యుక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమీర్ జెలియెన్‌స్కీ: ఒక కమెడియన్ దేశాధ్యక్షుడిగా ఎలా ఎదిగారు?

ఫొటో సోర్స్, Getty Images
టీవీలో వచ్చే ఒక ప్రముఖ కామెడీ సిరీస్‌లో "యుక్రెయిన్ అధ్యక్షుడి"గా నటించారు వొలోదిమీర్ జెలియెన్‌స్కీ. తెర మీద పాత్ర నడిచి వచ్చినట్టు, 2019 ఏప్రిల్‌లో ఆయన నిజంగానే ఆ దేశ అధ్యక్షుడయ్యారు.
ప్రస్తుతం, 4.4 కోట్ల జనాభాతో, పొరుగు దేశమైన రష్యా నుంచి సైనిక దాడులను ఎదుర్కుంటూ అత్యంత సున్నితమైన పరిస్థితుల్లో ఉన్న దేశానికి జెలియెన్‌స్కీ నాయకత్వం వహిస్తున్నారు.
ఆయన నటించిన కామెడీ సిరీస్ పేరు "సర్వెంట్ ఆఫ్ ది పీపుల్". అందులో ఆయన అణకువతో ఉండే హిస్టరీ ప్రొఫెసర్ పాత్రలో నటించారు. అవినీతికి వ్యతిరేకంగా ఆ ప్రొఫెసర్ మాట్లాడిన ఒక వీడియో వైరల్ కావడంతో అనుకోకుండా ఆయన దేశాధ్యక్షుడవుతారు. అదొక కల్పిత కథ. యుక్రెయినియన్ రాజకీయాల పట్ల ఆ దేశ ప్రజలకు ఉన్న భ్రమలపై సంధించిన అస్త్రం అది.
ఈ సిరీస్ జెలియెన్‌స్కీ పార్టీ పతాకగా మారింది. దేశంలో రాజకీయ ప్రక్షాళన చేస్తామని, తూర్పున శాంతి సాధిస్తామనే సందేశంతో జెలియెన్‌స్కీ ఎన్నికల్లో ప్రచారం చేశారు.
ప్రస్తుత యుక్రెయిన్ సంక్షోభం 44 ఏళ్ల జెలియెన్‌స్కీని చిక్కులో పడేసింది. యుక్రెయిన్‌లోని రెండు వేర్పాటువాద ప్రాంతాలను "స్వతంత్ర భూభాగాలుగా" గుర్తించాలన్న రష్యా అధ్యక్షుడి నిర్ణయం, యుక్రెయిన్‌లో రష్యా సైనిక బలగాల దాడులు.. జెలియెన్‌స్కీని ఆందోళనకరమైన అంతర్జాతీయ వివాదం మధ్యలో నిలబెట్టాయి.
నటుడిగా, కామెడియన్‌గా..
అధ్యక్ష పదవి వరకు జెలియెన్‌స్కీ ప్రయాణం సంప్రదాయబద్ధమైనది కాదు. యుక్రెయిన్ నగరం క్రివీ రిహ్‌లో యూదు తల్లిదండ్రులకు జన్మించిన వొలోదిమీర్ జెలియెన్‌స్కీ, కీయెవ్ నేషనల్ ఎకనామిక్ యూనివర్శిటీ నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ పొందారు.
అయితే, ఆయనకు కామెడీపై ప్రత్యేకమైన అభిరుచి ఏర్పడింది. యుక్తవయసులో జెలియెన్‌స్కీ, రష్యన్ టీవీలో నిర్వహించిన ఒక కామెడీ పోటీలో తరచు పాల్గొనేవారు.
2003లో తన కామెడీ బృందం పేరు మీద 'క్వార్టల్ 95ట అనే టీవీ నిర్మాణ సంస్థను భాగస్వాములతో కలిసి విజయవంతంగా స్థాపించారు. యుక్రేనియన్ నెటవర్క్ 1+1 కోసం ఈ సంస్థ కార్యక్రమాలను రూపొందించింది. దీని వివాదాస్పద బిలియనీర్ యజమాని ఇహోర్ కొలోమోయిస్కీ తరువాత దేశాధ్యక్ష పదవికి జెలియెన్‌స్కీ అభ్యర్థిత్వాన్ని బలపరిచారు.
కొన్నేళ్లవరకు జెలియెన్‌స్కీ తన టీవీ, సినిమా కెరీర్‌పైనే దృష్టి పెట్టారు. లవ్ ఇన్ ది బిగ్ సిటీ (2009), ర్జవ్‌స్కీ వెర్సస్ నెపోలియన్ (2012) వంటి సినిమాల్లో నటించారు.
"సర్వెంట్ ఆఫ్ ది పీపుల్"
2014లో యుక్రెయిన్‌లో ఏర్పడిన అనిశ్చితి, అస్తవ్యస్తమైన పరిస్థితులు అనూహ్యంగా జెలియెన్‌స్కీ రాజకీయ జీవితానికి మార్గం వేశాయి.
ఆ ఏడాది, రష్యా అనుకూల యుక్రెయిన్ అధ్యక్షుడు విక్టర్ యనుకోవిచ్‌కు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తడంతో, ఆయన పదవి కోల్పోయారు.
అదే సమయంలో రష్యా క్రైమియాను స్వాధీనం చేసుకుంది. యుక్రెయిన్‌తో యుద్ధంలో వేర్పాటువాదులకు మద్దతు ఇచ్చింది రష్యా. ఇది నేటికీ కొనసాగుతోంది. నెల రోజుల క్రితం దోన్యస్క్, లుహాన్స్క్‌లను స్వతంత్ర భూభాగాలుగా గుర్తిస్తున్నట్టు రష్యా ప్రకటించి, దాడులు మొదలుపెట్టడంతో అక్కడ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.
2015 అక్టోబర్‌లో 1+1 నెట్‌వర్క్‌లో "సర్వెంట్ ఆఫ్ ది పీపుల్" ప్రసారమైంది. అందులో జెలెన్‌స్కీ 'వాసిలీ గోలోబోరోడ్కో' అనే ప్రొఫెసర్ పాత్రలో నటించారు. ఈ పాత్ర రాజకీయ ప్రస్థానం లాగే జెలెన్‌స్కీ రాజకీయ ప్రస్థానం కూడా ఆనూహ్యంగా సాగింది.
2014 నుంచి 2019 వరకు యుక్రెయిన్ అధ్యక్షుడిగా కొనసాగిన పెట్రో పోరోషెంకోను ఎన్నికల్లో జెలియెన్‌స్కీ ఓడించారు. ఎన్నికల ప్రచారాల్లో పోరోషెంకో.. జెలియెన్‌స్కీని రాజకీయానుభవం లేని వ్యక్తిగా చిత్రీకరించినా, ప్రజలు దాన్ని సానుకూలమైన అశంగానే పరిగణించారు.
ఎన్నికల్లో 73.2 శాతం ఓట్లతో అత్యధిక మెజారిటీ సాధించారు జెలియెన్‌స్కీ. 2019 మే 20న యుక్రెయిన్ ఆరవ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.

దోన్బస్‌లో ప్రతిష్టంభన
తూర్పు యుక్రెయిన్‌లో ఘర్షణలను అంతం చేస్తానని తాను ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికే ప్రయత్నించారు జెలియెన్‌స్కీ. ఈ ఘర్షణల్లో 14,000లకు పైగా ప్రాణాలు కోల్పోయారు.
మొదట్లో రాజీ కుదుర్చుకునేందుకు ఆయనకు కొన్ని అవకాశాలు లభించాయి. రష్యాతో చర్చలు, ఖైదీల మార్పిడి, మిన్స్క్ ఒప్పందాలను అమలు చేసేందుకు రంగం సిద్ధమైంది. కానీ, అవేమీ కార్యరూపం దాల్చలేదు.
ఆక్రమిత ప్రాంతాల్లో నివసించేవారికి రష్యన్ పాస్‌పోర్టులు ఇవ్వాలని పుతిన్ నిర్ణయించడంతో మళ్లీ వాతావరణం వేడెక్కింది.
2020 జూలైలో కాల్పుల విరమణకు అంగీకరించారు. కానీ, అక్కడక్కడా యుద్ధం కొనసాగింది.
యూరోపియన్ యూనియన్‌లో, నాటో కూటమిలో సభ్యతం పొందేందుకు యుక్రెయిన్ తరపున తన స్వరాన్ని బలంగా వినిపించారు జెలియెన్‌స్కీ. ఈ ప్రతిపాదనలు రష్యా అధ్యక్షుడికి మంట పుట్టించాయి.
ఇటీవల వారాల్లో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. దోన్యస్క్, లుహాన్స్క్‌లను స్వతంత్ర ప్రాంతాలుగా గుర్తించిన వెంటనే, ఫిబ్రవరి 21న ఆ ప్రాంతాలపై రష్యా దాడులను మొదలుపెట్టింది. 2014 నుంచి ఈ ప్రాంతాలను రష్యా అండతో వేర్పాటువాద సమూహాలు నియంత్రిస్తున్నాయి.
సంపన్న వర్గాలకు "బాస్ ఎవరో చూపించాలి"
యుక్రెయిన్‌లోని అత్యంత సంపన్న వర్గాల రాజకీయ, ఆర్థిక ప్రభావాన్ని అరికడతానని కూడా జెలియెన్‌స్కీ వాగ్దానం చేశారు. కానీ, ఇదీ నెరవేర్చడం కష్టమని నిరూపణ అయింది.
కోటీశ్వరుడైన ఇహోర్ కొలోమోయిస్కీతో జెలియెన్‌స్కీకి ఉన్న లింకుల కారణంగానే ఇది సాధ్యం కాలేదని విమర్శకులు అంటారు.
అయినప్పటికీ, తన నిబద్ధతను జెలియెన్‌స్కీ తెలియజేశారు. యుక్రెయిన్‌లోని ప్రముఖ ఓలిగార్క్‌లకు జెలియెన్‌స్కీ ప్రభుత్వం గురిపెట్టింది. వీరిలో ప్రతిపక్ష పార్టీ నాయకుడు విక్టర్ మెడ్వెడ్‌చుక్ కూడా ఉన్నారు. ఈయన రష్యాకు అనుకూలం. దేశద్రోహం వంటి నేరాలపై మెడ్వెడ్‌చుక్‌ను హౌస్ అరెస్ట్ చేసింది జెలియెన్‌స్కీ ప్రభుత్వం. దీన్ని "రాజకీయ అణచివేత"గా మెడ్వెడ్‌చుక్ పేర్కొన్నారు.
1990లలో సోవియట్ యూనియన్ రద్దు తరువాత, రష్యన్ ప్రైవేటీకరణ కాలంలో వేగంగా సంపదను పోగుచేసుకున్నావారే ఈ ఓలిగార్క్‌లు.
ఆ తరువాత, ఓలిగార్క్‌లకు చట్టపరమైన నిర్వచనాన్ని ఇచ్చే ఒక నిబంధన ఆమోదం పొందింది. రాజకీయ పార్టీలకు ఆర్థిక సహాయంపై నిషేధం సహా వాళ్లపై పలు ఆంక్షలు విధించారు.
అయినప్పటికీ, జెలియెన్‌స్కీ చేపట్టిన అవినీతి నిరోధక చర్యలు పై పై మెరుగులేనని, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వానికి అనుకూలంగా తీసుకున్నవని విమర్శకులు అంటారు. యుక్రెయిన్ విషయంలో రష్యాకు వ్యతిరేకంగా ఒక కీలకమైన రక్షణ కవచం అమెరికా.

ఫొటో సోర్స్, SARAH RAINSFORD/BBC
'క్విడ్ ప్రో కో ఒప్పందాలేమీ జరగలేదు'
అయితే, అమెరికాతో యుక్రెయిన్ సంబంధాలలో కూడా కొన్ని చిక్కులు వచ్చాయి.
2019 జూలైలో అప్పటి అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఫోన్ కాల్‌లో జెలియెన్‌స్కీని "ఒక సహాయం" అడిగారు.
బైడెన్‌కు వ్యతిరేకంగా అవినీతి ఆరోపణల ఆరా తీయమని ట్రంప్, జెలియెన్‌స్కీని అడిగారు. బదులుగా జెలియెన్‌స్కీని వాషింగ్టన్‌కు ఆహ్వానిస్తామని, సైన్య సహాయం అందిస్తామని చెప్పారు.
కొన్ని లీకుల ద్వారా ఈ ఫోన్ కాల్ సంభాషణ బయటపడింది. తన రాజకీయ ప్రత్యర్థికి నష్టం కలిగించే సమాచారాన్ని కోరుతూ ట్రంప్, అక్రమంగా యుక్రెయిన్ అధ్యక్షుడిపై ఒత్తిడి తెచ్చారనే ఆరోపణలు వచ్చాయి.
తానే తప్పూ చేయలేదని ట్రంప్ వాదించారు. క్విడ్ ప్రో కో ఒప్పందాలేమీ జరగలేదని జెలియెన్‌స్కీ అన్నారు.
తరువాత, ట్రంప్‌పై అభిశంసన, ఆయన నిర్దోషిగా నిరూపణ కావడం జరిగాయి.
పాండోరా పేపర్స్
అయితే, జెలియెన్‌స్కీపై కూడా కొన్ని కుంభకోణాలకు సంబంధంచిన ఆరోపణలు ఉన్నాయి.
2021 అక్టోబర్‌లో లీక్ అయిన పాండోరా పేపర్స్‌లో జెలియెన్‌స్కీ పేరు కూడా ఉంది. విదేశాల్లోని కంపెనీల నెట్‌వర్క్ నుంచి జెలియెన్‌స్కీ, ఆయన సన్నిహిత వర్గాలు లాభం పొందాయని తెలిపారు.
అయితే ఆ పత్రాల్లో కొత్త విషయాలేమీ కనిపించలేదని, తన కంపెనీ క్వార్టల్ 95లో తానుగానీ, ఇతరులుగానీ మనీ లాండరింగ్‌కు పాల్పడలేదని జెలియెన్‌స్కీ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- యుక్రెయిన్: ‘రష్యా సైనికులు మా నాన్న గుండె మీద కాల్చారు.. నా కళ్లెదుటే చంపేశారు’
- పుతిన్‌కు ఎంతమంది పిల్లలు.. వాళ్లు ఎక్కడున్నారు.. ఏంచేస్తుంటారు?
- పుష్ప: తగ్గేదే లే.. అంటూ బాలీవుడ్‌కు పోటీ ఇస్తున్న దక్షిణాది సినిమా
- రష్యా-యుక్రెయిన్ సంక్షోభం: భారత వైఖరిపై ఇంత చర్చ ఎందుకు
- యుక్రెయిన్ సంక్షోభ సమయంలో ఇమ్రాన్‌ఖాన్ రష్యా ఎందుకు వెళ్లారు, భారత్‌పై చూపే ప్రభావమేమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












