‘యుక్రెయిన్‌లో ఉండొద్దు, ఇండియా వెళ్లిపోండి’ - భారత పౌరులకు రాయబార కార్యాలయం సూచన

ఫొటో సోర్స్, Getty Images
యుక్రెయిన్‌లోని భారత పౌరుల కోసం కీవ్‌లోని భారత రాయబార కార్యాలయం ఒక సూచన జారీ చేసింది.
యుక్రెయిన్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతల దృష్ట్యా ఇక్కడ నుంచి భారతీయులు తాత్కాలికంగా తిరిగి స్వదేశానికి వెళ్లాలని రాయబార కార్యాలయం కోరింది.
"ఇక్కడ ఉండాల్సిన అవసరం పెద్దగా లేకపోతే, మీరు ఇక్కడ నుంచి వెళ్లిపోవచ్చు" అని దేశంలో భారతీయులకు, ముఖ్యంగా విద్యార్థులకు ఎంబసీ సూచించింది.
యుక్రెయిన్‌లోనూ అనవసర ప్రయాణాలు కూడా మానుకోవాలని రాయబార కార్యాలయం భారతీయులకు చెప్పింది.
"అవసరమైనప్పుడు మీకు తగిన సహకారం అందించడానికి వీలుగా, మీరున్న పరిస్థితి గురించి ఎంబసీకి సమాచారం అందిస్తుండాలి" అని చెప్పింది. తమ కార్యాలయం మామూలుగానే పనిచేస్తుందని తెలిపింది.
యుక్రెయిన్‌లో ఉంటున్న తమ పౌరులు తిరిగి స్వదేశాలకు రావాలని మరో పదికి పైగా దేశాలు కోరాయి.

ఫొటో సోర్స్, TASS/GETTY IMAGES
ఏ క్షణమైనా దాడి జరగచ్చు: అమెరికా
యుక్రెయిన్‌లో ఏ క్షణమైనా వరుస వైమానిక దాడులు జరగవచ్చని అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది.
యుక్రెయిన్ సంక్షోభానికి తెరదించడానికి, దౌత్య పరిష్కారాలపై ఇంకా ఆశలు వదులుకోలేదని అమెరికా, బ్రిటన్ నేతలు చెప్పారు. కానీ పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉందని హెచ్చరించారు.
రష్యా సైనిక చర్యలకు దిగవచ్చనే హెచ్చరికలు వస్తున్నప్పటికీ, ఒప్పందం జరగడానికి ఇప్పటికీ అవకాశం ఉందని 40 నిమిషాలపాటు మాట్లాడుకున్న జో బైడెన్, బోరిస్ జాన్సన్ ఏకీభవించారు.
యుక్రెయిన్ సరిహద్దుల్లో లక్ష మందికి పైగా సైనికులను మోహరించిన రష్యా మాత్రం, ఆ దేశం మీద తాము దాడి చేస్తామని వ్యక్తమవుతున్న ఆందోళనలను తోసిపుచ్చుతోంది.
కానీ, రష్యా యుక్రెయిన్ నుంచి వెనక్కు తగ్గేలా చేయడానికి, దౌత్య చర్చలకు కీలకమైన దారి ఇంకా మిగిలే ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఇద్దరూ అన్నట్లు డౌనింగ్ స్ట్రీట్ తెలిపింది.
"చేయగలిగనవన్నీ చేయడానికి బ్రిటన్ సిద్ధంగా ఉంది" అని జాన్సన్ ఆయనతో అనగా, "మీరు లేకుండా మేం ఎక్కడికీ వెళ్లడం ఉండదు ఫ్రెండ్" అని బైడెన్ అన్నట్లు చెప్పింది.
ఫిబ్రవరి 16న రష్యా తమపై దాడి చేసే అవకాశం ఉండచ్చని అమెరికా అధికారులు భావిస్తున్నట్లు యుక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కి సోమవారం దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో చెప్పారు. ఆ రోజును ఐక్యతా దినంగా వర్ణిస్తూ, తమ సైనిక బలగాలను ప్రశంసించారు.
"మన దగ్గర సమాధానం ఇవ్వగలిగిన శక్తి ఉంది. మనకు గొప్ప సైన్యం ఉంది. ఇది ఎనిమిదేళ్ల క్రితం ఉన్న సైన్యం కంటే ఎన్నో రెట్లు బలమైనది" అన్నారు.
కానీ, తను చర్చలు, దౌత్యం ద్వారా సమస్యలన్నీ పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు.
"మీరు చుట్టూ చీకటి అలుముకున్నట్లు అనుకోవచ్చు. కానీ రేపు శాంతంగా ఉండే మన ఆకాశంలో సూర్యుడు మళ్లీ ఉదయిస్తాడు" అని ఆశాభావం వ్యక్తం చేశారు.
గత కొన్ని నెలలుగా రష్యా, యుక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇటీవల పరిస్థితి మరింత ఘోరంగా మారింది.
రష్యా ఎప్పుడైనా యుక్రెయిన్ మీద దాడి చేయవచ్చని అమెరికాసహా ఎన్నో పశ్చిమ దేశాలు చెబుతున్నాయి.
అయితే రష్యా ఆ ఆరోపణలను తోసిపుచ్చుతోంది. కానీ, ఇటీవల రోజుల్లో యుక్రెయిన్ సరిహద్దుల్లో సైనికుల సంఖ్యను రష్యా చాలా పెంచింది.

ఇవి కూడా చదవండి:
- ఏబీజీ షిప్‌యార్డ్ కేసు: ఇప్పటివరకు దేశంలో అతిపెద్ద బ్యాంక్ మోసం ఇదేనా, అసలేం జరిగింది?
- రామానుజాచార్యులు ఎవరు? సమాజం కోసం, సమానత్వం కోసం ఆయన ఏం చేశారు? రూ. వెయ్యి కోట్ల విగ్రహంపై విమర్శలు ఏంటి?
- ఆంధ్రప్రదేశ్: ఉద్యోగులు ఆశించినవన్నీ జరగవా? కొత్త పీఆర్సీ జీవోలను ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందా?
- రష్యా, యుక్రెయిన్ సంక్షోభం నుంచి చైనా లబ్ధి పొందాలని చూస్తోందా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












