హరిద్వార్ 'ధర్మ సంసద్' ప్రసంగాలపై భారత్‌కు సలహాలు ఇచ్చిన పాకిస్తాన్

పాక్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, పాక్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ

హరిద్వార్ 'ధర్మ సంసద్‌లో ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా రెచ్చొగొట్టే ప్రసంగాలు ఇవ్వడంపై పాకిస్తాన్ ప్రభుత్వం సోమవారం ఇస్లామాబాద్‌లోని భారత దౌత్యవేత్తను పిలిపించి మాట్లాడింది.

పాకిస్తాన్ దీనిపై భారత రాయబార కార్యాలయంలో సీనియర్ దౌత్యవేత్త అయిన ఎం.సురేష్ కుమార్‌ దగ్గర తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

పాకిస్తాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఆసిమ్ ఇఫ్తికార్ అహ్మద్ దీనిపై ఒక ప్రకటన కూడా జారీ చేశారు.

"ఈరోజు భారత దౌత్యవేత్తను ఇస్లామాబాద్‌లోని విదేశాంగ శాఖ కార్యాలయానికి పిలిపించాం. భారత్‌లో ముస్లింల ఊచకోతకు హిందుత్వ వాదులకు బహిరంగంగా పిలుపునివ్వడం పట్ల పాకిస్తాన్ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోందని భారత ప్రభుత్వానికి తెలిజేయాలని కోరాం" అని అందులో చెప్పారు.

"హిందూ రక్షణ సేనకు చెందిన ప్రబోధ్‌నాథ్ గిరి, మిగతా హిందుత్వ నేతలు జాతి ప్రక్షాళనకు పిలుపు నివ్వడం తీవ్రంగా ఖండించాల్సిన అంశం. కానీ, భారత ప్రభుత్వం దానిపై విచారం వ్యక్తం చేయడంగానీ, ఖండించడం గానీ చేయలేదు. వారిపై ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు" అని కూడా ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ విద్వేష పూరిత ప్రసంగాల వల్ల పాకిస్తాన్ ప్రజలు, పౌర సమాజాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ సమాజాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయనే విషయాన్ని తాము భారత్‌తో పంచుకున్నామని కూడా పాకిస్తాన్ తెలిపింది.

ఇంకా ఆ ప్రకటనలో, "భారత్‌లో హిందుత్వ ఆధారంగా నడుస్తున్న ప్రస్తుత బీజేపీ-ఆర్ఎస్ఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో మైనారిటీలు, ముఖ్యంగా ముస్లింలకు వ్యతిరేకంగా విద్వేషపూరిత ప్రసంగాలు చేయడం ఆనవాయితీగా మారిపోవడం విచారకరం" అని కూడా వ్యాఖ్యానించారు.

పాక్ ప్రధాని

ఫొటో సోర్స్, Reuters

పాకిస్తాన్ ఇంకా ఏమేం చెప్పింది

హరిద్వార్‌లో డిసెంబర్ 17 నుంచి 19 వరకూ నిర్వహించిన ధర్మ సంసద్‌లో సాధువులు చేసిన వివాదాస్పద ప్రసంగాలతో పాటు భారత్‌లో గతంలో జరిగిన కొన్ని ఘటనలను కూడా పాకిస్తాన్ గుర్తు చేసింది.

"హిందుత్వ నేతలు ఇలాంటి రెచ్చగొట్టే ప్రసంగాలు ఇంతకు ముందు కూడా ఇచ్చారు. అందులో అధికార పార్టీ నుంచి ఎన్నికైన సభ్యులు కూడా ఉన్నారు. 2020 ఫిబ్రవరిలో దిల్లీలో ముస్లిం వ్యతిరేక అల్లర్లు వారివల్లే జరిగాయి" అని పాక్ విదేశాంగ శాఖ తమ ప్రకటనలో చెప్పింది.

"మైనారిటీల మానవ హక్కులకు ముఖ్యంగా ముస్లింలు, వారి ప్రార్థనా స్థలాలకు తీవ్ర నష్టం కలుగుతోంది. దీనితోపాటూ కేంద్రం, చాలా బీజేపీ పాలిత రాష్ట్రాలు ముస్లిం వ్యతిరేక చట్టాలు రూపొందిస్తున్నాయి. హిందుత్వ సమూహాలు చిన్న చిన్న సాకులు చూపించి ముస్లింలకు వ్యతిరేకంగా వరుస దాడులకు పాల్పడుతున్నాయి. శిక్షలు పడకుండా తప్పించుకుంటున్నాయి. ఇది భారత్‌లో ముస్లింల భవిష్యత్తు, ఇస్లామోఫోబియా గురించి ఒక భయంకరమైన చిత్రాన్ని చూపిస్తోంది" అని పేర్కొంది..

భారత్‌కు పాక్ సూచనలు

ఫొటో సోర్స్, Getty Images

మైనారిటీలు, ముఖ్యంగా ముస్లింలకు వ్యతిరేకంగా వ్యవస్థీకృతంగా జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలకు భారత్‌ జవాబుదారీగా ఉండేలా, ముంచుకొస్తున్న మారణహోమం నుంచి కాపాడ్డానికి తక్షణం చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ సమాజాన్ని పాకిస్తాన్ డిమాండ్ చేస్తోందని తెలిపింది.

భారత్‌లో మైనారిటీలకు వ్యతిరేకంగా విద్వేషపూరిత ప్రసంగాలు, పెరిగిన హింసాత్మక ఘటనలపై భారత్ దర్యాప్తు చేస్తుందని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా అడ్డుకుంటుందని ఆశిస్తున్నామని పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అన్నారు.

దేశంలోని మైనారిటీల భద్రత, వారి సంక్షేమంతోపాటూ మైనారిటీల ప్రార్థనా స్థలాలను కూడా సంరక్షించాలని పాకిస్తాన్ భారత్‌ను కోరుతోందని ఆ ప్రకటనలో చెప్పారు.

భారత ప్రధాని

ఫొటో సోర్స్, Bjp

ఇరు దేశాలూ దౌత్యవేత్తలను పిలిపించడం మామూలే

ఏదైనా ఘటనలు జరిగినపుడు విదేశాంగ మంత్రిత్వ శాఖ తరఫున ఒక ప్రకటన జారీ చేయడం చాలా మామూలు విషయం.

కానీ, భారత్‌లో మైనారిటీలకు సంబంధించిన ఘటనలపై ఒక భారత దౌత్యవేత్తను పిలిపించి మాట్లాడడం అనేది చాలా తక్కువగా జరుగుతుంది.

అయితే, పాకిస్తాన్‌లో హిందూ, సిక్కు మైనారిటీల పట్ల హింసాత్మక ఘటనలు జరిగినపుడు, భారత్ చాలాసార్లు ప్రకటన జారీ చేసి వాటిని ఖండించింది. పాకిస్తాన్ దౌత్యవేత్తలను పిలిపించి మాట్లాడింది.

ఆగస్టులో పాకిస్తాన్‌లోని రహీమ్‌యార్ ఖాన్ జిల్లాలో హిందూ ఆలయంపై దాడి జరిగినపుడు భారత్ పాకిస్తానీ దౌత్యవేత్తను పిలిపించి మాట్లాడింది.

ధర్మ సంసద్

ఫొటో సోర్స్, BBC/VARSHA SINGH

ఫొటో క్యాప్షన్, ధర్మ సంసద్

హరిద్వార్‌లో ఏం జరిగింది

హరిద్వార్‌లో డిసెంబర్ 17 నుంచి 19 వరకూ నిర్వహించిన ధర్మ సంసద్‌లో హిందుత్వ గురించి సాధువులు చేసిన వివాదాస్పద ప్రకటనల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఈ వీడియోలో మత రక్షణకు ఆయుధాలు చేపట్టాలని, ముస్లింను ప్రధానమంత్రి కాకుండా చేయాలని, ముస్లిం జనాభాను పెరగనివ్వకూడదని అనడంతోపాటూ మత రక్షణ పేరుతో వివాదాస్పద ప్రసంగాలు ఇస్తూ కనిపించారు. మహిళా సాధువులు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు.

ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియో వైరలయిన కొన్ని గంటల తర్వాత కూడా పోలీసులు ఎలాంటి చర్యలూ చేపట్టకపోవడంతో జిల్లా యంత్రాంగంపై ప్రశ్నలు వెల్లువెత్తాయి.

అయితే, తర్వాత ఒక ఫిర్యాదు రావడంతో ఉత్తరాఖండ్ పోలీసులు, యూపీ షియా వక్ఫ్ బోర్డ్ మాజీ అధ్యక్షుడు వసీమ్ రిజ్వీ అలియాస్ జితేంద్ర నారాయణ్ త్యాగి, మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు.

వీడియోలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నా, ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదంటూ ఆ తర్వాత పోలీసులపై కూడా ప్రశ్నలు వచ్చాయి.

రాయ్‌పూర్ ధర్మ సంసద్

ఫొటో సోర్స్, ALOK PUTUL/BBC

ఫొటో క్యాప్షన్, రాయ్‌పూర్ ధర్మసంసద్‌లో కాళీచరణ్ మహరాజ్

ప్రత్యేకంగా ఒక సమాజానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రసంగాలు ఇచ్చారనే ఆరోపణలతో కొత్వాలీ పోలీసులు ఆదివారం హరిద్వార్‌కు చెందిన సాధువు ధర్మదాస్, సాధ్వి అన్నపూర్ణిపై కేసు నమోదు చేశారు.

ఈ ధర్మ సంసద్‌ ఉత్తర హరిద్వార్ ఖడ్‌ఖడీలోని వేద నికేతన్‌లో డిసెంబర్ 17 నుంచి 19 వరకూ జరిగింది. దీనికి పలు అఖాడాలకు చెందిన మహామండలేశ్వర్‌లు, హిందుత్వ సంఘాల నేతలు, సాధువులు, సాధ్విలు పాల్గొన్నారు.

ఈ ధర్మ సంసద్ తర్వాత రాయ్‌పూర్‌లో జరిగిన ఒక ధర్మ సంసద్ గురించి కూడా జోరుగా చర్చ జరిగింది.

ఆదివారం ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మహాత్మా గాంధీని దూషించడంతోపాటూ ముస్లింలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.

అయితే, ఈ ధర్మ సంసద్‌ నిర్వాహకుల్లో ఒకరైన రాయ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్ ఛైర్మన్, కాంగ్రెస్ నేత ప్రమోద్ దూబే ఫిర్యాదుతో మహాత్మా గాంధీని దూషించిన కాలీచరణ్ మహరాజ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మోహన్ మర్కామ్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేసారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)