యుక్రెయిన్ మీద రష్యా సైనిక దాడి: వైరల్‌గా మారిన నకిలీ వీడియోలు, ఫొటోలు

చుగియెవ్ వద్ద గాయపడ్డ మహిళ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రష్యా షెల్లింగ్‌లో గాయపడ్డ ఓ మహిళ ఫొటో.. ఆన్‌లైన్‌లో కుట్ర సిద్ధాంతాలు, తప్పుడు వాదనలకు సబ్జెక్టుగా మారింది
    • రచయిత, కేలీన్ డెవ్లిన్, షాయన్ సర్దారిజెదా
    • హోదా, బీబీసీ మానిటరింగ్

యుక్రెయిన్ మీద రష్యా దండయాత్ర మొదలై వారం రోజులవుతోంది. ఈ సైనిక దాడికి సంబంధించి నకిలీ లేదా తప్పుదోవ పట్టించే వీడియోలు, ఫొటోలు వైరల్ అవటం కూడా కొనసాగుతోంది.

అలా వేగంగా వ్యాపిస్తున్న వాటిలో.. ఈ యుద్ధానికి సంబంధించిన వీడియోలుగా పాత వీడియోలను చలామణి చేస్తున్నారు. అలాగే.. ప్రస్తుత ఘర్షణకు సంబంధించినవేనని స్పష్టంగా నిర్ధారించగలిగినా కూడా.. పైన కనిపిస్తున్న వంటి ఫొటోలు పాతవనీ ప్రచారం చేస్తున్నారు.

అలా వైరల్ అయిన కొన్ని ఫొటోలు, వీడియోలను బీబీసీ రియాలిటీ చెక్ బృందం పరిశీలించింది.

ఆమె 'ఓ నటి' అంటూ తప్పుడు ప్రచారం

తూర్పు యుక్రెయిన్‌లోని చుహుయెవ్‌లో గురువారం నాడు ఒక నివాస భవనం విధ్వంసానికి సంబంధించిన ఫొటోలు, వీడియో క్లిప్‌లు.. ఆ ఘటనవి కావని, రష్యాలోని మాగ్నటోగోర్స్క్ నగరంలో 2018లొ సంభవించిన గ్యాస్ విస్ఫోటనం నాటి దృశ్యాలని చెప్తూ ఆన్‌లైన్‌లో పోస్టులు కనిపించాయి.

చుహుయెవ్ విధ్వంసంలో రక్తసిక్తంగా ఉన్న మహిళ ఫొటో.. 2018 నాటి రష్యా గ్యాస్ విస్ఫోటనంలో గాయపడ్డ మహిళ ఫొటో అని కొందరు, అసలు ఆమె 'ఒక నటి' అని, ఈ దాడి దృశ్యాల్లో నటించేందుకు ఆమెకు డబ్బులు చెల్లించారని ఇంకొందరు చెప్పుకొచ్చారు.

రష్యా అనుకూలంగా ఉండే, కుట్ర సిద్ధాంతాలు ప్రచారం చేసే అకౌంట్ల నుంచి జరుగుతున్న ఈ వాదనలు బూటకం.

చుగియెవ్‌లో మంటలు బూటకమని చెప్తున్న సోషల్ మీడియా పోస్టు
ఫొటో క్యాప్షన్, చుహియెవ్‌లో గాయపడ్డ మహిళ ఫొటో.. 2018 నాటి రష్యా గ్యాస్ విస్ఫోటనంలో గాయపడ్డ మహిళ ఫొటో అనే వాదనలు తప్పు

మొదటిసారి చూసినపుడు పైపైన ఒకేలా కనిపించినప్పటికీ.. 2018 నాటి మాగ్నిటోగోర్క్స్ గ్యాస్ విస్ఫోటనం నాటి ఫొటోలు, గురువారం నాడు ఖార్కియెవ్ పట్టణంలో పేలుడుకు సంబంధించిన ఫొటోలకు మధ్య సారూప్యత లేదు.

'శత్రువు దాడితో చెలరేగిన మంటల్లో' ఒక చిన్నారి చనిపోగా, కొందరు గాయపడ్డట్లు తమకు సమాచారం అందిందని యుక్రెయిన్ స్టేట్ ఎమర్జెన్సీ సర్వీస్ గురువారం ఉదయం ఫేస్‌బుక్‌ పోస్టులో చెప్పింది.

ఘటనా స్థలం దగ్గరున్న ఓ జర్నలిస్టు.. మంటలు చెలరేగిన అనంతరం దృశ్యాలకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇతరులు కూడా అదే దృశ్యానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను పోస్టు చేశారు.

ఆ మహిళ ఫొటోలను ఇద్దరు ఫొటోగ్రాఫర్లు తీశారు. వీటిలో కొన్ని ఫొటోలు ప్రపంచమంతటా వెబ్‌సైట్లు, వార్తపత్రికల మొదటి పేజీల్లో కనిపించాయి. ఆ ఫొటోలను ఫిబ్రవరి 24న తీశామని ఆ ఇద్దరు ఫొటోగ్రాఫర్లూ నిర్ధారించారు. ఆ ఫొటోల మెటాడాటా కూడా అదే తేదీని రూఢిపరిచాయి.

2018 నాటి రష్యా గ్యాస్ విస్ఫోటనం (ఎడమ) ఫొటో, తాజాగా చుహియెవ్ దాడి (కుడి) ఫొటోలను పోల్చి చూసినపుడు వాటి మధ్య తేడా కనిపిస్తుంది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2018 నాటి రష్యా గ్యాస్ విస్ఫోటనం (ఎడమ) ఫొటో, తాజాగా చుహియెవ్ దాడి (కుడి) ఫొటోలను పోల్చి చూసినపుడు వాటి మధ్య తేడా కనిపిస్తుంది

సైనికుడితో పోట్లాడిన బాలిక యుక్రెయిన్ అమ్మాయి కాదు

అయితే.. యుక్రెయిన్‌ మీద దండయాత్రకు సంబంధించినవంటూ గత కొద్ది రోజుల్లో పోస్టయిన కొన్ని ఇతర ఫొటోలు, వీడియోలు.. నిజానికి ఆ యుద్ధానికి సంబంధించినవి కాదు.

ఓ రష్యా సైనికుడికి ఎదురుతిరిగి పోట్లాడుతున్న ఓ యుక్రెయిన్ బాలిక అంటూ పోస్టయిన ఒక అస్పష్టమైన వీడియోను టిక్‌టాక్‌లో 1.20 కోట్ల సార్లు వీక్షించారు. ట్విటర్‌లో 10 లక్షల సార్లు చూశారు.

కానీ నిజానికి ఆ వీడియో అహద్ తమీమీ అనే పాలస్తీనా బాలికను చూపుతోంది. 2012లో అప్పుడు 11 ఏళ్ల వయసున్న తమీమీ.. తన సోదరుడిని అరెస్ట్ చేసిన అనంతరం ఒక ఇజ్రాయెలీ సైనికుడితో ఘర్షణ పడుతున్న దృశ్యమది.

ఆ వీడియో 'అసందర్భమ'ని ట్విటర్ లేబుల్ ఇచ్చింది. కానీ టిక్‌టాక్‌లో ఆ వీడియో వైరల్‌ అవుతూనే ఉంది.

పాలస్తీనా బాలిక ఇజ్రాయెల్ సైనికుడితో ఘర్షణ పడుతున్న పాత వీడియో వైరల్ అయింది

ఫొటో సోర్స్, Twitter

ఫొటో క్యాప్షన్, పాలస్తీనా బాలిక ఇజ్రాయెల్ సైనికుడితో ఘర్షణ పడుతున్న పాత వీడియో వైరల్ అయింది

కీయెవ్‌లో పెట్రోల్ బాంబుల పోరాటం

రష్యా సైనిక బలగాల కాన్వాయ్ మీద.. కీయెవ్ నివాసులు మొలొటోవ్ కాక్‌టెయిల్స్ (సొంతంగా తయారు చేసిన పెట్రోల్ బాంబులు)తో పోరాడుతున్నారని చెప్తూ కొన్ని వీడియోలో గత వారాంతంలో సోషల్ మీడియా వేదికల మీద వైరల్ అయ్యాయి.

ఆ వీడియోలు.. యుక్రెయిన్ పౌరులు, రష్యా బలగాల మధ్య ఘర్షణలు జరుగుతున్నట్లు చూపుతున్నాయని చాలా మంది నమ్మారు. ఇద్దరు బ్రిటన్ ఎంపీలు సైతం ఆ వీడియోలను షేర్ చేశారు.

కీయెవ్‌లో పెట్రోల్ బాంబులతో పోరాడుతున్న ఈ వీడియోను 2014 నాటి యూరోమైదాన్ నిరసనల సందర్భంగా చిత్రీకరించారు

ఫొటో సోర్స్, Twitter

ఫొటో క్యాప్షన్, కీయెవ్‌లో పెట్రోల్ బాంబులతో పోరాడుతున్న ఈ వీడియోను 2014 నాటి యూరోమైదాన్ నిరసనల సందర్భంగా చిత్రీకరించారు

కానీ ఆ వీడియో పాతది. 2014లో అప్పటి యుక్రెయిన్ అధ్యక్షుడు విక్టర్ యనుకోవిచ్‌ను గద్దె దించటానికి కారణమైన యూరోమైదాన్ నిరసనల సందర్భంగా రికార్డుచేసిన వీడియో అది.

వైరల్‌గా మారిన వీడియో గేమ్ క్లిప్‌లు

ఒక రష్యా యుద్ధ విమానాన్ని యుక్రెయిన్ పైలట్ ఒకరు కాల్పులు జరిపి కూల్చివేస్తున్నట్లు కనిపించే నాటకీయమైన ఓ వీడియో క్లిప్‌ను బెలారుస్‌కు చెందిన నెక్ట్సా టీవీ ట్వీట్ చేసింది.

బెలారుస్‌లో వివాదాస్పదంగా మారిన 2020 అధ్యక్ష ఎన్నికల అనంతరం చెలరేగిన ప్రభుత్వ వ్యతిరేక నిరసనలకు సంబంధించిన వీడియోలకు ఈ టీవీ ప్రధాన వనరుగా మారింది.

ఈ టీవీ ట్వీట్ చేసిన సదరు వీడియోలో.. ఒక యుద్ధ విమానం మంటల్లో కాలిపోతూ పెద్ద శబ్దం చేస్తూ భారీ విస్ఫోటనంతో కూలిపోతుంది. ఈ వీడియోను పది లక్షల సార్లు చూశారు.

మిలటరీ వీడియో గేమ్ ఆర్మా3కి సంబంధించిన ఒక వీడియోకు 10 లక్షల వ్యూస్ వచ్చాయి

ఫొటో సోర్స్, Twitter

ఫొటో క్యాప్షన్, మిలటరీ వీడియో గేమ్ ఆర్మా3కి సంబంధించిన ఒక వీడియోకు 10 లక్షల వ్యూస్ వచ్చాయి

కానీ ఈ వీడియో వాస్తవం కాదు. ఆర్మా3 అనే వీడియో గేమ్‌లోని క్లిప్ ఇది. దీనికి యుక్రెయిన్ యుద్ధంతో సంబంధం లేదు.

యుక్రెయిన్ చిన్నారులు సైన్యానికి వీడ్కోలు చెప్పారా?

ఇద్దరు చిన్నారులు.. యుద్ధ రంగానికి వెళుతున్న యుక్రెయిన్ సాయుధ బలగాల కాన్వాయ్‌కి వీడ్కోలు చెప్తున్నట్లు చూపిస్తున్న ఒక ఫొటోకు లక్షల సంఖ్యలో లైక్‌లు, షేర్లు వచ్చాయి.

అమెరికా కాంగ్రెస్ సభ్యుడు ఆడం కన్జింగర్, స్వీడన్ మాజీ ప్రధానమంత్రి కార్ల్ బిల్ట్ తదితరులు ఈ ఫొటోను ట్వీట్ చేశారు.

2016 నాటి ఈ ఫొటోకు మిలియన్లలో లైకులు, షేర్లు వచ్చాయి

ఫొటో సోర్స్, Twitter

ఫొటో క్యాప్షన్, 2016 నాటి ఈ ఫొటోకు మిలియన్లలో లైకులు, షేర్లు వచ్చాయి

కానీ ఆ ఫొటో పాతది. మొదటిసారి 2016లో పబ్లిష్ అయింది.

యుక్రెయిన్ రక్షణ మంత్రిత్వశాఖ కోసం ఒక వలంటీర్ ఫొటోగ్రాఫర్ ఈ ఫొటోను తీశారు. సైన్యానికి సంబంధించిన తన ఫొటోలు కొన్నిటిని కృత్రిమ సన్నివేశాలు సృష్టించి తీసినవనే ఆరోపణలు రావటంతో అతడిని ఆ తర్వాత తొలగించారు.

యుద్ధ రంగంలో కీయెవ్ మేయర్

కీయెవ్ నగర మేయర్ విటాలి క్లిట్స్షెకో యుద్ధ రంగంలో ముందు వరుసలో దిగినట్లు చూపుతున్న ఒక ఫొటో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది.

కానీ అది కూడా పాత ఫొటోనే. చెర్నిహియెవ్ ప్రాంతంలోని డెస్నా శిక్షణ కేంద్రం దగ్గర తను ఉన్నప్పటి దృశ్యాన్ని చూపే ఈ ఫొటోను విటాలి 2021 మార్చిలో మొదటిసారి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.

ఈ ఫొటో తప్పుదోవ పట్టించేదే అయినప్పటికీ.. ఈ యుద్ధంలో మేయర్ విటాలి యుక్రెయిన్ సైనికులతో కలిసి తన నగర రక్షణకు బరిలోకి దిగారనేది నిజం.

కీయెవ్ మేయర్ విటాలి క్లిట్స్షెకోకు చెందిన ఈ ఫొటో 2021 మార్చిలో తీసిన ఫొటో

ఫొటో సోర్స్, INSTAGRAM

ఫొటో క్యాప్షన్, కీయెవ్ మేయర్ విటాలి క్లిట్స్షెకోకు చెందిన ఈ ఫొటో 2021 మార్చిలో తీసిన ఫొటో

యుక్రెయిన్ సైన్యంతో కలిసి జెలెన్‌స్కీ టీ తాగారా?

సైనిక దుస్తులు ధరించివున్న యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలియెన్స్కీ .. యుక్రెయిన్ బలగాల ఆత్మస్థైర్యాన్ని పెంచటానికి యుద్ధ రంగంలో వారితో కలిసి టీ తాగారని చెప్తూ గత వారాంతంలో పోస్టయిన ఒక వీడియోకు దాదాపు 30 లక్షల వ్యూస్‌ వచ్చాయి.

ఆ వీడియో నిజమైనదే. కానీ అది వారం రోజుల కిందట, రష్యా దండయాత్ర మొదలు కావటానికి ముందు తీసిన వీడియో. సైనికులకు మద్దతు ప్రకటించటానికి అధ్యక్షుడు జెలియెన్స్కీ సరిహద్దు సైనికులను కలిసినపుడు షైరోకిన్‌లో చిత్రీకిరించిన వీడియో అది.

ఈ వీడియో.. యుద్ధం మొదలు కావటానికి ముందు గత వారంలో తీసిన వీడియో

ఫొటో సోర్స్, Twitter

ఫొటో క్యాప్షన్, ఈ వీడియో.. యుద్ధం మొదలు కావటానికి ముందు గత వారంలో తీసిన వీడియో

ఇదిలావుంటే.. టెలిగ్రామ్‌లో జెలియెన్స్కీ పేరుతో ఉన్న ఒక అకౌంట్ నుంచి.. యుక్రెయిన్ సైనిక బలగాలు ఆయుధాలు పడేసి లొంగిపోవాలంటూ మెసేజ్‌లు పోస్టవటం కూడా సోషల్ మీడియా దృష్టిని ఆకర్షించింది. కానీ అది నకిలీది.

జెలియెన్స్కీకి టెలిగ్రామ్‌లో వెరిఫైడ్ అకౌంట్ ఉంది. ఈ ఘర్షణ కాలమంతటా ఆయన తన వెరిఫైడ్ సోషల్ మీడియా అకౌంట్లలో దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)