వివక్షతో చూసే చూపులతో బాధ ఎలా ఉంటుందో వారికి తెలియదు: వికలాంగ వైద్య విద్యార్థుల ఆవేదన

ఫొటో సోర్స్, SARAH ISLAM
మనకేమైనా ఆరోగ్య సమస్యలు వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తే, మనం చెప్పేవన్నీ ఆ డాక్టర్ నమ్ముతారో లేదో అనే సందేహం ఉంటుంది.
అలాంటి పరిస్థితి ఒక డాక్టర్‌కే వస్తే? మీకు మానసిక సమస్యలు, వైకల్యాలు ఉన్నాయని చెబితే.. మీ సహాధ్యాయులే మిమ్మల్ని నమ్మకపోతే ఎలా ఉంటుంది?
అలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్న వైద్య విద్యార్థుల గురించి మిరాండా ష్రెయిబర్ అందిస్తున్న కథనం ఇది.
నాకు 15 ఏళ్లు ఉన్నప్పుడు మానసిక అనారోగ్యానికి సంబంధించిన కొన్ని లక్షణాలను నా డాక్టర్‌కు వివరించాను. స్కూల్ వర్క్ చెయ్యలేకపోతున్నాని, చల్లదనం తెలియట్లేదని, ఓ పుస్తకం చదివితే అర్థం కావట్లేదని చెప్పాను.
బాగా ఒత్తిడిగా అనిపిస్తే వాకింగ్‌కు వెళ్తూ ఉండమని ఆయన ఒక్క ముక్కలో తేల్చేశారు.
ఒక్కోసారి డాక్టర్లు, రోగులు వేరు వేరు ప్రపంచాల్లో ఉన్నట్లు ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అంతరం కనిపిస్తుంటుంది. ఈ అంతరాల గురించి ఎంతోమంది వికలాంగులు రాశారు.
వాళ్లకున్న బాధలను, అవస్థలను డాక్టర్లకు అర్థమయ్యేట్లు చెప్పడానికి ఎంతో కష్టపడాల్సి వస్తుందని, వైద్య పరిభాషకు, వైకల్యానికి సామ్యం కుదరదని అనేకమంది దివ్యాంగులు గతంలో చెప్పారు.
అయితే, ఈ అనుభవం దివ్యాంగులైన డాక్టర్లకు కూడా ఎదురవుతూ ఉంటుంది. వారికున్న వైకల్యం గురించి చెబితే సహాధ్యాయులు కూడా నమ్మరు.
కొందరు ఈ సమస్యకు పరిష్కారాలు కోరుతున్నారు.
ఇండియానా యూనివర్సిటీలో నాలుగో సంవత్సరం మెడిసిన్ చదువుతుండగా సారా ఇస్లాం దీర్ఘకాలిక అనారోగ్యానికి గురయ్యారు. దానివలన అలసట, నొప్పులు ఉండేవి. దేని మీదా శ్రద్ధ పెట్టలేకపోయేవారు.
ఈ బాధలతో తాను చదువుతున్న వైద్యశాస్త్ర పరిభాషలో పట్టు కోల్పోయినట్లు ఆమెకు అనిపించేది.

ఫొటో సోర్స్, HARDEEP LOTAY
గోడకు చెబుతున్నట్టే..
"నేనో మెడికల్ విద్యార్థిని, మెడికల్ పరిభాషలో పదాలు నాకు బాగా తెలుసు. అయినా కూడా నా బాధేంటో చెబుతుంటే గోడకు చెబుతున్నట్లే ఉండేది. నా బాధ ఎలా వివరించి చెప్పాలో అర్థమయ్యేది కాదు" అని సారా చెప్పారు.
సారాకు ఉన్న వ్యాధి లక్షణాలు ఫలానా రోగానికి సంబంధించినవని తేల్చి చెప్పడం సాధ్యపడలేదు.
రోగ నిర్దరణ కాకపోయినా, వ్యాధి ఏంటో డాక్టర్లు సరిగా చెప్పలేకపోయినా కూడా తన జీవితం కొనసాగించవచ్చని ఆమెకు అర్థమైంది.
మెల్లగా కొంతకాలానికి సారా కోలుకున్నారు. తరువాత మళ్లీ మెడికల్ స్కూల్‌కు వెళ్లడం ప్రారంభించారు.
కానీ తన సహాధ్యాయులలో ఏదో మార్పు వచ్చిందని సారాకు అనిపించింది.
"నేను నొప్పి అని చెప్పగానే వాళ్లంతా 'బద్దకం, పని చెయ్యడానికి ఇష్టం లేదు కాబట్టి నొప్పి అని చెప్తున్నాను' అనుకున్నారు. నేను ఊరికే నాటకాలు ఆడుతున్నాను అనుకున్నారు.
వాళ్లతో నేను ఏం చెప్పినా నమ్మరని నాకు అర్థమైంది. పైగా వాటిని తిరిగి నా మీదే ప్రయోగిస్తారు. రెండు రోజులు ముందు బాగానే నడిచావు కదా, ఇప్పుడేం నొప్పి? ఇప్పుడెందుకు నడవలేవు అనేవారు. నేనేదో అబద్ధం చెప్తున్నట్లు చూసేవారు.
వైకల్యం అంటే ఏమిటో, ఆ బాధ ఎలా ఉంటుందో వాళ్లకు తెలీదు" అని సారా వివరించారు.
ఈ రకమైన వివక్షను 'ఏబులిజం' అంటారు. అంటే వైకల్యం ఉన్నవారిని చిన్నచూపు చూడడం.
దీనివలన వైకల్యం ఉన్న డాక్టర్లకు మరింత గడ్డు పరిస్థితి ఏర్పడుతుంది.
చాలామందిలాగే డాక్టర్లకు కూడా కొన్ని వైకల్యాలు ఉండొచ్చు. అలాగని వాళ్లు మంచి డాక్టర్లు కాకుండా పోరు. కానీ వైకల్యం వలన వాళ్లని ఎవరూ నమ్మరు.
పేషెంట్ల ముందు నోట్స్ రాసుకోవడం, మెట్లు ఎక్కకుండా లిఫ్ట్ ఎక్కడం వంటి చిన్న చిన్న విషయాలను కూడా తన ప్రొఫెసర్లు విమర్శించేవారని, అవన్నీ ప్రొఫెషనల్స్ చెయ్యాల్సిన పనులు కావని ఆరోపించేవారని సారా చెప్పారు.
"రోగులు ఏం చెప్తున్నారో మనం నమ్మకపోతే వాళ్లు మనల్ని ఎలా గౌరవిస్తారు? డాక్టర్లను రోగులు గౌరవించాలని మనం ఎలా ఆశించగలం? కొన్ని పనులు చేయలేకపోయినంత మాత్రాన మంచివాళ్లు, చెడ్డవాళ్లు అని ముద్ర వేయడం చూస్తే చాలా బాధగా, భయంగా ఉంటుంది" అని సారా అంటున్నారు.
హర్దీప్ లోటే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఐదో సంవత్సరం మెడిసిన్ చదువుతున్నారు. ఆయన మానసిక ఆరోగ్య నిపుణులు కూడా.
సారా అభిప్రాయంతో హర్దీప్ ఏకీభవిస్తున్నారు.
"మెడికల్ ప్రొఫెషన్‌లో నువ్వు చేయగలిగినదాని కన్నా ఎక్కువగా చేయాలని అనుకుంటారు. ఈ వృత్తి స్వభావమే అది అని నమ్ముతారు. మనం కాస్త తక్కువ చేసినా చిన్నచూపు చూస్తారు" అని హర్దీప్ అంటున్నారు.
హర్దీప్ వైద్య వృత్తిలో ఉన్న వివక్షపై కూడా పరిశోధనలు చేస్తున్నారు.
"నేను ఏడాదిపాటు బ్రేక్ తీసుకున్నాను. మెడికల్ స్కూల్‌లో కొద్దిపాటి వ్యత్యాసాన్ని కూడా బలహీనతగా చూస్తారు. నీ సహాధ్యాయులతో పోల్చి నీ సామర్థ్యాన్ని తీసి పారేస్తారు. బ్రేక్ తీసుకున్నారు అనేది వాళ్ల మెదళ్లల్లో పాతుకుపోతుంది. దాన్నొక బలహీనతగానే చూస్తారు. మనతోటి వారు, మన సీనియర్లు కూడా మానసిక రోగుల్లాగా మాట్లాడడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది" అని హర్దీప్ అంటున్నారు.

ఫొటో సోర్స్, CHARIS HILL
మెడికల్ స్కూల్లో ఇలాంటి వైఖరులు, సారా, హర్దీప్‌లకు ఎదురైన అనుభవాలు పరిశోధనల్లో కూడా బయటపడ్డాయని ఫిలాసఫీ ప్రొఫెసర్లు డాక్టర్ హావి కారెల్, డాక్టర్ ఇయాన్ కిడ్ అంటున్నారు. హావి కారెల్ యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్‌లో, ఇయాన్ కిడ్ యూనివర్సిటీ ఆఫ్ నాటింగ్‌హమ్‌లో పనిచేస్తున్నారు.
వైకల్యం ఉన్న రోగులను వైద్య నిపుణులు అసమర్థులుగా, బలహీనులుగా భావిస్తారు. వారికి మానసిక స్థిరత్వం ఉండదని, నమ్మదగినవారు కాదని విశ్వసిస్తారు. అందుకే వాళ్లేం చెప్పినా నమ్మరు అని అధ్యయనాల్లో తేలింది.
ఇలాంటి అభిప్రాయాల వలన వారికి సరైన వైద్యం అందించే అవకాశం ఉండదు. దాంతో వారు మరిన్ని అవస్థలకు గురవుతారు.
రోగులకు తమ మీద తమకే నమ్మకం పోయేలా చేయడం
రోగులకు కుటుంబ వైద్యులను కనుగొనడంలో సహాయపడే కెనడా కేర్ కనెక్షన్ (సీసీసీ) కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వెలిబుచ్చింది.
వైకల్యంతో బాధపడే రోగులకు కుటుంబ వైద్యులను చూసిపెట్టడానికి ఎక్కువ సమయం పడుతుందని సీసీసీ తెలిపింది.
"వైద్యులు అలాంటి రోగులకు చికిత్స అందించడానికి అసలు ఒప్పుకోరు" అని ఒక కేర్ కనెక్టర్ చెప్పారు.
న్యూజెర్సీకి చెందిన డిజేబిలిటీ యాక్టివిస్ట్ జోన్నాకు మాస్ట్ సెల్ యాక్టివేషన్ సిండ్రోమ్ ఉంది.
మాస్ట్ కణాలు కావలసినదాని కన్నా చురుకుగా పనిచేస్తుంటాయి. దీని ప్రభావం శరీర రోగ నిరోధక వ్యవస్థపై పడుతుంది.
జోన్నాకు 25 ఏళ్లు వచ్చేవరకూ ఏ రకమైన వైద్య సహాయం లేకుండానే గడిపారు. ఎందుకంటే తనకున్న లక్షణాలను ఆమె ఎక్కువగా ఊహించుకుంటున్నారని వైద్యులు భావించారు.
"వైద్య వృత్తిలో ఉన్నవారికి వైకల్యం ఉన్న రోగులు చెప్పే విషయాలను నమ్మాలని పాఠాల్లో చెబితే బాగుండును. మెడికల్ విద్యార్థులకుగానీ వైద్యులకుగానీ రోగి చెబుతున్న లక్షణాలకు తమ దగ్గర చికిత్స లేదని చెప్పడంలో తప్పేమీ లేదు. ఆ వాస్తవాన్ని అంగీకరిస్తే తప్పేం కాదు. రోగులకు తమ మీద తమకే నమ్మకం పోయేలా ప్రవర్తించడం కన్నా ఇది ఎంతో మేలు" అని జోన్నా అంటున్నారు.
ఈ అంశంపైనే యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్ దృష్టి పెడుతోంది. వైకల్యం ఉన్న రోగులతో ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి అనే విషయాలపై కోర్సులు ప్రవేశపెట్టారు.
డిజేబిలిటీ ప్రైడ్ గురించి, దైనందిన జీవితంలో వారి పట్ల సహానుభూతితో ఉండడం గురించి పాఠాలు చెబుతున్నారు.
అయితే, వైకల్యం ఉన్నవారు ఎక్కువ మంది డాక్టర్లుగా ఉంటే ఈ కమ్యూనికేషన్ అంతరాన్ని పూడ్చగలమని డిజేబుల్డ్ యాక్టివిస్టులు, మెడికల్ విద్యార్థులు, వైద్యులు అంటున్నారు.
"వైకల్యం చెడ్డదని డాక్టర్లు అనుకుంటారు. దాని నుంచి దూరంగా ఉండాలని భావిస్తారు" అని డిజేబిలిటీ యాక్టివిస్ట్ చారిస్ హిల్స్ అంటున్నారు.
"అదే ఒక డిజేబుల్డ్ డాక్టర్ ఉంటే నా బాధేమిటో చెప్పడానికి నేను అవస్థ పడక్కర్లేదు. ఎందుకంటే మా ఇద్దరి భాష ఒకటే. నాకు సరైన వైద్యం అందుతుంది. నా ఆరోగ్యం మెరుగుపడుతుంది" అని వారు అంటున్నారు.
సారా, హర్దీప్ కూడా తమ అనుభావలను దృష్టిలో పెట్టుకుని తాము అందిస్తున్న వైద్యంలో మార్పులు తీసుకువస్తున్నారు.
"వైకల్యం ఉన్నవారితో ఎలా మాట్లాడాలి, వారికి ఎలా వైద్య సహాయం అందించాలనేది యూనివర్సిటీ చదువుల్లో పద్ధతి ప్రకారం నేర్పించాలి" అని ససెక్స్ మెడికల్ స్కూల్ సీనియర్ లెక్చరర్ డాక్టర్ డంకన్ ష్రూస్‌బరీ అభిప్రాయపడ్డారు.
వైకల్యం ఉన్న విద్యార్థులకు యూనివర్సిటీ సీటు సంపాదించే దిశలో పెట్టే పరీక్షల్లో కూడా యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్‌లో మార్పులు తీసుకు వచ్చారు. రోగిని ఎత్తుకుని తీసుకెళ్లగలిగే సామర్థ్యం ఉండడంలాంటి వాటిని ప్రమాణాల్లోంచి తీసేశారు.
"వైద్యం చేయడం అనేది సగం సమస్య మాత్రమే. మెడికల్ సీటుకు దరఖాస్తు పెట్టుకోవడం దగ్గర నుంచీ మాలాంటి వాళ్లకు కష్టాలు మొదలవుతాయి. సీటు సంపాదించి, కోర్సు పూర్తి చేసి, వైద్య వృత్తి చేపట్టేవరకు ఎన్నో రకాల సమస్యలు" అని సారా అంటున్నారు.
అయితే, వ్యవస్థలో క్రమబద్ధమైన మార్పులు తీసుకు వస్తే పరిస్థితులు మారవచ్చు.
అలాంటి మార్పుల కోసమే యాక్టివిస్టులు, కొన్ని మెడికల్ కాలేజీలు కృషి చేస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
- పీరియడ్స్ సమయంలో వ్యాక్సీన్ తీసుకోవచ్చా?
- గాంధీ హాస్పిటల్‌కు చేతులెత్తి దండం పెట్టిన ఓ మహిళ... ఆ వైరల్ ఫోటో వెనుక అసలు కథ
- ఆడపిల్లలు వయసు రాకముందే రజస్వల కావడానికి కారణాలేమిటి? సమస్యలేమిటి? పరిష్కారాలేమిటి?
- మోదీ చెబుతున్నట్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడానికి నిజంగా గత ప్రభుత్వాలే కారణమా?
- ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ విజయానికి కారణాలేంటి... ఏ పార్టీ ఏమంటోంది?
- శాంతియుత నిరసనలు హింసాత్మకంగా ఎందుకు మారతాయి? పోలీసులతో జనం ఎందుకు ఘర్షణకు దిగుతారు?
- చింతల వెంకటరెడ్డి: మట్టితో ఈ రైతు చేసిన ప్రయోగాలు సేంద్రియ వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కిస్తాయా?
- ఆంధ్రప్రదేశ్: గాడిద మాంసం తింటే సెక్స్ సామర్థ్యం పెరుగుతుందా.. ఏపీలో ఎందుకంత గిరాకీ పెరుగుతోంది
- బిర్యానీ పక్కాగా వండాలంటే కచ్చితమైన లెక్కలు ఉంటాయా? దీనికో ఆల్గారిథమ్ ఉందా?
- IPO అంటే ఏమిటి... దరఖాస్తు చేసిన వారందరికీ షేర్లు కేటాయిస్తారా? కేటాయించకపోతే ఏం చేయాలి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








