యుక్రెయిన్‌పై దాడుల గురించి రష్యా టీవీ చానళ్లు ఏం చూపిస్తున్నాయి, ఏం చెబుతున్నాయి

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సిమోనా క్రలోవా, శాండ్రో వెత్సకో
- హోదా, బీబీసీ మానిటరింగ్
మార్చి 1న అంటే మంగళవారం రాత్రి పదిన్నరకు (భారత కాలమానం ప్రకారం) రష్యా టెలివిజన్లలో ప్రభుత్వ మీడియా అందించిన కథనాలు వాస్తవాలకు భిన్నంగా చేసే కవరేజీకి ఒక ఉదాహరణగా నిలిచాయి.
కీయెవ్‌లో ఒక టీవీ టవర్ మీద జరిగిన దాడి వార్తతో బీబీసీ వరల్డ్ టీవీ తన బులెటిన్ ప్రారంభిస్తే, అదే సమయంలో రష్యా టీవీ యుక్రెయిన్‌లో నగరాలపై దాడులకు ఆ దేశమే కారణం అని చెబుతోంది.
ఇలాంటి పరిస్థితుల్లో రష్యాలో టీవీలో వార్తలు చూస్తున్న సామాన్యులకు అసలు ఈ యుద్ధానికి సంబంధించి ఎలాంటి సమాచారం అందుతోంది అనే ప్రశ్న కూడా వస్తుంది. టీవీలో వార్తల ద్వారా వారికి ఏం తెలుస్తోంది?
రష్యాలో సామాన్యులు అక్కడి ప్రభుత్వం లేదా పుతిన్ కార్పొరేట్ సహచరుల నియంత్రణలో ఉన్న వివిధ టీవీ చానళ్లలో 2022 మార్చి 1న ఏం చూశారనేది మేం ఈ కథనంలో చెప్పబోతున్నాం.
రష్యాలో ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ప్రముఖ చానళ్లలో ఒకటైన చానల్ వన్ బ్రేక్‌ఫాస్ట్ న్యూస్‌లో సాధారణంగా మిగతా దేశాల చానళ్లలో ఉన్నట్లే మామూలు వార్తలు, కల్చర్, లైట్ ఎంటర్‌టైన్మెంట్ కలగలిసి ఉంటాయి.
కానీ, మంగళవారం మాస్కోలో ఉదయం 5.30కు (భారత కాలమానం ప్రకారం ఉదయం 8) ఆ న్యూస్ ప్రసార క్రమం మారిపోయింది.
బ్రేకింగ్ న్యూస్ కారణంగా టీవీ కార్యక్రమాన్ని మార్చామని, ఇందులో మరిన్ని వార్తలు, కరెంట్ అఫైర్స్ ప్రసారం చేస్తామని యాంకర్ చెప్పారు. ప్రేక్షకులను తప్పుదారి పట్టించడానికి సిద్ధం చేసిన ఆ న్యూస్ బులెటిన్లో యుక్రెయిన్ సైన్యం రష్యా సైన్యానికి నష్టం కలిగించినట్లు చెబుతూ వస్తున్న వార్తలు ఫేక్ అని తెలిపింది.

"ఇంటర్నెట్‌లో చూపిస్తున్న ఆ ఫుటేజ్ ఫేక్ తప్ప, అందులో నిజం లేదు" అని చెప్పిన యాంకర్, ఆ తర్వాత ఒక ఫొటోను చూపించి దానికి మార్పులు చేర్పులు చేశారని తెలిపారు.
తర్వాత ఉదయం 8 గంటలకు మేం ఎన్‌టీవీ ఉదయం న్యూస్ బులెటిన్ చూశాం. ఆ చానల్ క్రెమ్లిన్ నియంత్రణలో ఉన్న గజ్‌ప్రోమ్‌కు చెందిన ఒక అనుబంధ కంపెనీకి సంబంధించినది.
ఈ బులెటిన్‌లో ఎక్కువ వార్తలు దోన్బస్‌లో ఘటనల చుట్టూనే తిరిగాయి. ఫిబ్రవరి 24న యుక్రెయిన్ మీద దాడులకు ముందు నాజీల నుంచి విముక్తి కల్పించడానికే యుక్రెయిన్ మీద రష్యా సైనిక ఆపరేషన్‌కు దిగిందని పుతిన్ చెప్పారు.
ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బెలారుస్ నుంచి యుక్రెయిన్ రాజధాని కీయెవ్ వైపు ముందుకు వెళ్తున్న కొన్ని కిలోమీటర్ల పొడవున్న సైనిక వాహనాల కాన్వాయ్ గురించి ఆ వార్తల్లో చిన్న మాట కూడా చెప్పలేదు. బీబీసీ రేడియో-4 మాత్రం ఆ కాన్వాయ్ మొదలైన కాసేపటి నుంచే దాని గురించి చెబుతూ వచ్చింది.

ఇక ఎన్‌టీవీ ప్రజెంటర్లు అయితే దోన్బస్ నుంచి వచ్చిన బ్రేకింగ్ న్యూస్‌తో తాము వార్తలు ప్రారంభిస్తున్నామని చెప్పారు.
"లుహాన్స్క్ రిపబ్లిక్(ఎల్ఎన్ఆర్) ఫైటర్లు తమ దూకుడు కొనసాగిస్తున్నారు. మూడు కిలోమీటర్లు ముందుకెళ్లారు. దోన్యస్క్ పీపుల్స్ రిపబ్లిక్(డీఎన్ఆర్) యూనిట్ 16 కిలోమీటర్లు ముందుకెళ్లింది" అని తెలిపారు.
దోన్బస్ ప్రాంతంలో యుక్రెయిన్ సైన్యం యుద్ధ నేరాలకు పాల్పడిందని రష్యాలోని రెండు ప్రముఖ చానళ్లైన రోసియా 1, చానల్ వన్ ఆరోపణలు చేశాయి.
"రష్యా నుంచి కాదు, యుక్రెయిన్లకు స్వయంగా తమ జాతీయవాదుల నుంచే ముప్పు పొంచి ఉంది. వారు అక్కడి పౌరులను మానవ కవచంలా ఉపయోగించుకుంటున్నారు. కావాలనే నివాస ప్రాంతాలను లక్ష్యంగా మారుస్తున్నారు. అందుకే దోన్బస్‌లోని నగరాల్లో కూడా బాంబుల మోత పెరుగుతోంది" అని రోసియా 1 ప్రజెంటర్ అన్నారు.
ఇక యుక్రెయిన్ సైన్యం తమ పౌరులను, రష్యా సైన్యాన్ని రెచ్చగొడుతోందని చానల్ వన్ ప్రజెంటర్లు చెప్పుకొచ్చారు.
రష్యా టీవీ చానళ్లలో యుక్రెయిన్‌లో జరుగుతున్న ఘటనలను యుద్ధంగా చెప్పడం లేదు. యుక్రెయిన్‌లో సైనికీకరణను ఆపి, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే రష్యా ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు వారు వర్ణిస్తున్నారు.
రష్యా సైన్యం యుక్రెయిన్‌లో సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకుంటోందని ఈ చానళ్లు పదే పదే చెబుతున్నాయి.
ప్రభుత్వ నియంత్రణలోని టీవీ ప్రజెంటర్లు, రిపోర్టర్లు భావోద్వేగంతో మాట్లాడుతున్నారు. కొన్ని ఫొటోలు చూపిస్తూ జర్మనీతో సోవియట్ యూనియన్ యుద్ధానికి, యుక్రెయిన్‌లో రష్యా ప్రత్యేక ఆపరేషన్‌కు ముడిపెట్టి మాట్లాడుతున్నారు.
రోసియా 1కు సంబంధించిన రోసియా 24 చానల్లో ఉదయం ఒక బులెటిన్‌లో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత చిన్నారులను మానవ కవచంగా మార్చుకుంటూ వచ్చిన జాతీయవాదుల తీరు ఏమాత్రం మారలేదని చెప్పారు.
"వారు ఫాసిస్టుల్లా ప్రవర్తిస్తున్నారు. నియో నాజీలు తమ సైనిక సామగ్రిని నివాస స్థానాల్లోనే కాకుండా బేస్‌మెంటులో చిన్నపిల్లల దగ్గర కూడా ఉంచారు" అని టీవీ ప్రసారంలో ఒక రిపోర్టర్ చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
యుక్రెయిన్ మీద ఆరోపణలు
యుక్రెయిన్ మహిళలు, పిల్లలు, వృద్ధులను మానవ కవచంగా ఉపయోగించుకుంటున్నారని గత వారం దేశాధ్యక్షుడు పుతిన్ అన్న మాటలనే ఆ దేశ చానళ్లు మళ్లీ మళ్లీ ప్రసారం చేస్తున్నాయి.
పుతిన్ సైన్యం వేగంగా ముందుకు వెళ్లలేక ఇబ్బంది పడుతోందని పశ్చిమ దేశాల మీడియా చెబుతుంటే, రష్యా ఈ సైనిక ఆపరేషన్‌లో విజయవంతం అయ్యిందని ఆ దేశ టీవీ చానళ్లు చెబుతున్నాయి.
యుక్రెయిన్‌కు చెందిన ఆయుధాలను రష్యా ధ్వంసం చేసిందని వరుస వార్తలు ప్రసారం చేస్తున్నారు. 1100కు పైగా సైనిక నిర్మాణాలు రష్యా ఆపరేషన్‌లో ధ్వంసం అయ్యాయని ఆ దేశ టీవీ చానళ్లు చెబుతున్నాయి.
అయితే, ఈ సైనిక ఆపరేషన్‌లో రష్యా సైన్యానికి చెందిన ఎంత మంది మృతి చెందారనేది ఒక్క న్యూస్ చానల్ కూడా చెప్పడం లేదు.
రష్యా చానళ్లు ఉదయం వార్తల్లో యుక్రెయిన్‌లోని మిగతా ప్రాంతాల్లో తమ సైనిక ఆపరేషన్ గురించి చెబుతున్నాయి. కానీ ప్రభుత్వ టీవీ రిపోర్టర్లు ఎవరూ కీయెవ్ లేదా ఖార్కియెవ్ నుంచి ఎలాంటి గ్రౌండ్ రిపోర్టులూ ఇవ్వడం లేదు. బదులుగా వారు తమ సైన్యంతో కలిసి దోన్బస్ నుంచి రిపోర్టింగ్ చేస్తున్నారు.
ఖార్కియెవ్ నగరంపై బాంబులు ప్రయోగించారనే వార్తను బీబీసీ కొన్ని గంటలపాటు కవర్ చేస్తే, దాని గురించి ఎన్టీవీ చివరికి ఆ విషయం మధ్యాహ్నం వార్తల్లో చెప్పింది.
యుక్రెయిన్‌పై దాడులకు రష్యా సైన్యమే కారణమని చెప్పడం ఫేక్ న్యూస్ అని రష్యా చానళ్లు చెబుతున్నాయి. ఆ పేలుళ్లకు స్వయంగా యుక్రెయిన్ సైనికులే బాధ్యులని రోసియా 1 చానల్ మధ్యాహ్నం నాలుగు గంటల తర్వాత చెప్పింది.
"ఖార్కియెవ్ మీద దాడులు చేసి, అవి రష్యా చేసిందని చెప్పడం తప్పు. యుక్రెయిన్ తన మీదే తానే దాడి చేసుకుంటోంది. పశ్చిమ దేశాలకు అబద్ధాలు చెబుతోంది. అయినా, ప్రజలను తప్పుదోవ పట్టించడం ఇంత సులభమా" అని ప్రశ్నించింది.
యుక్రెయిన్ గురించి రష్యాలో ఫేక్‌న్యూస్, వదంతులుగా చెబుతున్న వార్తల కోసం రష్యా ప్రభుత్వం ఒక కొత్త వెబ్‌సైట్ ప్రారంభించింది. అక్కడ సరైన సమాచారం మాత్రమే పబ్లిష్ చేస్తున్నామని చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














