యుక్రెయిన్ సంక్షోభం: నాటో ఆహ్వానించినా భారత్ ఎందుకు ఆ కూటమిలో చేరలేదు?

ఫొటో సోర్స్, Getty Images
యుక్రెయిన్‌పై రష్యా దాడి అనంతరం నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) పేరు వార్తల్లో మార్మోగుతోంది.
అమెరికా నేతృత్వంలోని నాటోలో యుక్రెయిన్ చేరకూడదని రష్యా పట్టుబడుతోంది.
అంతేకాదు1997 తర్వాత నాటోలో చేరిన తూర్పు యూరప్ దేశాల నుంచి నాటో తమ బలగాలను ఉపసంహరించుకోవాలని రష్యా డిమాండ్ చేస్తుంది.
ఈ నేపథ్యంలో భారత్‌తో నాటో సంబంధాలపైనా చర్చ జరుగుతోంది. భారత్ ఎందుకు నాటోలో చేరలేదు? చేరితే వచ్చే ప్రయోజనాలు ఏమిటి? ప్రతికూల ప్రభావాలేమిటి? లాంటి ప్రశ్నలకు ఇప్పుడు సమాధానాలు చూద్దాం.

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌కు ఆహ్వానముందా?
నాటోలో భారత్ సభ్య దేశం కాదు. అయితే, నాటోలోని కొన్ని దేశాలతో భారత్‌కు మంచి సంబంధాలున్నాయి. అమెరికాతో మొదలుపెట్టి, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ తదితర దేశాలతో భారత్‌కు దృఢమైన సంబంధాలున్నాయి.
మరోవైపు భారత్‌తో కలిసి పనిచేసేందుకు నాటో కూడా సంసిద్ధత వ్యక్తంచేసింది. భారత విదేశాంగ శాఖ గత ఏడాది ఏప్రిల్‌లో నిర్వహించిన ‘‘రైసీనా డైలాగ్’’ను ఉద్దేశించి నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోలెన్‌బర్గ్ ప్రసంగించారు. భారత్, నాటో కలిసి పనిచేయాల్సిన ఆవస్యకతను ఆయన నొక్కి చెప్పారు.
‘‘సైనిక ఆపరేషన్లలో పాలుపంచుకోకపోయినా.. నాటోతో భారత్ కలిసి పనిచేయొచ్చు. ప్రస్తుతం చాలా అంతర్జాతీయ ఒప్పందాలకు విఘాతం కలగుతోంది. కొన్ని దేశాలు నిబంధనలను అసలు పట్టించుకోవడం లేదు. ఇలాంటి సమయాల్లో భారత్, నాటో కలిసి పనిచేయొచ్చు’’అని ఆయన అన్నారు.
‘‘నాటో కేవలం మిలిటరీ ఆపరేషన్లకు మాత్రమే పరిమితం అవుతుందని అనుకోకూడదు. నిజానికి రాజకీయ చర్చలు, భాగస్వామ్యాలు, సహకారాన్నే మేం ముందు పరిశీలిస్తాం. కాబట్టి నాటో, భారత్ కలిసి పనిచేసేందుకు చాలా అవకాశాలు కనిపిస్తున్నాయి.’’

‘‘భారత్‌కు నేడు అంతర్జాతీయంగా మంచి గుర్తింపు ఉంది. నాటో విశ్వసించే సూత్రాలనే భారత్ కూడా నమ్ముతుంది. ఆ విలువలకు ముప్పు పొంచి వున్నప్పుడు మనం కలిసి పనిచేయాలి. చాలా దేశాల్లో నిరంకుశత్వం పెరిగిపోతోంది’’అని ఆయన అన్నారు.
‘‘అఫ్గానిస్తాన్‌తో మొదలుపెట్టి ఉగ్రవాదం, సముద్ర తలంలో భద్రత వరకు నాటో భారత్ కలిసి పనిచేయొచ్చు’’అని ఆయన పిలుపునిచ్చారు.
‘‘చైనా తన ఆర్థిక శక్తికి సైనిక శక్తిని కలిపి ముందుకు వెళ్తోంది. గత దశాబ్దంలో తమ సైనిక బడ్జెట్‌ను చైనా మూడింతలు పెంచింది. ఇప్పుడు ప్రపంచంలో రెండో అతిపెద్ద మిలిటరీ బడ్జెట్ చైనాదే. అదే సమయంలో చైనా విలువలు పూర్తిగా భిన్నమైనవి. వారు వీగర్లు లాంటి మైనారిటీలను వేధింపులకు గురిచేస్తున్నారు. హాంకాంగ్‌లోనూ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారు. సొంత ప్రజలపైనే నిఘా పెడుతున్నారు.’’
ఇలాంటి ముప్పులు పొంచివున్నప్పుడు భారత్, నాటో కలిసి పనిచేయాల్సిన అవసరముందని ఆయన పిలుపునిచ్చారు. అయితే, దీనిపై భారత ప్రభుత్వం అధికారికంగా స్పందించలేదు.

ఫొటో సోర్స్, Getty Images
నాటోతో భారత్ కలిసి పనిచేస్తే వచ్చే ప్రయోజనాలు ఏమిటి?
చైనాతో ముప్పు పొంచివున్న నేపథ్యంలో నాటోతో భారత్ కలిసి పనిచేయాల్సిన అవసరముందని ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో సింగపూర్ యూనివర్సిటీలోని దక్షిణాసియా స్టడీస్ విభాగం డైరెక్టర్, అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకుడు సీ రాజామోహన్ చెప్పారు.
‘‘ఇటీవల కాలంలో భారత్ విదేశాంగ విధానంలో చాలా మార్పులు వచ్చాయి. పచ్ఛన్న యుద్ధ సమయంలో భారత్ ఏ పక్షమూ వహించలేదు. కానీ 1991 తర్వాత పరిస్థితులు పూర్తిగా మారాయి. చాలా తటస్థ దేశాలతోనూ నేడు నాటో కలిసి పనిచేస్తోంది. మరోవైపు రష్యా, చైనాలతో విభేదాలు ఉన్నప్పటికీ.. ఆ రెండు దేశాలతో నాటో తరచూ చర్చలు జరుపుతోంది’’
‘‘అలానే, భారత్ కూడా నాటోతో తరచూ చర్చలు జరపాలి. ఎందుకంటే నాటోలోని చాలా దేశాలతో భారత్ విడిగా ఇలాంటి చర్చలు జరుపుతోంది. అలాంటప్పుడు నాటోతో చర్చలతో వచ్చే సమస్య ఏమిటి? చైనా, పాకిస్తాన్ లాంటి విభేదాలు ఉండే దేశాలతోనే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీవో)లో భారత్ కలిసి పనిచేస్తోంది. అలాంటప్పుడు నాటోను ఎందుకు విడిగా చూడాలి?’’అని ఆయన ప్రశ్నించారు.
‘‘సమస్య అనేది నాటోతో లేదు. మనం చూసే కోణంలో ఉంది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మన నాయకులు యూరప్‌ను రష్యా లెన్సులతో చూడటం మొదలుపెట్టారు. కానీ, ఇటీవల కాలంలో ఆ మూస ధోరణి నుంచి బయటకు వస్తున్నారు. ఇప్పుడిప్పుడు యూరప్‌కు తగినట్లుగా కొత్త విధానాలకు రూపకల్పన చేస్తున్నారు. ఇప్పుడు మరో అడుగు ముందుకువేసి నాటోతో కలిసి పనిచేయొచ్చు’’అని ఆయన అన్నారు.
నాటోలో చేరితే వచ్చే నష్టం ఏమిటి?
అయితే, నాటోలో చేరితే చేకూరే ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువని ఐఐఐటీ గ్వాలియర్‌కు చెందిన అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకుడు ప్రతీక్ దర్శ్ అభిప్రాయపడ్డారు.
‘‘మొదటగా రష్యాతో భారత్ సంబంధాలు దెబ్బతింటాయి. సిప్రి నివేదిక ప్రకారం 56 శాతానికిపైగా భారత్ రక్షణ దిగుమతులకు రష్యానే ఆధారం. యుద్ధ విమానాల నుంచి మొదలుపెట్టి అసాల్ట్ రైఫిల్స్ వరకు చాలా పరికరాలను మనం రష్యా నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. మరికొన్ని రక్షణ ఉత్పత్తులను రష్యా భాగస్వామ్యంలో భారత్‌లోనే అభివృద్ధి చేస్తున్నాం. ఇవన్నీ మనం పశ్చిమ దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలంటే మన బడ్జెట్ భారీగా పెంచాల్సి ఉంటుంది’’అని ఆయన అన్నారు.
‘‘భారత్ మొదట్నుంచీ ఏ పక్షమూ వహించని దేశంగా ఉంటూ వస్తోంది. ఇప్పుడు ఈ విధానాన్ని కాస్త మార్చి మల్టీ అలైన్‌మెంట్ విధానాన్ని తీసుకొచ్చాం. అంటే రెండు పక్షాలతోనూ కలిసి పనిచేయడం. మనం నాటోలో చేరితే ఈ విధానానికి ముప్పు వాటిల్లే అవకాశముంది.’’
‘‘నాటో నిబంధనల్లో ఆర్టికల్ 5 మరో ప్రధాన సమస్య. ఏదైనా మిత్రదేశంపై దాడిచేస్తే, తమపై దాడి జరిగినట్లుగా భావించాలని ఇది చెబుతోంది. అంటే, నాటోలో చేరిన తర్వాత, పాకిస్తాన్ లేదా చైనా దాడి చేస్తే నాటో వస్తుందా? అనేది మరో ప్రశ్న. అదే సమయంలో ఏదైనా ఐరోపా దేశంపై రష్యా దాడి చేస్తే మనం కూడా రష్యా పైకి వెళ్లాల్సి ఉంటుంది’’అని ఆయన అన్నారు.
‘‘నాటోలో చేరడమంటే ప్రతి చిన్న విషయానికి అమెరికాపై ఆధారపడటమే. మరి అమెరికా మనం పిలిచిన ప్రతిసారీ వస్తుందా? అనేదే మరో ప్రశ్న’’.
‘‘నాటోలో చేరితే భారత్‌లోనూ నాటో స్థావరాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీనితో మన సార్వభౌమత్వానికే ముప్పు వస్తుంది.’’
నాటోలో చేరడమంటే మన చేతులకు మనమే సంకెళ్లు వేసుకోవడమని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘నిజానికి భారత్‌కు ఇప్పటికే చాలా సమస్యలు ఉన్నాయి. నాటోలో చేరితే వీటికి కొత్త సమస్యలు కూడా తోడవుతాయి’’అని ఆయన అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Reuters
ఇవి కూడా చదవండి:
- 'స్విఫ్ట్' అంటే ఏమిటి? ఈ పేమెంట్ నెట్వర్క్ నుంచి రష్యాను నిషేధిస్తే ఎవరికి నష్టం?
- పుతిన్‌కు ఏం కావాలి? యుక్రెయిన్‌పై రష్యా ఎందుకు దాడి చేస్తోంది
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య 5 గ్రామాల వివాదం ఏంటి... కొత్త జిల్లాల ఏర్పాటుతో చిక్కులు తప్పవా?
- భీమ్లానాయక్: పవన్ నోట పొలిటికల్ డైలాగులు, అభిమానుల్లో ఫుల్ జోష్
- యుక్రెయిన్‌లోని తెలుగు విద్యార్థులు: ‘ఇక్కడ పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి, మమ్మల్ని ఎలాగైనా ఇండియాకి తీసుకెళ్లండి’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















