రష్యాపై ఆంక్షలు: 'నా దగ్గర ఏమీ లేదు, ఇక ఆంక్షల గురించి దిగులెందుకు?'

ఫొటో సోర్స్, EPA
యుక్రెయిన్ మీద దాడితో అమెరికా, యూరోపియన్ యూనియన్ రష్యా మీద కఠిన ఆంక్షలు విధించాయి.
విదేశీ కంపెనీలు, ఆర్థిక సంస్థలతోపాటూ, పెట్టుబడిదారులు కూడా రష్యా నుంచి వెనక్కు వస్తున్నారు. ఆ దేశాన్ని పాశ్యాత్య ప్రపంచం నుంచి విడగొట్టారు.
ప్రముఖ రెస్టారెంట్ చెయిన్ మెక్ డొనాల్డ్స్, గ్లోబల్ ఎంటర్‌టైన్మెంట్ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ లాంటివి అక్కడ తమ కార్యకలాపాలను రద్దు చేశాయి.
వీసా, మాస్టర్‌కార్డ్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ ఆ దేశం నుంచి బయటికొచ్చేశాయి. రష్యా కరెన్సీ రూబుల్ పతనంతో పెరుగుతున్న ఆహారం, నిత్యావసరాల ధరలను నియంత్రించడం కష్టంగా మారింది.
ప్రపంచంలో ఏకాకి
నిజానికి సూపర్ మార్కెట్లు జనం కొనుగోలు చేసే నిత్యావసర వస్తువులపై ఇప్పటికే పరిమితులు విధించాయి. రష్యా ప్రజలకు విదేశాలకు వెళ్లడం కూడా ఖరీదైన వ్యవహారంగా, కష్టంగా మారింది.
అమెరికా, ఈయూ, ఇంకా చాలా దేశాలు రష్యా విమానాలకు తమ గగనతలం మూసివేశాయి.
అయితే,ఇప్పుడు రష్యన్లు ఏం చేస్తారు?
ఇప్పటివరకూ వారి జీవితాలపై ఎలాంటి ప్రభావం పడిందో తెలుసుకోడానికి బీబీసీ కొంతమంది రష్యన్లతో మాట్లాడింది.

ఫొటో సోర్స్, Getty Images
మరియా (36), మాస్కో: నేను పెద్దగా పట్టించుకోలేదు
నిజాయితీగా చెప్పాలంటే నేను వాటిని(ఆంక్షలను) పెద్దగా పట్టించుకోలేదు, నాకు పడవలేం లేవు, కోవిడ్ వచ్చినప్పటి నుంచి ఎక్కడికీ వెళ్లే పని కూడా పెట్టుకోలేదు. అవును, వాళ్లు ఐకియా, మిగతావాటిని మూసేశారు. కానీ, నేను మాత్రం పుస్తకాలు చదువుకుంటూ, వ్యాయామం చేస్తూ గడిపేస్తున్నాను.
ఏదీ మారలేదు. అవును, వాళ్లు నిరసనలను అణచివేస్తున్నారు. కానీ వాళ్లు అలా చాలా కాలం నుంచీ చేస్తున్నారు. పరిస్థితులు చాలా దారుణంగా అవుతున్నాయి. అవును.. అన్నీ కవర్ చేయడానికి నేను మూడు ఉద్యోగాలు చేయాల్సొచ్చింది. నేను గత పదేళ్ల నుంచీ అదే చేస్తున్నా. అందుకే, నాకు కొత్తగా ఏం అనిపించడం లేదు
అక్కడ(యుక్రెయిన్‌లో) ఏం జరుగుతోంది అనేదాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే, అంతా గందరగోళంగా ఉంది. నాకు వాళ్లెవరో తెలీదు, ఎవరు ఎవరిమీద బాంబులు వేస్తున్నారో తెలీదు. నేను మాస్కోలో ఉంటాను. ఇక్కడ బాంబులేం పడ్డం లేదు.

ఫొటో సోర్స్, Getty Images
డారియా (37), బ్రిటన్: ఇది మా స్వేచ్ఛను పరిమితం చేస్తుంది
రష్యన్లు తెలివి తెచ్చుకుంటారని, హఠాత్తుగా పుతిన్‌కు వ్యతిరేకంగా గళమెత్తుతారని యూరోపియన్ దేశాలు కలలు కంటున్నాయి. అది భ్రమ. అలా జరగడం ఉండదు.
యుద్ధం మొదలవుతోందనగా, నా స్నేహితులు నాకు నీ ఫోన్లో ఉన్న మెసేజులు డెలిట్ చేయమని చెప్పారు. నాకు వ్యతిరేకంగా ఉపయోగించగలిగే కంటెంట్ ఏదైనా ఉంటే తీసెయమన్నారు. అందుకే, యాంటీ వార్ ర్యాలీలో తీసుకున్న నా సెల్ఫీని కూడా డెలిట్ చేసేశా.
మా అమ్మనాన్నలు రష్యాలో ఉండడం వల్ల నేను బయట స్వేచ్ఛగా ఏదీ మాట్లాడలేకపోతున్నా, ఎందుకంటే అక్కడకు వెళ్లగానే నన్ను అరెస్ట్ చేస్తారేమో అనే భయం లేకుండా నేను వాళ్లను కలవగలగాలి.
నాతో మాట్లాడే రష్యన్లందరిలో సాధారణంగా భయంతోనో, నైరాశ్యంతోనో ఉన్నట్టు అనిపిస్తోంది. బలవంతంగా సైన్యంలోకి లాగకుండా తప్పించుకోడానికి చాలా మంది రష్యా నుంచి పారిపోతున్నారని చెబుతున్నారు. వెళ్లిపోడానికి ప్రయత్నిస్తుంటే కొందరి ఫోన్లు చెక్ చేస్తున్నారని అంటున్నారు. పోరాడే వయసులో ఉన్న ఇద్దరిని విమానాశ్రయం నుంచి వెనక్కు పంపేశారట. ఇలాంటి వదంతులు చాలా వస్తున్నాయి. కానీ పేర్లు బయటపెట్టడానికి, రాతపూర్వకంగా ఏదైనా ఇవ్వడానికి ప్రస్తుతం ఎవరూ సిద్ధంగాలేరు.
ఇంకా దారుణమైన విషయం తెలుసా.. 'రూసో ఫోబియా' వాక్చాతుర్యం పెంచుతోంది. రష్యాలో దేశభక్తి సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. "రష్యన్లను యూరప్ నుంచి బయటకు నెట్టేస్తున్నారు. తిరిగి రండి, మీ మాతృభూమి కోసం పనిచేయండి" అని వాటిలో చెబుతున్నారు.
మీరు ఒకవేళ యూరప్‌లో నివసించే రష్యన్ అయితే, ఏదైనా ద్వేషపూరిత వ్యాఖ్యలు అనుభవం కలిగుంటే ఇలాంటి సందేశాలు నమ్మకం కలిగించేలా ఉంటాయి.
ఇది ఎలా ముగుస్తుందో నాకు తెలీదు. కానీ ఇది మా స్వేచ్ఛను ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా చాలా పరిమితం చేస్తుందని నాకు తెలుసు.

ఫొటో సోర్స్, Getty Images
పావెల్ (55), యారస్లావల్: మాకున్న ఒకే ఒక దారి కలిసి నిలబడడం, యుద్ధం గెలవడం
ఇదంతా నాకు నడి సముద్రంలో నౌక తగలబడుతున్న పరిస్థితిని గుర్తుకు తెస్తోంది. పడవలో ఉన్న వాళ్లు ప్రతివిషయంలోనూ విభేదిస్తుంటారు. కానీ, రాజకీయాలు, లేదా ఆహార ప్రాధాన్యాలు మనల్ని వేరు చేసినా మంటల్ని ఆర్పాల్సిన అవసరం ఉంది.
మనం కలిసి మంటలు ఆర్పాలి లేదా కలిసి చనిపోవాలి. ఇక్కడ మూడో ఆప్షన్ లేదు.
మేమూ, అలాంటి పరిస్థితిలోనే ఉన్నాం. రష్యన్లుగా మేం కలిసి నిలబడాలి, యుద్ధం గెలవాలి లేదంటే మేం ఈ ఘర్షణ కొనసాగించవచ్చు, ఒక దేశంగా, దేశ ప్రజలుగా భూమికి ఒక వైపున తుడిచిపెట్టుకుపోవచ్చు..
మేం ఆయుధాలు దించితే వాళ్లు మమ్మల్ని క్షమిస్తారని, తక్షణం ఆంక్షలు ఎత్తివేసి వెంటనే యూరప్ మిగతా దేశాల గగనతలం తెరిచేస్తారని అనుకోవడం అమాయకత్వమే అవుతుంది. నేనలా అనుకోవడం లేదు. వాళ్లు వాటిని రెట్టింపు చేస్తారు, మమ్మల్ని పది రెట్లు శిక్షిస్తారు. పరిహారాలతో మాపై స్వారీ చేస్తారు. మమ్మల్ని నీచులుగా మార్చి, సజీవంగా తినేస్తారు.
అందుకే, ఈ యుద్ధంలో గెలవడం.. లేదా నాశనం కావడం తప్ప మాకు వేరే దారి లేదు. ఈ మంటలు ఎవరు రాజేశారనేది మేం తర్వాత చూసుకోవచ్చు.
(కథనంలో వ్యక్తుల భద్రత కోసం వారి పేర్లు మార్చాం)
ఇవి కూడా చదవండి:
- యుక్రెయిన్‌ను రష్యా ఆక్రమిస్తే ఆ తర్వాత ఏం జరుగుతుంది?
- యుద్ధ నేరం అంటే ఏమిటి? యుక్రెయిన్‌లో రష్యా యుద్ధ నేరాలకు పాల్పడుతోందా?
- ‘దండయాత్రపై లెక్క తప్పిన పుతిన్’ యుక్రెయిన్‌పై దాడి తీవ్రతను మరింత పెంచుతారా
- యుక్రెయిన్ ఆక్రమణ విషయంలో రష్యాను భారత్ ఎందుకు విమర్శించలేకపోతోంది?
- తమిళనాడు: కష్టకాలంలో ఉన్నవారిని ఆదుకుంటున్న 'చదివింపుల విందు'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











