ మన్రో నగ్న చిత్రాలతో ప్లేబాయ్ ఫస్ట్ ఎడిషన్ విడుదలైంది. ఆ ఫొటోలను హెఫ్నర్ 200 డాలర్లకు కొన్నారు.

ఫొటో సోర్స్, Playboy
నగ్నత్వానికి దక్కిన గౌరవం
ప్లేబాయ్ తర్వాత అనేక పత్రికలు అదే పంథాలో వచ్చాయి.
అమెరికాలో కాంట్రాసెప్టివ్‌లపై నిషేధం ఉన్న కాలంలోనే.. హెఫ్నర్ కారణంగా నగ్నత్వానికి కూడా ప్రధాన స్రవంతి మీడియాలో ఒక గౌరవం దక్కింది.
ప్లేబాయ్‌తో ఆయన మల్టీ మిలియనీర్ అయిపోయారు. ఆయన వ్యాపార సామ్రాజ్యం కాసినోలకు, నైట్ క్లబ్బులకు విస్తరించింది.
తన డేటింగ్ అలవాట్లు, ప్లేబాయ్ మోడల్స్‌ను పెళ్లి చేసుకోవడం తదితర కారణాలతో హెఫ్నర్ పేరు పొందారు. తనకు వేయిమందికి పైగా మహిళలతో సంబంధం ఉందని హెఫ్నర్ బాహాటంగా చెప్పుకునేవారు. ఆ క్రెడిట్ వయాగ్రాకే దక్కుతుందని కూడా పేర్కొన్నారు.
ఆయన ప్రేరణతో ''ద గర్ల్స్ నెక్ట్స్ డోర్'' అన్న రియాలిటీ టీవీ షో కూడా వచ్చింది. 2012లో 86 ఏళ్ల వయసులో హెఫ్నర్ తనకన్నా 60 ఏళ్లు చిన్నదైన క్రిస్టల్ హారిస్‌ను మూడో భార్యగా వివాహమాడారు.

ఫొటో సోర్స్, Getty Images
సెక్స్ మేగజీన్ కాదు
2002లో సీఎన్‌ఎన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ''ప్లేబాయ్‌ను నేను ఎన్నడూ ఓ సెక్స్ మేగజైన్‌గా చూడలేదు'' అని హెఫ్నర్ అన్నారు.
''అదో లైఫ్‌స్టైల్ మేగజైన్. దానిలో సెక్స్ అనేది ఒక ముఖ్యమైన మసాలా'' అని వివరించారు.
తనను తాను 'మిఠాయిల దుకాణంలో ఉన్న పిల్లాడి'గా పేర్కొన్న హెఫ్నర్.. తాను చాలా అదృష్టవంతుణ్నని చెప్పుకునేవారు.

ఫొటో సోర్స్, Reuters
కేవలం నగ్న చిత్రాలు మాత్రమే కాదు.. ప్లేబాయ్‌లో మార్టిన్ లూథర్ కింగ్, బీటిల్ జాన్ లెనాన్, ఫిడేల్ క్యాస్ట్రోలాంటి ప్రముఖుల ఇంటర్వ్యూలు కూడా ప్రచురించారు.
మార్చి 1990 ప్లేబోయ్ సంచిక ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కవర్ పేజీతో వెలువడింది.
మెరిసిపోయే సిల్కు దుస్తుల్లో దర్శనమిచ్చే హెఫ్నర్ ఒక రకంగా అమెరికా సమాజాన్ని నిట్టనిలువునా విడదీశారనవచ్చు.

ఫొటో సోర్స్, AFP
'డర్టీ ఓల్డ్ మ్యాన్'
హెఫ్నర్ అమెరికాలో లైంగిక విప్లవం తెచ్చాడని కొందరంటే.. మరికొందరు 'డర్టీ ఓల్డ్ మ్యాన్'గా కొట్టిపారేస్తారు.
మహిళలను లైంగిక వస్తువులుగా దిగజార్చేశారని ఫెమినిస్టులు ఆరోపిస్తారు.
కానీ, అదే హెఫ్నర్ జాతి వివక్షను వ్యతిరేకించి, గే హక్కులను సమర్థించారు.
కుమారుడు కూపర్ మాటల్లో చెప్పాలంటే హెఫ్నర్.. లైంగిక స్వాతంత్ర్యం, భావస్వేచ్ఛ, భావనల ప్రచారకర్త. సాంస్కృతిక మార్గదర్శకుడు.
ఆనాడు ప్లేబాయ్ కథనాలు చాలా మందికి మింగుడు పడకున్నా.. ప్రస్తుత సమాజంలో అవేవీ మనకు అసహజంగా కనిపించవు.
మంచికో, చెడుకో.. ఆ రకంగా హ్యూ హెఫ్నర్ ఓ దార్శనికుడు అన్నది మాత్రం నిజం.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్లోనూ ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేసుకోండి)








