2021లో తీవ్రంగా విరుచుకుపడిన ప్రకృతి వైపరీత్యాలకు మానవ తప్పిదాలే కారణమా?

హరికేన్ ఐడా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, హరికేన్ ఐడా
    • రచయిత, మాట్ మెక్‌గ్రాత్
    • హోదా, బీబీసీ సైన్స్

మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల 2021లో చోటు చేసుకున్న కొన్ని విపత్తులు ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది జీవితాల్లో కష్టాలను మిగిల్చినట్లు ఒక వాతావరణ నివేదిక తెలుపుతోంది.

క్రిస్టియన్ ఎయిడ్ అనే స్వచ్చంద సంస్థ నిర్వహించిన ఈ అధ్యయనం 1.5 బిలియన్ డాలర్లకు( సుమారు రూ. 112,500,000,000 కోట్లు) పైగా నష్టాన్ని చేకూర్చిన 10 తీవ్రమైన వాతావరణ సంబంధిత ఘటనలను గుర్తించింది.

ఆగస్టులో అమెరికాలో సంభవించిన హరికేన్ ఐడా, జులైలో యూరోప్ లో ఏర్పడిన వరదల వల్ల తీవ్రమైన ఆర్ధిక నష్టం వాటిల్లినట్లు ఈ నివేదిక పేర్కొంది. కొన్ని నిరుపేద ప్రాంతాల్లో, వరదలు, పెనుగాలులు ప్రజలను నిరాశ్రయులను చేసి తీవ్రమైన కష్టాలను మిగిల్చాయి.

ఈ సంఘటనలకు వాతావరణ మార్పులే కారణమని చెప్పేందుకు శాస్త్రవేత్తలు ధైర్యంగా ప్రయత్నిస్తున్నప్పటికీ, తీవ్రమైన వాతావరణ పరిస్థితులన్నీ, వాతావరణ మార్పులతోనే ముడిపడి ఉన్నాయని చెప్పలేం.

"ప్రస్తుతం ప్రపంచంలో ఏర్పడుతున్న హీట్ వేవ్‌లన్నీ మానవ ప్రేరేపిత వాతావరణ మార్పుల వల్ల చోటు చేసుకుంటున్నవే" అని ఈ ఏడాదిలో డాక్టర్ ఫ్రెడ్‌రిక్ ఒట్టో అనే రీసెర్చర్ ట్వీట్ చేశారు.

తుపానులు, సుడిగాలుల విషయానికొచ్చేసరికి, వాతావరణ మార్పులు వీటి పై ప్రభావం చూపిస్తున్నట్లు చాలా ఆధారాలు ఉన్నాయి.

ఆగస్టులో ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ (ఐపీసీసీ) ఆరవ నివేదికలో తొలి భాగాన్ని ప్రచురించింది.

మనుషులు సృష్టిస్తున్న వాతావరణ మార్పుల వల్లే సుడిగాలులు, ఉష్ణప్రాంతాల్లో తుపానులు ఏర్పడుతున్నాయనడానికి బలమైన ఆధారాలు లభించినట్లు ఈ నివేదిక అధ్యయనకర్తలు అభిప్రాయపడ్డారు.

"ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్‌తో పాటు తీవ్రమైన తుపానులు, తుపాను సమయంలో సగటున వీచే గాలుల వేగం, ఉష్ణప్రాంతాల్లో ఏర్పడే తీవ్రమైన తుఫానుల సమయంలో గాలుల స్థాయి మరింత పెరుగుతుంది" అని ఈ అధ్యయనం పేర్కొంది.

వీడియో క్యాప్షన్, 70 ఎకరాల సొంత పొలాన్ని అడవిగా మార్చి పక్షులు, జంతువులకు విడిచిపెట్టిన ప్రకృతి ప్రేమికుడు
రైలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రైలు

ఊహించినట్లుగానే...

ఈ అధ్యయనం వెలువడిన కొన్ని వారాల్లోనే అమెరికాలో హరికేన్ ఐడా సంభవించింది. ఈ ఏడాదిలో ఆర్ధికంగా అత్యంత భారీ నష్టం చేకూర్చిన వాతావరణ విపత్తు ఇదేనని క్రిస్టియన్ ఎయిడ్ పేర్కొంది. ఈ సుడిగాలులు లూసియానాలో కొన్ని వేల మంది ప్రజలను నిరాశ్రయులను చేశాయి. ఈ గాలుల వల్ల అమెరికాలోని అనేక రాష్ట్రాలు, నగరాల్లో భారీ వర్షాలు కురిసాయి.

న్యూ యార్క్ లో ఫ్లాష్ ఫ్లడ్ కారణంగా ఎమెర్జెన్సీ అలెర్ట్ ఇవ్వడం ఇదే మొదటిసారి.

ఈ తుపాను సమయంలో 95 మంది మరణించారు. వేల కోట్ల డాలర్ల ఆర్ధిక నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. జులైలో జర్మనీ, ఫ్రాన్స్, ఇతర యూరోపియన్ దేశాల్లో ఏర్పడిన వరదలు కూడా తీవ్రమైన ఆర్ధిక నష్టం చేకూర్చాయి. రక్షణ వలయాలను కూడా చేధించి వేగంగా ప్రవహించిన నీరు వల్ల 240 మంది ప్రాణాలు కోల్పోయారు.

వాతావరణానికి సంబంధించిన ఘటనలు ఎక్కువగా అభివృద్ధి చెందిన దేశాల్లోనే సంభవించినట్టు ఈ అధ్యయనం చెబుతోంది.

ధనిక దేశాల్లో ఏర్పడిన ధన నష్టం గురించి అక్కడ నమోదు చేసే ఇన్సూరెన్సు క్లెయిమ్ ల వల్ల తెలుసుకునే వీలు కలుగుతుంది. ఈ దేశాల్లో ప్రజలు తమ ఇళ్లు, వ్యాపారాలు బీమా చేసుకునే స్థోమత కలిగి ఉంటారు.

గత 5 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన విపత్తుల వల్ల సుమారు 100 బిలియన్ డాలర్లు ( సుమారు రూ.750,000 కోట్లు) ఖర్చు కావడం ఈ ఏడాది నాలుగవ సారని ఇన్సూరెన్సు సంస్థ ఏఓఎన్ తెలిపింది.

కొన్ని విపత్తుల్లో ఆర్ధిక నష్టం అంచనా వేయడం కూడా సాధ్యం కాని పత్రాలను కూడా ఈ అధ్యయనం పొందుపరిచింది. కానీ, ఈ వాతావరణ ఘటనలు ప్రజల పై తీవ్రమైన ప్రభావాన్ని చూపించాయి.

వరదలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వరదలు

పేద దేశాలపై ప్రభావం

దక్షిణ సుడాన్ లో ఏర్పడిన వరదల్లో 800,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారు. ఇండియా, శ్రీ లంక, మాల్ దీవుల్లో టకుటే తుఫాను తలెత్తినప్పుడు దాని నుంచి తప్పించుకునేందుకు సుమారు 200,000 మందికి పైగా ఆ ప్రాంతం నుంచి తరలి వెళ్లారు.

"మనుషులకు సంబంధించి అది చాలా భారీ ప్రభావాన్ని చూపించింది" అని ఈ అధ్యయన రచయత డాక్టర్ కాట్ క్రేమర్ అన్నారు. "ఇల్లు, జీవనోపాధితో సహా సర్వస్వాన్ని కోల్పోవడం, వాటిని పునర్నిర్మించుకునేందుకు తగిన వనరులు లేకపోవడం చాలా కష్టమైన పని. కనీసం ఇన్సూరెన్సు ఉంటే వాటిని పునర్నిర్మించుకునే అవకాశం కొంత వరకు ఉంటుంది" అన్నారాయన.

భవిష్యత్తులో వాతావరణ ప్రభావాల వల్ల చేకూరే నష్టాలను తగ్గించాలంటే కార్బన్ డయాక్సైడ్‌ ఉద్గారాలను తగ్గించే ప్రయత్నాలను ముమ్మరం చేయాల్సిన ఆవశ్యకతను ఈ నివేదిక ప్రముఖంగా పేర్కొంది.

తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందులలో ఉన్న దేశాల్లో నిధులను వెచ్చించమని ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాతావరణ రాయబారులను కూడా ఈ నివేదిక కోరుతోంది.

వాతావరణ మార్పుల వల్ల ఏర్పడిన ఆర్ధిక నష్టాల అంశం మీద, గ్లాస్గోలో జరిగిన కాప్-26 గ్లోబల్ క్లైమేట్ సమావేశాల్లో పలు దేశాల మధ్య అభిప్రాయ భేదాలు కనిపించాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలకు నగదు కావాల్సి ఉండగా, ధనిక దేశాలు మాత్రం ఈ విషయంలో మరిన్ని చర్చలు అవసరమని చెబుతున్నాయి.

"వాతావరణ మార్పుల వల్ల ఏర్పడే నష్టం గురించి ఈ సమావేశాల్లో చర్చించడం మంచిదే అయినప్పటికీ, వాతావరణ మార్పుల వల్ల శాశ్వత సమస్యలనెదుర్కొంటున్న ప్రజల కోసం ఎటువంటి నిధిని ఏర్పాటు చేయకుండా వైదొలగడం కాస్త నిరుత్సాహంగా ఉంది" అని బంగ్లాదేశ్ లో క్రిస్టియన్ ఎయిడ్ క్లైమేట్ జస్టిస్ సలహాదారుడు నుష్రత్ చౌదరి అన్నారు.

"ఈ నిధిని అమలయ్యేటట్లు చూడటం 2022లో అంతర్జాతీయ ప్రాధాన్యత కావాలి" అని అన్నారాయన.

వీడియో క్యాప్షన్, ఉప్పెన సినిమాలో కనిపించిన రామాలయం ఇప్పుడు లేదెందుకు? ఈ ఊరిని సముద్రం మింగేస్తోందా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)