యుక్రెయిన్-రష్యా యుద్ధం: పశ్చిమ దేశాలు ఈ ఘర్షణలకు ఆజ్యం పోశాయా

ఫొటో సోర్స్, SERGEI MALGAVKO
- రచయిత, జుబైర్ అహ్మద్
- హోదా, బీబీసీ ప్రతినిది
యుక్రెయిన్ మీద రష్యా దాడుల తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీరుపై వస్తున్న విమర్శల మధ్యే, పశ్చిమ దేశాల నేతల విధానం గురించి కూడా ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
దాడులకు సంబంధించిన కవరేజీలో పశ్చిమ మీడియా పక్షపాతం చూపిస్తోందంటూ పశ్చిమేతర దేశాలకు చెందిన చాలా మంది నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పశ్చిమ దేశాల నేతలు ద్వంద్వ విధానం అవలంబిస్తున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి.
రష్యాను విలన్‌గా చేయడానికి పశ్చిమ దేశాల నేతలు ఏ అవకాశాన్నీ వదులుకోవడం లేదని, ఇప్పుడు జరుగుతున్న దానిలో వారిది కూడా కొంత దోషం ఉందని అంటున్నారు.
పశ్చిమ మీడియా జాత్యహంకార కవరేజీ చేసిందని ఆరోపిస్తూ ఒక ప్రకటన విడుదల చేసిన అరేబియా, మధ్యప్రాచ్య దేశాల జర్నలిస్టుల సంఘం 'అరబ్ అండ్ మిడిల్ ఈస్ట్ జర్నలిస్ట్స్ అసోసియేషన్' దీనిపై ఆందోళన వ్యక్తం చేసింది.
పశ్చిమ దేశాల ద్వంద్వ విధానం
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మంగళవారం తన 'స్టేట్ ఆఫ్ ద యూనియన్' ప్రసంగంలో రష్యాపై ఆంక్షలు మరింత కఠినతరం చేస్తామని ప్రకటించారు. తమ చర్యలతో ముందు ముందు రష్యాకు ఆర్థికంగా మరింత నష్టం తప్పదన్నారు.
ప్రపంచ ఆర్థికవ్యవస్థలో అత్యధిక లాభాలు ఆర్జించే కొందరిపై కూడా ఈ చర్యలు ఉంటాయని బైడెన్ ప్రకటించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ పెట్టుబడిదారీ స్నేహితులను ఉద్దేశించి ఆయన ఈ సంకేతాలు ఇచ్చారు. వారు ఈ యుద్ధంలో పుతిన్‌కు సహకరిస్తున్నారని ఆయన అన్నారు.
అమెరికాతోపాటూ మిగతా యూరోపియన్ దేశాలు కూడా రష్యాపై కఠిన ఆంక్షలు విధించాయి. ఆ ఆంక్షల ప్రభావం రష్యాలో కనిపించడం మొదలైందని పశ్చిమ మీడియా చెబుతోంది. మరింత నష్టపోయేలోపే తమ డబ్బు విత్ డ్రా చేసుకోడానికి రష్యా ప్రజలు ఏటీఎంలు, బ్యాంకుల ముందు క్యూ కడుతున్నారని అమెరికా మీడియా సీఎన్ఎన్ చెప్పింది.
కానీ, రష్యాలో ఈ ఆంక్షలతో ప్రజలు ఎంత ఆందోళనగు గురవుతున్నారు అనే అంశంపై ఆ దేశ మీడియాలో కథనాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే అక్కడి మీడియాపై ప్రభుత్వం చాలా రకాల ఆంక్షలు విధించినట్లు వార్తలు వస్తున్నాయి.
కానీ, ఆసక్తికరమైన విషయం ఏంటంటే రష్యాపై ఆంక్షల గురించి మాట్లాడుతున్న చాలామంది పశ్చిమ మీడియా రిపోర్టర్లు రష్యా నుంచి గ్యాస్, ముడి చమురు ఎగుమతులపై యూరప్, అమెరికా ఎలాంటి నిషేధం విధించలేదనే విషయం మాత్రం చెప్పడం లేదు.
తాము ఇప్పటికీ వినియోగదారుల ఆర్డర్ ప్రకారం యుక్రెయిన్ గుండా యూరప్‌కు పైప్‌లైన్ ద్వారా గ్యాస్ సరఫరా చేస్తున్నట్లు రష్యాలో గ్యాస్ ఎగుమతి చేసే అతిపెద్ద కంపెనీ గజ్‌ప్రోమ్ సోమవారం చెప్పింది.
యుక్రెయిన్ 2014లోనే రష్యా నుంచి గ్యాస్ తీసుకోవడం ఆపేసింది. కానీ, అది కూడా అదే పైప్ లైన్ నుంచే యూరప్ ద్వారా గ్యాస్ తీసుకుంటూ వస్తోంది. యుద్ధం తర్వాత కూడా అది కొనసాగుతోంది.
రష్యా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ముడి చమురు ఎగుమతి దారు. గ్యాస్ విషయంలో కూడా అది ప్రపంచంలోనే అతిపెద్ద ఎగుమతి దేశంగా ఉంది.
రష్యా నుంచి గ్యాస్ తీసుకోవడం ఆపేస్తే యూరప్ దేశాల్లోని నివాసాల్లో హీటింగ్ సిస్టమ్ స్తంభించిపోతుంది. దాంతో చలి వాతావరణంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కునే అవకాశం ఉంది. ఇళ్లలో వెచ్చదనం అందించడంతోపాటూ విమానాలు, కార్లు ఇతర వాహనాలకు కూడా గ్యాస్‌ను ఇంధనంగా ఉపయోగిస్తున్నారు.
సహజవాయువు అతిపెద్ద ఎగుమతి దారు అయిన ఖతార్‌తో పోలిస్తే రష్యా నుంచి యూరోపియన్ దేశాలకు గ్యాస్ చాలా చౌకగా దొరుకుతోంది.
ఆంక్షలు రెండువైపులా పదునైన కత్తి లాంటివి...
ఈ ఆంక్షలు రెండు వైపులా పదునున్న కత్తి లాంటివని జార్జియా, అమెరికాల్లో భారత రాయబారిగా పనిచేసిన అచల్ కుమార్ మల్హోత్రా చెప్పారు.
"పుతిన్ ఈ అంక్షలకు అలవాటుపడిపోయారు. ఇప్పటివరకూ అవి ప్రభావం చూపినట్లు నిరూపితం కాలేదు. యుక్రెయిన్ మీద దాడి చేస్తే పశ్చిమ దేశాలు ఆంక్షలు విధిస్తాయని, వాటిని ఎలా ఎదుర్కోవాలి అనేది పుతిన్‌కు ముందే తెలిసుంటుందని నాకు అనిపిస్తోంది. పుతిన్ ఆర్థికవ్యవస్థ కంటే జాతీయ భద్రతకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆంక్షలు రెండు వైపులా పదునైన కత్తిలాంటివని ఆయనకు తెలుసు. వాటివల్ల రష్యాకు నష్టం ఎటూ జరుగుతుంది, దానితోపాటూ ఆంక్షలు విధించిన దేశాలకు కూడా అది ఉంటుంది" అన్నారు.
పశ్చిమ దేశాల ద్వంద్వ విధానంగా చెబుతున్న దానిని బయటపెట్టడానికి ప్రయత్నించిన కొద్ది మంది పశ్చిమ దేశాల జర్నలిస్టుల్లో న్యూయార్క్‌లోని జెరెమీ స్కహిల్ ఒకరు. ఆయన దీనిపై వరుస ట్వీట్లు చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
రష్యా యుక్రెయిన్‌లో చేస్తోంది అన్ని విధాలుగా తప్పు. దానిని ఎవరూ సమర్థించరు. కానీ, ఇలాంటి విషయంలో పశ్చిమ దేశాల రికార్డు కూడా ఖండించదగినదేనని కూడా ఆయన చెప్పారు.
"తన సొంత నేరాలను ఒప్పుకోడానికి ఎప్పుడూ నిరాకరిస్తూ వచ్చిన అమెరికా వైఖరి, రష్యాను ఖండించడంలో దాని విశ్వసనీయతను బలహీనపరుస్తుంది. ముఖ్యంగా నాటో, అమెరికా సైనిక చర్యల చరిత్ర తెలిసిన వారి దృష్టిలో. ఇది పుతిన్‌కు ఒక బహుమతి లాంటిది" అని జెరెమీ స్కహిల్ అన్నారు.
అఫ్గానిస్తాన్, ఇరాక్ ఆక్రమణలతో పోలిక
రష్యా యుక్రెయిన్ మీద దాడికి ముందు 21వ శతాబ్దంలో ఇప్పటివరకూ గత 22 ఏళ్లలో అమెరికా, నాటో దళాలు అఫ్గానిస్తాన్(2021), ఇరాక్(2003)ను ఆక్రమించాయి. సిరియాలో అధ్యక్షుడు బషర్ అసద్‌కు వ్యతిరేకంగా తమ సైన్యాన్ని దించాయి. లిబియా, సోమాలియాలో సైనిక చర్యలకు దిగాయి.
అమెరికా 19 ఏళ్ల క్రితం ఇరాక్ మీద దాడి చేసింది. ఆ దాడి కొన్ని రోజుల ముందు ప్రసంగించిన అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యు బుష్ తాము ఏ కారణంతో దాడి చేస్తున్నామో చెప్పారు.
"అమెరికా, మిగతా ప్రభుత్వాల ద్వారా సేకరించిన నిఘా సమాచారం ప్రకారం ఇరాక్ ప్రభుత్వం అత్యంత ప్రాణాంతకమైన ఆయుధాల్లో కొన్నింటిని ఇప్పటికీ ఉంచుకోవడం, దాచడం చేస్తోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ పాలకులు ఇరాక్ పొరుగు దేశాలు, ఇరాక్ ప్రజలపై ఇప్పటికే సాముహిక విధ్వంసక ఆయుధాలు ఉపయోగించారు" అన్నారు.
అధ్యక్షుడు బుష్ ఈ దాడికి మరో కారణం కూడా చెప్పారు. ఇరాక్ అధ్యక్షుడు సద్దామ్ హుస్సేన్ అల్ ఖైదా, ఇతర తీవ్రవాదులకు ఆశ్రయం కూడా ఇచ్చారని చెప్పారు. ఆయన తర్వాత ఏకంగా అమెరికాలో 9/11 దాడుల వెనుక సద్దాం హుస్సేన్ హస్తం ఉందని ఆరోపించారు.
కానీ, ఇరాక్ మీద దాడుల తర్వాత సామూహిక విధ్వంసక ఆయుధాలు దొరక్కపోవడంతో అమెరికా, నాటో దేశాల విశ్వసనీయతపై ప్రశ్నలు వెల్లువెత్తాయి.
'అనుకోకుండా తప్పు జరిగిపోయింది' అంటూ పశ్చిమ మీడియా ఆ సమయంలో ఈ అంశాన్ని పక్కనపెట్టేసిందని నిపుణులు చెబుతున్నారు.
యుక్రెయిన్ సంక్షోభ సమయంలో సోషల్ మీడియాలో ప్రజలు రష్యా, పుతిన్‌ను తీవ్రంగా విమర్శిస్తున్నారు. కానీ, వారంతా కొరియా, వియత్నాం లాంటి ఇతర దేశాలపై అమెరికా దాడుల గురించి కూడా చర్చిస్తున్నారు. వాటి గురించి ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
రష్యాపై చర్యల విషయంలో పశ్చిమ దేశాల నేతల ప్రకటనలు సరైనవే కావచ్చు, కానీ వాటిని వారి స్వంత సైనికవాదం, ద్వంద్వ విధానం, నైతిక దివాలాతనంగా కూడా చూడాలి. అని జెరెమీ స్కహిల్ అన్నారు.
మీడియా జాత్యహంకార ఆరోపణలు
చాలా దేశాల మీడియా సంస్థలు పశ్చిమ మీడియాను విమర్శిస్తున్నారు. యుక్రెయిన్ యుద్ధం కవరేజీ జాత్యహంకారానికి ఉదాహరణగా కనిపిస్తోందని చెబుతున్నాయి.
"మేం ఈ జాత్యహంకార వార్తల కవరేజీకి సంబంధించి కొన్ని ఉదాహరణలను ట్రాక్ చేశాం. అవి కొంతమంది యుద్ధ బాధితులు, ఇతరులకే చాలా ప్రాధాన్యం ఇచ్చాయి" అని అరేబియా, మధ్యప్రాచ్య జర్నలిస్టుల సంఘం(ఎఎంఈజేఏ) ఒక ప్రకటనలో చెప్పింది.
ఈ సంస్థ సీబీఎస్ న్యూస్, ద టెలిగ్రాఫ్, అల్ జజీరా ఇంగ్లిష్ లాంటి ప్రముఖ మీడియా సంస్థల విశ్లేషకులు, జర్నలిస్టులు చేసిన వ్యాఖ్యలను ఉదాహరణలుగా చెబుతూ ఈ ప్రకటన జారీ చేసింది.
ఈ వ్యాఖ్యల్లో యుక్రెయిన్‌కు చెందిన కాకేసియన్ జాతి లేదా వారి ఆర్థిక స్థితిపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు. వారిని మధ్యప్రాచ్య దేశాలు లేదంటే ఉత్తర ఆఫ్రికా ప్రజలతో పోల్చారు.
దీనిపై సోషల్ మీడియాలో కూడా చాలా మంది కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై వీడియో క్లిప్స్ కూడా రూపొందించారు.
సీబీఎస్ న్యూస్‌కు చెందిన ఒక సీనియర్ జర్నలిస్ట్ కీయెవ్ నుంచి రిపోర్టింగ్ చేస్తూ "ఇది ఇరాక్ లేదా అఫ్గానిస్తాన్ లాంటి ప్రాంతం కాదు. ఇది ఒక యూరోపియన్ నగరం, ఇక్కడ మీరు ఇలాంటివి జరుగుతాయని అసలు ఊహించరు" అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
మరో రిపోర్టర్ యుక్రెయిన్ గురించి మాట్లాడుతూ "ఇది అభివృద్ధి చెందుతున్న మూడో ప్రపంచ దేశం కాదు" అన్నారు.
యుక్రెయిన్ నుంచి వెళ్తున్న శరణార్థుల గురించి చెబుతున్న మరో రిపోర్టర్ "వీరంతా ధనిక మధ్యతరగతి ప్రజలు, ఉత్తరాఫ్రికా లాంటి దేశాల నుంచి వచ్చిన వారు కాదు. వీరంతా యూరప్‌లో ఉంటున్న పొరుగువారులాగే అనిపిస్తోంది" అన్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















