నడి రోడ్డుపైనే ఉమ్మేసే జనం తీరు మారేదెప్పుడు..

గోడల పై చిత్రాల ద్వారా బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మడం తప్పని అవగాహన కల్పిస్తున్న ముంబయి కార్పొరేషన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గోడలపై చిత్రాల ద్వారా బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మడం తప్పని అవగాహన కల్పిస్తున్న ముంబయి కార్పొరేషన్
    • రచయిత, అపర్ణ అల్లూరి
    • హోదా, బీబీసీ న్యూస్

ఈ ఏడాది మొదట్లో బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం ఆపేయాలని ప్రజలకు అవగాహన కల్పించేందుకు రాజా, ప్రీతి నరసింహన్ ఒక రోడ్ ట్రిప్‌కు బయలుదేరారు.

కారులో ఒక లౌడ్ స్పీకర్ పెట్టుకుని తమ సందేశాన్ని ప్రజలకు వినిపించారు.

బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడానికి వ్యతిరేకంగా నినాదాలను వారు ప్రయాణం చేస్తున్న కారుపై రాశారు.

దేశంలో ఉన్న వారికెవరికైనా ఈ దంపతులు చేస్తున్న పోరాటం గురించి సులువుగా అర్ధమవుతుంది. వీధుల్లో ఉమ్మి వేయడం సర్వ సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. కొన్ని సార్లు సాధారణంగా, కొన్ని సార్లు కఫంతో కూడుకుని, కొన్ని సార్లు కిళ్లీ నమిలి వచ్చే ఎర్రని రంగుతో ఊసిన ఉమ్ములతో సాధారణ గోడల పైన, కొన్ని భవనాల పైన కూడా మరకలు కనిపిస్తూ ఉంటాయి.

ఆఖరుకు కోల్‌కతా చారిత్రక హౌరా బ్రిడ్జ్ పై కూడా ఈ మరకలు భయపెడుతూ ఉంటాయి.

బహిరంగంగా ఉమ్మి వేసే వారి నుంచి దేశంలోని భవనాలను, వీధులను కాపాడేందుకు నర్సింహన్ దంపతులు బయలుదేరారు. వారు పూణెలో ఉంటారు. 2010 నుంచి ఈ ఉమ్మి వేసే అలవాటుకు వ్యతిరేకంగా పని చేస్తున్నారు.

ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో ప్రచారం నిర్వహిస్తూ వర్క్ షాపులు నిర్వహిస్తున్నారు. మున్సిపాలిటీలను సంప్రదించి శుభ్రపరిచే ప్రయత్నాలను కూడా చేస్తున్నారు. ఒకసారి, వారు పుణే రైల్వే స్టేషన్‌లో కిళ్లీ మరకలతో ఉన్న గోడలపై పెయింట్ వేశారు. కానీ, మూడు రోజుల్లోనే ఆ గోడ కిళ్లీ ఉమ్మి మరకలతో నిండిపోయింది.

ఆ దంపతులు చేస్తున్న పనికి కొంత మంది అభ్యంతరం తెలిపితే, మరి కొందరు కోపం ప్రదర్శించారు. "నీ సమస్య ఏంటి? ఇది నీ అయ్య సొమ్మా? అని ఒక వ్యక్తి ప్రశ్నించడాన్ని ప్రీతి గుర్తు చేసుకున్నారు.

"అయితే, కోవిడ్ మహమ్మారి కొన్ని మార్పులను తీసుకొచ్చింది. కొంత మంది బహిరంగంగా ఉమ్మి వేసేవారు క్షమాపణలు చెప్పారు" అని ప్రీతి చెప్పారు.

"మహమ్మారి భయం వారిని ఆలోచించేలా చేసింది" అని ఆమె అన్నారు.

పుణేలో ఉమ్ము వేసినందుకు 11 మంది పై చర్యలు తీసుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పుణేలో ఉమ్ము వేసినందుకు 11 మంది పై చర్యలు తీసుకున్నారు.

"ఉమ్మి వేసే దేశం"

దేశంలో వీధుల్లో ఉమ్మి వేయకూడదని చేస్తున్న పోరాటం ఎప్పుడూ మనస్ఫూర్తిగా జరగలేదు.

బహిరంగంగా ఉమ్మి వేసే వారిని, మూత్ర విసర్జన చేసేవారిని మందలించేందుకు కొంత మంది స్వచ్చంద ఇన్స్పెక్టర్ల ద్వారా చెప్పించేందుకు ముంబయి చాలా ప్రయత్నించింది. కానీ, ఉమ్మి వేయడం నేరం అనే విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.

ఇంతలో కోవిడ్ మహమ్మారి చుట్టుముట్టింది. ఈ సారి బహిరంగంగా ఉమ్మి వేసే వారికి తీవ్రమైన జరిమానాలు, జైలు శిక్ష విధిస్తామంటూ అధికారులు రంగంలోకి దిగారు.

ఇదంతా విపత్తు నిర్వహణ చట్టం కింద అమలు చేశారు. ఆఖరుకు బహిరంగ స్థలాల్లో ఉమ్ము వేయవద్దని ప్రధాని మోదీ కూడా విజ్ఞప్తి చేశారు.

2016లో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి స్వయంగా పార్లమెంటులో "ఇది ఉమ్మి వేసే దేశం" అని ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ అన్నారు.

కాలక్షేపం అవ్వకపోతే ఉమ్మి వేస్తాం, అలిసిపోతే ఉమ్మి వేస్తాం, కోపం వస్తే ఉమ్మి వేస్తాం, లేదా కొన్నిసార్లు ఊరికే కూడా ఉమ్మి వేస్తాం. ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు ఉమ్మి వేస్తాం.

ఆయన చెప్పింది కూడా నిజమే. భారతదేశంలో రోడ్లపై నడుస్తూ ఉమ్మి వేస్తూ ఉండటం చూస్తూ ఉంటాం. కార్లలో డ్రైవ్ చేస్తూ, బైక్ లు నడుపుతూ, ఆటోలు నడుపుతూ కూడా ఉమ్మి వేస్తూ ఉంటారు.

ఈ అలవాటు ఎక్కువగా పురుషుల్లో ఉంటుంది.

"భారతదేశంలో పురుషులు తమ శరీరాలతో, శరీరం నుంచి వెలువడే ప్రతీ విషయంతో చాలా సౌకర్యవంతంగా ఉంటారు" అని కాలంనిస్ట్ సంతోష్ దేశాయ్ చెప్పారు.

"పురుషులు ఏదైనా చేయొచ్చు అనే విషపూరితమైన అభిప్రాయంతో ఈ ఉమ్మి వేయడం కూడా ముడి పడి ఉంటుంది" అని టెలిగ్రాఫ్ అసోసియేట్ ఎడిటర్ చెప్పారు.

భారతదేశంలో రోడ్ల పై ఉమ్ము వేయడం సాధారణంగా చేస్తూ ఉంటారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రోడ్లపై ఉమ్మి వేయడం సాధారణంగా చేస్తూ ఉంటారు.

బహిరంగంగా ఎందుకు?

బహిరంగంగా ఉమ్మి వేయడానికి.. కోపం నుంచి కాలక్షేపం వరకూ చాలా కారణాలు ఉన్నాయని ప్రీతి అంటారు. "ఇంతకంటే ఉత్తమంగా చేయడానికి వారి దగ్గర వేరే పనేమీ ఉండదు, లేదా ఊయడం వారి హక్కు అని అనుకుంటారు" అని ఆమె అన్నారు.

ఈ అలవాటు శరీరంలోంచి వచ్చే మలినాలను ఇంటి బయటే విడిచిపెట్టాలనే హిందూ సంప్రదాయాల నుంచి కూడా వచ్చి ఉంటుందని కొంత మంది చరిత్రకారులు అంటారు.

"ఈ ఉమ్మివేసే అలవాటు పరిశుభ్రతను కూడా పట్టించుకోదు" అని ముఖర్జీ చెప్పారు. ఒకసారి ఒక ట్యాక్సీ డ్రైవర్ తనకు రోజు బాగా గడవలేదని, తన అనుభవాన్ని ఉమ్మి ద్వారా వదిలించుకోవాలని అనుకుంటున్నానని చెప్పినట్లు చెప్పారు.

ఉమ్మి వేయడానికి వ్యతిరేకంగా పోరాటం

ఒకప్పుడు ప్రతి చోటా, ప్రతి ఒక్కరూ ఉమ్మి వేస్తూ ఉండేవారు. ఉమ్మి వేయడాన్ని రాచరికపు మందిరాల్లో కూడా చూడవచ్చు. చాలా ఇళ్లల్లో ఈ ఉమ్మి సేకరణ కోసం పెద్ద పెద్ద ఉమ్మి తొట్లు కూడా ఉండేవి.

మధ్య యుగంలో యూరోప్‌లో భోజనం చేస్తుండగా మధ్యలో టేబుల్ కింద ఉమ్మి వేయవచ్చు. ఉమ్మిని లోపలకు పీల్చడం తప్పు అని ఎరాస్ మస్ రాశారు. 1903లో బ్రిటిష్ మెడికల్ జర్నల్ ప్రపంచంలోనే ఉమ్మి ద్వారా తలెత్తే ఉపద్రవాలకు అమెరికా కేంద్రమని పేర్కొంది.

ఫ్యాక్టరీలలో కార్మికులు నేలపై ఎందుకు ఉమ్మి వేస్తున్నారని 1908లో ఒక మసాచూసెట్స్ హెల్త్ ఇన్స్పెక్టర్ అడిగిన ప్రశ్నకు "మరి నేలపై కాకపోతే, వారి జేబుల్లో ఉమ్మి వేస్తారా" అని తిరిగి ప్రశ్నించారు.

బ్రిటన్‌లో పరిస్థితులేమి మెరుగ్గా లేవు. అక్కడ ట్రామ్ కార్లలోనూ ప్రజలు ఉమ్మి వేస్తూ ఉండేవారు. అయితే, దానికి వ్యతిరేకంగా చట్టాన్ని తీసుకుని రావాలని వైద్య సమాజం కోరడంతో జరిమానాలు విధించడం మొదలయింది.

1880లో న్యూ యార్క్ తొలిసారి బహిరంగంగా ఉమ్ము వేయడాన్ని నిషేధించింది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 1880లో న్యూ యార్క్ తొలిసారి బహిరంగంగా ఉమ్ము వేయడాన్ని నిషేధించింది

"అయితే, క్షయ వ్యాధి పశ్చిమ దేశాల్లో ఈ అలవాటుకు ఒక చెక్ పెట్టింది. 19వ శతాబ్దం చివర్లోనూ, 20వ శతాబ్దం మొదట్లోనూ వచ్చిన క్రిమి సిద్ధాంతం కూడా అవగాహన పెంచేందుకు కీలక పాత్ర పోషించింది" అని జర్నలిస్టు విద్య కృష్ణన్ అన్నారు.

ఆమె 'ఫాంటమ్ ప్లేగ్: హౌ ట్యూబర్ కులోసిస్ షేప్డ్ హిస్టరీ' అనే పుస్తకం రాస్తున్నారు.

"క్రిముల వ్యాప్తి పట్ల అవగాహన రావడంతో కొత్త సామాజిక అలవాట్లు, ఆచారాలు మొదలయ్యాయి. తుమ్ములు, దగ్గు వచ్చినప్పుడు చేతులు అడ్డు పెట్టుకోవడం, హ్యాండ్ షేకింగ్ మానడం, పిల్లలను ముద్దు పెట్టుకోవడం లాంటివి ఆపారు. పరిశుభ్రత గురించి అవగాహన బయటకు కనిపించడం మొదలయింది".

ఉమ్ము వేయడం గురించి అవగాహన రావడంతో మగవారి ప్రవర్తనలో మార్పు వచ్చిందని కృష్ణన్ చెప్పారు.

"క్షయ లాంటి రోగాల వ్యాప్తికి ఇప్పటికీ ఈ బహిరంగంగా ఉమ్మి వేయడమే కారణం" అని అన్నారు.

"కానీ, భారతదేశంలో ఇది అమలు చేయడానికి చాలా అవరోధాలున్నాయి" అని కృష్ణన్ చెప్పారు.

ఈ అలవాటును మాన్పించడానికి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గట్టి ప్రయత్నాలు చేయలేదు. ఉమ్మి వేయడాన్ని సామాజికంగా కూడా ఆమోదిస్తారు. పొగాకు పీల్చడం, లేదా క్రీడాకారులు కెమెరా వైపు ఉమ్మి వేయడం, లేదా బాలీవుడ్ లో ఇద్దరు మగవాళ్ళ మధ్య వివాదం చెలరేగుతున్నప్పుడు ఒకరిపై ఒకరు ఉమ్మి వేసుకోవడం చాలా సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది.

ఉమ్మి తొట్టెలు లేకపోవడాన్ని ప్రీతి నరసింహన్ విమర్శిస్తారు."నేను ఉమ్మి వేయాలని అనుకున్నా ఎక్కడ వేస్తాను?" అని ప్రశ్నించారు. ఒకప్పుడు కోల్‌కతాలో వీధి దీపపు స్తంభాలకు ఇసుక నింపిన ఉమ్మి తొట్టెలు కట్టి ఉండేవి. అవిప్పుడు మాయమైపోయాయి. దాంతో, ప్రజలు ఎక్కడ పడితే అక్కడ ఉమ్మి వేస్తున్నారు.

గోడల పై చిత్రాల ద్వారా బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మడం తప్పని అవగాహన కల్పిస్తున్న ముంబయి కార్పొరేషన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గోడల పై చిత్రాల ద్వారా బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మడం తప్పని అవగాహన కల్పిస్తున్న ముంబయి కార్పొరేషన్

వీటి కంటే పెద్ద సవాళ్లు ఉన్నాయి. "ఇక్కడుండే కులం, లింగం, వర్గాలను ప్రవర్తన పరంగా వచ్చిన మార్పులు కానీ, లేదా ప్రజారోగ్య కార్యక్రమాలు కానీ దాటలేవు". అని కృష్ణన్ అన్నారు. భారతదేశంలో టాయ్ లెట్లు , మంచి నీరు, కూడా కొందరికి మాత్రమే అందుబాటులో ఉండే అవకాశాలు.

ప్రజలకు అవగాహన కలుగచేయకుండా శిక్షించడం వల్ల ఈ అలవాటుకు వ్యతిరేకంగా చేస్తున్న యుద్ధంలో గెలవలేమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గత రెండేళ్లుగా కోవిడ్ మహమ్మారి ఉన్నప్పటికీ, ఈ అలవాటును మాన్పించే ప్రయత్నాలు కూడా నెమ్మదిగా మాయమైపోతున్నాయి.

కానీ, రాజా, ప్రీతీ నరసింహన్ మాత్రం వారి పోరాటాన్ని కొనసాగిస్తున్నారు.

దీని వల్ల కోవిడ్-19 వ్యాప్తి చెందుతుందని చాలా మందికి అవగాహన కూడా లేదు. కనీసం ఈ అవగాహనను కలిగించేందుకు వారి ప్రయత్నం పనికొస్తుంది.

"మేము సమయాన్ని వృథా చేస్తున్నా పర్వాలేదు, మేము ప్రయత్నిస్తాం" అని నరసింహన్ అన్నారు.

"కనీసం 2 శాతం మందిలో ఈ ప్రవర్తనలో మార్పు తేగలిగితే, మనం కొంత వరకు మార్పును తీసుకొచ్చినట్లే" అని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)