ఏబీజీ షిప్‌యార్డ్ కేసు: ఇప్పటివరకు దేశంలో అతిపెద్ద బ్యాంక్ మోసం ఇదేనా? అసలు ఏం జరిగింది?

బ్యాంక్ మోసం

ఫొటో సోర్స్, MUKESH GUPTA/REUTERS

బ్యాంకులను రూ.22,842 కోట్లకు మోసం చేశారని ఆరోపిస్తూ ఏబీజీ షిప్‌యార్డ్, దాని మాజీ సీఎండీ కమలేష్ అగ్రవాల్, అప్పటి డైరెక్టర్లు సంతానం ముత్తుస్వామి, అశ్వినీ కుమార్‌లపై సీబీఐ కేసు నమోదు చేసింది.

ఇంత పెద్ద మొత్తంలో అక్రమాలు జరిగినట్లు విచారణలో తేలితే, ఇది ఇప్పటివరకూ దేశంలో జరిగిన అతిపెద్ద బ్యాంకింగ్ ఫ్రాడ్ కేసు అవుతుంది.

ఇంతకు ముందు నీరవ్ మోదీ పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు దాదాపు రూ.13 వేల కోట్లు టోపీ పెట్టారు. దానిని భారత దేశ బ్యాంకింగ్ చరిత్రలో అతిపెద్ద బ్యాంకింగ్ ఫ్రాడ్‌గా అప్పుడు చెప్పుకున్నారు.

ఏబీజీ మోసం గురించి ఫిర్యాదు చేయడంలో తాము ఏమాత్రం ఆలస్యం చేయలేదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెబుతోంది.

కంపెనీపై కేసు నమోదు చేయడంలో జాప్యం జరిగిందని వస్తున్న ఆరోపణలపై ఎస్‌బీఐ వివరణ ఇచ్చింది. ఏబీజీ షిప్‌యార్డ్ అకౌంట్ ఎన్‌సీఎల్టీ ప్రక్రియ కింద లిక్విడేషన్‌లో ఉన్నట్లు తెలిపింది.

మొదట 2019 నవంబర్లో బ్యాంకులను మోసం చేశారంటూ ఈ కంపెనీ మీద ఎస్‌బీఐ కేసు పెట్టింది. ఆ తర్వాత 2020 డిసెంబర్‌లో రెండో ఫిర్యాదు చేసింది. కంపెనీపై ఫిర్యాదు చేయడంలో తాము ఎలాంటి జాప్యం చేయలేదని బ్యాంక్ చెప్పింది.

వీడియో క్యాప్షన్, లబ్‌డబ్బు: బ్యాంకులు.. మొండి బకాయిలు

ఈ కంపెనీకి రెండు డజన్ల బ్యాంకుల కన్సార్టియం రుణం ఇచ్చిందని ఎస్‌బీఐ తరఫున జారీ అయిన ఒక ప్రకటనలో చెప్పారు.

కానీ, పేలవమైన పనితీరు వల్ల 2013 నవంబర్‌లో ఆ కంపెనీ అకౌంట్ ఎన్‌పీఐ అయిపోయినట్లు అందులో తెలిపారు. ఆ కంపెనీ పుంజుకోడానికి చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ, అవేవీ సఫలం కాలేదని చెప్పారు.

అయితే ఈ కన్సార్టియంకు ఐసీఐసీఐ బ్యాంక్ నేతృత్వం వహిస్తోంది. కానీ, అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ కావడంతో ఎస్‌బీఐ ఈ బ్యాంక్ ఫ్రాడ్‌ గురించి సీబీఐకి ఫిర్యాదు చేసింది.

మొదటి ఫిర్యాదు 2019 నవంబర్లో నమోదు చేశారు. ఆ తర్వాత నుంచి సీబీఐ, ఎస్‌బీఐ ఈ కేసు గురించి నిరంతరం సంప్రదింపులు జరుపుతూ వచ్చాయి.

కంపెనీ నుంచి వీలైనంత ఎక్కువ మొత్తాన్ని రికవరీ చేయడానికి ప్రయత్నిస్తామని ఎస్‌బీఐ ఎండీ జె.స్వామినాథన్ (రిస్క్ కంప్లయన్స్ అండ్ స్ట్రెస్ రిజల్యూషన్ గ్రూప్) చెప్పారు.

రణదీప్ సింగ్ సూర్జేవాలా

ఫొటో సోర్స్, SANTOSH KUMAR/HINDUSTAN TIMES VIA GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, రణదీప్ సింగ్ సూర్జేవాలా

ప్రజాధనం చోరీ-కాంగ్రెస్

ఈ బ్యాంక్ ఫ్రాడ్ కేసులో కాంగ్రెస్ మోదీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జేవాలా ఆదివారం చండీగఢ్‌లో జరిగిన ఒక ప్రెస్ కాన్ఫరన్స్‌లో దీనిపై మాట్లాడారు.

"ఏబీజీ షిప్‌యార్డ్ లిక్విడేషన్ కేసు 2017లో అహ్మదాబాద్‌లోని ఎన్సీఎల్టీకి వెళ్లింది. ఆ తర్వాత 2019లో కంపెనీ రుణాలు, బ్యాంక్ ఖాతాలను ఫ్రాడ్‌గా ప్రకటించారు. ఆ తర్వాత ఐదు నెలలకు ఏబీజీ షిప్‌యార్డ్‌కు చెందిన రుషి అగ్రవాల్, మిగతావారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఎస్‌బీఐ కేసు పెట్టింది" అన్నారు.

ఇది ప్రజాధనం చోరీ చేయడమేనని ఆయన ఆరోపించారు. సీబీఐ, ఎస్‌బీఐ, మోదీ ప్రభుత్వం మొత్తం కేసును బ్యూరోక్రటిక్ ఉచ్చులో చిక్కుకునేలా చేశాయని, ఫైళ్లు మాత్రమే అటూ, ఇటూ అవుతూ వచ్చాయన్నారు.

ఈ ఫ్రాడ్ కేసులో కంపెనీని లిక్విడేషన్ ప్రక్రియలోకి పంపించిన ఐదేళ్ల తర్వాత కూడా రెండు డజన్లకు పైగా బ్యాంకులు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ఆయన ప్రశ్నించారు. కంపెనీ ఖాతా ఫ్రాడ్ అని 2019లోనే తేలినప్పుడు దానికి వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

రాహుల్, టికైత్ విమర్శలు

రాహుల్ గాంధీ ఇదే కేసు గురించి ఒక ట్వీట్ చేశారు.

"నరేంద్రమోదీ కాలంలో ఇప్పటివరకూ 5,35,000 కోట్ల రూపాయల బ్యాంక్ ఫ్రాడ్ జరిగింది. 75 ఏళ్లలో భారత్‌లో ఇంత ప్రజాధనం మోసానికి గురవడం ఎప్పుడూ జరగలేదు. దోపిడీ, మోసాల ఈ రోజులు మోదీ మిత్రులకు మాత్రమే అచ్చే దిన్" అన్నారు.

భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ టికైత్ కూడా ఇదే విషయంపై ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

"ప్రియమైన దేశ ప్రజలారా, హిజాబ్ మీద కాదు, దేశంలో బ్యాంకుల హిసాబ్(కుంభకోణాలు)పై ఉద్యమాలు చేయండి. ఇదే పరిస్థితి కొనసాగితే దేశం అమ్ముడుపోవడానికి ఎంతోకాలం పట్టదు. మేం అలా జరగనివ్వం" అన్నారు.

బీజేపీ ఎదురుదాడి

కానీ, బీజేపీ కాంగ్రెస్ మీద ఎదురుదాడికి దిగింది.

ఏబీజీ షిప్‌యార్డ్‌కు ఈ రుణాలు ఇచ్చింది యూపీఏ-2 ప్రభుత్వమేనని ఆరోపించింది. కానీ, మోదీ ప్రభుత్వం వచ్చాక, ఈ మోసం చేసిన ప్రమోటర్లకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడం మొదలయ్యిందని చెప్పింది.

సీబీఐ

ఫొటో సోర్స్, Getty Images

కంపెనీ, అధికారుల ఇళ్లు, కార్యాలయాలపై దాడి

వార్తా సంస్థ పీటీఐ వివరాల ప్రకారం ఏబీజీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌ అనే మరో కంపెనీతోపాటూ, ఏబీజీ షిప్‌యార్డ్ మాజీ సీఎండీ రుషి కమలేష్ అగ్రవాల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంతానం ముత్తుస్వామి, డైరెక్టర్ అశ్వినీ కుమార్, సుశీల్ కుమార్ అగ్రవాల్, రవి విమల్ నేవతియాపై కూడా నేరపూరిత కుట్ర, మోసం, విశ్వాస ఉల్లంఘన లాంటి కేసులు నమోదు చేశారు.

శనివారం ఈ కంపెనీతోసహా, సూరత్, భరూచ్, ముంబయి, పుణెలో ఉన్న డైరెక్టర్ల ఇళ్లపై దాడులు చేసిన సీబీఐ అధికారులు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.

బ్యాంకులు ఫ్రాడ్ గురించి ఎప్పుడు ప్రకటిస్తాయి

రుణాలిచ్చిన బ్యాంకుల సంయుక్త సమావేశంలో ఫోరెన్సిక్ ఆడిట్ నివేదికపై చర్చ జరిగినపుడు అవి ఒక కంపెనీ ఖాతాను ఫ్రాడ్‌గా ప్రకటిస్తాయి. తర్వాత మొదట దాని గురించి సీబీఐకి ఫిర్యాదు చేస్తారు. ఆ తర్వాత దర్యాప్తు కోసం మరింత సమాచారం సేకరిస్తారు. కొన్ని కేసుల్లో మరింత కీలకమైన సమాచారం సేకరించగానే, బ్యాంకులు రెండో ఫిర్యాదు చేస్తాయి. సీబీఐ దర్యాప్తుకు ఈ ఫిర్యాదులు ఆధారంగా మారుతాయి.

వీడియో క్యాప్షన్, విశాఖ తీరానికి కొట్టుకొచ్చిన బంగ్లాదేశ్ నౌక

ఏబీజీ షిప్‌యార్డ్ ఏం చెబుతోంది

ఏబీజీ షిప్‌యార్డ్ లిమిటెడ్ కార్యకలాపాలు గుజరాత్‌లో జరుగుతున్నాయి. ఈ కంపెనీ గుజరాత్‌లోని దాహెజ్, సూరత్‌లో నౌకల తయారీ, వాటి మరమ్మతుల పనులు చేస్తుంటుంది. ఈ కంపెనీ ఇప్పటివరకూ 165 నౌకలు నిర్మించింది. వీటిలో 46 నౌకలను విదేశీ మార్కెట్ల కోసం తయారుచేసింది.

ప్రపంచవ్యాప్తంగా మాంద్యం కారణంగా ఈ కంపెనీ వ్యాపారం కుప్పకూలిందని ఎస్‌బీఐ తన ఫిర్యాదులో పేర్కొంది.

సరుకుల డిమాండ్ తగ్గడం షిప్పింగ్ పరిశ్రమను దెబ్బతీసిందని, దీంతో ఆ నౌకల తయారీ కోసం కంపెనీకి వచ్చిన ఎన్నో కాంట్రాక్టులు రద్దయ్యాయని చెప్పింది.

ఫలితంగా నౌకలు తయారు చేసిన తర్వాత కూడా కంపెనీ ఇన్వెంట్రీలో పడిందని, దానివల్ల వర్కింగ్ కాపిటల్ కొరత రావడం, అది నష్టాల్లో కూరుకుపోవడం జరిగిందని వివరించింది.

నౌకల తయారీ పరిశ్రమ 2015 నుంచి మాంద్యంలో చిక్కుకుని విలవిల్లాడుతోంది.

ISWOTY Footer

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)